వాడిపోయింది...!

వాడిపోయింది...!

 • - స్ఫూర్తి
 • 17/10/2014

* గులాబి (బాగోలేదు)
తారాగణం: మాదాల హరికృష్ణ, ప్రదీప్‌రెడ్డి, అలేఖ్య, సునీ
సంగీతం: పవన్‌శేష, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత
దర్శకత్వం: మాదాల కోటేశ్వరరావు.

‘‘గులాబి’’- అంటే మృదుత్వానికి ఆహ్లాదకర వాతావరణానికి ప్రతీక. అందుకు తగ్గట్లు సున్నిత రీతుల్లో సినిమా నడుస్తుందని ఆశించిన వాళ్లకీచిత్రం నిరాశే కల్గించింది. అయితే ‘గులాబి’తోపాటు వాటి వెనుక ఉన్న ‘ముళ్లు’ని మరిచిపోకండి.. అన్నట్లు అలాంటి కంటకప్రాయుల పనిపట్టాలి అన్న రీతిలో ఈ చిత్రం సాగింది. కానీ ఈ రీతిలో అది ప్రజాస్వామ్య దేశంలో ఎంతవరకూ సమ్మతమన్నది చిత్ర రూపకర్తలు విస్మరించినట్లున్నారు. హరి, శివ, సంపత్ అనే యుకులకు తమతమ జీవితాల్లో సంభవించిన అన్యాయాలకు అందరిలా చట్టాన్ని ఆశ్రయించక ‘‘తామే పోలీసులు, తామే కోర్టులు, తామే జడ్జిలు’’అన్నట్లు వ్యవహరించడంలో ఎదుర్కొన్న అంశాలూ, అనంతర పరిణామాలూ ఇందులోని కీలక కథాంశం. ఒక యువకుడు తన చెల్లెల్ని ప్రేమించానని చెప్పిన అబ్బాయి స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. ఆ క్రమంలో ఆ అమ్మాయి చనిపోతుంది. అలా చంపేసిన వారిపై తానే ప్రతీకారం తీర్చుకుంటాడు. అలాగే మరో యువకుడు (హాస్పటల్‌లో పనిచేసే వార్డ్‌బోయ్) తాను ప్రేమించిన అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తోంటే నిర్లక్ష్యంగా వాహనం నడిపి యాక్సిడెంట్‌కి కారకుడవుతాడు, ఓ పెద్ద మనిషి. ఆ యాక్సిడెంట్‌లో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. అదే విధంగా ఇంకో యువకుడి వ్యక్తిగత జీవితంలో జరిగిన అన్యాయానికి అలానే ప్రతిఘటిస్తాడు. ఇలా వీరిలో ఎవరూ ఎవరికీ సంబంధం లేకపోయినా తమకు జరిగిన నష్టానికి తామే బదులు తీర్చుకోవాలన్న కాంక్షతో ఉంటారు. వారు తమలా ఎందుకు చేసామన్నది చెప్పడంతో సినిమా ముగుస్తుంది. అసలు ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి. ఈ పిక్చర్‌లోలా ఎవరికివారు ఉన్న చట్టాల్నీ, రక్షకభట యంత్రాంగాన్నీ ఆశ్రయించకుండా ఇష్టాయుతంగా వ్యవహరిస్తే సమాజం ఎక్కడికిపోతుందో ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలా అసలెదుకు...? అంటే సత్వర న్యాయం జరగట్లేదు కనుక అనీ,... దాంతోపాటు అయినదానికీ, కాని దానికీ వంద రోజుల సంబరాలు చేసుకునే అలవాటున్న ఈ దేశంలో, నేరం జరిగిన వంద రోజుల్లో న్యాయం ఎందుకు జరపరు? అని నిలదీస్తుందీ చిత్రం. ‘సత్వర న్యాయం జరగాలి, నేరస్థులకు తగిన శిక్ష పడాలి, అలాంటి నేరం పునరావృతం కాకుండా చేయాలి’అన్నది అందరూ ఏక కంఠంతో అనే అంశమే. కానీ అందుకు అన్ని సందర్భాలలో వంద రోజుల్లో కేసు పూర్తయిపోవాలి అన్న నిబంధన సరికాదు. ఎందుకంటే ఏ శిక్షాస్మృతి ప్రధాన ఉద్దేశ్యమైనా నేరస్థుడికి శిక్షపడాలన్నదే, అదే సందర్భంలో ఎలాంటి పరిస్థితిలోనూ అమాయకుడు శిక్షబారిని పడకూడదని. అందుకే నిందితుడికి ఒక కోర్టునుంచి, మరో కోర్టుకి వెళ్లే అవకాశం కల్పిస్తోంది, అయితే ఈ సినిమాలోలాంటి తీవ్రస్థాయి నేరాలకి ఇంకా పటిష్టంగా యంత్రాంగం కదలాలి అనేది అందరూ ఒప్పుకునేదే. కానీ ఆ ‘న్యాయం’ ఈ రీతిలోనే (ఎవరికివారు నేరుగా అంతంచేసే విధానం..) జరగాలి అన్నది స్వాగతించతగ్గ అంశం కాదు. ఇంకా మిగతా వివరాల్లోకి వెళితే చిత్రంలో చాలాచోట్ల క్లారిటీ కొరవడింది. హత్యలు ఎవరు చేస్తున్నారన్న ఉత్కంఠ సన్నివేశాలు కల్పించినప్పుడు దానికి సమాధానం తప్పనిసరిగా సినిమాలో ఎక్కడోక్కడ ఇవ్వాలి. కానీ ఆ నియమం ఇందులో గాలికొదిలేశారు. ఉదాహరణకి హంతకుడు తానుచేసే హత్యల్లో ఒక పద్ధతి పాటిస్తాడు. అదిఅలా తాను హతంచేసే వ్యక్తుల చూపుడు వేలు తొలగిస్తూ వుంటాడు. అలా ఎందుకు చేసాడన్న దానికీ వివరణ లేదు. అలాగే అనవసర వికృత సన్నివేశం- తన హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్లనీ, నర్సుల్నీ లైంగిక వేధింపులకు గురిచేసే సీనియర్ డాక్టర్ ఆఖరికి తనవద్దకు వచ్చే లెడీ డెడ్ బాడీలను సైతం పోస్టుమార్టమ్ సందర్భంలో ఓ సన్నివేశం ఈ రీతిలో సాగుతుంది. వాలీబాల్ ఆడుకుంటున్న అరవింద్ అనే అబ్బాయిని, ఓ అమ్మాయి వచ్చి బయటకు తీసుకెళ్తుంది. వాళ్లిద్దరూ ప్రేమికులనుకుంటాం. కారులో వెళుతూంటే ‘నేను నెల తప్పాను, నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటుంది. పోనే్ల ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అన్నట్లు, అమ్మాయితోపాటు, బేబీ ఫ్రీ అని సంతోషిస్తాడు వచ్చేవాడు’ అని బదులిస్తాడు అరవింద్. ‘చాల్లే అలా వచ్చేవాడు కూడా ఇలాంటి వాడే అయితే’.. అని అమ్మాయి సమాధానమిస్తుంది. ఈ సంభాషణతో వీరిద్దరిమధ్య ‘సంబంధం’మనకర్థమయిపోతుంది. ఆడపిల్లలకన్యాయం జరగకూడదని మంచి ఉద్దేశ్యంతో అనుకున్న ఇలాంటి సినిమాలో స్ర్తి పాత్రకు పైస్థాయి పూత ఎందుకు ఇచ్చారో అన్నది చిత్రంలో స్పష్టంకాలేదు. తగిన సాక్ష్యాధారాలతో అరెస్టుచేసిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టేముందు ఈ సినిమాలోలాంటి నిందితులకి చిత్రంలో చూపిన లెవెల్‌లో పోలీసులు థర్డ్‌డిగ్రీ పద్ధతులు అవలంభించే ఆస్కారం అంతగా వుండదు. డిటెక్టివ్ భార్య ఓ వ్యక్తి చిన్నప్పటి ఫొటో ఆధారంగా వర్తమానంలో ఎలా ఉంటాడో అన్న చిత్రం గీసిన విధానం- ఆ బేస్‌తో దర్యాప్తు కొనసాగించడం బావుంది. నటీనటుల టాలెంట్ ప్రస్థావనకొస్తే- ప్రతాప్ (పోలీసధికారి పాత్రధారి), గిరి (డిటెక్టివ్)గా నటించిన వ్యక్తీ బాగా నటించారు. శివ పాత్రను పోషించిన నటునికి సంభాషణోచ్ఛారణలో కాస్తంత తర్ఫీదు చేయిస్తే బావుండేది. పవన్‌శేష స్వరాల్లో ‘శతమానంభవతి’.. మెలోడీ పరంగా బావుంది. కానీ నేపథ్య సంగీతం హోరుని కాస్త తగ్గించాల్సింది. దీనివల్ల కొన్ని మాటలు వినపడలేదు. ‘వర్షం ముందు గాలినీ, బాధ ముందు కోపాన్నీ పట్టించుకోకూడదు’లాంటి చిన్న చిన్న చమక్కులు సంభాషణల్లో దొర్లాయి. అన్యాయాన్ని సత్వరం శిక్షించే ‘సిస్టమ్’రావాలని కోరుకోడం కరెక్టే అయినా అందుకు అవలంభించాల్సిన ‘సిస్టమ్’ ఈ సినిమాలోలాంటిది మాత్రం కాదు అనేది గ్రహించాలి.

దిక్కులు చూడొద్దు..!

దిక్కులు చూడొద్దు..!

