Others

పెంకి పెళ్లాం (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు, పాటలు: ఆరుద్ర
సంగీతం: కె ప్రసాదరావు
కళ: గోడ్‌గాంకర్
కూర్పు: వియస్ నారాయణ, ఆర్‌వి రాజన్
ఛాయాగ్రహణం: డియల్ నారాయణ
నృత్యం: అనిల్‌కుమార్ చోప్రా,
వెంపటి సత్యం
దర్శకత్వం: కె కామేశ్వరరావు
సహాయ దర్శకులు: యం మల్లిఖార్జునరావు
నిర్మాతలు: ఎస్ భావనారాయణ, డిబి నారాయణ
**
ద్రాక్షారామంలో జన్మించిన దినవహి భాస్కర్ నారాయణ (డిబి నారాయణ) 1938 నుంచి మైసూరులోని మైసూరు స్టూడియోలో సౌండ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 1951లో మద్రాసు వచ్చి ప్రకాష్ స్టూడియోలో జనరల్ మేనేజర్‌గా కొంతకాలం చేశారు. ఈయన స్నేహితులు సరిదె భావన్నారాయణతో కలిసి సాహిణి ప్రొడక్షన్స్ స్థాపించారు. తొలి చిత్రంగా ‘అమరసందేశం’ నిర్మించి ఆదుర్తి సుబ్బారావుని దర్శకునిగా చిత్రసీమకు పరిచయం చేశారు.
‘సినీ ఫాన్’ కలం పేరుతో కృష్ణా పత్రికలో పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావును నిర్మాత హెచ్‌ఎం రెడ్డి మద్రాస్‌కు ఆహ్వానించి, దర్శకత్వ శాఖలో బాధ్యత అప్పగించారు. దర్శకునిగా వీరి తొలి చిత్రం ‘చంద్రహారం’. వీరి ప్రతిభను గుర్తించిన డిబి నారాయణ, భావన్నారాయణలు తమ బ్యానర్‌పై రూపొందించిన రెండవ చిత్రం ‘పెంకి పెళ్లాం’కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఎన్టీ రామారావు హీరోగా సాహిణి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన పెంకి పెళ్ళాం చిత్రం 1956 డిసెంబర్ 6న విడుదలయింది.
***
తాగుబోతు రంగయ్య (నాగభూషణం), హేమలత దంపతుల పిల్లలు సీత (జూ. శ్రీరంజని), రాజు (మాస్టర్ నాగేశ్వరరావు, ఎన్‌టి రామారావు). ఆవేశంలో చేసిన హత్య కారణంగా రంగయ్య జైలుకు వెళ్లటంతో అతని బావ పెరుమాళ్ళు (కెవియస్ శర్మ) పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. అతని మొదటి భార్య కొడుకు వాసు (అమర్‌నాథ్) సీతను ప్రేమిస్తాడు. తాయారు (్ఛయాదేవి) పెరుమాళ్ళు రెండో భార్య. ఆమె అక్క సుందరమ్మ (సూర్యకాంతం). ఆమె కొడుకు హనుమంతు. సుందరమ్మ, తాయార్ల కారణంగా వాసు, సీతను ప్రేమ వ్యవహారం పెరుమాళ్లుకు తెలుస్తుంది. ఆగ్రహించిన పెరుమాళ్లు, సీతను తన ఇంటినుంచి వెడలగొడతాడు. ఆత్మాభిమానంగల సీత, స్వయంశక్తి కఠోర శ్రమతో తమ్ముడు రాజును పెంచి బిఏ ఫస్టుక్లాసులో పాసయ్యేలా చేస్తుంది. ఉద్యోగార్థం బస్తీవెళ్ళిన రాజును (ఎన్‌టిఆర్) రావుబహద్దూర్ గోవిందరావు(రేలంగి) కుమార్తె ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. తల్లిలేని పిల్ల అని గారాబంగా తండ్రి పెంచటంతో, పెంకితనంతో పెరిగిన సరోజ (రాజసులోచన) భర్త తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటుంది. రాజు సొంత ఊళ్లో ఉద్యోగం రావటం, భర్తతో అక్కడికెళ్లిన సరోజ తన ప్రవర్తనతో భర్త, ఆడపడచును అవమానిస్తుంది. దూరపు చుట్టమైన సుందరమ్మ, సరోజకు చెందిన డబ్బు నగలు దొంగిలిస్తుంది. శరభయ్యకిచ్చి పంపించేసి, ఆ నేరం సీత చేసిందని, ఆమెకు అక్రమ సంబంధం ఉందని సరోజను నమ్మిస్తుంది. ఆ కోపంలో సరోజ ఇల్లు వదిలి తండ్రివద్దకు వెళ్ళగా అతడు కూతురిని మందలించి పంపుతాడు. తరువాత రాజు ఆఫీసు డబ్బుకూడా సుందరమ్మ మాయం చేయటం, ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన సీత, సుందరమ్మను గాయపర్చి తమ్ముడిని పోలీసుల నుంచి విడిపిస్తుంది. ఆ సమయానికి వచ్చిన శరభయ్య (రమణారెడ్డి) పెద్ద దొంగ అని, మారువేషాల్లో తిరుగుతున్నాడని ఇన్‌స్పెక్టర్ వాసు (అమర్‌నాథ్) అతన్ని బంధించబోతాడు. తప్పించుకోబోతున్న శరభయ్యను రంగయ్య పట్టుకోవటంతో పోలీసులు అతన్ని జైలులో పెడతారు. పెరుమాళ్ళు వాసుకి, సీతకు పెళ్ళిచేస్తానని చెప్పటం, అపోహలు తొలగిన సరోజ, రాజులు ఏకం కావటం, సుందరమ్మనూ పోలీసులు అరెస్ట్ చేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
పిల్లలను గారాబంగా పెంచితే ఒకడు హనుమంతు (జోగారావు)లా పిచ్చివాడిగా తయారుకావటం లేదా సరోజాలా పెంకి పిల్లగా మారతారని, పిల్లల్ని క్రమశిక్షణతో సీతలా పెంచాలని గోవిందరావు సందేశమివ్వటం ఈ చిత్ర కథా సూక్ష్మాన్ని వివరిస్తుంది. ఈ చిత్రంలో రాగిణి, పెరుమాళ్ళు, పేకేటి శివరామ్, పెండ్యాల అతిథి నటులుగా నటించారు. సరోజ పెళ్ళిచూపులకు వచ్చిన వ్యక్తులుగా పేకేటి శివరామ్, ఇంకో వరునిగా పెండ్యాల నటించారు.
హీరో రాజుగా ఎన్‌టి రామారావు అనుభవైకమైన నటను ప్రదర్శించారు. బాధ్యతనెరిగిన తమ్మునిగా మెప్పించారు. మనసిచ్చిన యువతి సరోజతో స్థాయికి తగ్గట్టుగా ప్రేమ, వలపు, చొరవ, హుషారు చూపటం, సన్నివేశాలకు అనుగుణమైన భావయుక్త నటనతో మెప్పించారు. కథానాయిక సరోజగా రాజసులోచన పెంకితనం, స్వాభిమానం, అతిశయం, తొలిచూపులో వలచిన వ్యక్తిని భర్తగా పొందటంలో ఆనందాన్ని చక్కగా చూపించారు. చెప్పుడు మాటలు విని ఆడపడుచు పట్ల నిరాదరణ, తండ్రి మందలింపుతో తన ప్రవర్తనకు మన్ననకోరటంలాంటి సన్నివేశాల్లో ఆకట్టుకునేలా నటించింది. సరోజ తండ్రిగా రేలంగి, రాజు అక్క సీతగా జూ.శ్రీరంజని పరిణితితో కూడిన సాత్విక నటనతో అలరించారు. మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా నటించారు. రమణారెడ్డి కుమార్తెగా, జోగారావుకు జంటగా సీత, రేలంగి ఇంట నౌకరుగా రామకోటి, డాక్టరుగా రామచంద్రరావు నటించారు.
సునిశిత ప్రజ్ఞావంతులు కమలాకర కామేశ్వరరావు సన్నివేశాలను ఎంతో సహజంగా, అర్దవంతంగా రూపొందించి చిత్రీకరించారు. రంగయ్య, జైలుకు వెళ్ళే సన్నివేశంలో భార్య, పిల్లల ఆవేదనను ఆర్ద్రతతో ఆకట్టుకునేలా చూపించారు. సీతకు వాసుతో పెళ్ళి జరిగి తన తమ్ముడిని ఇంటినుంచి తాయారు, సుందరమ్మ తరిమేస్తున్నట్టు కలరావటం, తమ్ముడి సుఖం తరువాతే తన సుఖం అని సీత నిశ్చయం, మాట పట్టింపుతో తమ్ముడికోసం సీత శ్రమపడటంలాంటి అంశాలను ప్రబోధాత్మకంగా ఒక గీతంలో అలరించేలా చిత్రీకరించారు. -లేదు సుమా/ అపజయమన్నది లేదు సుమా/ పాటు పడినచో లోటే రాదు/ రెక్కలపైనా బతికేవారు ఎక్కడ వున్నా ఒకటే సుమా (ఘంటసాల) అంటూ సాగుతుంది. ఇక నౌకర్లు, కూతురితో రేలంగి కనిపించే సన్నివేశాలు సెంటిమెంట్, హాస్యంతో సాగుతాయి. ‘ఎవరికయినా డబ్బు ఇచ్చేటప్పుడు నోటు నెంబర్లు వ్రాసుకునే మంచి అలవాటు’ రేలంగి పాత్ర ద్వారా చెప్పించటం, కూతుర్ని మందలించిన తండ్రి తనను తాను హింసించుకోవటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రాజసులోచనను చిన్ననాటి నుంచి అతి గారాబంగా పెంచటం, యుక్తవయస్కురాలైనాక కూడా ఓ నృత్యంలో ఆమె స్వభావం తెలియ చేయటంలాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ గీతం -ఆటలు సాగునటే చెలి (ఏపి కోమల). రాజును ప్రేమించాక అతనెలా ఉండాలో వూహిస్తూ సాగే గీతం (మూడు అద్దాల్లో మూడు బింబాలతో కనువిందుగా చిత్రీకరించారు) -సొగసరివాడు సోకైనవాడు (జిక్కి). ఎన్టీఆర్, రాజసులోచనలపై యుగళ గీతాలు.. పెళ్ళికి ముందు -నన్ను పెండ్లాడవే చెంచితా’ (ఎఎం రాజా, జిక్కి), పెళ్ళి తరువాత వెనె్నల రేయిలో గీతం -నన్ను పెండ్లాడవోయి నా సామి (జిక్కి, ఎఎం రాజా) సరదాగా సాగుతూ అలరిస్తాయి. ఇవి సరోజ, బాల బృందంపై చిత్రీకరించిన హుషారు గీతం -పడుచుదనం రైలు బండిపోతున్నది’ (జిక్కి బృందం). శ్రీరంజనిపై రెండు గీతాలు -అమ్మా అమ్మా (సుశీల), -్భరమునీదే నమ్మా (పి లీల). ఈ చిత్రంలో అమర్‌నాథ్, శ్రీరంజనిలపై చిత్రీకరించిన తొలిరేయి గీతం ఎంతో పరవశించేలా, సంగీత సాహిత్యాల సున్నిత మేళవింపుగా -లేదోయి లేదోయి వేరే హారుూ అంటూ సాగుతుంది. ఈ చిత్రం పేరు చెప్పగానే ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన గీతం.. రేలంగి గుర్రం మొహం తగిలించుకొని కూతుర్ని ఎత్తుకుని ఆడించే పాట -చకచక గుర్రం చెలాకి గుర్రం (ఏపి కోమల, వివిఎల్ ప్రభాకర్ రచన). ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజు 1956లో కణ్ణియన్ కడమై పేరిట తమిళంలోకి డబ్ చేశారు.
‘పెంకి పెళ్ళాం’ చిత్రం సక్సెస్ సాధించకపోయినా మంచిని తెలియచేస్తూ సహజ సన్నివేశాలతో రూపొందిన కుటుంబ కథా చిత్రంగా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందగలిగింది. పాటలు నేటికీ శ్రోతలను అలరిస్తుండటం విశేషం.
దర్శకులు కమలాకర కామేశ్వరరావు తొలి చిత్రం ‘చంద్రహారం’, మలి చిత్రం ‘పెంకి పెళ్ళాం’లలో హీరోగా నటించిన ఎన్టీ రామారావు, వారి ప్రతిభను గమనించి తమ ఎన్‌ఏటి బ్యానర్‌పై రూపొందించిన ‘పాండురంగ మహాత్మ్యం’ చిత్రానికి దర్శకులుగా నియమించుకున్నారు. ఆ తరువాత వారు పలు చిత్రాలకు నిర్దేశకత్వం వహించి ‘పౌరాణికబ్రహ్మ’ బిరుదు పొందటం ఎంతో హర్షదాయకమైన విషయం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి