అక్షర

ఆంధ్ర దేశ చరిత్రపై విజ్ఞాన సర్వస్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలి మధ్యయుగ
ఆంధ్ర దేశం-
విజ్ఞాన సర్వస్వం
5వ భాగం (1324-1724)
వెల: 580/
ప్రతులకు: విశాలాంధ్ర- అన్ని బ్రాంచీలు

దాదాపు ఆరువేల సంవత్సరాలకు పూర్వంనుండే మనకు ఆంధ్రదేశ చరిత్ర ఐతిహాసిక ఆధారాలతో ప్రామాణికంగా లభ్యమవుతున్నది. స్పష్టమైన శాసనాధారాలతో రెండువేల సంవత్సరాల చరిత్రను అంచనా వేయవచ్చు. లోగడ ఆయా రచయితలు భిన్నయుగాలపై గ్రంథాలు వెలువరించారు. మారేమండ రామారావు శాతవాహన సంచిక కాకతీయ సంచిక వంటివి తెచ్చారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఆదిరాజు వీరభద్రరావు, బిఎన్‌శాస్ర్తీ (శాసనాల శాస్ర్తీ)వంటి వారి కృషిని మరచిపోలేము. నేలటూరి వెంకటరమణయ్య, సురవరం ప్రతాపరెడ్డి వంటివారు చేసిన పరిశోధనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతిని బృహత్ గ్రంథాలుగా వెలువరించాలనే ప్రయత్నంలో 1976లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెసు నిర్ణయానికి ‘‘శాస్ర్తియ లౌకిక చరిత్ర’’ నిర్మాణం తమ లక్ష్యం అని పీఠికలో చెప్పుకున్నారు. అంటే సైంటిఫిక్ సెక్యులర్ హిస్టరీ అని అర్థం. ఈ కారణంచేతనే దాదాపు వామపక్ష భావాలుకల వకుళాభరణం రామకృష్ణ వంటి వారి నేతృత్వంలో రొమిల్లా థాపర్, ఆర్.శర్మ, బిపిన్‌చంద్ర వంటి వామపక్ష చరిత్రకారుల ఆర్థికకోణంతో చరిత్రను నిర్మించే మహాప్రయత్నంలో భాగంగా కొన్ని సంపుటాలు వచ్చాయి. మలి మధ్యయుగం (1324- 1724) పతనంతో మొదలైన చరిత్ర, విజయనగరం సామ్రాజ్యం దక్కనులో మొగలుల పాలన వరకు ఇందులో చర్చింపబడింది. దక్షిణ అనే పదంనుండి దక్కన్ అనే పదం పుట్టింది. ఈ ఎన్‌సైక్లొపేడియా వంటి గ్రంథంలో ఆయా శీర్షికలను విడివిడిగా చరిత్ర అధ్యాపకులు వ్రాశారు. దాదాపు యాభైకి పైగా ఉన్న అధ్యాయాలల్లో ఒక్కొక్క విభాగం కింద ఉన్న ఉప శీర్షికలను ముగ్గురు లేక నలుగురు వేరే వేరే వ్యాసాలను రచించారు. అంటే ఇదొక బృహత్ సంకలన గ్రంథం అనవచ్చు. అందరిలోనూ అనుస్సూతంగా ఉన్నది ఆర్థిక- సామాజిక దృష్టేకాని రాజుల వంశ వృక్షాలుకావు. భంగ్యంతరంగా చెప్పుకోవాలంటే ఆంధ్రదేశ చరిత్రను ఆర్థిక సంఘర్షణ చరిత్రగా వ్యాఖ్యానించే ప్రయత్నమిది. ఇందులో ఇవ్వబడిన సమాచారం- చాలా విలువైనది. సేకరణ గొప్పది. అభివ్యక్తి అంతకన్నా గొప్పది. లౌకికవాదంకోసం అక్కడక్కడ కొన్ని అంశాలపై కప్పదాట్లు జరిగినా చాలా నిజాలు కూడా చెప్పారు. ప్రభువు వైయక్తిక లక్షణాలు సమర్ధతలపై మధ్యయుగంలో రాజ్యస్థిరత ఆధారపడి ఉంది. పాలకులు సామాన్యంగా ధర్మానుశాసనాలను తప్పి నడిచే వారు కాదు. అందువల్ల రాజ్యానికి స్థిరత్వం కొనసాగింపు కలిగాయి. (వకుళాభరణం పీఠిక.) ఒక జాతి చరిత్రను సర్వాంగాణంగా దర్శించాలంటే రాజ్యవ్యవస్థతోబాటు ఆర్థిక సాంఘిక సామాజిక కళారంగాలను కూడా స్పృశించాలి. ముఖ్యంగా తెలుగు భాషలిపి క్రమపరిణామ వ్యాకరణ ప్రయోగాలకు సంబంధించి ఇందులో చాలా విస్తృతమైన వ్యాసం ఉంది. అలాగే సంస్కృతం ఉర్దూ పర్షియన్ సాహిత్యాలకు సంబంధించిన వ్యాసాలూ చాలా పరిశోధనాత్మకమైనవే. ఒరియా లిపికి సంబంధించి స్నిగ్ధవ్రాసిన వ్యాసాన్ని ఎవరో అనువదించి ఉంటారు (పుట- 560). ‘‘గుప్తానంత కుటిల మొ. విధంగా ఒరియా లిపి అభివృద్ధిదశలను పేర్కొంటున్నారు. ఇది తెలుగు వాక్యమేనా?? రాయప్రోలు పేరు రావిప్రోలు అని వ్రాశారు. ఎన్‌సైక్లొపీడియా అనదగ్గ గ్రంథాలల్లో ప్రతి పంక్తి శ్రద్ధగా ప్రూఫ్ చూచుకోవాలి. 640వ పుటలో విజయనగర రాజుల కాలంనాటి విదేశీ యాత్రికుల కథనాలకు సంబంధించిన వ్యాసం పరిశోధక విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంది. అలాగే గ్రంథాంతంలో (657) పద పట్టిక బాగుంది. 10వ పుటలో ఇవ్వబడ్డ విలస శాసన సంక్షిప్త పాఠం, గంగాదేవి మధురా విజయ సారాంశం చూస్తే వర్తమాన పాలకులకు కొంత బుద్ధిరావచ్చు. దక్షిణ రాజ్యాల పతనానికి శత్రువుల పరాక్రమంతోబాటు స్థానిక రాజుల అనైకమత్యం ఎంతగానో తోడ్పడింది. 11వ పుటలో ఆంధ్ర దేశంలో జరిగిన రాచరికపు పరిణామాలు చక్కగా వివరింపబడ్డాయి. చోళచాళుక్య పాండ్య వంటి రాజవంశాలు వెనుకబడి వ్యావసాయిక నేపథ్యంగల వ్యక్తులు పాలకులైనారు. అంటే కమ్మ కాపు తెలగ- యదవ- రెడ్డి కులస్థులు రాజ్యాధికారం పొందారు. ఐతే కాకతీయులు కూడా తాము అత్యర్కేందు వంశస్థులము అనే చెప్పుకున్నారు కదా’’. చంద్రగుప్తవౌర్యుడు కూడా వృషలుడే.
ఈ గ్రంథాన్ని రాజకీయ చరిత్ర, పరిపాలన- కళలు- సాహిత్యం- లిపి- వంటి కొన్ని విభాగాలుగా చేశారు. మతము అనే అధ్యాయంలో శైవము వైష్ణవము- తదితరములు అందలి అంతశ్శాఖలు చాలా చక్కగా వివరించారు. అంతేకారు ప్రదర్శన కళల ఆరంభ వికాసాలు అందినంతవరకు వర్ణించారు. పల్నాటి వీర చరిత్రలో నలగామరాజు నాట్యమేళము దర్శించిన విధానాన్ని శ్రీనాథుడు సవివరంగా ప్రస్తావించాడు. దానిని ఈ గ్రంథంలో ఉదాహరించారు. ఈ సాహిత్యయజ్ఞంలో వకుళాభరణం వారికి వి.రామకృష్ణ, ఆర్.సోమారెడ్డి, బి.రాజేంద్రప్రసాద్, ఐసోరు సుందరరావు వంటివారు తోడ్పడగా కార్యనిర్వాహక సంపాదకులుగా కె.ఎస్.కామేశ్వరరావు, ఎ.ఎ సత్యనారాయణగార్లు వివిధ బాధ్యతలు నిర్వహించారు. కాకాని చక్రపాణి దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డిగారు అనువాదకులుగా జి.వెంకటరామయ్యగారి ఎకడమిక్ కోఆర్డినేషన్ సమర్ధవంతంగా సాగింది. వ్యవహరించగా ఇంత మంచి పనిచేసిన ఈ మహనీయులను వ్యాసకర్తలను మనస్ఫూర్తిగా అభినందించవలసి ఉంది. గ్రంథాంతంలో పట్టికలు పటముల నాణెముల వంటి వాని వివరములు ఉన్నయి. కొన్ని ప్రముఖ ఆలయాలు కోటబురుజుల విశేషాలు పొందుపరిచారు.

-ముదిగొండ శివప్రసాద్