సబ్ ఫీచర్

ఆయన త్యాగం అనితరసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు నేతాజీ జయంతి

ఆంగ్లేయుల పాలననుంచి భారత జాతి విముక్తికోసం అలుపెరగని పోరాటం సాగించిన సమరయోధుడు నేతాజీ. ఆంగ్లేయులకు సింహస్వప్నమై భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో తనదైన స్థానాన్ని స్థిరపరుచుకున్న ధన్యజీవి నేతాజీ. నేతాజీగా భారతీయుల హృదయాలలో ప్రతిష్టితమైన సుభాష్ చంద్రబోస్ ఒడిషాలో ని కటక్‌లో 1897 జనవరి 23న జానకీనాధ్ బోస్ ప్రభావతి దంపతులకు జన్మించారు. కటక్‌లో ప్రాథమిక విద్య, వారెన్‌సన్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పాసైన తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత చదువులు చదివారు. సంపన్న కుటుంబంలో జన్మించిన బోస్ లండన్‌లో ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థి దశలోనే నేతాజీకి ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి పెరిగి కొంతకాలం తీర్థయాత్రలు చేసారు. నేతాజీపై రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఉపదేశాల ప్రభావం ఎంతగానో ఉంది. నాటి బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను సంపూర్ణంగా అవగతం చేసుకున్నారు. ఈ దేశం ఉన్నతిని పొందాలంటే విదేశీ పాలనను అంతమొందించడమే తక్షణ కర్తవ్యం అని భావించారు. అందుకు వీలుగా ఐపిఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి దిగారు.
అప్పటికే గాంధీజీ దేశ స్వాతంత్య్ర సమరంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తుండడంతో ముందుగా గాంధీజీని కలిసారు నేతాజీ. దేశబంధు చిత్తరంజన్‌దాస్ అప్పటికే కలకత్తాలో ఫ్రముఖ రాజకీయ నాయకుడు. ఆయనతో కలిసి రాజకీయ క్షేత్రంలో భాగస్వామి కావాల్సిందిగా గాంధీజీ ఇచ్చిన సలహా మేరకు బోస్ చిత్తరంజన్‌దాస్‌ను కలిసారు. ఇది సుభాష్ బోస్ భవిష్యత్తుకు పెనుమార్పు. స్వాతంత్రోద్యమ చరిత్రలో లోకమాన్య తిలక్ తర్వాత బోస్‌వలె ఏ రాజకీయ నాయకుడూ బ్రిటి ష్ ప్రభుత్వం నుంచి అంతగా బాధలను అనుభవించలేదు.
ఇంగ్లండ్ యువరాజు వేల్స్ కలకత్తా రాక సందర్భంగా నల్ల జెండాలతో నిరసన తెలిపిన కార్యకర్తలకు అగ్రభాగాన ఉండి ప్రజల, ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. స్వరాజ్య సం ఘం పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. కలకత్తా నగర పాలక సంస్థను కైవసం చేసుకుని ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కలకత్తా నగర అభివృద్ధికి పాటుపడడంతోపాటు బెంగాల్‌లో వరద బాధితులకు పునరావాసం కల్పించడంలో ఆయన కృషి అపారమైంది. ప్రభుత్వం దాస్,బోస్‌లను నిర్బంధించి బర్మా జైలుకు తరలించింది. జైలునుంచి విడుదలై వచ్చాక బోస్ ఆందోళనలు ఉద్ధృతం కాగా మరోమారు నిర్బంధించి జైలుకు తరలించారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉంటూ 1939లో మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ చేసారు. బోస్ ప్రత్యర్థి గాంధీజీ నిలబెట్టిన పట్ట్భా సీతారామయ్య. పట్ట్భా ఓటమి తన ఓటమిగా పరిగణిస్తానన్న గాంధీజీ హెచ్చరిక విలువను కోల్పోయింది. బోస్ తిరిగి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అయితే గాంధీజీతో తనకు గల సిద్ధాంతాలు విభేదాల కారణంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.
తర్వాత బోస్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసారు. ద్వితీయ ప్రపంచ సంగ్రామం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వానికి వత్తాసు పలకమని పిలుపునివ్వడం నచ్చని బోస్ అజ్ఞాతంలోకి జారుకున్నారు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జపాన్, జర్మనీ, ఇటలీ నేతలతో సమావేశమై తన కార్యాచరణను తెలియజేసారు. ఆ నేతల సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన బోస్ బ్రిటిష్, అమెరికా దేశాలపై యుద్ధం ప్రకటించారు. తన పక్షాననున్న రాజ్యాల బలాన్ని అదునుగా చేసుకుని ఢిల్లీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్న సంకల్పంతో చలో ఢిల్లీ అను నినాదంతో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఇండో-బర్మా సరిహద్దు మీదుగా ఈశాన్య రాష్ట్రాల మీదుగా నడిపించడానికి ప్రణాళిక రూపొందించారు. అప్పటికే జపాన్ దేశం అండమాన్ నికోబార్ దీవులను స్వాధీనం చేసుకొని వాటిని బోస్‌కు అప్పగించింది. బోస్ ఆ దీవులకు షహీద్ స్వరాజ్ అని పేరుపెట్టారు. బోస్ త్రివర్ణ పతాకాన్ని పోర్ట్‌బ్లెయిర్ సెల్యులర్ జైలుపై ఎగరవేసి చరిత్ర సృష్టించారు. అక్కడ గుమికూడిన జన సందోహం బోస్‌ను నేతాజీగా పిలిచి అభినందించారు.ఆ పేరే బోస్‌కు శాశ్వతమైంది. సింగపూర్‌లో నెలకొల్పిన ఆజాద్ హింద్ సైనిక స్థావరాన్ని రంగూన్‌కు మార్చారు. ఢిల్లీ వైపు పురోగమించడం సులువవుతుందని అంచనా. తన సేనలో మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తూ ఝాన్సీరాణి రెజిమెంట్‌ను స్థాపించాడు. ఎందరో వనితలు భాగస్వాములయ్యారు. నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రజల సమక్షంలో స్వతంత్ర భారత దేశాన్ని ప్రకటిస్తూ తాను ప్రధానిగా వారందరి చేత ఎ న్నుకోబడి తన ప్రభుత్వంలో మంత్రులను కూ డా నియమించారు. ఈ ప్రభుత్వాన్ని జపాన్, జర్మనీ, ఇటలీ, క్రోటియా, మంచూకో, శాన్‌కింగ్, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, బర్మా దేశాలు గుర్తించాయి. అలా తొలి స్వతంత్ర భారత దేశ ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్.
జపాన్ దూకుడును అడ్డుకోవడానికి అమెరికా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులను ప్రయోగించింది. జపాన్ ఆ ధాటికి కదనరంగంలో చతికిలబడింది. జపాన్ సాయం తో ఢిల్లీని ఆక్రమించాలన్న బోస్ ప్రణాళికకు విఘాతం ఏర్పడింది. అయినప్పటికీ ఆజాద్ హింద్ ఫౌజ్‌కు ఆయుధాలు సమకూర్చడం కోసం నేతాజీ సింగపూర్‌నుండి టోక్యోకు బయలుదేరి వెళ్లాడు. 1945 ఆగస్టు 18న ఒక విమానం తైపేలో కూలిందని, అందులో నేతాజీ ప్రయాణం చేస్తూ మరణించారని జరిగిన ప్రచారం భారతీయులను హతాశులను చేసింది. ఏది ఏమైనా ఆ త్యాగధనుని కడపడి జీవితం అతి నిగూఢ రహస్యంగా ఉండిపోయింది. ఒకే జాతి, ఒకే దేశం, ఒకే సంస్కృతి ఈ దేశంలో విలసిల్లడానికి యువతకే నాయకత్వం అందించాలన్నది ఆయన ఆకాంక్ష. నేతాజీ ఇచ్చిన ఈ పిలుపు నేటి యువతకు స్ఫూర్తిదాయకం అనడంలో అతిశయోక్తి కాదు.

-ఎ.సీతారామారావు