క్రీడాభూమి

అమీర్‌తో విభేదాల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 24: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కారణంగా జైలు శిక్షను, ఐదేళ్ల సస్పెన్షన్‌ను పూర్తి చేసుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని పాకిస్తాన్ కెప్టెన్ అజర్ అలీ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో వచ్చేనెల 3 నుంచి మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో సహచరులతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న అతను అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అమీర్ జట్టులో ఉన్నందుకు తాను బాధపడడం లేదని అన్నాడు. అమీర్ ఉంటే తాను శిక్షణ శిబిరానికి హాజరుకానంటూ భీష్మించుకున్న అజర్ ఆతర్వాత మనసు మార్చుకున్నాడు. అమీర్‌తో కలిసి శిబిరంలో పాల్గొన్నాడు. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటికే ముగిసిన టి-20 సిరీస్‌ను పాకిస్తాన్ 1-2 తేడాతో కోల్పోగా, అమీర్ మొత్తం మూడు మ్యాచ్‌ల్లో 11 ఓవర్లు బౌల్ చేసి, 100 పరగులకు ఒక వికెట్ సాధించాడు. అమీర్‌పై వ్యక్తిగత అభిప్రాయాలు ఎలావున్నప్పటికీ, కెప్టెన్ హోదాలో జట్టులోని అందరినీ కలుపుకొని ముందుకు సాగాల్సిన బాధ్యత తనపై ఉందని అజర్ అన్నాడు. టి-20 సిరీస్ కోల్పోయినప్పటికీ తాము అధైర్యపడడం లేదన్నాడు. వనే్డ సిరీస్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
అమీర్‌పై ఆంక్షల్లేవు
స్పాట్ ఫిక్సింగ్ కేసులో జైలు శిక్షను, ఐదేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న మహమ్మద్ అమీర్‌పై ప్రత్యేక ఆంక్షలేవీ ఉండవని పాకిస్తాన్ జట్టు మేనేజర్ ఇంతికాబ్ ఆలమ్ స్పష్టం చేశాడు. అమీర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అతను బేషరతుగా క్షమాపణ కోరాడని, శిక్షను అనుభవించాడని, అంతేగాక పునరావాస శిక్షణకు హాజరయ్యాడని పిసిబి అంటున్నది. మారిన మనిషికి అవకాశం ఇవ్వడం తప్పుకాదని వ్యాఖ్యానిస్తున్నది. ఒక ఇంటర్వ్యూలో ఇంతికాబ్ విలేఖరులతో మాట్లాడుతూ అమీర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు మొత్తానికి ఉండే నిబంధనలే అతనికీ వర్తిస్తాయే తప్ప అదనంగా నిబంధనలు, నిషేధాలు ఏవీ ఉండవని తేల్చిచెప్పాడు.
యాసిర్ సస్పెన్షన్‌పై అప్పీల్!
లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సస్పెన్షన్‌ను విధించడాన్ని సవాలు చేస్తూ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టులో అప్పీల్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నిర్ణయించినట్టు సమాచారం. పేరు చెప్పేందుకు నిరాకరించిన బోర్డుకు చెందిన ఒక ఉన్నతాధికారి పిటిఐతో మాట్లాడుతూ యాసిర్ డోప్ టెస్టులో దొరికాడంటూ అతనిపై వేటు వేయడాన్ని పిసిబి తీవ్రంగా పరిగణించిందని చెప్పాడు. న్యాయ నిపుణులు, వైద్యులతో సంప్రదించిన తర్వాత యాసిర్ సస్పెన్షన్‌పై అప్పీల్ చేయాలని నిర్ణయానికి పిసిబి వచ్చిందని తెలిపాడు. గత ఏడాది నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో సిరీస్ జరుగుతున్న సమయంలో నిర్వహించిన డోప్ పరీక్షలో యాసిర్ విఫలమయ్యాడు. అయితే ‘ఎ’ శాంపిల్‌లో దోషిగా తేలినప్పటికీ ‘బి’ శాంపిల్‌ను పరీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పిసిబి అధికారి ప్రస్తావిస్తూ, న్యూజిలాండ్ పర్యటనకు యాసిర్‌ను ఎంపిక చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరనున్నట్టు చెప్పాడు.