Others

ఆట బొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్‌బ్యాక్ @ 50

కథ, మాటలు: జి కృష్ణమూర్తి
పాటలు: జి కృష్ణమూర్తి, సి నారాయణరెడ్డి
కళ: బి నాగరాజన్
ఛాయాగ్రహణం: లక్ష్మణ్‌గోరే
నృత్యం: చిన్ని, సంపత్
స్టంట్స్: శివయ్య
సంగీతం: ఎస్‌పి కోదండపాణి
నిర్మాత: టిసి సుబ్బన్న
దర్శకత్వం: జి విశ్వనాథం

జమిందారిణి సుభద్రమ్మ తమ్ముడు భుజంగరావు (సత్యనారాయణ) దుర్మార్గుడు. వారి వంశానికి చెందిన 3 గోల్కొండ వజ్రాలను కాజేయాలని ప్రయత్నిస్తుంటాడు. సుభద్రమ్మ అవి అతనికి దక్కకుండా కాపాడుతుంది. అనారోగ్యం పాలైన సుభద్రమ్మ, వజ్రాలను నమ్మకమైన నౌకరు రాఘవుల చేతికిచ్చి, తన కూతురు శశి పెద్దదయ్యాక అప్పగించమని కోరుతుంది. రాఘవులు ఆ మూడు వజ్రాలను శశి ఆడుకునే రెండు ఆటబొమ్మల్లో దాచి, వాటిని జాగ్రత్త చేయమని తన కుమారులు సూర్యం, చంద్రంలకు ఇస్తాడు.
భుజంగం జమీందారిణిని విషప్రయోగంతో చంపిస్తాడు. రాఘవుల వద్దనున్న వజ్రాల కోసం ఒత్తిడి చేసి అతన్నీ హత్య చేస్తాడు. భర్త మరణంతో రాఘవుల భార్య కూడా మరణించటంతో సూర్యం, చంద్రం దిక్కులేనివారవుతారు. వజ్రాలకోసం పిల్లలను భుజంగం హింసిస్తాడు. దాంతో వారిరువురూ భుజంగం వద్దనుంచి పారిపోతారు. దారిలో విడిపోతారు. చెరొక బొమ్మ వారివద్ద ఉంటుంది. దాంట్లో వజ్రాలున్న సంగతి వారికి తెలియదు. చంద్రం ఒక ధనవంతుడి ప్రాపకంలో శేఖర్ పేరుతో పెరిగి సిఐడి ఇన్‌స్పెక్టర్ అవుతాడు. భుజంగం చేతికి చిక్కిన సూర్యం అతని పోషణలో పెద్ద దొంగగామారి, నారాయణ పేరుతో వ్యవహరిస్తుంటాడు. భుజంగం దొంగ వ్యాపారాలను నారాయణ అడ్డుకుంటూ, ఒక నైట్‌క్లబ్ నడిపిస్తుంటాడు. ఆ ఊరిలోని దొంగ వ్యాపారం అరికట్టడానికి శేఖర్ ట్రాన్స్‌ఫర్ అయి వస్తాడు. భుజంగంను, నారాయణను అనుమానిస్తాడు. భుజంగం శశి ఆస్తిని అనుభవిస్తూ, శశిని తన కొడుకు సదానందానికిచ్చి పెళ్ళిచేసి ఆస్తి పొందాలని ప్లాన్ వేస్తాడు. శశి, శేఖర్ కలుసుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటారు. శశి సదానందాన్ని పెళ్ళి చేసుకోవటం ఇష్టంలేక ఇంట్లోంచి పారిపోతుంది. నారాయణ ఆమెను బంధించి తన క్లబ్బులో బలవంతంగా డాన్స్ చేయిస్తాడు. ఆమెకోసం భుజంగంరాగా, ఆమె నారాయణ ఇంట్లో దాక్కుంటుంది. నారాయణ భార్య శాంతకు, నారాయణ నైజం తెలియచేస్తుంది. తన భర్త మంచివాడని అప్పటి వరకూ నమ్మిన శాంత, తన బిడ్డను గీత సైకిలు బుట్టలోవుంచి ఆత్మహత్యకు సిద్ధపడి నదిలో దూకుతుంది. నారాయణ మనుషుల వల్ల నీటిపాలైన శేఖర్ ఆమెను రక్షిస్తాడు. శాంత, శేఖర్‌లు రక్షింపబడి, నారాయణకు శేఖర్ తన తమ్ముడని తెలియటం, వీరిరువురి కారణంగా భుజంగం పోలీసులకు పట్టుబడడం, వజ్రాలు శశికి అందచేశాక, శేఖర్‌తో శశికి పెళ్ళికావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో భుజంగంగా సత్యనారాయణ సన్నివేశానుగుణమైన క్రూరత్వాన్ని అలవాటైన రీతిలో ప్రదర్శించారు. నారాయణగా ఎస్‌వి రంగారావు గెటప్, నడక, సంభాషణలు పలకటం, అన్నిటికి తనదైన ప్రావీణ్యాన్ని వైవిధ్యంగా మెప్పించారు, అంతకుముందు వచ్చిన ‘మొనగాళ్ళకు మొనగాడు’ పాత్రకు కొంత దగ్గరగా ఉండటం విశేషం. నెగెటివ్ పాత్ర పోషణలోనూ, అందెవేసిన నటులు ఎస్‌వి రంగారావుకు ఇది నల్లేరుమీద నడక. పోలీస్ ఆఫీసర్‌గా కాంతారావు చురుకుగా, శశితో ప్రణయంలో చలాకీగా అలరించగా, యల్ విజయలక్ష్మి నటిగానూ ఎంతో ఈజ్‌తో మెప్పించారు. ఇతర పాత్రధారులు పాత్రోచితంగా నటించారు. దర్శకులు విశ్వనాథం కథకు తగ్గట్టు సన్నివేశాలు రూపొందించి చిత్రీకరించారు.
ఆటబొమ్మలు చిత్ర గీతాలు
మ్యాజిక్ మేన్‌గా రమణారెడ్డిపై చిత్రీకరించిన గీతం -మాది పేర్ ఖాదర్‌భాషా/ దేఖోభయ్యో తమాషా (జి కృష్ణమూర్తి, గానం మాధవపెద్ది). రమణారెడ్డి గీతాంజలిలపై చిత్రీకరించిన గీతం -నున్వూ నేనూ జట్టు/ నా లవ్వుమీద ఒట్టు/ ఎందుకయ్యారట్టు/ నీ దారి నువ్వు పట్టు (జి కృష్ణమూర్తి, గానం పిబి శ్రీనివాస్, యల్‌ఆర్ ఈశ్వరి). యల్ విజయలక్ష్మి, కాంతారావులపై చిత్రీకరించిన యుగళ గీతం -కనులు పిలిచెను రారారా/ మనసు పలికెను రారారా/ పొదల నీడలలో (సి నారాయణరెడ్డి- గానం ఘంటసాల, సుశీల). యల్ విజయలక్ష్మి, రాజ్‌బాబులపై చిత్రీకరించిన గీతం -మత్తు మందుజల్లేవు బుచ్చిబావా/ ఓరకంట జూసీ నా చిన్నదానా (జి కృష్ణమూర్తి- గానం మాధవపెద్ది, జమునారాణి). యల్ విజయలక్ష్మి, గీతాంజలిపై చిత్రీకరించిన గీతం -గువ్వన్నాడే, రోజా పువ్వన్నాడే, నేనే నువ్వన్నాడే (జి కృష్ణమూర్తి- గానం ఎస్ జానకి). యల్ విజయలక్ష్మిపై చిత్రీకరించిన నృత్యగీతం -మొగ్గలు వీడిన పువ్వులు, సిగ్గులు వీడిన నవ్వులు (జి కృష్ణమూర్తి- గానం పి.సుశీల). కాంతారావు, యల్ విజయలక్ష్మిలపై చిత్రీకరించిన గీతం -నాలోన నీవు నీలోన నేను/ ఏనాటికి నీతోడు వీడలేను (సి నారాయణరెడ్డి, గానం ఘంటసాల). ఈ చిత్రంలో సూర్యం, నారాయణగా ఎస్‌వి రంగారావు; చంద్రం, శేఖర్‌గా కాంతారావు, సచ్చిదానందంగా రాజ్‌బాబు, లోకనాథంగా రమణారెడ్డి, గీతగా గీతాంజలి, శశిగా యల్ విజయలక్ష్మి, నారాయణ భార్య శాంతగా జి వరలక్ష్మి నటించారు.
కుటుంబ కథాచిత్రానికి ఆటబొమ్మలో వజ్రాలు దాచటం అనే సస్పెన్స్‌తో రూపొందించిన ఈ చిత్రం సాధారణ చిత్రంగా నిలిచింది. బొమ్మల్లో బాంబులవంటివి దాచటం అంశంతో పలు చిత్రాలు ఆ తరువాత రూపొందినా, కమల్‌హసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడులో ఇలా కూతురి ఆటబొమ్మలో వజ్రాలుంచటం అనే అంశాన్ని చూస్తాం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి