అంతర్జాతీయం

అసాంజేది నిరంకుశ నిర్బంధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా/ లండన్, ఫిబ్రవరి 5: బ్రిటన్, స్వీడన్‌లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా చేసిన పోరాటంలో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విజయం సాధించారు. అసాంజేది నిరంకుశ నిర్బంధమేనని ఐరాస వర్కింగ్ గ్రూప్ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. నిరంకుశ నిర్బంధం వల్ల అసాంజే తన స్వేచ్ఛను కోల్పోయారని పేర్కొంది. మూడు సంవత్సరాలకు పైగా కాలం నుంచి నిరంకుశ నిర్బంధంలో ఉన్న అసాంజేకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా ఐరాస వర్కింగ్ గ్రూప్ బ్రిటన్, స్వీడన్‌లను ఆదేశించింది. నిరంకుశ నిర్బంధాలపై ఏర్పడిన ఐరాస వర్కింగ్ గ్రూప్ నిపుణుల కమిటీ ప్రస్తుత అధినేత సియోంగ్ ఫిల్ హాంగ్ శుక్రవారం జెనీవాలో మాట్లాడుతూ అసాంజే ఒక రకమైన నిరంకుశ నిర్బంధానికి గురయ్యారని ప్రకటించారు. అసాంజే నిరంకుశ నిర్బంధానికి ముగింపు పలకాలని వర్కింగ్ గ్రూప్ భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. అసాంజేకు ఉన్న ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛను గౌరవించాలని, ఇంతకాలం నిరంకుశ నిర్బంధంలో ఉన్నందుకు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఆయనకు ఉందని హాంగ్ వివరించారు. అయితే ఐరాస వర్కింగ్ గ్రూప్ నిర్ణయాన్ని బ్రిటన్, స్వీడన్ తోసిపుచ్చాయి. వర్కింగ్ గ్రూప్ నిర్ణయంలో కొత్తేమే లేదని వ్యాఖ్యానించాయి.
ఆస్ట్రేలియాకు చెందిన 44 ఏళ్ల అసాంజే గత మూడేళ్లుగా సెంట్రల్ లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. అసాంజే 2006లో ప్రారంభించిన వికీలీక్స్ అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి అమెరికా మిలిటరీకి చెందిన అయిదు లక్షల రహస్య పత్రాలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన రెండున్నర లక్షల కేబుళ్లను కూడా బయటపెట్టింది. అసాంజే తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడని స్వీడన్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఇదివరకే కేసు పెట్టారు. ఈ ఆరోపణలను అసాంజే ఇదివరకే తోసిపుచ్చారు. ఈ కేసులో బ్రిటన్ తనను స్వీడన్‌కు అప్పగించకుండా తప్పించుకోవడానికి ఆయన ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందారు. ఈ దౌత్య కార్యాలయంలోని ఒక చిన్న గదిలో ఉంటున్న అసాంజే తనకు అంతరిక్ష కేంద్రంలో ఉన్నట్లుగా ఉందని అభివర్ణించారు. బ్రిటన్ తనను స్వీడన్‌కు అప్పగిస్తే తరువాత స్వీడన్ తనను అమెరికాకు అప్పగిస్తుందని అసాంజే భయపడుతున్నారు. అప్పుడు అమెరికా రహస్య పత్రాలను బయటపెట్టినందుకు గాను ఆ దేశం తనను గూఢచర్యం చట్టం కింద విచారిస్తుందనేది అసాంజే ఆందోళన. ఒకవేళ ఐరాస వర్కింగ్ గ్రూప్ తనది నిరంకుశ నిర్బంధం కాదని ప్రకటిస్తే తాను శుక్రవారం మధ్యాహ్నమే ఈక్వెడార్ దౌత్య కార్యాలయం నుంచి బయటకు వచ్చి బ్రిటన్ పోలీసులకు లొంగిపోతానని అసాంజే గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.