అంతర్జాతీయం

ఉగ్రవాదంపై పోరులో కలిసి సాగుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 13: భారత్, శ్రీలంక దేశాల భద్రత విడదీయలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, కీలకమైన సముద్ర జలాల రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో తమ రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమని నొక్కి చెప్పారు. మూడు దేశాల పర్యటనలో చివరి మజిలీగా శ్రీలంక చేరుకున్న మోదీ శుక్రవారం ఆ దేశ పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ, శ్రీలంక సమైక్యత, సమగ్రత భారత దేశానికి అత్యంత ప్రధానమైనవని, దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రజలు మార్పును, సమన్వయాన్ని ఆశిస్తున్నారనే విషయానికి అద్దం పడుతున్నాయని అన్నారు. శ్రీలంక పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానుల్లో మోదీ నాలుగోవారు. ఇంతకు ముందు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్‌లు శ్రీలంక పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. అంతేకాదు 1987లో రాజీవ్ గాంధీ శ్రీలంకలో పర్యటించిన తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యిటంచడం ఇదే మొదటిసారి.
ఇరుదేశాలు ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్ల గురించి ప్రధాని మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని విజయవంతంగా తిప్పి కొట్టడానికి సముద్ర జలాల సహకారాన్ని విస్తరించుకోవడంలో రెండు దేశాలు చేతులు కలపాలని అన్నారు. ‘శ్రీలంకతో భద్రతాపరమైన సహకారానికి మేము ఎంతో విలువ ఇస్తున్నాం. భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య ఉన్న సముద్ర జల రవాణా భద్రతా సహకారాన్ని హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా విస్తరింపజేయాలి’ అని మోదీ అన్నారు. మన రెండు దేశాల భద్రత, అభివృద్ధికి హిందూ మహాసముద్రం అత్యంత కీలకమైనదని, మన రెండు దేశాలు గనుక కలిసి పని చేస్తే, పరస్పర విశ్వాసం, నమ్మకంతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తే, అన్నిటికన్నా మించి ఒకరి ప్రయోజనాలను మరొకరు అర్థం చేసుకుంటే ఈ లక్ష్యాలను సాధించడంలో మరింతగా విజయవంతమవుతామని ఆయన అన్నారు. రెండు దేశాలకు స్థానికంగా సవాళ్లు ఉన్నాయని, అయితే ఇప్పుడు కొత్త మార్గాల్లో సరికొత్త ప్రమాదాలు ఎదురవుతున్నాయని, ఉగ్రవాదం అనేది ప్రపంచ ముప్పుగా పరిణమించడాన్ని మనం చూస్తున్నామని ప్రధాని అంటూ, అందువల్ల మన రెండు దేశాల మధ్య సహకారం గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. అంతేకాదు శ్రీలంకతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భారత దేశం పూర్తిగా కట్టుబడి ఉందని, ఇది ఒక మిత్రుడు, పొరుగువాడి బాధ్యతగా తాము భావిస్తున్నామని ప్రధాని అన్నారు.
దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎల్‌టిటిఇతో శ్రీలంక జరిపిన పోరాటాన్ని మోదీ ప్రస్తావిస్తూ, ఉగ్రవాదాన్ని అంతమొందించి, ఈ పోరుకు తెరదించినందుకు ఆ దేశాన్ని అభినందించారు. ఇప్పుడు సమాజంలోని అన్ని వర్గాల హృదయాలను చూరగొనే, వారి గాయాలను మాన్పగలిగే ఓ గొప్ప అవకాశం మీకు లభించిందని ఆయన అంటూ, మార్పును, సమన్వయాన్ని ఐక్యతను కోరుకుంటున్నామన్న ఈ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఇటీవల జరిగిన ఎన్నికలు అద్దం పట్టాయని అన్నారు. శాంతి, సమన్వయం కోసం దేశం జరిపే కొత్త ప్రయాణంలో తమిళులకు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవంతో కూడిన జీవితాన్ని భారత దేశం కోరుకుంటోందని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను సాహసోపేతమైన, అహ్వానించదగ్గ చర్యలుగా మోదీ అభివర్ణించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినప్పుడు దేశం వారి వల్ల మరింత బలోపేతంగా తయారవుతుందని ఆయన అన్నారు.
అంతకు ముందు శ్రీలంకలో రెండు రోజుల పర్యటనకోసం శుక్రవారం మాల్దీవులనుంచి కొలంబో చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ్ సింఘే స్వాగతం చెప్పారు. అనంతరం మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో చర్చలు జరపడం కోసం అధ్యక్ష భవనానికి వెళ్లారు. అధ్యక్ష భవనం వద్ద మోదీకి శ్రీలంక అధ్యక్షుడు సాదరంగా స్వాగతం పలికిన తర్వాత సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఇరువురు నేతలు ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తన పర్యటన తమ రెండు దేశాలు మరింతగా అర్థం చేసుకోవడానికి తోడ్పడిందని, ఇరు దేశాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంతో పాటు, రెండు దేశాల సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిందని మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య చిక్కు సమస్యగా మారిన జాలర్ల సమస్యపై తాను సిరిసేనతో చర్చించానని చెప్పిన మోదీ రెండు దేశాల జీవనోపాధి, మానవతా అంశాలు ఇమిడి ఉన్న చిక్కు సమస్య ఇదని అన్నారు. ఈ కోణంలోనే మనం ఈ సమస్యను చూడాలని, అదే సమయంలో దీనికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు.