సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజిరెడ్డి ఆలోచనలు చెదరగొడుతూ స్టేషన్ ముందు జీప్ ఆగింది. యుగంధర్ లోపలికి వచ్చి విజిటర్స్ గదిలో కూర్చున్న వాళ్లని చూసి చిన్నగా నవ్వి తన రూములోకి వెళ్లాడు. రెండు నిమిషాల తర్వాత స్టేషన్ రైటర్ లోపలికి ప్రవేశించి సెల్యూట్ చేసి చెప్పాడు.
‘సార్! రాజిరెడ్డిని కోర్టులో హాజరు పెట్టడానికి అవసరమైన పేపర్స్ రెడీగా ఉన్నాయి. కోర్టుకి తీసుకెళ్లడానికి వ్యానుతోపాటు ఎస్కార్టుని రమ్మన్నాను’
‘గుడ్.. రాజిరెడ్డిని, సుందరాన్ని తీసుకెళ్లి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వస్తాను’ చెప్పాడు.
ఓ పది నిమిషాల తర్వాత జీప్ బయలుదేరింది.
యుగంధర్ జీప్ డ్రైవ్ చేస్తుంటే రాజిరెడ్డి, సుందరం వెనుక సీట్లలో కూర్చున్నారు. మెయిన్ రోడ్డులోకి ప్రవేశించి కొంత దూరం వెళ్లాక కుడిపక్కకి తిరిగింది జీప్. వాంబే కాలనీ పక్కనుంచి మట్టి రోడ్డులో ఓ కిలోమీటరు వెళ్లి మూడు తాటిచెట్ల దగ్గర ఆగింది.
‘దిగండి’ చెప్పాడు యుగంధర్. వాళ్లు దిగేక అడిగాడు.
‘ఈ లే అవుట్ మీరు వేసిందే కదూ?’
తలూపాడు రాజిరెడ్డి.
‘పదెకరాల భూమిలో ముప్పై ఎనిమిది ప్లాట్లు వేశారు. అందులో రాంప్రసాద్ వాటాగా వచ్చిన పదిలో ఆరు అమ్మేశాడు. మిగిలిన నాలుగు, మీ ఇరవై ఎనిమిది కలిపి మొత్తం ముప్పై రెండు బిట్లు ఇక్కడున్నాయి. అవునా?’ అడిగేడు యుగంధర్.
ఉలికిపాటు నేర్పుగా కప్పిపుచ్చుకుని రాజిరెడ్డి తలాడిస్తే, గుడ్లు మిటకరించి చూశాడు సుందరం.
‘రాంప్రసాద్ శవం ఈ సైట్‌లో పడుంది. మద్యం సేవించినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. అంటే అతనితో తాగించి ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేశారు. కడుపులో ఎనిమిది అంగుళాల మేర కత్తి గాయాలు మూడున్నాయి. మీ ఇద్దరిలో కత్తితో పొడిచిందెవరు? కదలకుండా రాంప్రసాద్‌ని పట్టుకున్నదెవరు?’
ఆ ఇద్దరి ముఖాలు మాడిపోయాయి.
‘మూడు గ్లాసుల్లో మందు పోసుకుని తాగుతూ రాంప్రసాద్ చూడకుండా మీ గ్లాసుల్లోది నేల మీద ఒంపేశారు. అంతేకాదు. అతని గ్లాసులో మందు ఎక్కువ పోశారు. పార్టీ చేసుకోవడం నిత్యం మీకు మామూలే కాబట్టి అతను మిమ్మల్ని అనుమానించలేదు. పగలే మనుషులు తిరగని ఈ ప్రాంతంలో సాయంకాలం హతమారిస్తే శవం ఆచూకీ చిక్కదని అనుకున్నారు. ఎందుకంటే నడుమెత్తు గడ్డి మధ్య పడున్న శవం బయటకి కనిపించదు. కొంతకాలానికి కుళ్లిపోయి పురుగులు పట్టి శరీరం శిథిలమవుతుంది. ఎలాగూ ఈ సైట్లలోకి మీరు తప్ప ఎవరూ రారు కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. బ్రహ్మాండమైన పథకం. కాని చిన్న లోపం...’ నవ్వేడు యుగంధర్.
రాజిరెడ్డి తుళ్లిపడి చూశాడు.
‘అక్కడున్న మూడు తాటిచెట్లు పోతువి. వేసవి ప్రారంభంలో వాటి నుండి కల్లు తీస్తారు. మొదట్లో రోజుకి ఒకసారి అదీ ఉదయం కల్లు కోసం చెట్టెక్కుతారు. అక్కడ నుంచి కనిపించింది రాంప్రసాద్ శవం. కావాలంటే పైకి చూడండి’
ఇద్దరూ అప్రయత్నంగా తలెత్తారు. కల్లు కుండలు వేలాడుతున్నాయి.
చుట్టూ పరిశీలనగా చూశాడు యుగంధర్. అంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. కనుచూపు మేర ఇళ్లు లేవు.
‘కారులో కూర్చుని మీ ముగ్గురూ మందు తాగిన చోటుకి పదండి. అక్కడ మీకు మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతాను’ చెప్పాడు.
ఇద్దరూ అటు అడుగులు వేశారు.
ఏదో కనిపించినట్టు ఒంగి నేల మీద గడ్డిలోకి చూస్తూ ఉండిపోయాడు యుగంధర్. వాళ్లిద్దరూ పదడుగులు వెళ్లాక తలెత్తాడు. పోచ్ నుంచి పిస్టల్ బయటికి తీసి స్లాట్ వెనక్కి లాగేడు. ముందు నడుస్తున్న రాజిరెడ్డికి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. ‘్ఢం’ అనే చప్పుడుతో తూటా దూసుకెళ్లి అతని వెన్నులోకి ప్రవేశించింది. నేల మీద బోర్లా పడ్డాడతను.
అది చూసి ఒక్కసారిగా పరుగందుకున్నాడు సుందరం. యుగంధర్ చేతిలోని పిస్టల్ రెండోసారి పేలింది. పరిగెడుతున్న సుందరం తూటా తగిలి తూలిపడ్డాడు. గడ్డిలో పడిన బుల్లెట్ ఎటీ కేసులు అందుకుని జేబులో వేసుకున్నాడు. సెల్లు తీసి ఓ నెంబర్‌కి కాల్ చేసి చెప్పాడు.
‘ఆపరేషన్ పూర్తయింది సార్!’
* * *
‘ఉదయం పదీ ముప్పై ఐదుకి జరిగిందా సంఘటన. దర్యాప్తులో భాగంగా నిందితుల్ని హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాడు ఇన్‌స్పెక్టర్. అక్కడ వాళ్లిద్దరూ ఇన్‌స్పెక్టర్ మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితిలో కాల్చాడు’ చెప్పాడు కమీషనర్, ఎదురుగా కూర్చున్న మీడియాకి. అదంతా లైవ్ టెలికాస్ట్ అవుతోంది. కొందరు తలవంచుకుని గబగబా రాసుకుంటున్నారు.
కమీషనర్ పక్కన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికొచ్చిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కూర్చున్నాడు. రెండో పక్క డిప్యూటీ కమీషనర్ ఉన్నాడు. గదంతా చల్లగా ఉంది.
‘ముంబైలో మాదిరిగా ఎన్‌కౌంటర్ ద్వారా నేరస్తుల్ని ఏరివేయాలని మీ డిపార్ట్‌మెంట్ నిర్ణయించుకుందా?’ ఓ విలేకరి అడిగేడు.
‘ముంబైలోని మాఫియా కాని, అక్కడ పరిస్థితులు కాని మనకి లేవు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన’ జవాబిచ్చాడు కమీషనర్.
‘గతంలో ఓ తీవ్రవాదిని కాల్చి ఎయిర్‌పోర్ట్ దగ్గర తుప్పల్లో పడేశారు. ఎదురు కాల్పుల్లో మరణించినట్టు ప్రకటించారు. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని ప్రజాసంఘాలు తేల్చాయి. ఇది కూడా అలాగే కనిపిస్తోంది’ ఆవేశంగా అన్నాడు మరో విలేకరి.
‘ఎప్పుడో జరిగిన దాని గురించి అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే, అప్పుడు నేనిక్కడ కమీషనర్ని కాను’
‘ఇద్దరు మనుషుల్ని కాల్చి చంపడం చట్ట వ్యతిరేకం కాదా?’
‘కొన్ని సందర్భాల్లో కాదు..’ శాంతంగా అని, కొనసాగించేడు ‘ఓ పోలీసు ఉద్యోగి ఆధీనంలోని ముద్దాయిలు పారిపోతే చాలా సందేహాలు వస్తాయి. అతను డబ్బుకి కక్కుర్తిపడి వదిలేశాడని లేదా అసమర్థుడు కావడంవల్ల పారిపోయారని అనుకోవడానికి అవకాశం ఉంది. వెంటనే అతన్ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీ మొదలెడుతుంది డిపార్ట్‌మెంట్. ముద్దాయి పారిపోతే పోలీసు వాడి ఉద్యోగం పోతుంది. ఏ విధమైన అనుమానాలకు అవకాశం లేకుండా ఇన్‌స్పెక్టర్ వాళ్లని కాల్చాడు’
‘మీరు ఆ ఇన్‌స్పెక్టర్ని సమర్థిస్తున్నారా?’ మరో అతను అడిగేడు.
చిన్నగా నవ్వేడు కమీషనర్.
‘జరిగిన సంఘటన ఎదురుగా కనిపిస్తుంటే ప్రత్యేకంగా సమర్థించాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు నిందితుల్ని కాల్చడం వల్ల ఆ ఇన్‌స్పెక్టర్‌కి కలిసొచ్చేదేమిటో మీరే చెప్పండి? తన మీద తనకి ఎంత నమ్మకం ఉన్నా ఎస్కార్టుతో వెళ్లకపోవడం ఆ ఇన్‌స్పెక్టర్ చేసిన తప్పు. అందుకే అతన్ని ఆ స్టేషన్ నించి బదిలీ చేసాను’
‘ఎక్కడికి సార్?’
‘పెందుర్తి’
‘అతని మీద మరే చర్య తీసుకోరన్నమాట...’
ఆ విలేకరి వైపు చిరునవ్వుతో చూశాడు కమీషనర్. మొన్నటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి బాకా ఊది ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో విమర్శించడమే పనిగా పెట్టుకున్న పత్రిక తరఫున వచ్చాడతను. రాత్రి పది దాటాక ప్రెస్‌క్లబ్‌లో జరిగే మందు పార్టీలో పీకల దాకా తాగి పడిపోయే మనిషి అతనే. తన మనసులో కదులుతున్న ఆలోచనలు అణచుకుని జవాబు చెప్పాడు కమీషనర్.
‘ప్రభుత్వానికి నివేదిక పంపాక అక్కడ నుంచి వచ్చిన సూచన్లకి లోబడి చర్య తీసుకుంటాం. తమ భాగస్వామిని దారుణంగా హతమార్చిన ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా కాల్చివేయబడ్డారు. ఇలా జరగడం హర్షించేది కాకపోయినా సిటీ చుట్టుపక్కల చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ల్యాండ్ మాఫియాకి ఓ హెచ్చరికలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’
మరికొన్ని ప్రశ్నల అనంతరం ఆ సమావేశం ముగిసింది.
6
రాత్రి ఎనిమిది గంటలకి బ్లూకలర్ శాంత్రో లేడీస్ హాస్టల్‌కి యాభై గజాల దూరంలో రోడ్డు పక్క ఆగింది. ఇంజన్ ఆపి డోరు తెరుచుకుని దిగాడు డ్రైవర్. వాచీ చూసి ఇంకా పావుగంట సమయం ఉండటంతో సిగరెట్ వెలిగించాడు.
డ్రైవర్ ఉద్యోగమే అయినా రోజంతా పని ఉండదతనికి. వారానికి రెండు మూడుసార్లు మాత్రమే డ్యూటీకి పిలుస్తారు. ఇప్పుడు ఎనిమిదీ పావుకి కారెక్కిన మనిషిని బీచ్‌లోని పోలీసు గెస్ట్‌హౌస్‌కి చేర్చాలి. ఉదయం అయిదు గంటలకి వెళ్లి ఆ మనిషిని తిరిగి హాస్టల్ దగ్గర దించాలి. ఆ తర్వాత కారు షెడ్‌లో వదిలి ఇంటికి వెళ్లిపోతాడు. మళ్లీ ఫోన్ వచ్చేవరకూ పని లేదు.
తాజ్ రెసిడెన్సీ, గ్రీన్ పార్క్, రుషికొండ కాటేజి - ఇలా ముందుగా చెప్పిన చోటుకి తీసుకెళ్లి, తీసుకురావడమే పని. కారులో ఎక్కిన మనిషితో ఎట్టి పరిస్థితిలోను మాట్లాడకూడదు. అలాగే కారుని మధ్యలో ఆపకూడదు. కారు లోపల ముందు సీటుకి వెనుక సీటుకి మధ్య సీత్రూ గ్లాస్ ఉంటుంది. దానివల్ల కారులో ప్రయాణించేవారికి డ్రైవర్ కనిపిస్తాడు తప్ప లోపల ఉన్నవారు డ్రైవర్‌కి కనిపించరు.
ఇవన్నీ ఇబ్బందిపెట్టే విషయాలు కాదు. డ్యూటీ మూడు నాలుగు గంటలకు మించి ఉండదు. ప్రతి నెలా ఒకటో తారీఖున జీతం బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. అందువల్ల ఆ ఉద్యోగం అతనికి సుఖంగా ఉంది. అందుకే ఎలాంటి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకుండా పని చేసుకుపోతాడు.
వాచీ చూసుకున్నాడతను. ఇంకా అయిదు నిమిషాలు సమయం ఉంది. సిగరెట్ పారేసి డోరు తెరిచి వాటర్ బాటిల్ అందుకుని కొద్దిగా నీళ్లు తాగాడు. వాటర్ బాటిల్ తిరిగి లోపల పెట్టి డోరు మూస్తున్నప్పుడు గమనించాడు. ముఖం కనపడకుండా తల మీద చున్నీ కప్పుకుని ఓ అమ్మాయి రావడం, ఆమె భుజానికి వేలాడుతున్న ఎరుపు రంగు వ్యానిటీ బ్యాగ్ చూసి వెనుక డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె కూర్చున్నాక తలుపు మూసి కారు స్టార్ట్ చేసి ఏ.సి ఆన్ చేశాడు.
అక్కడ నుంచి మెయిన్ రోడ్డులోకి తిరిగి బీచ్ వైపు వెళ్లసాగింది శాంత్రో.

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994