 • -అనిల్
 • 17/10/2014

** దిక్కులు చూడకు రామయ్య... (ఫర్వాలేదు)
తారాగణం:
అజయ్, నాగశౌర్య
సనా మక్బూల్
ఇంద్రజ, బ్రహ్మాజీ
అలీ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
కెమెరా: ఎస్.రాజశేఖర్
బ్యానర్: వారాహి చలనచిత్రం
నిర్మాత: రజని కొర్రపాటి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రికోటి

కానె్సప్ట్ వింటేనే - భయం పుడుతుంది. మనసులో చిరాకు. ఆఖరికి సినిమా కథని మరీ ఇంతగా దిగజార్చేశారా? అన్న సందేహం. తండ్రీ కొడుకులు ఒకే అమ్మాయి ప్రేమలో పడటం జీర్ణించుకోలేని అంశం. ఏ మాత్రం తొణికినా- కథ ‘మాస్’కి కూడా కాకుండా మూసీలో కలుస్తుంది. కొత్త దర్శకుడు.. అందునా ఇలాంటి కథ. ఏ లక్ష్యంతో దూసుకెళ్లాలని ప్రయత్నించాడో అర్థంకాని పరిస్థితి. అటూ ఇటూ దిక్కులు చూసే సందిగ్ధత. ‘టైటిల్ ప్లస్ కానె్సప్ట్’తో ఒక్కసారిగా ఇన్ని ఆలోచనలు ముసురుతాయి. కొత్తదనం ఆశించే ప్రేక్షకులు ఆ వెరైటీని వెతుక్కోవటంలోనూ అంతే ముందుంటారు. ఇన్నాళ్లూ రొటీన్‌గా ‘సా..’గిపోయే కథలూ కరడుగట్టిన విలన్‌నీ.. అతడి బృందాన్నీ ‘బకరా’ల్ని చేయటం... పనిలో పనిగా హీరోయిన్ అందాల్ని తడిమేయటం.. కానె్సప్ట్ నుంచీ బయటికొచ్చి చూస్తే.. కచ్చితంగా ఇదో వెరైటీ కథనే. ఆ సున్నితమైన కథని దర్శకుడు ఏ దిక్కుకి చేర్చాడో చూద్దాం....
గోపాలకృష్ణ (అజయ్) స్టేట్‌బ్యాంక్ ఉద్యోగి. జీవితంలో ఏ అచ్చట ముచ్చట తీరకుండానే (అతడి భాషలో చెప్పాలంటే- లవ్వు గివ్వు - రొమాన్స్ గిమాన్స్ - ఆకర్షణ గీకర్షణ ఏవీ లేకుండా) భవానీ (ఇంద్రజ)తో పెళ్లయ పోతుంది. వెంటవెంటనే ఇద్దరు పిల్లలు. రోజులు గడుస్తాయి. పెద్దబ్బాయి మధు (నాగశౌర్య) ఇంజనీరింగ్ చదువుకి వస్తాడు. భర్త సాక్షాత్తు భగవత్ స్వరూపం అని భావించే భార్య భవానీ చేష్టలు వెగటు పుడతాయి గోపాలకృష్ణకి. పేరుకి తగ్గట్టే రొమాంటిక్ భావాలూ ఎక్కువే. ఇన్నాళ్లకి ఒక అమ్మాయిని లవ్‌లోకి దింపి తన చిన్నిచిన్ని కోరికల్ని తీర్చుకోవాలనుకుంటాడు ఓ శుభ ముహూర్తంలో. కాలం ఖర్మం కలిసొచ్చి ఒకానొక లిటిగేషన్‌లో ఇరుక్కున్న సంహిత (సన మక్బూల్)కి సాయం చేసినట్టే చేసి ఆమెకి దగ్గర కావాలనుకుంటాడు. తనకింకా పెళ్లి కాలేదనీ.. చక్కటి అమ్మాయి దొరికితే ప్రేమలో మునిగి పోవాలనీ అంటాడు. గోపాలకృష్ణ పుత్రరత్నం మధు కూడా సంహితని గాఢంగా ప్రేమిస్తూంటాడు. చివరికి ఈ ముక్కోణపు ప్రేమకథ ఏ మలుపు తిరిగింది? తను ప్రేమిస్తున్న అమ్మాయినే తండ్రి కూడా ఇష్టపడుతున్నాడని తెలిసిన మధు మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉంది? భర్త చేష్టలు తెలిసిన భార్య భవానీ అతడికి బుద్ధి చెప్పిందా? ఈ ప్రేమకథ ఏ దిక్కుకి వెళ్లిందన్నది క్లైమాక్స్.
గిరి కథలో హాలీవుడ్ సినిమా ‘అమెరికన్ బ్యూటీ’ ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. బహుశా ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగిన ఆలోచన కూడా కావొచ్చు. ఒక సన్నివేశాన్నైతే స్క్రీన్‌పై దించేశాడు కూడా. విభిన్న తరహా కథని పక్కనబెడితే- గోపాలకృష్ణ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకి అజయ్ నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడన్నది చిన్న మాట. గత చిత్రాల్లో అతని పెర్‌ఫార్మెన్స్‌కీ.. ఈ చిత్రంలోని గోపాలకృష్ణ పాత్రకీ పొంతన లేదు. విలన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ఇన్నాళ్లు అతణ్ణి ఏ కోణంలోనూ ఏ దర్శకుడూ సరిగా వినియోగించుకో లేదేమో ననిపిస్తుంది. క్లైమాక్స్ సీన్‌లో అజయ్ చూపిన నటన ఈ సినిమాని బతికిస్తుంది. అతడిలోని మానసిక సంఘర్షణని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో అతడు జీవించాడు. అతడికి తగ్గట్టుగానే - కొత్తవాడైనా నాగశౌర్య పాత్రని పండించాడు. ఒక విధంగా చెప్పాలంటే- రెండు కేరెక్టర్లలోనూ మానసిక సంఘర్షణ ప్రధానాంశం. ఆ ఎమోషన్స్‌ని తెరపై పండించకపోతే - స్క్రీన్‌పై ఆయా పాత్రలు తేలిపోతాయి. దర్శకుడు వీరిద్దరి నుంచీ చక్కటి నటనని రాబట్టుకో గలిగినప్పటికీ - సనా మక్బూల్‌లో నటన శూన్యం. ఈ సినిమాకి మైనస్ అయింది. ఒకనాటి హీరోయిన్ ఇంద్రజ ఈ సినిమాలో గోపాలకృష్ణ భార్య భవానీగా నటించింది. భార్యా బాధితుడిగా బ్రహ్మాజీ కంటతడి పెట్టిస్తూనే నవ్వు తెప్పించాడు.
కీరవాణి సంగీతం కథని చక్కగా నడిపించటానికి తోడ్పడింది.
డిఫరెంట్ కానె్సప్ట్‌నీ.. అందునా ఒక అభ్యంతరకరమైన కానె్సప్ట్‌ని నెత్తికెత్తుకోవటం అంటే చెప్పినంత ఈజీ కాదు. ఏ మాత్రం బెసగినా- మొత్తం రసాభాస అయిపోతుంది. అటు కమర్షియల్‌కీ ఇటు క్లాస్‌కీ పట్టకుండా పోతుంది. ఈ వ్యవహారాన్నంతటికీ సరిగ్గా టాకిల్ చేస్తూ వచ్చాడు దర్శకుడు. ఇటువంటి కథలకి క్లైమాక్స్ ఆయువుపట్టు. ఎందుకంటే చిక్కుముడి వేయటం తేలిక. కానీ తీయటమే కష్టం. ఆఖరికి సంహిత ఎవరికి దక్కుతుంది? అన్న ఆలోచన ప్రేక్షకుల్లో వచ్చినప్పటికీ... ఎటు చెప్పినా ప్రమాదమే. ఆ విషయాన్ని దర్శకుడు సరైన దారిలోనే నడిపించాడు.
కొన్నికొన్ని మైనస్‌లున్నప్పటికీ- వెరైటీగా కథలో ఏం చెప్పాడన్నది చూడాలనుకొంటే మాత్రం - ‘దిక్కులు చూడకుండా’ సినిమా చూడొచ్చు.

జీవిత పాఠాలు!

జీవిత పాఠాలు!

 • -రతన్
 • 17/10/2014

** పాఠశాల (ఫర్వాలేదు)
తారాగణం:
నందు, శశాంక్, సాయి రోనక్
హమూద్, అనుప్రియ, సూర్య
శిరీష, కృష్ణ్భగవాన్
ఎల్.బి.శ్రీరామ్, నరసింహరాజు
సంగీతం: రాహుల్ రాజ్
కెమెరా: సుధీర్ సురేంద్రన్
బ్యానర్: మూన్‌వాటర్ పిక్చర్స్
నిర్మాత: రాకేశ్ మహంకాళి
దర్శకత్వం: మహి వి.రాఘవ్

