మెయన్ ఫీచర్

పాఠాలు నేర్వకుంటే ప్రమాదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యధాభరిత ప్రజాజీవనం, ఆర్థిక, భౌగోళిక అస్థిరత వంటివి 2015 సంవత్సరాన్ని పూర్తిగా ముంచె త్తాయ. మరి 2016 దీనికంటే మెరుగ్గా ఉంటుందా? గత ఏడాది కాలంగా కొనసాగిన హింస, నష్టాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకొని పోతాయని భావించడం అత్యాశే అవుతుంది. కాకపోతే కొత్త సంవత్సరం తొలి మాసాల్లో పరిస్థితి కొంతమేర మెరుగుపడొచ్చు. గతం నుంచి పాఠాలను నేర్చుకొని, తప్పులను సరిదిద్దుకుంటూ ముందడుగు వేస్తే అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో క్రమేపీ మార్పులను వీక్షించవచ్చు. ఇక 2016 ద్వితీయార్థం మాత్ర సాపేక్షంగా శాంతి, న్యాయం సుస్థిరతలతో మరింత ఆనందకరంగా కొనసాగాలంటే, ఇప్పటివరకు అనుసరించిన వినాశకర విధానాలనే పట్టుకొని వేళాడటం వల్ల భావి మరింత దుర్భరమవుతుందన్న విజ్ఞత సామూహింకంగా కలగడం అతిముఖ్యం. 2015లో కొనసాగిన యుద్ధాలు, మానవహక్కుల ఉల్లంఘనల వల్ల 60 మిలియన్ల మంది నిర్భాగ్యులు బలవంతంగా తమ స్వస్థలాలను విడిచి పరాయి ప్రదేశాలకు వలసపోయారని, ఐక్యరాజ్య సమితి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1992 నుంచి ఇప్పటి వరకు ఇదే అధికం. సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, ఉక్రెయిన్, దక్షిణ సూడాన్, బురుండి వంటి దేశాలు 2015లో తీవ్రస్థాయి హింసకు కేంద్రాలుగా నిలిచాయి. కానీ బలవంతపు వలసల గురించి ఐరాస చెబుతున్న గణాంకాలు వాస్తవ సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి.
2015లో ప్రపంచలోని చాలా ప్రాం తాలు యుద్ధ సుడిగుండంలో చిక్కుకుపోయాయి. అందువల్ల నూతన సంవత్సరంలో కనీసం కొన్ని తొలిమాసాల్లో అవే భయానక, గంభీర పరిస్థితులు కొనసాగక తప్పదు. న్యూయార్క్‌కు చెందిన సౌఫాన్ గ్రూపు వ్యూహాత్మక వ్యవహారాలపై ప్రతిష్ఠాత్మక కన్సల్టెన్సీగా పేరుపడింది. తన వార్షిక ముగింపు నివేదికలో..‘‘సిరియా అంతర్యుద్ధానికి 2016 చిట్టచివరి సంవత్సరం కాగలదా?’’ అని ప్రశ్నిస్తూ, అందుకు తానూహించిన సమాధానాన్ని కూడా అందులో పొందుపరచింది. ‘‘సిరియాలో అనేక సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగే అవకాశముంది,’’ అనేదే ఆ సమాధానం. శాంతి చర్చలు ఫలిస్తాయన్న ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమైన ఆశాభావాల స్వభావాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది. అయితే ఇప్పుడు మనమంతా సరైన మార్గంలోనే పయనిస్తున్నామని మాత్రం స్పష్టం చేసింది. సిరియా అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలే సరైన మార్గమని ఐక్యరాజ్య సమితి ప్రవేశ పెట్టిన తీర్మానానికి సభ్యదేశాల మద్దతు లభించడమే మనం నడిచే బాట సరైన దిశలో ఉన్నదనడానికి ఉదాహరణ అని పేర్కొంది. అయితే భద్రతామండలిలో అగ్రరాజ్యాల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ముఖ్యంగా సిరియాలో అగ్రరాజ్యాలు తెరవెనుక ఉండి పరోక్ష యుద్ధాన్ని కొనసాస్తున్న నేపథ్యంలో, అక్కడినుంచి ఉపసంహరించుకోవడానికి వాటిని అంగీకరింపజేయాలంటే తగిన సమయం అవసరం కాక తప్పదు. సమీప భవిష్యత్తులో సిరియాలో యుద్ధం ముగిసిపోతుందని ఆశించడం కష్టం. అయితే అమెరికా-రష్యాలు కలిసి ఈ దిశగా పనిచేయడానికి ముందుకు రావడం క్రమంగా ఈ భయంకర యుద్ధం సమసిపోతుందనడానికి పొడచూపుతున్న ఆశాకిరణం.
2015 సంవత్సరం మనకు అందించిన శుభవార్త..ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) తాము గతంలో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలనుంచి క్రమంగా పట్టు కోల్పోవడం. గడచిన 12 నెలల కాలంలో తమ స్వాధీనంలోని ఖలీఫేట్‌గా చెబుతున్న ప్రదేశంలో సుమారు 14 శాతం వరకు ఐఎస్‌ఐఎస్ కోల్పోయింది. ‘ఐహెచ్‌ఎస్ కాన్‌ఫ్లిక్ట్ మానిటర్’ ప్రకారం.. ఇరాన్, రష్యా, యుఎస్‌ల మద్దతుతో ఇరాక్ సైన్యం..గత ఏడాది ఐఎస్‌ఐఎస్ ఆక్రమించుకున్న భూభాగాల్లో చాలావాటినుంచి ఉగ్రవాదులను తరిమేసి తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. మరోవైపు పశ్చిమ దేశాల మద్దతు పుష్కలంగా ఉన్న కుర్దుల పోరాట దళాలు ఐఎస్‌ఐఎస్‌పై గణనీయమైన విజయాలు సాధించాయి. ఈ పరిణామాలతో ఖలీఫా సామ్రాజ్యాన్ని మరింతగావిస్తరించాలన్న ఐఎస్‌ఐఎస్ ఆశలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. వారి విస్తరణ కూడా నిలిచిపోయింది.
ఐఎస్‌ఐఎస్ అధినేత అబు బకర్ అల్-బగ్దాదీ తాజాగా విడుదల చేసిన ఆడియో రికార్డింగ్‌లో ఈ పరాజయ నిరాశ స్పష్టంగా ధ్వనించింది. ఈ ఆడియో ప్రసంగంలో జిహాదిస్టుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు యత్నించాడు. ‘‘మృత్యువు మనల్ని ముద్దాడినా లేదా గాయాలపాలైనా, బలహీనపడినా లేదా పెను విపత్తు దాడికి గురైనా, భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు,’’ అని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముస్లింల నియామకాలను అబు బకర్ చేపట్టడంలో అంతర్లీనంగా ఒక పాఠం ఉంది. ‘‘ ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం కేవలం చిన్నపాటి మతయుద్ధం కాదు, ప్రపంచంలోని అన్ని అవిశ్వాస దేశాలు, ఇస్లామిక్ స్టేట్‌పై జరుపుతున్న పోరాటం. ప్రపంచ దేశాలన్నీ ఏకమయి ఒకే లక్ష్యపైన పోరాటం సలపడం మానవ చరిత్రలో ఇదే ప్రథమం,’’ అన్నదే ఈ నియామకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
అందువల్ల 2016 సంవత్సరం చెబుతున్న పాఠం చాలా స్పష్టం : అంతర్జాతీయ సమాజం తమ మధ్య ఉన్న విభేదాలను, సంకుచిత లక్ష్యాలను విడనాడి సమైక్యంగాఐఎస్‌ఐఎస్‌పై తీవ్రస్థాయిలో వత్తిడిని కలుగజేస్తే, ఈ ఉగ్రవాద సంస్థను అణచివేయడం సాధ్యం. మరి ఇది సాధ్యమా? అనేది పెద్ద ప్రశ్న. ముఖ్యంగా టర్కీ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల వైఖరి దీన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. ఐఎస్‌ఐఎస్‌ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమర్థిస్తున్న దేశాలు గతకాలం నాటి తమ ‘్ధర్త’ వ్యవహారశైలిని విడనాడితే దారుణ కృత్యాల ద్వారా ఉదారవాదులను, మైనారిటీలను హతమారుస్తున్న ఈ ఐఎస్‌ఐఎస్ ‘్భతాన్ని’ అణచివేయడానికి తప్పనిసరిగా వీలవుతుంది.
సిరియా, ఇరాక్‌ల్లో చావుదెబ్బ తిన్నప్పటికీ ఐఎస్‌ఐఎస్ ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా దాడిచేసే ప్రమాదం పొంచి ఉండనే ఉంది. ఈజిప్టులో రష్యా పౌరులపై, ప్యారిస్‌లో ఫ్రెంచ్ పౌరులపై, సాన్ బెర్నార్డినోలో అమెరికన్లపై ఐఎస్‌ఐఎస్ జరిపిన దాడులను గమనిస్తే, 2016లో భద్రతాపరంగా నెలకొనబోయే సంక్లిష్ట వాతావరణం కళ్లకు కడుతున్నది. ఐఎస్‌ఐఎస్ ప్రతిపాదిత ఇస్లామిక్ స్టేట్ విస్తీర్ణం కుంచించుకొని పోయినా, దాని సిద్ధాంతాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తప్పుదారి పట్టిన సున్నీ ముస్లిం యువకుల హృదయాలను తట్టిలేపడమే కాదు పౌర లక్ష్యాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు వారిని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. మరి ఇటువంటి హృద య విదారక దాడులను నివారించాలన్నా లేక పరిమితం చేయాలన్నా ప్రపంచ దేశా ల్లో 2015లోని నిఘా వ్యవస్థ కంటే మరింత ఆధునికమైన, పటిష్టమైన నిఘావ్యవస్థను నెలకొల్పడమే కాకుండా, సమన్వయంతో, సమాచారాన్ని పరస్పరం పంపిణీ చేసుకోవడం అత్యంత అవసరం. జిహాదీ బలిదానాల పట్ల వెర్రి ఆకర్షణను అడ్డుకోవడానికి..సంయమనంతో కూడిన విధానాలు, పరస్పరం విశ్వాసం కలిగించే మాటలు, తీవ్రవాద వ్యతిరేక ఉద్యమాలు ఇక ఎంతమాత్రం పనిచేయవు. ఇది ముఖ్యంగా శరణార్థి వ్యతిరేక, వలస వ్యతిరేక భావోద్వేగాలు తీవ్రంగా ఉన్న ముస్లిం, పశ్చిమ దేశాలకు వర్తిస్తుంది. అటువంటి భావోద్వేగాలు 2015లో ఆయా దేశాల్లో పరాకాష్టకు చేరుకున్నాయి. జాతి విద్వేషం, విదేశీ వ్యతిరేకతను హృదయం నిండా నింపుకున్న వారు ఐఎస్‌ఐఎస్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారక మానరు.
2016లో కృషి చేయాల్సిన మరో రంగం ఉంది. అదే సామాజిక, ఆర్థిక రంగాల్లో అందరినీ కలుపుకొని పోవడం. ప్రజల్లో ఆత్మగౌరవ పరిరక్షణకోసం వేగంగా పెరిగిపోతున్న అసమానతలను నియంత్రించడానకి యత్నించాలి. ఇది కేవలం ముస్లిం దేశాలకే పరిమితం కాదు. ఏ దేశాల్లో అయితే వర్గ విభజనలు, ధృవాత్మక సమాజాలు అధికంగా ఉన్నాయో వాటిల్లో కూడా ఈ అసమానతల తొలగింపునకు ఆయా దేశాలు కృషి చేయాలి. మళ్లీ ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మధ్యతరగతి సమాజం దీనివల్ల తీవ్ర సంక్షోభానికి గురవుతుంది. అందువల్ల సరైన విధానంలో పనిచేయని దేశీయ, అంతర్జాతీయ సంస్థలను నియంత్రణలో ఉంచడానికి ఆయా ప్రభుత్వాలు కృషి చేయాలి. అందుకోసం విస్తృత స్థాయి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న వారు ప్రభుత్వాన్ని, కార్పొరేషన్లను ఒప్పించి విశాలహితాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేసేలా, ఉత్తమ సమాజ రూపకల్పనకు దోహదపడేలా కృషి చేయాలి.
ఇక చివరగా దృష్టి పెట్టాల్సింది పర్యావరణ పరిరక్షణపై. ఇప్పటికే 2015 అత్యంత ఉష్ణతాపం కలిగిన సంవత్సరంగా నమోదైంది. ప్రపంచంలో వాతావరణ పరమైన అనేక తీవ్రస్థాయి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్యారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం ఆధారంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకోవాలి. ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలన్నీ వాస్తవికతను గుర్తించి, కర్బనవాయువు పరిమాణాన్ని వాతావరణంలో మరింత తగ్గించేందుకు నిబద్ధతతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశాలు, ప్రైవేటు రంగానికి చెందిన దిగ్గజాలు, రాజకీయ నేతలు, ఉగ్రవాద సంస్థలు నూతన సంవత్సర కాల ప్రవాహంలో ఉత్థాన పతనాలను చూడవచ్చు. కానీ ఈ క్రమంలో భూమి ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

- శ్రీరాం చౌలియా