రుచి

అరటిదవ్వ వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటిమొక్క కాండాన్ని ఒలిస్తే లోపలి భాగంలో తెలుపురంగులో పొడవైన గొట్టాల మాదిరి దవ్వ ఉంటుంది. అరటి దూటగా కూడా వ్యవహరించే దీనితో పలురకాల రుచికరమైన వంటకాలు చేస్తారు. ఆరోగ్యరీత్యా అరటిదవ్వ ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. దవ్వను ముక్కలుగా కోసి బాగా ఎండబెట్టి తేనెతో కలిపి తింటే మహిళల్లో గర్భాశయ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇది మలబద్ధకాన్ని నివారించి శరీరానికి చలువను అందిస్తుంది. పిల్లల కడుపులో క్రిములు పోవాలంటే అరటిదవ్వను తినిపించాలి. అరటి గెలల్ని తొలగించిన తర్వాత కాండంపై పొరలు తొలగించి తీసిన దవ్వను కూరగాయల మార్కెట్లలో విక్రయిస్తారు. దవ్వతో పెసరపప్పు కూర, బజ్జీలు, పెరుగు పులుసు, పచ్చడి, ఆవకూర వంటివి వండుతారు.

బజ్జీలు
అరటిదవ్వ చక్రాలు - 12
శెనగపిండి -1 కప్పు
బియ్యప్పిండి - 1/2 కప్పు
నూనె - 250 గ్రా.
జీలకఱ్ఱ -2 చెంచాలు
వాము -1 చెంచా
కారం -2 చెంచాలు
కార్న్‌ఫ్లోర్ - 2 చెంచాలు
ఉల్లిముక్కలు - 1 కప్పు
కొత్తిమీర, మసాలా కారం,
నిమ్మరసం - సరిపడా
శెనగపిండి, బియ్యప్పిండి, కారం, జీలకఱ్ఱ, వాము కలిపి బజ్జీల పిండిలా చేసుకుని, ఈ ముద్దలో చక్రాల మాదిరి తరిగిన అరటిదవ్వ ముక్కలను ముంచి కాగిన నూనెలో దోరగా వేపుకోవాలి. ఈ బజ్జీలపై ఉల్లిముక్కలు, మసాలా కారం, నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

పులుసు
అరటిదవ్వ - 2 కప్పులు
చింతపండు పులుసు - 4 కప్పులు
మెంతులు - 1 చెంచా
ఎండుమిర్చి - 12
నువ్వులు - 2 చెంచాలు
ఆవాలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
మినప్పప్పు, శెనగపప్పు - 2 చెంచాలు
కొబ్బరి కోరు - 5 చెంచాలు
బెల్లం కోరు - 4 చెంచాలు
నూనె - 5 చెంచాలు
కొత్తిమీర - కొంచెం
సన్నగా తరిగిన అరటిదవ్వ ముక్కలపై ఉప్పు చల్లి అలాగే ఉంచాలి. మరుగుతున్న చింతపండు పులుసులో దవ్వ ముక్కలు, బెల్లం వేసి కాసేపు మరగనివ్వాలి. బాణలిలో పోపులు వేయించి, మెంతులు కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ మెంతికారాన్ని ఉడుకుతున్న పులుసులో కలిపి చివరగా కొత్తిమీర వేయాలి.

పెరుగు పచ్చడి
తరిగిన దవ్వ - 4 కప్పులు
పెరుగు - 5 కప్పులు
పసుపు - 1/2 చెంచా
ఉప్పు -5 చెంచాలు
కొత్తిమీర - 1/2 కప్పు
నెయ్యి - 2 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
మినప్పప్పు - 5 చెంచాలు
ఇంగువ - చిన్నముక్క
ఎండుమిర్చి - 5
పచ్చిమిర్చి - 5
బాణలిలో వేయించిన పోపును, ఉప్పును గడ్డ పెరుగులో కలపాలి. తరిగిన అరటిదవ్వ ముక్కలపై ఉప్పు, పసుపు,నీరు కలిపి పావుగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటిని పిండేసి దవ్వ ముక్కలను పెరుగులో కలపాలి. చివరగా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ పెరుగు పచ్చడి అన్నం, దోశెల్లోకి బాగుంటుంది.

పప్పుకూర
పెసరపప్పు - 2 కప్పులు
అరటిదవ్వ - 4 కప్పులు
ఉప్పు -2 చెంచాలు
కరివేపాకు - కొంచెం
ఎండుమిర్చి - 4
పచ్చిమిర్చి - 4
నూనె - 2 చెంచాలు
ఆవాలు- 1 చెంచా
జీలకఱ్ఱ -1 చెంచా
ఇంగువ - కొంచెం
మినప్పప్పు - 2 చెంచాలు
శెనగపప్పు - 2 చెంచాలు
నిమ్మరసం - 1/4 కప్పు
కొబ్బరికోరు - 1 కప్పు
ముందుగా పెసరపప్పును బాగా ఉడికించి పక్కనపెట్టాలి. బాణలిలో పోపు వేయించాక దవ్వ ముక్కలు, ఉప్పువేసి నీళ్లుచల్లి మగ్గనివ్వాలి. ఇది కమ్మటి వాసన వస్తుండగా ఉడికించిన పెసరపప్పు,కరివేపాకు కలిపి దింపాలి. చివరగా కొబ్బరి కోరు వేయాలి. వడ్డించే ముందు నిమ్మరసం చిలకరించాలి.

ఆవకూర
ఆవాలు - 4 చెంచాలు
అరటిదవ్వ - 2 కప్పులు
నూనె - 5 చెంచాలు
మినప్పప్పు - 5 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
సన్నగా తరిగిన అరటిదవ్వపై ఉప్పు,పసుపు, నీళ్లు వేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. బాణలిలో పోపు వేయించాక, నీటిని పిండేసిన దవ్వ ముక్కలను కలిపి బాగా మగ్గనివ్వాలి. మెత్తగా అయ్యాక కరివేపాకు, ఆవముద్ద కలపాలి.
-వెంకటలక్ష్మి