ఓ తీయటి అనుభూతిని కలిగించే చిత్రం వచ్చినప్పుడైనా - చూసి ఆదరిస్తే.. మళ్లీమళ్లీ అటువంటి కథల్ని చూసి తరించే అవకాశం ఉంటుంది. వెరైటీ కథలు రావటం లేదని వాపోవటం కాదు.. వస్తే వాటిని సాదరంగా ఆహ్వానించటమన్న సంప్రదాయాన్ని పాటించాలి. లోబడ్జెట్ చిత్రాల్లో సైతం కథ లేదని వెక్కిళ్లు పెట్టి ఏడ్చే ప్రేక్షకుడికి ఓదార్పు కలిగిస్తుందీ సినిమా. ఆ ఓదార్పు యాత్రలో ఎన్నో జీవిత సిత్రాలు.. వ్యధలూ బాధలూ.. కష్టాలూ కన్నీళ్లూ విరిసీ విరియని నవ్వులు.. ఆప్యాయత అనుబంధాలు.. పోగొట్టుకున్న ప్రేమలూ.. చేజార్చుకున్న కుటుంబ విలువలూ.. ఒక్కటేమిటి ఒక జీవితానికి సరిపడిన అనుభూతిని అందిస్తుందీ ‘పాఠశాల’. ఎక్కడో అడపాదడపా కనిపించిన పోస్టర్లలో ‘5 ఫ్రెండ్స్ - 5 వీక్స్ - 5వేల కిలోమీటర్ల ప్రయాణం’ అన్న టాగ్ ఉత్కంఠ కలిగించింది. నిజానికి - ఎవరూ అంతగా ‘పాఠశాల’ని పట్టించుకోలేదు గానీ- డిఫరెంట్ కథని డిఫరెంట్ యాంగిల్‌లో డిఫరెంట్‌గా తీసిని సినిమా ఇది. ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాని నిర్మించిన మహి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడు. మారటమే కాదు- తనలో సత్తా ఏమిటో చూపించాడు కూడా.
కథ - పల్లెటూళ్లలో.. పట్టణాలలో. విభిన్న సంస్కృతుల మధ్య.. సామాజిక నేపథ్యంలో ఎదిగి ఒక కాలేజీలో కలిసిన ఐదుగురు ఫ్రెండ్స్. ఒకరి జీవితం ఏమిటో మరొకరి తెలీదు. ఫలానా చోటి నుండి వచ్చినట్టు తెలుసుగానీ.. ఆ గ్రామీణ వాతావరణం గానీ.. పట్టణం గానీ ఎలా ఉంటుందో ఒకరికొకరికి తెలీదు. కాలేజీ చదువులు ముగిసి ఎవరికి వారు ఊళ్లు వెళ్లిపోతూండగా.. ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట మేరకు - ఆ ఐదుగురు తమతమ నివాస స్థలాలకు అందరూ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ ఐదువేల కిలోమీటర్ల ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు.. వాటి పరిష్కారాలు.. కలసిన వ్యక్తులు -పలకరింపులు.. మాటలు.. వెల కట్టలేని ప్రేమలు ఎలా ఉన్నాయో? అవి భావి జీవితానికి ఏ విధంగా దోహదం చేశాయో ఒక్కో ఊళ్లో.. ఒక్కో సందర్భంలో అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కరి ఊళ్లో వారం రోజుల పాటు గడపాలి. అక్కడి పరిస్థితులు ఏవైనప్పటికీ. అక్కడి మనుషులు ఎలాంటి వారైనప్పటికీ. ఏ కాలేజీలోనూ బోధించని జీవిత సత్యాలు. జీవితాన్ని ఎలా మలచుకోవాలో? ఎ కెరీర్‌ని ఎంచుకోవాలో? చెప్పిన జీవిత పాఠాలు. ఈ ఐదుగురు ఫ్రెండ్స్ కార్తీక్ అనే వ్యక్తిని కలుస్తారు. జీవితంపట్ల అతనికున్న ఆశావాదాన్నీ.. ఎనర్జీని చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వారికి తెలిసిన నిజం కూడా అంతే భయంకరమైనది. కార్తీక్‌కి కేన్సర్. రేపోమాపో చనిపోతాడు. మృత్యువుని కూడా ‘టేకిట్ ఈజీ పాలసీ’గా తీసుకున్న అతడు వారిలో స్ఫూర్తిని నింపుతాడు. ఒకరికి చావు దగ్గరలో ఉంటే.. ఇంకొకరికి మరి కాస్త దూరం. అంతే! చావుని తప్పించుకోగల మనిషి ఇంతవరకూ పుట్టలేదు. ఏదో నాటికి ఈ లోకాన్ని విడిచి వెళ్లే వ్యక్తి ఎంతటి మారణకాండని సృష్టిస్తాడో? ఎనె్నన్ని భావావేశాలను చవి చూపుతాడో? ఒక్కో సన్నివేశంలో వారికి వివరిస్తాడు కార్తీక్. ఆఖరికి అతడి మరణం వారిలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది.
ఐదుగురు ఫ్రెండ్స్.. ఐదు వారాలు - 5వేల కిలోమీటర్ల ప్రయాణం ప్రేక్షకుణ్ణి గోదావరీ తీరం వెంబడి.. అరకు అందాల వైపు.. వరంగల్ సంస్కృతి వైపు, నెల్లూరు, కడపల ఆచార వ్యవహారాల వైపు పరుగులు పెట్టిస్తుంది. వాస్తవానికి - సినిమాల్లో ‘రోడ్’ నేపథ్యం అంతగా నప్పదు. ఒక్క ‘గమ్యం’ సినిమా తప్ప మిగతావన్నీ కాస్త అటు ఇటుగా నడిచినవే. ఐతే- ‘పాఠశాల’ మాత్రం తీయటి అనుభూతిని మిగల్చటమే కాదు- ఆలోచనలను రేకెత్తిస్తుంది. అందమైన లొకేషన్స్‌తో భావగర్భితంగా నడిచే జీవితాల వెనుక దాగిన సత్యాలు - ఇలా ఎన్నింటినో స్పృశిస్తుంది. సినిమా అంటే కేవలం ఫైటింగ్స్.. రొమాంటిక్ సీన్లు.. పాటలు లేదా ఐటెం సాంగ్‌లే కాదు.. అవేవీ లేకుండా కూడా సినిమా తీయ్యొచ్చునని మరోమారు చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మహికి ఇది మొదటి సినిమా. కాబట్టి - అక్కడక్కడ కొన్ని తప్పులు దొర్లినా అంతగా పట్టించుకో నవసరం లేదు. కొన్నికొన్ని సినిమా సన్నివేశాల మాదిరి కనిపించినా విడిచిపెట్టేయ్యొచ్చు. మనసులోకి ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా - కళ్లని తెరకి అప్పగించేస్తే.. ఆ ప్రయాణంలో ప్రేక్షకుల్ని హాయిగా తీసుకెళతాడు.
నటీనటులంతా కొత్తవాళ్లే అయినప్పటికీ - ప్రతి సన్నివేశంలోనూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. వీరికి తగ్గట్టు స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ, మాటలు తమ వంతు సహకారాన్ని అందించాయి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా ఇంత నీట్‌గా తీయ్యొచ్చునని నిరూపించారు. ద్వంద్వార్థాల జోలికి గానీ.. బొటాబొటి కాస్ట్యూమ్స్ జోలికి గానీ వెళ్లకుండా.. సన్నివేశాలను సైతం ‘హార్ట్ టచింగ్’లా మలచారు.
ఐతే - ఈ సినిమా థియేటర్లలోంచి వెళ్లిపోక ముందే చూడాలి. ఎందుకంటే- ఇలాంటి క్లాసిక్ మూవీని ‘ఎ’ గ్రేడ్ సెంటర్లు మాత్రమే ఆదరిస్తే సరిపోదు.

రోమ్‌స్పెషల్!

రోమ్‌స్పెషల్!

 • -మురళి
 • 17/10/2014

** రోమియో (ఫర్వాలేదు)
తారాగణం:
సాయిరాం శంకర్, అదోనికా
రవితేజ, జయసుధ, అలీ
ప్రగతి, నాగబాబు
సుబ్బరాజు తదితరులు
సంగీతం: సునీల్ కాశ్యప్
బ్యానర్: టచ్‌స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్
కథ, మాటలు: పూరి జగన్నాథ్
నిర్మాత: దొరస్వామి రాజు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీ గణేశ్

‘‘కథ ఏదయితేనేం? ఎవరు రాస్తేనేం? ఆ కథని తెరపై నడిపించిన విధానమే ప్రధానం.’’
వరుస పరాజయాలతో సతమతమవుతూ, తన ఖాతాలో కనీసం ఒక్క సక్సెస్‌ని కూడా వేసుకోలేకపోయిన సాయిరామ్ శంకర్‌కి ఎలాగైనా సక్సెస్ ‘రుచి’ని చూపించాలన్న గట్టిపట్టుదలతో ఈసారి తనే స్వయంగా రంగంలోకి దిగాడు దర్శకుడు పూరి జగన్నాథ్. కథ-మాటలు అందించడంతోపాటు తన సహాయకుడైన గోపి గణేష్‌ని దర్శకుడిగా నియమించాడు. ప్రేక్షకులని థియేటర్‌కి రప్పించడానికి ‘పూరి రాసిన ప్రేమకథ’అంటూ టాగ్‌లైన్‌ని సైతం తగిలించాడు. మరి ఈ రోమియో ఏమేరకు తన సత్తా చాటుకున్నాడో తెలుసుకునే ముందు..
న్యూయార్క్ నగరంలో స్థిరపడ్డ భారత కుటుంబానికి చెందిన సమంత (ఆదోనిక రాడ్రిక్స్)కి ఒంటరిగా పర్యాటక ప్రాంతాలకి ప్రయాణించడం హాబి. ఈ కారణంగానే ఇటలీ దేశానికి పయనమై ‘రోమ్’నగరానికి చేరుకుంటుంది. అక్కడ కిట్టు (సాయిరామ్‌శంకర్) అనే యువకుడితో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్తా వారిద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. ఈ క్రమంలో ‘పెళ్ళి చేసుకుందాం రా!’ అంటూ సమంతని ‘ప్రపోజ్’చేస్తాడు కిట్టు. తాను ‘ఇదివరకే ఒక వ్యక్తిని ప్రేమించానని, అతనినే పెళ్ళిచేసుకుంటా’నని కిట్టు అభ్యర్థనని తిరస్కరిస్తుంది సమంత. కాని కిట్టు ససేమిరా అంటూ తనతో పెళ్ళికి ఒప్పుకోమని బతిమాలుతాడు, తను లేకపోతే బతకలేనంటాడు. సమంతపై కిట్టుకి అంతగా ప్రేమ కలగడానికి దారితీసిన కారణాలు ఏమిటి? సమంత తన జీవితంలో ఎదురైన ఈ సంఘటనని ఎలా ఎదుర్కొంది?
పై ప్రశ్నలకి సినిమాలో జవాబులు ఉన్నప్పటికీ అవి స్పష్టత లేకుండా గందరగోళంగా గజిబిజిగా అన్పిస్తాయి. దీనికి బాధ్యులు కథకుడా? లేక దర్శకుడా? అన్న ప్రశ్న ఉదయిస్తే యిద్దరూ అనే చెప్పాల్సి ఉంటుంది. కథని అష్టవంకరలు తిప్పి, నానా హింసలు పెట్టి, ముక్కలు- ముక్కలు చేసి మూలనపడేశారు. దర్శకుని అవివేకాన్ని చాటి చెప్తుంది ఈ చిత్రం యొక్క ‘స్క్రీన్‌ప్లే’. సినిమాలో ఎక్కడా సీరియస్‌నెస్ అన్నది కనిపించదు. అంతా వేళాకోళంగానే ఉంటుంది. కథని ముందుకి నడిపించకుండా కేవలం రెండే రెండు పాత్రలతో ఒకదాని వెంట మరొకదాన్ని గుండ్రంగా తిప్పుతూ సమయాన్ని వృధాచేసాడు రథసారథి. ఎందుకో ఏమో మధ్యమధ్యలో ‘యాంకర్’లా ప్రగతి కనిపిస్తుంటుంది. ప్రారంభంలో కాస్త ‘సస్పెన్స్’ క్రియేట్ అయ్యినా, అంతలోనే తుస్సుమంటుంది. నాయికానాయకుల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కూడా మనకి చిరాకుని తెప్పిస్తాయి. పాస్‌పోర్ట్‌కోసం హీరోగారి వెంట హీరోయిన్ పడటం- పెళ్ళిచేసుకోమంటూ హీరోయిన్‌గారి వెంట హీరో పడటం- వీలయినప్పుడల్లా హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ సీన్లు- వీటితో ప్రథమార్థం ముగుస్తుంది. ‘‘ద్వితీయార్థం పరిస్థితి కూడా యించుమించుగా యింతే. కాకపోతే చిన్న తేడా! వాణిజ్య ప్రకటనల్లోని నటుల్ని తలపించే విధంగా రవితేజ- ఆలీ- నాగబాబు- సుబ్బరాజు- జయసుధ అక్కడక్కడ దర్శనమిస్తుంటారు. ఎందుకంటారా? వద్దులెండి! చెప్తే దర్శకుడిపై మీకు మరింత కోపం వస్తుంది. మూడు పాటలు, ఓ ఫైటుతో ద్వితీయార్థం కూడా ముగిసిపోతుంది. కథాపరంగా చూస్తే సినిమా యావత్తు ప్రేక్షకుని సహనానికి పరీక్షగా సాగుతుంది. యిలా జరగడానికి కారణం బహుశ సినిమా చిత్రీకరణ మొత్తం ఇటలీ దేశంలో జరపడమే కావచ్చు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధుడై, కథని, కథనాన్ని అందంగా చెప్పే బదులు రోమ్- వాటికన్- వెరోనా లాంటి నగరాల అందాలను, అక్కడి అద్భుతమైన కట్టడాలను, అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలను అలాగే కలోసియం, రోమియో- జూలియట్ స్మారక చిహ్నం లాంటి పర్యాటక ప్రాంతాలను తెరనిండా చూపాలని ‘డిసైడ్’ అయ్యుంటాడు దర్శకుడు. ఈ మాట కాస్త వెటకారంగా అన్పించినా, సినిమా చూసిన ప్రేక్షకుడు మాత్రం ‘ఫరిన్ ట్రిప్’ వెళ్ళొచ్చిన అనుభూతిని పొందుతాడు.
సాయిరామ్ శంకర్ తన నటనలో, డైలాగ్ డెలివరీలో పదేళ్ళుగా నటిస్తున్నా పట్టు సాధించకపోవడం విశేషం. సమంత పాత్రలో ఆదోనిక అంగాంగ ప్రదర్శనల వరకూ ఓకే!
దొంగనాకొడుకులు- దొబ్బేసావు- దూల తీరిందా- లాంటి మాటలు ఈ చిత్రానికి ‘డైలాగ్ రైటర్’ పూరి జగన్నాథ్ అని మనకి చెప్పకనే చెబుతాయి. సినిమా మొత్తానికి మెచ్చుకోదగ్గ ఒకే ఒక్క అంశం పి.జి.విందా అందించిన ఫొటోగ్రఫి. ‘రోమ్’ తదితర నగరాల అందాలను అద్భుతమైన రీతిలో తన కెమెరాలో బంధించాడు. ఇతని పనితనం కారణంగానే సినిమా ‘రిచ్‌నెస్’ని సంతరించుకుంది. కాని దర్శకుని తప్పిదాల వలన ఈ రిచ్‌నెస్ కాస్తా ‘అడవిగాచిన వెన్నెల’గా మారాల్సి వచ్చింది.

బొమ్మలో దెయ్యం!

బొమ్మలో దెయ్యం!

 • - కె.పి.అశోక్‌కుమార్
 • 17/10/2014

హాలీవుడ్ రివ్యూ
=========
** అన్నాబెల్లీ (ఫర్వాలేదు)
తారాగణం:అన్నాబెల్లీవాల్లీస్, వార్డ్ హర్టీన్, ఆల్‌ఫ్రే ఉడార్ట్
ఎడిటింగ్:టామ్ ఎల్కిన్స్
ఫొటోగ్రఫి:జేమ్స్ కీస్ట్
దర్శకుడు:జాన్ లియో నెట్టీ
------------------
ఆటబొమ్మలలో దెయ్యం దూరి బీభత్సం సృష్టించడం అనే ఇతివృత్తంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘‘కర్స్ ఆఫ్ చక్కీ, ఛైల్డ్ ప్లే, డాల్స్, పప్పెట్ మాస్టర్, డెమెనిక్ టాయ్స్’’ లాంటి సినిమాలు అలా వచ్చినవే. ఇప్పుడు మళ్లీ ‘అన్నాబెల్లీ’ పేరుతో కొత్త బొమ్మ వచ్చింది. 2013లో హిట్ అయిన హారర్ చిత్రం ‘ది కంజూరింగ్’కు ఇది ప్రీక్వెల్.
‘అన్నాబెల్లి’ చిత్రంలో- మియా, జాన్ అనోన్యంగా ఉండే యువ దంపతులు. జాన్ తన పనులలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గర్భవతిగా వున్న మియాను అపురూపంగా చూసుకుంటుంటాడు. బొమ్మలంటే మక్కువ కలిగిన మియాకు ఒక రోజు ఒక పెద్ద బొమ్మను జాన్ బహుమతిగా ఇస్తాడు. ఆ రాత్రి ఏదో గలాభా వినిపించి చూడగా, ఎవరో ఇద్దరు యువతీ యువకులు ఆమె పొరిగింటివారిని హత్యచేయడం కనిపిస్తుంది. అందులో దాడిచేసిన యువతి చేతిలో ఒక బొమ్మ వుంటుంది. అంతలో జాన్‌తోపాటు వచ్చిన పోలీసులు ఆ యువకుణ్ణి చంపెయ్యగా, ఆ యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. చనిపోతూ ఆమె రక్తంతో ఒక చిహ్నాన్ని గోడమీద వేసి, తన చంకలో వున్న బొమ్మ ముఖంమీద ఒక రక్తపుచుక్క విడుస్తుంది. ఆమె పేరు ‘అన్నాబెల్లీ హిగ్గెన్స్’ అని, అతను ఆమె బాయ్‌ఫ్రెండ్ అని, వాళ్లు ఆమె తల్లిదండ్రులను కూడా చంపేశారని, అదంతా ఒక తాంత్రిక పూజలో భాగంగా చేశారని తెలుస్తుంది.
అక్కడినుండి వాళ్లింట్లో అనేక విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఏవో నీడలు కనిపించడం, ఏవో చప్పుళ్లు వినిపించడం, రాత్రిళ్లు కుట్టుమిషన్ దానంతట అదే పనిచేయడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒక తాంత్రిక యువతి చచ్చి ఆ బొమ్మను ఆవహించిందని, ఆ బొమ్మ పేరు అన్నాబెల్లీ అని తెలుస్తుంది. ఈ బొమ్మవల్ల వచ్చే ఇబ్బందులను తట్టుకోలేక ఆ బొమ్మను వాళ్లకు దూరంగా చెత్తకుండీలో వేసి, ఆ ఇల్లు ఖాళీచేసి కొత్తగా అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోతారు. తీరా చూస్తే తమ ఇంట్లో అడుగున వున్న పెట్టెలో అన్నాబెల్లీ బొమ్మ కనిపిస్తుంది. అది పుట్టబోయే మియా కూతురి ఆత్మకోసం ఎదురుచూస్తుంటుంది. మియా ప్రసవిస్తుంది. పాపకు లియో అని పేరు పెడతారు. ఇంట్లో బొమ్మవల్ల వచ్చే ఇబ్బందులను తట్టుకోలేక ఒక డిటెక్టివ్‌ను సంప్రదిస్తారు. వాడు పరిశోధించి హిగ్గిన్స్ దంపతులు దెయ్యపు శక్తులను ఆహ్వానించారని, ఆ దెయ్యం ఒక ఆత్మగురించి వెతుకుతుందని చెబుతాడు. వాళ్లు ఒక ఆఫ్రికన్ యువతి నడిపే పుస్తకాల షాపుకు వెళ్లి, అక్కడి పుస్తకాల ద్వారా ఆ దెయ్యం శక్తి తమ పాప లియో ఆత్మను కోరుతుందని తెలుసుకుంటారు. జాన్, మియా దంపతులు ఆ బొమ్మను తీసుకొని చర్చ్ ఫాదర్ వద్దకు వస్తారు. అక్కడ అన్నాబెల్లీ తన దెయ్యం శక్తులతో విజృంభించి మాయమైపోతుంది. అంతలో ఆఫ్రికన్ యువతి వచ్చి, మియా వయసులో వుండే తన కూతురు రూబీ, తను చేసిన కారు ప్రమాదంలో చచ్చిపోయిందని చెబుతుంది. తనవల్లనే ఇలా జరిగినందుకు చింతించి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఇది సమయం కాదని రూబీ కంఠంనుండి వినిపించిందని చెబుతుంది.
అన్నాబెల్లీ ఆత్మ చేసిన పనులవల్లనే తనకు గాయాలయ్యాయని, ఈ రాత్రికే అది బొమ్మలోనుండి వెలువడి మానవ శరీరంలో దూరుతుందని చర్చ్ ఫాదర్ చెబుతాడు. దాంతో జాన్ పరుగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. అక్కడ దెయ్యం శక్తులు విజృంభించి ఆఫ్రికన్ యువతిని బయటకు విసిరేసి, మియాను నిలదీస్తుంది. మియా ఆ బొమ్మను నాశనం చేయబోతుండగా, తనకు మియా ఆత్మ కావాలని అది చెబుతుంది. అంతలో జాన్, ఆఫ్రికన్ యువతి తలుపులు బద్దలుకొట్టి చూడగా, అన్నాబెల్లి బొమ్మను చేతిలో పట్టుకుని కిటికీలోనుండి బయటకు దూకబోతున్న మియా వారికి కనిపిస్తుంది. జాన్ వచ్చి మియాను రక్షిస్తాడు. ఆఫ్రికన్ యువతి వచ్చి అన్నాబెల్లీ బొమ్మను తీసుకుని తను త్యాగం చేసే సమయం వచ్చిందని గుర్తించి, కిటికీలోంచి దూకి మరణిస్తుంది. పాప క్షేమంగానే ఉంటుంది. ఆరు నెలల తరువాత- ఆ అన్నాబెల్లీ బొమ్మ ఒక మ్యూజియంలో వుందని, 15 రోజులకొకసారి ఫాదర్ వచ్చి ఆశీర్వదించి వెళ్లడంతో ఆ దెయ్యం బొమ్మలోనే ఉండిపోవడంవల్ల ప్రజలు సురక్షితంగా ఉన్నారని చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
ఇంతకుముందు వచ్చిన ‘ది కంజూరింగ్’తో పోల్చుకుని చూస్తే ఈ సినిమా పేలవంగా, అనాసక్తికరంగా తయారైంది. గతంలో బొమ్మతో వచ్చిన దెయ్యాల సినిమాలు గగుర్పాటు కలిగించగా ఈ సినిమా నిస్తేజంగా కనిపిస్తుంది. అయినా ఇది ప్రేక్షకులను ఆకర్షించడంలో ఘనవిజయం సాధించింది. ఆరున్నర మిలియన్ డాలర్ల ఖర్చుతో తయారైన ఈ చిత్రం 122 మిలియన్ డాలర్లను వసూలుచేయడం విశేషం.

సముద్ర ప్రాణుల సంరక్షణ

సముద్ర ప్రాణుల సంరక్షణ

 • -అశోక్‌కుమార్
 • 10/10/2014

** డాల్ఫిన్ టేల్-2 (ఫర్వాలేదు)
తారాగణం:
హారీ కొనిక్, అష్లే జూడ్
నాధన్ గాంబిల్, అకిస్ క్రిస్ట్ఫార్ సన్
ఫొటోగ్రఫీ: డారిన్ ఒకాడా
రచన, దర్శకత్వం: చార్లెస్ మార్టిన్ స్మిత్

గతంలో వచ్చిన ‘ద డే ఆఫ్ ది డాల్ఫిన్, ఫ్లిప్పర్, డాల్ఫిన్స్, బెనీత్ ది బ్లూ’ అనే చిత్రాలు డాల్ఫిన్‌ల మీద తీసినవే. వీటి తర్వాత వింటర్ అనే డాల్ఫిన్ యదార్ధ గాథ ఆధారంగా నిర్మితమైన ‘డాల్ఫిన్ టేల్’ 2011లో విడుదలైంది. ఇందులో 2005 డిసెంబర్‌లో ఫ్లోరిడా తీరానికి గాయపడి కొట్టుకు వచ్చిన సీసాముక్కు డాల్ఫిన్‌ను రక్షించి క్లియర్ వాటర్ మెరైన్ అక్వేరియంలో చేర్పించడం చూడవచ్చు. వింటర్ అనే ఈ డాల్ఫిన్‌కు, సాయర్ అనే పిల్లవాడికి మధ్య ఏర్పడిన అనుబంధాన్ని ప్రధానంగా చిత్రీకరించిన ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ‘డాల్ఫిన్ టేల్-2’ ఇప్పుడు విడుదలైంది.
శ్వాస సంబంధిత సమస్యలతో సముద్రంలోంచి పైకి వచ్చిన డాల్ఫిన్ మాండీ ఎండ దెబ్బకు కమిలిపోయి ఒడ్డుకు కొట్టుకురావడం ఒకమ్మాయి చూడడం, దానిని డాక్టర్ క్లే హాస్పటల్‌లో చేర్చడంతో ‘డాల్ఫిన్ టేల్-2’ ప్రారంభమవుతుంది. సముద్ర జంతువులను రక్షించడం, బాగు చేయడం, వదిలేయడం అనే ఆశయంతో డాక్టర్ క్లే, క్లియర్ వాటర్ మెరైన్ అక్వేరియంను ప్రారంభిస్తాడు. వింటర్ విజయగాథతో ఈ అక్వేరియం బోలెడు పేరు, డబ్బు సంపాదించుకుంటుంది. దీనికి వచ్చిన లాభాలతో సముద్ర జంతువుల సంరక్షణ కొనసాగుతుంటుంది. మొదటి భాగంలో డాల్ఫిన్ వింటర్‌తో అనుబంధం ఏర్పరుచుకున్న బాలుడు సాయర్ ఇప్పుడు టీనేజర్‌గా, అక్వేరియంలో పనిచేసే వాళ్లకు శిక్షకుడిగా పని చేస్తుంటాడు. వింటర్‌తో ఏర్పడిన అనుబంధం వల్ల తన భవిష్యత్తును సాయర్ నిర్ణయించుకోగలుగుతాడు. మెరైన్ అక్వేరియంలో పనిచేస్తున్న డాక్టర్ క్లే కూతురైన హాజెల్, సాయర్‌కు మంచి స్నేహితురాలిగా గానే కాకుండా అతనిపై ఎన్నో ఆశలను పెంచుకుంటుంది.
డాల్ఫిన్ వింటర్ మళ్లీ కష్టాల్లో పడుతుంది. దాని సహచర డాల్ఫిన్ పనామా వృద్ధాప్యంతో చనిపోతుంది. డాల్ఫిన్స్ సామూహిక జీవులు కాబట్టి పనామా మరణంతో ఒంటరిదైపోయిన డాల్ఫిన్ ఆహారాన్ని ముట్టక సహాయ నిరాకరణతో డిప్రెషన్‌లో కూరుకుపోతుంది. అలా మొరాయించిన డాల్ఫిన్ తన మిత్రుడైన సాయర్‌ను సైతం గాయపరుస్తుంది. దాంతో క్లే-సాయర్, హాజెల్ డాల్ఫిన్ వింటర్‌తో కలిసి ఈతలాడవద్దని ఆజ్ఞాపిస్తాడు. దానికి తోడుగా ఆ దేశ చట్టాల ప్రకారం టాంక్‌లో ఒంటరి డాల్ఫిన్ ఉండడానికి వీల్లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో వున్న వారికి గాయపడిన డాల్ఫిన్ మాండీ ఆ మెరైన్‌కు రావడంతో వింటర్‌కు జోడీ దొరికిందని అంతా సంతోషిస్తారు. అక్కడ మాండీ వేగంగా కోలుకోవడంతో, దాన్ని త్వరలో సముద్రంలో విడిచిపెట్టేయాలని డాక్టర్ క్లే నిర్ణయిస్తాడు. దానికి ఆయన కూతురైన హాజెల్ ఒప్పుకోదు. మాండీ ఇంకా కొన్ని రోజులు వింటర్‌తో ఉంటే, వింటర్ కోలుకుంటుందని ఆమె నమ్మకం. కాని డాక్టర్ క్లే తమ సంస్థ ఆశయాలు ఆమెకు వివరించి మాండీని సముద్రంలో విడిచిపెట్టేస్తాడు. ఇక వింటర్‌ను కాపాడడానికి వేరే మార్గం లేదు కాబట్టి దానిని టెక్సాస్‌లో వున్న మెరైన్ ఎక్వేరియంకు తరలిస్తానంటాడు. ఇంతలో ఎక్కడో బందీగా వున్న ఒక ఆడ డాల్ఫిన్‌ను రక్షించి, ఆ అక్వేరియం హాస్పిటల్‌కు పంపిస్తున్నామని ఫోన్ వస్తుంది. వింటర్‌కు కంపెనీ దొరికిందని అంతా సంతోషిస్తారు. ఆ వచ్చిన డాల్ఫిన్ యంగ్ కావడం, వేట తెలియకపోవడం వల్ల దాన్ని సముద్రంలో విడిచిపెట్టలేరు. అంతా దానికి హోప్ అనే పేరు పెట్టుకుంటారు. ఇంకోవైపు ఆ మెరైన్ ఆస్పత్రి వాళ్లు ఒక సముద్రపు తాబేలును బాగుపరిచి సముద్రంలో వదిలిపెడతారు. దానితో అనుబంధం ఏర్పరుచుకున్న, అందర్ని చికాకుపరిచే పెలికాన్ పక్షి కూడా దానితోపాటే ఎగిరిపోతుంది.
డాక్టర్ క్లే ప్రభృతులు హోప్‌ను తీసుకువచ్చి వింటర్ దగ్గర నీళ్లలో విడిచిపెడతారు. చురుకైన హోప్, వింటర్‌కు తోక లేదనీ, అందుకే దాని కదలికలు సరిగా లేవని గుర్తిస్తుంది. దాంతో రెచ్చిపోయిన హోప్ చేసే ప్రమాదకర విన్యాసాలకు భయపడిన సిబ్బంది ఆ రెండు డాల్ఫిన్‌లను వేరుపరుస్తారు. అప్పుడు డాక్టర్ మాకర్తీ వింటర్‌కోసం సహజంగా కనిపించే విధంగా తయారుచేసిన కృత్రిమ తోకను దానికి అమరుస్తాడు. దాంతో రెండు డాల్ఫిన్‌లు నీళ్లలో చక్కగా తిరుగుతుంటాయి. అవి రెండూ అక్కడే ఉంటాయని తెలిసి అంతా సంతోషిస్తారు. వింటర్ కోలుకోవడంతో మెరైన్ బయాలజీ కోర్సును చదవడానికి సాయర్ వెళుతుండడంతో భారమైన హృదయంతో హాజెల్ తన వీడ్కోలు చెబుతుండగా సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాను జంతు ప్రదర్శనశాలగా కాకుండా జంతువుల స్పందనలకు, అనుభూతులకు ఇందులో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. జంతువులపట్ల మన దృష్టి మారాల్సిన అవసరాన్ని, జంతు సంరక్షణకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఈ సినిమా తెలియజేస్తుంది. మొదటి భాగం కంటే ఈ రెండవ భాగమే చాలా బాగా వచ్చింది.

కొంచెం కొత్తగా...!

కొంచెం కొత్తగా...!

