శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అడుగుల తేడా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 5: ఆత్మకూరులో రోడ్ల విస్తరణ పర్వంలో అధికార్ల చేతివాటం విన్యాసాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పట్టణంలో రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 30 అడుగుల వరకు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఆ ప్రకారం పనులు కూడా జరుగుతున్నాయి. 30 అడుగులకు సంబంధించి మార్కింగ్ చేపట్టడంలోనే తేడాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కో చోట 26 అడుగులకే పరిమితం చేశారు. దీంతో నాలుగు అడుగుల వరకు గతంలో మాదిరి యధాప్రకారం కొనసాగేలా పరిస్థితులు అనుకూలించాయి. వివిధ దుకాణదారులు పురపాలక నిర్ణయానికి వ్యతిరేకంగా పైఎత్తుతో వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా నిర్ణయించుకున్న 30 అడుగుల్లో మూడు అడుగుల వరకు వరద, మురుగు నీటిని తీసుకెళ్లేందుకు కాలువ నిర్మిస్తున్నారు. దీంతో నాలుగు అడుగుల తక్కువతో క్రమబద్దీకరణ జరిగిన చోట మొత్తం మీద కాలువ పోను 23 అడుగులకే రోడ్డు మధ్య నుంచి విస్తరణ జరిగింది. అంతకుముందు 20 నుంచి 25 అడుగుల్లో రోడ్లకు ఇరువైపులా నిర్మాణాలున్నాయి. మొత్తమీద తాజాగా క్రమబద్దీకరణ జరిగిన చోట పెద్దగా కట్టడాల కూల్చివేత లేకుండా సరిపెట్టిన తతంగం పలు దుకాణాల విషయంలో స్పష్టంగా అవగతం. ఈ క్రమంలో ఆయా అంగళ్ల ముందుండే మెట్లు లేక కొద్ది మేర నిర్మాణాన్ని మాత్రమే తొలగించారు. కాలువ, రోడ్డు నిర్మాణం పూరె్తైన తరువాత పాత పద్ధతిలోనే అంగళ్ల ముంగిట భాగం ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విస్తరణపర్వంతో క్రమబద్దీకరణ అంశాన్ని కొంతమంది చాకచక్యంగా తప్పించుకున్నారనే సంగతి తేటతెల్లం. ఇదిలాఉంటే విడతలవారీగా నెల్లూరుపాళెం కూడలి నుంచి ఆర్టీసీ డిపో వరకు రోడ్డు విస్తరణ పూరైంది. సోమశిల కూడలి నుంచి మున్సిపల్ బస్టాండ్, పాత హాల్ సెంటర్ మీదుగా తిరిగి బైపాస్ మీదుగా నెల్లూరు-ముంబయి రహదారి వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం తలెత్తని రీతిలో విస్తారమైన రోడ్డు ఉండేలా అభివృద్ధి సారాంశం. అయితే ఆర్టీసీ డిపో నుంచి సోమశిల కూడలి వరకు పనుల్లో జాప్యం ఆవహించింది. తమకు పరిహారం ఇవ్వనిదే రోడ్డు విస్తరణ పనులు చేయడానికి లేదంటూ ఎల్‌ఆర్‌పల్లెకు చెందిన ఓ ఆసుపత్రి యాజమాన్యం న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీనికి ప్రతిగా ప్రభుత్వ యంత్రాంగం తరపున కోర్టులో కేసు దాఖలు చేయలేదు. ఈనేపథ్యంతో ఆర్టీసీ డిపో నుంచి సోమశిల కూడలి వరకు రోడ్ల విస్తరణ పనులు ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత కరవు.

గృహ నిర్మాణంలో నూతన విధానాలు అమలుచేస్తాం
* కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సలహాదారు అశోక్‌కుమార్ జైన్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 5: గృహనిర్మాణంలో, పారిశుద్ధ్య కార్యక్రమంలో అధికారుల నుండి ప్రతిస్పందన సేకరించి తద్వారా కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా దాన్ని అమలుచేయడమే ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ సలహాదారు అశోక్‌కుమార్‌జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం గోల్డెన్ జూబ్లీ హాలులో కేంద్రప్రభుత్వ నిధులతో అమలుచేయనున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం జానకి పాల్గొన్నారు. ఈసందర్భంగా అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు గృహ నిర్మాణాలకు గాని, పారిశుద్ధ్య కార్యక్రమాలు గాని అమలుచేసేటప్పుడు లబ్ధిదారుల నుండి అభిప్రాయాలు సేకరించాలన్నారు. దేశం మొత్తంమీద చూసినట్లయితే గ్రామీణ స్థాయిలో 3కోట్ల గృహాలు అవసరమని, అదే పట్టణ ప్రాంతంలో అయితే 2కోట్ల గృహాలు అవసరమన్నారు. ప్రస్తుతం గృహాల నిర్మాణ ఫండింగ్ గురించి ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఇందిరా ఆవాజ్ యోజన పథకం కింద 70వేల రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 16వేలు, స్వచ్ఛ్భారత్ కింద 12వేల రూపాయలు అందిస్తుందన్నారు. గృహనిర్మాణ లబ్ధిదారులు గృహనిర్మాణం పూర్తిచేయకుండానే అనవసరమైన ఖర్చులుపెట్టి ఇళ్లనిర్మాణాలు పూర్తికాకుండా ఉండటం గమనించినట్లు తెలిపారు. తాను నెల్లూరు జిల్లాలో చేసిన పర్యటనలో కొంతమంది లబ్ధిదారులు గృహనిర్మాణ పునాదిని ఒకటిన్నర మీటరు ఎత్తుకు వేసుకున్నారని, స్టేర్‌కేస్‌లను కూడా వేసుకున్నారని, ఇంకా నిర్మాణం పూర్తికాలేదన్నారు. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవని ఆయన తెలిపారు. ముందుగా ఇంటిని పూర్తిచేసుకున్న తర్వాత మాత్రమే మిగతా అవసరమైన పనులు పూర్తిచేసే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం గురించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి వంద రోజులు కేంద్రప్రభుత్వం పనులు కల్పిస్తున్నట్లు, దేశవ్యాప్తంగా గణాంకాలు చూసినట్లయితే ఇప్పటివరకు సరాసరి 60 రోజుల పనిదినాలు మాత్రమే లబ్ధిదారులు వాడుకుంటున్నారన్నారు. గృహనిర్మాణ పథకానికి జాతీయ ఉపాధి హామీ పథకం లింక్‌చేయడంవల్ల చాలావరకు లబ్ధిదారులకు ఉపయోగపడుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖ లబ్ధిదారులకు సిమెంట్ ఒక బస్తా 190 రూపాయలకే ఇస్తున్నారన్నారు. ఫ్రీ ఫ్యాబ్రికేషన్ ద్వారా ఖర్చు తగ్గడంతోపాటు ఇళ్లు ఎక్కువ నాణ్యతతో ఎక్కువ సంవత్సరాలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించడమే కాకుండా వాటిని ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు కొత్త ఆలోచనలకు తెరదీసి అతి తక్కువ కాలంలో పక్కాఇళ్లు లబ్ధిదారులు నిర్మించేలా తగు సూచనలు ఇవ్వాలన్నారు. హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రారెడ్డిని గృహనిర్మాణాల గురించి తెలియచేయాల్సిందిగా ఆయన కోరారు. ఈసందర్భంగా గృహనిర్మాణ పిడి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణాల డిమాండ్ గురించి సర్వే నిర్వహించినట్లు, లబ్ధిదారుల నుండి దరఖాస్తులు పెట్టుకునే విధంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసినట్లు, లబ్ధిదారులు మీ-సేవా ద్వారా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా జైన్ మాట్లాడుతూ హౌసింగ్ నిర్మాణం, శానిటేషన్ నిర్మాణం గాని తక్కువ సమయంలో పూర్తిచేయాలన్నారు. స్వయం సహాయక గ్రూపుల వారిని కూడా గృహనిర్మాణ కార్యక్రమంలో మిళితం చేసి తద్వారా తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. రూరల్ వాటర్ సప్లయి గురించి ఆయన మాట్లాడుతూ ఫ్లోరైడ్ ప్రాంతాల్లో నీటిని డీఫ్లోరైడ్ చేసిన తర్వాత మరలా మిగిలివున్న ఫ్లోరైడ్‌ను భూమిలోకి పంపనున్నట్లు, దీనివల్ల మరలా భూమి పొరల్లోకి ఫ్లోరైడ్ చేరుతుందన్నారు. నానో టెక్నాలజీ పద్ధతిలో ఫ్లోరైడ్‌ను నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లాలో అమలుచేస్తున్న హౌసింగ్ కార్యక్రమాలు, శానిటేషన్ గురించి జైన్‌కు వివరించారు. ఈసందర్భంగా జైన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కొత్త ఆలోచనలు తీసుకుని తద్వారా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చురుగ్గా అమలుచేయడానికేనన్నారు.

సింహపురి అంటేనే హడల్!
* రావాలంటే భయపడుతున్న అధికారులు
* రాజకీయాలకు ఆరుగురు బదిలీలు
ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 5: జిల్లాకు బదిలీపై రావాలంటేనే ఉన్నతాధికారులు సైతం హడలి పోతున్నారు. శాఖ ఏదైనా సరే బదిలీపై వచ్చాక కనీసం ఆరు నెలలైనా ఉంటామనే నమ్మకం లేకుండా పోతుంది. జిల్లా రాజకీయాలకు నలిగిపోతున్నారు. అధికార పార్టీ నాయకుల మాటలు వింటే కొన్ని రోజులైనా జిల్లాలో ఉంటారు. లేదంటే బదిలీకి సిద్ధంగా ఉండాల్సిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. వీరంతా సాధారణ బదిలీలో జరిగిన వారు కాదు. నేతల మాటలు వినకపోయే సరికే వారి ఆగ్రహానికి గురైన వారిలో ఐఎఎస్, ఐపిఎస్‌లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ శాఖ అయినా ఏ స్థాయి అధికారి అయినా సరే అధికార పార్టీ నేతల మాటలు వినకపోతే ఇంతే సంగతులు. బదిలీలు మండల అధికారులకు అనుకుంటే పొరపాటే. కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ సెంథిల్‌కుమార్, జడ్పీ సిఇఓ జితేంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు(