కడప

అన్నికత్తులు ఒకే వరలో ఇమిడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 26: జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశంపార్టీలోకి వలసలు మొదలుకావడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రాంతాల్లో దశాబ్దాలకాలంగా వందలాది మంది అశువులు బాశారు. రాజకీయ స్వార్థంతో నేతలు ఏకమైనా వారి వెంట వున్న కార్యకర్తలు మొఖం చాటేసుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అన్నినియోజకవర్గాల్లో స్వపక్ష పార్టీలోనే రెండు, మూడు గ్రూపులు మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. వలస నాయకుల రాకతో అసలైన సిసలైన పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం సీనియర్ నేతలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ హైకమాండ్ మాత్రం పార్టీ భవిష్యత్ కోసం ప్రతిపక్ష నేతను టార్గెట్ చేసుకుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న నేతల మధ్య బేధాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు టిడిపి ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్న ప్రతి నియోజకవర్గంలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. రేపోమాపో మరికొందరు వైకాపా నేతలు కాంగ్రెస్ దిగ్గజాలు టిడిపిలోకి ప్రవేశిస్తుండటంతో టిడిపి సీనియర్ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇక రిజర్వుడ్ నియోజకవర్గాలైన రైల్వేకోడూరు, బద్వేలులో టిడిపి హౌస్‌ఫుల్ అయ్యింది. స్థానిక సంస్థలకు చెందిన ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు , కార్పొరేటర్లు వస్తుండటంతో వారందరికీ పార్టీలో సుముచిత స్థానం లభిస్తే టిడిపిలోని ప్రధమ, ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు భవిష్యత్ ఏమిటని వారు సమాలోచనలు చేస్తున్నారు. టిడిపిలో చేరేందుకు ఏ పార్టీ నుంచి నేతలు వచ్చినా వారందరినీ పార్టీలోకి తీసుకోవాలని లోకేష్ ఆదేశించడంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

వైవియులో ముంచుకొస్తున్న నీటిఎద్దడి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 26: యోగివేమన విశ్వవిద్యాలయంలో అవసరాలకు తగినంత నీరు అందక పోవడంతో వేసవికి ముందే సమస్యలు ఎదురవుతున్నాయి. విశ్వవిద్యాలయంలో ఉన్న బోర్లలో నీరు తగ్గిపోవడం , కొన్ని బోర్లు మొరాయించడం వల్ల నీటి సమస్య ఎదురౌతోంది. గత మూడునెలలుగా వల్లూరు మండలం చెరువుకిందపల్లె పెన్నానది నుంచి వైవియుకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వల్లూరు నుంచి వైవియుకు పైపులైన్ దెబ్బతినడం, ఆ పైపులైన్‌కు మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో వైవియుతోపాటు వల్లూరు మండలంలోని పలుగ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది. వైవియుతోపాటు వల్లూరు , పెండ్లిమర్రి మండలాల్లోని 25 గ్రామాలకు తాగునీరు అందివ్వాలన్న లక్ష్యంతో మూడేళ్ల కిందట వల్లూరు మండలం పెన్నానదిలో బోర్లు ఏర్పాటుచేసి అక్కడి నుంచి పెద్దలేవాకు గ్రామం వద్ద సర్వీసు రిజర్వాయర్ నిర్మించారు. అక్కడి నుంచి పంపింగ్ స్కీమ్ ద్వారా గ్రామాలకు, వైవియుకు తాగునీరు అందిస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ పొలాల్లో పంపులు దెబ్బతినడం వల్ల వైవియుకు నీరు అందకుండా పోయింది. వైవియులో పాత బోర్లు తప్ప కొత్త బోర్లు ఏర్పాటుచేసేందుకు వైవియు అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగా తాగునీటికి, ఇతర అవసరాలకు నీటి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వైవియులో ఫ్లోరైడ్ వాటర్ లేకుండా చేసేందుకుగాను వైవియు అధికారులు గత మూడుసంవత్సరాల నుంచి వైవియులో ప్రధాన కార్యాలయాల వద్ద, భవనాల వద్ద ,హాస్టల్‌భవనాల వద్ద ఎనిమిది మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. వైవియులో భవనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అవసరమైన నీటి అవసరాలు తీరడం లేదు. వైవియుతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడ, వివిధ ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు సోమశిల బ్యాక్‌వాటర్ నుంచి పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు తెప్పించేందుకు 2008లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్కీమ్‌ను ప్రారంభించారు. రూ.417కోట్లతో ప్రారంభించిన వాటర్ స్కీమ్ సోమశిల బ్యాక్‌వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణం పనులు జరిగాయి. చింతకొమ్మదినె్న మండలం కృష్ణాపురం వరకు పైపులైన్ నిర్మాణం పనులు జరగగా, అక్కడి నుంచి నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఎంతో మందికి తాగునీటి అవసరాలు తీర్చే పథకం ఆగిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సివుంది.

లోకేష్ హెచ్చరికలతో జిల్లానేతల అలర్ట్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 26: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్.లోకేష్ రెండురోజుల జిల్లా పర్యటన విజయవంతమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సొంత జిల్లాలో వైకాపాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆకర్ష్ పథకం పేరుతో గురువారం అర్దరాత్రి వరకు జిల్లాలో మకాంవేసి వైకాపా నేతలను ఆకర్షించేందుకు వ్యూహరచన చేశారు. రాత్రి 9.30గంటలకు హైదరబాద్ బయలుదేరాల్సిన లోకేష్...వ్యూహాత్మకంగా తన ప్రయాణాన్ని అర్థరాత్రికి వాయిదావేసుకొని ప్రొద్దుటూరు నుంచి మున్సిపల్ మాజీ చైర్మన్ బత్తా, ఇన్‌చార్జ్ మాజీ చైర్మన్‌తోపాటు మరో 300 మంది తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. రెండురోజుల పర్యటన సందర్భంగా నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించు పార్టీలో ఆధిపత్య రాజకీయాలున్న కీలక నేతలతో లోకేష్ సుదీర్ఘంగా మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల నేతలతో లోతుగా సమీక్షించారు. 40రోజుల వ్యవధిలో అన్ని గ్రూపులు కలిసి పోయి నియోజకవర్గాల్లో విభేధాలు లేకుండా పార్టీ బలోపేతానికి కలసి పనిచేయాలని, వైకాపా నేతలను పార్టీలోకి తీసుకురావాలని సూచించారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లను నియామకం చేయకపోవడం, మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిల ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైకాపా నుంచి ఎమ్మెల్యేల వలస మొదలుకావడంతో ఒకటిన్నర మాసంలో వలసలకు ముగింపు చెప్పి, అనంతరం వివాదాలకు దూరంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండేనాయకులను ఇన్‌చార్జిగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. పలు నియోజకవర్గాల్లో నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం గమనించిన లోకేష్ తన 40రోజుల ఫార్ములాను ప్రయోగించారు. దీంతో ఇన్‌చార్జి పదవులకోసం పోటీపడే నేతలంతా లోకేష్ పరీక్షలో నెగ్గేందుకు నడుం బిగించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), జిల్లా ప్రదానకార్యదర్శి బి.హరిప్రసాద్, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఇటీవల పార్టీలో చేరిన నేతలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో నేతలంతా వైకాపా నేతలను ఏదోవిధంగా పార్టీలోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ కార్యకర్తలు తమకు సముచిత స్థానం కల్పించలేదని, సమన్వయ కమిటీలో అవకాశం ఇవ్వలేదని కార్యాలయంలో సమీక్షలు జరుగుతున్న సమయంలో ఆందోళనకు దిగారు. లోకేష్‌బాబు సమీక్ష మధ్యలో నుంచి బయటకువచ్చి అన్ని అంశాలు అధ్యయనం చేస్తున్నానని, ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పనిలేదని వారికి సర్దిచెప్పారు. మొత్తమీద లోకేష్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైకాపాను బలహీనపర్చే చర్యలను వేగవంతం చేసి, అదే సమయంలో పార్టీకి గతవైభవాన్ని చేకూర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

కడపలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపించాలి
కడప (క్రైం), ఫిబ్రవరి 26: కడప కలెక్టరేట్ ఎదుట గత ఆరురోజులుగా అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేస్తున్న శిబిరాన్ని సిపిఎం, సిపిఐ జాతీయ, రాష్టన్రేతలు శుక్రవారం సాయంత్రం పరామర్శించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రభుత్వ తప్పిదనం, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వత్తాసు పలకడం వల్లే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఎం జాతీయ నేతలు బివి రాఘవులు, మధు,గఫూర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యలు డిమాండ్‌చేశారు. అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని రాష్ట్ర విభజన తర్వాత సీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజితో అభివృద్ధి చెందదని ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గత ఆరు రోజులుగా కడప ఉక్కు రాయలసీమ హక్కు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ సిపి ఐ,సిపియం జాతీయ నేతలు రాష్ట్ర నేతలు జిల్లా నాయకులతో కలసి బస్సుయాత్రను ప్రారంభించారు. కడప జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేల్,మైదుకూరు, పోరుమామిళ్ళ,పులివెందుల, ఎర్రగుంట్ల, కడపలలో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. చివరి రోజు శుక్రవారం కడప కలెక్టరేట్ వద్ద మహాసభను నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఇండ్లకు, రోడ్లకు, చెట్లకు రంగు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తను రాయలసీమ వాసినని చెప్పుకుంటూ సీమకు ద్రోహం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 1950,52,56 కాలంలో రాష్ట్రం సమైక్యంగా ఉందని రాయలసీమ నుంచి 6 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ సీమ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ అనుచరులకు కాంట్రాక్టులు వారి అభివృద్ధి కోసమే పని చేశారని, ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ద చూపలేదన్నారు. ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి ఎదురు తిరిగితే తప్పా రాయలసీమ అభివృద్ధి చెందదన్నారు. పాలకులను ప్రశ్నించే స్థాయికి ప్రజలు ఎదగాలని పిలుపునిచ్చారు. సిసిఐ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ తరతరాలుగా రాయలసీమ అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 15న అసెంబ్లీ సమావేశాలకు ముందు వేలాదిమందితో ఆందోళన చేస్తామని దానికి అడ్డువస్తే ప్రభుత్వా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. సీమకు కృష్ణా జలాలు మళ్ళీంచాలని డిమాండు చేశారు. సీమను పట్టించుకోకుండా చంద్రబాబు అమరావతి చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీమ సమస్యలపై నోరు మెదపక పోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు కలసి ఉద్యమిస్తేనే సీమ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫార్ మాట్లాడుతూ జివో 120 పేరుతో సీమకు అన్యాయం చేస్తారని చెప్పారు. రాయలసీమకు మంజూరైన పరిశ్రమలు, విద్యా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపియం రాష్ట్ర నేత మధు మాట్లాడుతూ రాయలసీమలో 750 అడుగులు తవ్విన్నపటికీ నీరు పడడం లేదని అలాంటి సీమను ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మార్చి 15న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సీమ సమస్యలపై పోరాటం సాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపి ఐ రాష్ట్ర నేత ఓబుల్ కొండారెడ్డి, జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య, సిపియం జిల్లా కార్యదర్శి కె ఆంజనేయులు, నగర కార్యదర్శి ఎం రవిశంకర్‌రెడ్డి, సిపి ఐ నగర కార్యదర్శి ఎన్ వెంకటశివా, చిత్తూరు జిల్లా సిపి ఐ నాయకులు రామానాయుడు, సిపియం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, సిపి ఐ పట్టణ కార్యదర్శి జి చంద్ర, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ప్రజా నాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలతో ప్రజలను ఉర్రుతాలూగించారు.

ఇదేనా చంద్రబాబు నైతికత?
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 26: తన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నానని, నైతిక విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం హాశ్యాస్పదంగా వుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వైకాపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెరవేర్చలేని హామీలు ప్రజలకిచ్చి అధికారంలోకి రావడమేనా నైతికత, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం నైతికతా? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని, రాష్ట్రాన్ని విభజించే సమయంలో తెలంగాణలో విభజన అంటూ, ఆంధ్రాలో సమన్యాయమంటూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించలేదా అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టి ఆర్ ఎస్‌లో చేరితే తప్పు అని, ఇక్కడ వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరితే అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్నారని అనడం ఏ విధమైన నైతికతనో చంద్రబాబునాయుడే జవాబు చెప్పాలన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీ అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతానన్న చంద్రబాబు ఈరోజు ఆయన కాళ్లకు మొక్కడం నైతికతనా అని ప్రశ్నించారు. 1983లో ఎన్‌టి.రామారావు విలువలతో కూడిన తెలుగుదేశం పార్టీని నిర్మిస్తే ఈరోజు చంద్రబాబు ఆ విలువలకు తిలోదకాలిస్తున్నాడన్నారు. నైతిక విలువలు అనే మాట రావడం చంద్రబాబు నోటి నుంచి రావడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రాజారామిరెడ్డి, పట్టణ వైకాపా అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, వైకాపా నాయకులు సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పోసా భాస్కర్, ఖాజా, దేవీశ్రీప్రసాద్‌రెడ్డి, జయలక్ష్మి, పోసా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
రాజంపేట, ఫిబ్రవరి 26:రాజంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్ళడం జరుగుతుందని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై ప్రతి 15 రోజులకొకమారు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో అభివృద్ధిపనులు చేపట్టేందుకు రూ.13కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. మంచినీటి సమస్యలు, పైపులైన్ మరమత్తులు వంటి సమస్యలను శాశ్వితంగా పరిష్కరించేందుకు పాత పైపులైన్లను తొలగించి నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ జనాభా ప్రకారం 10 ఎన్‌టిఆర్ సుజల స్రవంతి ప్లాంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నామన్నారు. ప్రస్తుతం 4 ప్రాంతాల్లో ఎన్‌టిఆర్ సుజల స్రవంతి ప్లాంట్లు ఉన్నాయని, మరో 6 ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాజంపేట పట్టణంలో ఇళ్లు లేని పేదల విషయమై 3500 పక్కా గృహాలు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరగా, ఒక ఇంటిని కూడా తగ్గించకుండా అన్నింటిని మంజూరు చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ అధికారులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణంలోని 20 వార్డుల్లో పర్యటించి లబ్దిదారులను గుర్తించాలన్నారు. ఇప్పటికి 1500 దరఖాస్తులు వచ్చాయన్నారు. . ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ ఫజులుల్లా, పట్టణ టిడిపి అధ్యక్షుడు టి.సంజీవరావు, పార్టీ నేతలు డాక్టర్ సి.సుధాకర్, విశ్వనాధాచారి, కటారు సుబ్బరామిరెడ్డి, జ్యోతీశ్వరబాబు, మెంటా శేఖర్, వడ్డెర రమణ పాల్గొన్నారు.