 • -అనిల్
 • 10/10/2014

** హైదర్ (ఫర్వాలేదు)
తారాగణం:
షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్
టబు, ఇర్ఫాన్‌ఖాన్, నరేంద్ర ఝా సంగీతం: విశాల్ భరద్వాజ్
నిర్మాతలు: సిద్దార్థ్ రాయ్ కపూర్ - విశాల్ భరద్వాజ్
బ్యానర్: యుటివి మోషన్ పిక్చర్స్
దర్శకత్వం: విశాల్ భరద్వాజ్

కాశ్మీరీ బాధాతప్త జీవితాల్ని ఆవిష్కరింపజేసే కథ. సరిహద్దుల్లో శత్రుమూకల అలజడి.. అమాయకుల ప్రాణ త్యాగాలు.. ఉగ్రవాదుల బీభత్స భయానక మారణకాండ - చిన్న అలికిడికి సైతం ఉలిక్కిపడే బడుగు బతుకులు - ఒకనాడు ప్రశాంతతకూ.. ఆహ్లాదకర వాతావరణానికీ.. నిర్మలత్వానికీ మజిలీ.. ఈనాడు ఎంతటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదీ కొన్ని సన్నివేశాల్లో చెప్పిన కథ. దర్శకుడు విశాల్ భరద్వాజ్ - కాశ్మీరీ జర్నలిస్ట్ బషారత్ పీర్.. తమ కోణంలోంచి చూసిన కాశ్మీర్ వ్యధను కమర్షియల్‌గా చూస్తే ఏ మాత్రం అర్థంకాదు. బాధ మనసుకి ఎక్కదు. భారీ బడ్జెట్‌తో కూడిన రొమాన్స్... విదేశీ లొకేషన్స్.. రిథమిక్‌గా సాగే సంగీతం.. కురచ కాస్ట్యూమ్స్ - లిప్‌లాక్.. ఇవన్నీ పక్కనబెట్టి- దేశంలో ఒకపక్క నిరంతరంగా సాగుతోన్న దమనకాండను వీక్షిస్తే -అక్కడి సమస్యలేమిటో? అక్కడి వెతలేమిటో? కన్నీళ్లేమిటో? తెలుస్తుంది. రొటీన్‌గా భిన్నంగా సాగిన ‘హైదర్’ పయనం ఎటో చూద్దాం.
హైదర్ (షాహిద్ కపూర్) శాంతికాముకుడు. కవి. తండ్రి డాక్టర్ హిలాల్ మీర్ (నరేంద్ర ఝాష) అంటే ప్రాణం. ఆయన్ని ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేసిందన్న వార్త తెలిసి అలీఘర్ నుంచీ తిరిగి వచ్చేస్తాడు హైదర్. తన తండ్రి అదృశ్యం (?) వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ మిస్టరీలో తల్లి.. మామల ప్రమేయం ఉందా? ఆయన్ని ఎక్కడ ఉంచారు? ఆయన బతికే ఉన్నాడా? చంపేశారా? ఇదీ హైదర్ కథ.
‘మక్బూల్’ ‘ఓంకారా’ సినీ కథల్ని చూసిన ప్రేక్షకులకు భరద్వాజ్ కథాపటిమ ఎలాంటిదో తెలిసిందే. సామాజికాంశాన్ని కథలో పెట్టడం అంటేనే - కత్తి మీది సాము. శత్రుదేశం అనుక్షణం కయ్యానికి కాలు దువ్వుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అంశాన్ని తెర పైకెక్కించటం కూడా ధైర్యంతో కూడుకున్నదే. కాశ్మీరీ లోయలో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? శాంతిని కోరుకునే వారి జీవితాల్లో అశాంతి మిగలడానికి గల కారణాలు ఏమిటి? పగ, ప్రతీకారాలతో ఏం పోగొట్టుకుంటున్నామో తెలీని సందిగ్ధత తాలూకు భయాందోళనలు - వీటిని ప్రతి కోణంలోనూ ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేశాడు భరద్వాజ్. నేటి రాజకీయ దుస్థితిని ఎండగట్టాడు. కాశ్మీర్ పైకి అందంగా ప్రకృతి రమణీయతతో అలరారుతుందో... లోలోన ఎంతగా కుమిలిపోతోందో? ఆ మంచు దిబ్బల మధ్య ఎంతగా రగిలిపోతోందో? ప్రతి ఫ్రేమ్‌లోనూ చూపెట్టాడు.
దర్శకుడు భరద్వాజ్‌కి విలియం షేక్స్‌పియర్ అంటే ఎంత ఇష్టమో అతడి మాటల్లో కనిపిస్తుంది. షేక్స్‌పియర్ నాటకాల ప్రభావం కూడా భరద్వాజ్‌పై అంతే ఉంటుందన్నది నిర్వివాదాంశం. ‘మక్బూల్’ కథని చూసిన వారికి షేక్స్‌పియర్ ‘మేక్‌బెత్’ కేరెక్టర్ గుర్తుకొస్తుంది. ‘ఓంకారా’లో ఒథెల్లో కూడా ఇలాంటిదే. ఇక ‘హైదర్’ విషయానికి ‘హామ్లెట్’ పాత్రని దించేశాడన్నది విమర్శకుల మాట. ఏది ఏమైనా- కాశ్మీరీ నేపథ్యంతో ‘హైదర్’ ప్రేక్షకుల మదిలో తళుక్కున మెరుస్తాడు.
నటనాపరంగా - హైదర్‌గా షాహిద్ వొదిగిపోయాడు. జర్నలిస్ట్ అర్షియాగా శ్రద్ధా కపూర్.. డాక్టర్‌గా నరేంద్ర ఝా, మామగా కెకె మీనన్, హైదర్ తల్లి గజాలాగా టబు తదితరుల పాత్రల పరిధి చిన్నవైనప్పటికీ - ఆయా సంఘటనల సమాహారంలో తాము భాగస్వాములయ్యారు. కాశ్మీరీ అందాలను ఒకవైపు.. రక్తసిక్త వాతావరణాన్ని మరోవైపు కలిపి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. పంకజ్‌కపూర్ ఫొటోగ్రఫీ ‘హైదర్’కి ప్రాణం పోసింది. మిగతా శాఖలన్నీ కథని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయటంలో తోడ్పడ్డాయి.

యాక్షన్ థ్రిల్లర్!

యాక్షన్ థ్రిల్లర్!

 • -ఆశ్రీత్
 • 10/10/2014

** బ్యాంగ్ బ్యాంగ్ (ఫర్వాలేదు)

తారాగణం:
హృతిక్ రోషన్, కత్రినా కైఫ్
డానీ డెన్‌జెంగో పా, జావీద్ జాఫ్రీ
పవన్ మల్హోత్రా తదితరులు
సంగీతం: విశాల్-శేఖర్
సినిమాటోగ్రఫీ: వికాస్ శివరామన్ - సునీల్ పటేల్
నిర్మాణం: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్

యాక్షన్ థ్రిల్లర్స్‌కి కథతో పనేంటి? ఈ సెంటిమెంట్‌లో బోలెడన్ని సౌలభ్యాలు కూడా. ఎందుకంటే - కథకి సింగిల్ థ్రెడ్ ఉంటే చాలు. రీళ్లకు రీళ్లకు ఊళ్లకి ఊళ్లని చుట్టేయ్యొచ్చు. ఉన్న కథని ఎంచక్కా స్క్రీన్‌ప్లేకి అప్పగించేస్తే సరి?! కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. ఈ పని విధానాలన్నీ తెలుసు కాబట్టే- దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ అంతగా కష్టాన్ని కొని తెచ్చుకోలేదు. టామ్ క్రూసె - కామెరోన్ డియాజ్ సినిమా ‘నైట్ అండ్ డే’ కథని భారతీయ స్క్రీన్‌కి తగ్గట్టు సింపుల్‌గా రూపకల్పన చేశాడు. ఆనక - యాక్షన్ సీన్లు.. ఫైట్స్.. ఛేజింగ్‌లూ ఉండనే ఉంటాయి. యాక్షన్ మరీ ఓవర్ యాక్షన్‌గా మారితే- నవ్వించటానికో రొమాన్స్ వొలికించటానికో సీన్లు సరేసరి. ఈ స్టెప్ బై స్టెప్ కథని దర్శకుడు ఏ విధంగా తెరపై పండించాడో చూద్దాం....
రాజ్‌వీర్ నంద (హృతిక్ రోషన్) - లండన్‌లోని కోహినూర్ వజ్రాన్ని ఎంతో చాకచక్యంగా కొట్టేస్తాడు. (ఐతే? ఇక ఏవో ఊహల్లోకి వెళ్లొద్దని మనవి.) లెక్కలేనన్ని సినిమాల్లోలాగానే - అతగాడి వెనుక ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఓమర్ జాఫర్ (డానీ), హమీద్ గుల్ (జావేద్ జాఫ్రీ) తమ బృందంతో ఛేజింగ్ చేస్తూంటారు. మళ్లీ రొటీన్‌గా - ఓమర్ జాఫర్ కోసం రాజ్‌వీర్ ప్రయత్నిస్తూంటాడు. ఈ పనిలో బిజీగా ఉన్న రాజ్‌కి బ్యాంక్ రిసెప్షనిస్ట్ హర్లీన్ సాహ్ని (కత్రీనా కైఫ్) పరిచయమవుతుంది. ఆమె అందానికి ముగ్ధుడైన రాజ్‌ని ఆమె ఫాలో అయిపోతూండగా.. రాజ్ సాహసోపేత చర్యలకు ఫ్లాటయి పోతుంది హర్లీన్. ఇకనేం? ఇంటర్వెల్ తర్వాత బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. రాజ్‌కీ ఓమర్ జాఫర్‌కీ సంబంధం ఏమిటి? రాజ్‌కి కోహినూర్‌ని దొంగిలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు దీనికంతటికీ మూల కథ ఏమిటన్నది ‘బ్యాంగ్ బ్యాంగ్ - బజావో’.
హృతిక్ రోషన్ ఉన్నాడు కాబట్టి గానీ.. లేకుంటే ఎందుకూ కొరగాని కథ ఇది అనే స్థాయిలో ఉంది. కాకపోతే - హృతిక్ డాన్సులు, ఫైట్స్.. యాక్షన్ థ్రిల్లింగ్‌ని కలిగించటంవల్ల ఈ సినిమా బతికి బట్ట కట్టింది. సినిమా ఆరంభమైన పావుగంట వరకూ - కథలో ఏం చెప్పదలచుకున్నాడో ఒక్క ముక్క అర్థంకాదు. రొటీన్‌గా చూసుకుంటూ వెళ్లిపోవటమే. కథలో సస్పెన్స్ చివరాఖరికి గానీ తేలదు కాబట్టి - ఫస్ట్ హాఫ్‌ని పాటల్తోనూ.. రొమాంటిక్ సీన్లతో చక్కగా సర్దేశాడు దర్శకుడు. బోలెడన్ని లాజిక్‌ల జోలికి వెళ్లలేదు కూడా. ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టిన ప్రేక్షకుడు ఆ తర్వాత ఏదో ఉంటుందని భ్రమించటం సహజం. కానీ- అంతటి భయోత్పాతాలేవీ జరగలేదు. కథ ఏ కొస నుంచీ ఆ కొసకి వెళ్లిపోతుంది. ఐతే- స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుణ్ణి ఏ మాత్రం ఆలోచించనివ్వలేదు. పైగా థాయ్‌లాండ్, సిమ్లా, మనాలీ, అబూ దబీ... ప్రాగ్ తదితర లొకేషన్లలోకి తీసుకెళ్లి - కంటికింపు కలిగించాడు.
హీరో అన్న తర్వాత ఆ మాత్రం వీరోచిత పోరాటాలవీ చేయకపోతే ఎలా? అసలుకే కథ నిల్ కదా?! అన్నట్టు ఎనె్నన్ని సాహసాలు వొలకబోయాలో అన్నింటినీ హృతిక్ చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే- ‘బ్యాంగ్ బ్యాంగ్’ని పూర్తి స్థాయిలో అతడొక్కడే నెట్టుకొచ్చాడు. యాక్షన్ థ్రిల్లింగ్‌ని కలిగించాడు. ఆ విన్యాసాలవీ చూడాల్సిందే.
కత్రీనా కైఫ్ పాత్ర పరిధి తక్కువ. కాకపోతే - హృతిక్ - కత్రీనా కెమిస్ట్రీ పండింది. రొమాంటిక్ సీన్లలోనూ... ముద్దుల విషయంలోనూ హద్దులు లేకపోవటంవల్ల - తనదైన స్టయల్‌ని గ్లామర్‌గా చూపెట్టింది. విలన్‌గా డానీ.. పవన్ మల్హోత్రా తదితరులు ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు.
టెక్నికల్‌గా మాట్లాడుకొంటే- ఈ సినిమా అభిమానులకు ప్రత్యేక ఆకర్షణ. సిద్దార్థ్ ఆనంద్ టెక్నికల్‌గా సినిమాని చక్కగా మలిచాడు. అందుకు తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ- ఫైటింగ్ సీన్లనూ.. యాక్షన్ సన్నివేశాల్లోనూ ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించింది. ‘తూ మేరీ’ ‘మెహర్బాన్’ ‘బ్యాంగ్ బ్యాంగ్’ పాటలు ఇప్పటికే టాప్‌రేంజ్‌లో ఉండటం.. ఆయా పాటలకు తగ్గట్టుగా సన్నివేశాలు కలవటంతో ప్రేక్షకుణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథలోకి నడిపిస్తుంది.

పాత డ్రాకులా కొత్తకథ!

పాత డ్రాకులా కొత్తకథ!

 • - కె.పి.
 • 10/10/2014

** డ్రాకులా అన్‌టోల్డ్ (ఫర్వాలేదు)
తారాగణం:
లూక్ ఇవాన్స్,సారా గడోన్
డొమినిక్ కూపర్, సమంతా బార్క్స్
ఫొటోగ్రఫీ: జాన్ స్క్వాజమాన్
ఎడిటింగ్: రిచర్డ్ పియర్సన్
దర్శకత్వం: గేల్‌షోర్

ఇంతవరకు డ్రాకులా గురించి బోలెడంత చదివాం, చూశాం. నూరేళ్ళకు పైగా డ్రాకులా గురించి చెప్పుకుంటూనే వున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పడమా? ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంది? ట్రాన్సిల్వేనియాకు చెందిన ఈ నెత్తురు తాగే పిశాచం గురించి వందలాది సినిమాలు వచ్చాయి. డ్రాకులా అని ప్రత్యేకంగా చెప్పకుండా, కేవలం నెత్తురు తాగే పిశాచాల మీద అంతకంటె ఎక్కువగా సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా కొత్తగా మనకు తెలియని డ్రాకులా గురించి చెప్పడానికి ఈ చిత్రం వచ్చింది. తన ఆహార్యంతో, నటనతో డ్రాకులా పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన క్రిస్ట్ఫోర్ లీ లాంటి ప్రముఖ నటులు, ప్రముఖ సంస్థలు తీసిన అనేక డ్రాకులా చిత్రాలను చూసిన వాళ్ళకు నిజంగా ఈ సినిమా కొత్తగా, వైవిధ్యభరితంగా వుండి పిశాచాల పురాగాథలలో ఒకటిగా నిలిచిపోతుంది.
అది 15వ శతాబ్ది. తూర్పు యూరప్ ప్రాంతాన్ని చూపిస్తూ ‘‘డ్రాకులా అన్‌టోల్డ్’’ చిత్రం ప్రారంభమవుతుంది. అక్కడ టర్కులు నియంతృత్వంతో, నిరంకుశంగా చెలరేగిపోతుంటే, పక్కనే వున్న ట్రాన్సిల్వేనియాలో వ్లాడిటేప్స్ రాజ్యం చేస్తుంటాడు. టర్కులతో అనేక బాధలు పడిన వ్లాడ్ హింసకు, యుద్ధాలకు దూరంగా భార్య మరీనా, కొడుకుతో కలిసి ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. ఒకరోజు వ్లాడ్ తన మిత్రులు, సహచరులతో కలిసి పది సంవత్సరాల శాంతి సంపద సందర్భంగా వైభవంగా విందు చేసుకుంటుండగా, టర్కీ సుల్తాన్ రాయబారులు వస్తారు. వెయ్యి మంది ట్రాన్సిల్వేనియన్ పిల్లలను పంపించమనీ, వాళ్ళను బాల బానిస యోధులుగా తీర్చిదిద్ది యుద్ధాలలో వాడుకుంటామనీ ఆ పిల్లలతోపాటు వ్లాద్ కుమారుడ్ని కూడా పంపించాలనీ, అది రాజాజ్ఞ అని వాళ్ళు తెలియజేస్తారు. మంచివాడు, చిన్నప్పుడు బాల బానిస యోధుడిగా ఎన్నో కష్టాలు పడిన వ్లాద్ దీన్ని అంగీకరించలేకపోతాడు. నచ్చజెపుదామంటే అహంకారియైన సుల్తాన్ వినడు. తనకేమో స్వంత సైన్యం లేదు. బలమైన సైన్యం కలిగిన సుల్తాన్‌తో పోరాడటం అంటే కొండతో పొట్టేలు ఢీకొనడమే. గత్యంతరం లేక దూరంగా వున్న పర్వతం, దాని మీద వున్న చీకటి గుహలో దాగివున్న దెయ్యపుశక్తుల సహాయాన్ని కోరి వెళతాడు. అక్కడ వున్న పాత దెయ్యం అనగా నెత్తురు తాగే పిశాచం ఊరడించి- వ్లాద్‌కు అత్యధిక బలం, అతీతశక్తులు కావాలంటే మానవ రక్తం తాగాలని చెప్పి తాగిస్తుంది. దాంతో అతను నెత్తురు తాగే పిశాచంగా మారిపోతాడు. ఒకవేళ ఆ రక్తం తాగడానికి నిరాకరిస్తే, వ్లాద్ మనిషిగానే మిగిలిపోయేవాడు. వ్లాద్ తనకు సంక్రమించిన శక్తులతో ప్రపంచంలో అత్యంత బలమైన సైనిక శక్తిని 72 గంటల్లో ఓడిస్తాడు. ఇక అతను రక్తం తాగడం మానేస్తాడు.
అతి పెద్ద సైన్యంతో విరుచుకుపడిన టర్కులతో, వ్లాద్ యుద్ధంచేసిన తీరును బాగా చిత్రీకరించారు. చీకట్లో వేలాది నెత్తురు తాగే గబ్బిలాలను సృష్టించి సైనికుల మీదకు వుసిగొల్పి వారిని నాశనం చేస్తాడు. సుల్తాన్‌ను చికాకు పరుస్తాడు. వ్లాద్ విజయం సాధించినా ఇటు టాన్సిల్వేనియన్లు, అటు టర్క్‌లు వ్లాద్‌ను అనుమానిస్తారు. కుటుంబం పట్ల, రాజ్యం పట్ల అత్యంత ప్రేమ, విధేయత కలిగిన వ్లాద్ నెత్తురు తాగే పిశాచంగా మారాడని తెలుసుకున్న అతని భార్య అతడ్ని ఓదారుస్తుంది. ప్రజలు అతడ్ని పిశాచంగా గుర్తించి చంపి తగలబెట్టడానికి ప్రయత్నిస్తారు. అతడి మంచితనం తెలుసుకుని అండగా నిలుస్తారు. సుల్తాన్ యుద్ధంతో వ్లాద్ దృష్టిని మళ్ళించి, అతని అంతఃపురంపై దాడి చేసి భార్యను చంపి, కొడుకును బందీగా తీసుకుపోతాడు. భార్యను రక్షించుకోలేకపోయిన వ్లాద్‌ను తన ప్రజలు చచ్చినవాళ్ళు పోగా, చాలామంది కొన ప్రాణాలతో వుండటం కనిపిస్తుంది. చేసేది లేక వాళ్ళందర్ని డ్రాకుల్లా లాగా చేసి, వారితో సుల్తాన్ పైకి దండెత్తుతాడు. సూర్యకాంతి, వెండి మాత్రమే డ్రాకులాను నాశనం చేస్తుంది. అందుకని సుల్తాన్ వేలకొద్ది వెండి నాణేలను తన గుడారంలో వెదజల్లి, వ్లాద్ కుమారుడ్ని ఎరగా వేసి, వ్లాద్‌ను ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు. తాకిన ప్రతి వెండి నాణెం కాల్చేస్తు వుండగా, వ్లాద్ అత్యంత నైపుణ్యంగా సుల్తాన్‌తో పోరాడి చంపివేస్తాడు. టర్కులమీద డ్రాకులా సైన్యం విజయం సాధిస్తుంది.
ఇందులో రోమన్ చక్రవర్తి కలిగులా చనిపోయి, అప్పటినుండి ఆ గుహలో నెత్తురు తాగే పిశాచంగా పడి వున్నాడని ఇందులో చూపిస్తారు. ఐరిష్ నవలాకారుడు 1897లో డ్రాకులా నవల రాయడంతో ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు కూడా ఈ డ్రాకులా లాంటి వ్యక్తులు వుండగా, వాళ్ళను గుర్తు తెలియని పిశాచాలుగా అభివర్ణిస్తూ బోలెడన్ని కథలు యూరోపియన్ సమాజంలో వ్యాప్తి చెందాయి. వాటికొక చారిత్రిక నేపథ్యాన్ని కలిపిస్తూ ఈ సినిమాను తీశారు. ఇందులో డ్రాకులా సూపర్ హీరోలా కాకుండా మానవీయ విలువలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. భయానకంగా వుండాల్సిన ఈ చిత్రం విషాదాంతంగా ముగియడంవలన డ్రాకులా ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగాడు. ఈ చారిత్రాత్మక సినిమాకు, గతంలో వచ్చిన ‘‘300’’ చిత్రం తాలూకు పోలికలు కనిపించడం ఆశ్చర్యం.

