క్రీడాభూమి

చివరి వనే్డలో విజయంతో తప్పిన ‘వైట్‌వాష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 23: ఆస్ట్రేలియ చేతిలో ‘వైట్‌వాష్’ ప్రమాదం నుంచి టీమిండియా తృటిలో బయటపడింది. మనీష్ పాండే అజేయ శతకంతో ఆదుకోవడంతో, రెండు బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్ల తేడాతో చివరిదైనా ఐదో వనే్డలో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌ను మాత్రం 1-4 తేడాతో కోల్పోయింది. అంతకు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శతకాలతో కదంతొక్కగా, ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అయితే, భారత్ ఆ లక్ష్యాన్ని 49.4 ఓవర్లలో అధిగమించింది. చివరి క్షణం వరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో మనీష్ వీరోచిత ఇన్నింగ్స్ ప్రత్యేకతను సంతరించుకుంది. సంక్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ను కొనసాగించి, అజేయంగా శతకాన్ని సాధించడంతోపాటు జట్టును గెలిపించిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన జస్‌ప్రీత్ బుమ్రా ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి, రెండు వికెట్లను పడగొట్టి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు.
మ్యాచ్ ఆరంభానికి ముందు 0-4 తేడాతో వెనుకబడిన టీమిండియాపై క్లీన్‌స్వీప్‌ను సాధించేందుకు ఆస్ట్రేలియా అన్ని అస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, చివరి మ్యాచ్‌ని గెల్చుకొని, వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి బయటపడాలన్న పట్టుదలతో ధోనీ నేతృత్వంలోని భారత్ కూడా పోరాటానికి ఉపక్రమించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఈ జట్టు మొదటి ఓవర్‌లోనే ఒక వికెట్ సాధించింది. ఆరోన్ ఫించ్ (6)ను ఇశాంత్ శర్మ ఎల్‌బిగా వెనక్కు పంపడంతో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (28), జార్జి బెయిలీ (6), షాన్ మార్ష్ (7) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. 117 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఆదుకున్నారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. వార్నర్ 113 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేసి ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ భాగస్వామ్యంలో ఆస్ట్రేలియా జట్టు 300 పరుగుల మైలురాయిని అధిగమించింది. 27 బంతుల్లో 36 పరుగులు చేసిన వేడ్‌ను ధోనీ క్యాచ్ పట్టగా ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. జేమ్స్ ఫాల్క్‌నెర్ కేవలం ఒక పరుగు చేసి జస్‌ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శతకాన్ని నమోదు చేసే క్రమంలోనే మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా స్కోరును 330 పరుగులకు చేర్చాడు. అతను 126 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 84 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు చేశాడు. అప్పటికి జాన్ హాస్టింగ్స్ రెండు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్, రిషీ ధావన్‌లకు చెరొక వికెట్ లభించింది.
రాణించిన ఓపెనర్లు
ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా వైట్‌వాష్ వేయించుకోకుండా బయటపడేందుకు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఆస్ట్రేలియా బౌలర్లను లక్ష్యపెట్టకుండా వీరిద్దరూ స్కోరుబోర్డును పరుగులు తీయించారు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను ధావన్ రూపంలో కోల్పోయింది. అతను 56 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేసి జాన్ హాస్టింగ్స్ బౌలింగ్‌లో షాన్ మార్ష్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 8 పరుగులు చేసి జాన్ హాస్టింగ్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే బాధ్యతాయుతంగా ఆడుతూ రోహిత్ శర్మకు చక్కటి సహకారాన్ని అందించాడు. మూడో వికెట్‌కు మనీష్ పాండేతో కలిసి 97 పరుగుల జోడించిన తర్వాత హాస్టింగ్స్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ శర్మ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 108 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కెరీర్‌లో 11వ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని కేవలం ఒక్క పరుగు తేడాతో రోహిత్ కోల్పోయినప్పటికీ, భారత్ విజయానికి అతను బాటలు వేశాడు. రోహిత్ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక ఫోర్, మరో సిక్సర్ సాయంతో 34 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్‌ను మిచెల్ మార్ష్ వేశాడు. తొలి బంతి వైడ్‌గా వెళ్లడంతో, భారత్ విజయానికి 6 బంతుల్లో 12 పరుగుల దూరంలో నిలిచింది. మొదటి బంతిని ధోనీ సిక్సర్‌గా మార్చడు. అయితే, రెండో బంతిలో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అప్పటికి భారత స్కోరు 325 పరుగులు. మరో నాలుగు బంతులు మాత్రమే మిలిలాయి. మనీష్ పాండే మూడో బంతిని ఫోర్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్‌వికెట్ వైపుకొట్టి, రెండు పరుగులను రాబట్టడంతో భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. 49.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 331 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ, వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి బయటపడింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సాధించిన శతకాలు వృథాకాగా, అజేయ సెంచరీతో భారత్‌ను గెలిపించిన మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.