ప్చ్...‘పాషా’!

ప్చ్...‘పాషా’!

 • -స్ఫూర్తి
 • 10/10/2014

* పాషా అందరివాడు (బాగోలేదు)
తారాగణం:
చంద్రమోహన్, సాయిప్రణీత
సాయికృష్ణ, ఫాజల్
ఓంప్రకాష్, అయ్యప్ప
సత్యప్రియ, హరి, ప్రభాకర్
అనంత్, చిన్నా
వైజాగ్ ప్రసాద్, తదితరులు.
సంగీతం: బండారు దానయ్య కవి
దర్శకత్వం: ఎస్.కె.సైదా సూరజ్,

దేశ జనాభాలో పిల్లల సంఖ్యా, స్థితి ఎన్నదగినదైనా ఆ నిష్పత్తిలో బాలల చిత్రాలు రావడం లేదన్నది అందరూ అంగీకరించే అంశం. ఇదిలావుంటే, ఈ తరహా చిత్రాల సంఖ్య తెలుగులో మరీ తక్కువ. ఆ కొరత తీర్చడానికా అన్నట్లు ‘పాషా అందరివాడు’ వచ్చిందనడానికి పూర్తిస్థాయి ఆస్కారం లేకుండా పోయింది. అదేమిటో చూద్దాం... కటిక దరిద్రంనుంచి వచ్చిన పాషా స్వయంకృషితో, మంచి నడతతో అందరివాడై ఉన్నత స్థానానికి ఎదిగిన విధానం ఇందులో ఉన్న స్థూల కథాంశం. అయితే దీని చిత్రీకరణలో దర్శకుడు, లేదా ఆ విభాగ పర్యవేక్షకుడు (ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు- దర్శకత్వ పర్యవేక్షకుడూ అంటూ వేర్వేరు వ్యక్తులు ఉన్నారు) అవలంభించిన అనుభవలేమి పద్ధతుల వల్ల అనాసక్తికరంగా తయారైంది. ప్రధానంగా పిల్లల సమస్యలపై, లేదా పిల్లలే ప్రధాన పాత్రలు ధరించిన చిత్రాల రూపకర్తలకు ఓ భయం వెంటాడుతూ వుంటుంది. కేవలం పిల్లల అంశాలే పెట్టి తీస్తే పెద్దలు వారిక్కావల్సిన విషయాలు ఇందులో ఉండవేమోనన్న అభిప్రాయంతో సినిమాకు రారేమోనన్న భావన. అదే అభిప్రాయంతో ఓ అనవసర సందర్భం కల్పించి ‘చల్లచల్లని బీరు’ అంటూ ఓ ఐటెమ్‌సాంగ్ కూడా పెట్టారు. అది ఏ రకంగానూ సినిమాకు ఉపయోగపడలేదు సరికదా అంతవరకూ ‘పాషా’అంటే ప్రేక్షకుల్లో ఉన్న మంచి అభిప్రాయాన్ని పల్చన చేసింది. అలాగే పాషాకున్న ఉన్నత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసిన సన్నివేశం- పుల్లయ్య- కన్యాకుమారి మధ్య ప్రేమ పెంపొందించడానికి (అసలు టెన్త్‌క్లాస్ పిల్లలపై ప్రేమ- లవ్వు అంటూ సన్నివేశాలు- అందులోనూ ఇలాంటి సందేశ ఉద్దేశ్య చిత్రాల్లో మరీ అప్రస్తుతం.) స్నేహితులు చేసిన ప్రయత్నాల్లో పాషాకూడా భాగస్వామి అయిన సీను అంతేకాకుండా పాషా పాత్ర ద్వారానే ‘‘ఒరేయ్ నువ్వు మా గురించి కూడా రెండు మంచి ముక్కలు కన్యాకుమారి దగ్గర చెప్పరా...’’అని అనిపించడం, ఇంకా ఆ పాత్ర విలువ తగ్గించింది. తొలుత పాషా ఇంటి పరిస్థితిని చక్కదిద్దిన వ్యక్తిగా, అనంతరం దేవుడి తాత (చంద్రమోహన్)ని ఆపద నుంచి కాపాడడం, వెంట తెచ్చుకోడం వంటి వాటిని చూపి ఉదాత్తంగా చూపారు. కానీ రానురాను ఆ ఉదాత్తత మిగతా సన్నివేశాల్లో కొరవడడం, విరుద్ధ సన్నివేశాలు తెరపై రావడంలో చిత్రం పట్టుకోల్పోయింది. అంతకన్నా సినిమాలో ఓచోట శ్రీను పాత్రలో అతని తండ్రి ‘నువ్వేం అవుదామనుకుంటున్నావే’ అని అడిగితే, నేను తెలుగు టీచర్ని అవుదామనుకుంటున్నాను అంటాడు. దానికి ప్రతిగా తండ్రి ‘‘కాదు నువ్వు ఫలానాదవ్వాలి’’అని పట్టుపడతాడు. ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటాడు. వాస్తవ ప్రపంచంలో కూడా పిల్లల అభీష్టానికి విలువివ్వకుండా తల్లిదండ్రులు తమతమ అభిప్రాయాల్ని బలవంతంగా రుద్దడం చూస్తున్నాం. వాటిని సాకల్యంగా చర్చిస్తూ పరిష్కార మార్గాలు సూచించినా సినిమా అర్ధవంతంగా తయారయ్యేది. లేకపోతే చంద్రమోహన్ పాత్రతో చెప్పించిన ‘‘మత, కుల, వర్గ, వర్ణాల విబేధాలు వద్దు, అందరం ఒకటే’’నన్న విశ్వశ్రేయ వాక్యాలకి సంపూర్ణ ఆవిష్కరణ దిశగా సినిమా నడిచినా చక్కగా ఉండేది. అలాకాకుండా అనవసర అంశాలకు అధిక ప్రాధాన్యమివ్వడంవల్ల సినిమా గాడి తప్పింది. ఇవన్నీ పక్కకు పెడితే కొన్ని కొన్ని అంశాల్లో అభినందనీయ ప్రయత్నాల పోకడలు ఇందులో కనపడ్డాయి. ముఖ్యంగా పిల్లలతో మంచి నటన రాబట్టారు. ఎటొచ్చీ వాటి నేపథ్యం వివరణ సరిగ్గా లేకపోవడంవల్ల అది రాణించవలసినంతగా రాణించలేదు. పాషా, పుల్లయ్య పాత్రధారులు చక్కటి నటన ప్రదర్శించారు. అలాగే పాషా తల్లి పాత్రధారిణీ బాగా నటించారు. చంద్రమోహన్ తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయినా, తన స్వర విషయంలో స్పష్టత పట్ల శ్రద్ధతీసుకుని వుంటే బాగుండేది. ‘‘చదువు సంపాదనకోసమే కాదు. విజ్ఞానంకోసం..’’ ఏదైనా సాధించాలంటే కృషీ, పట్టుదలా అవసరం.. వంటి బాగా తెలిసిన మాటలే ఇందులో ఉపయోగించినా, సినిమాలో అవి చక్కగా అనిపించాయి. ‘‘మనం ఎలా ఆలోచిస్తామో విషయాన్ని అలాగే చూస్తాం’’అన్న వాక్యమూ బాగుంది. ‘‘జీవితమంటే సమరం...’’ పాటలో ‘ఏడుస్తూనే జననం ఏడిపిస్తూ మరణం..’ అన్నవి అర్థవంతంగా చెప్పారు. అదే విధంగా చంద్రమోహన్‌పై చిత్రీకరించిన ‘‘తిరుపతి వెళ్లి ఏం లాభం, తీరు మార్చుకోండి, మక్కా వెళ్ళి ఏం లాభం మనసు మార్చుకోండి, చర్చికి వెళ్లి ఏం లాభం చెంపలేసుకోండి..’’అన్న పాటా అర్థపరంగా ఉన్నతంగా ఉంది. కానీ దీని వివరణకు సినిమాలో ఇంకా చోటిస్తే సమంజసంగా ఉండేది. ఇంకో ప్రధాన లోపం- ఈ చిత్రంలో వినపడే శబ్దానికీ, కనపడే దృశ్యానికీ ప్రాధాన్యత ఇవ్వకుండా అశ్రద్ధ వహించడం. దీనివల్ల చాలాచోట్ల సినిమా దృశ్యం సరిగ్గా కనపడలేదు. మాట కుదురుగా వినపడలేదు. వీటిని అధిగమిస్తేనే సినిమా ప్రేక్షకుణ్ణి నేరుగా చేరుతుంది. మొత్తానికి మంచి ఆశయంతో సినిమా అందివ్వాలన్న తపనతోపాటు, అది అందించిన తీరులో పాటించాల్సిన పద్ధతుల్ని సరిగా అనుసరించి ఉంటే నిజంగా ‘పాషా’ అందరివాడై అలరించేవాడు అని అనిపించింది.

రివ్యూ

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading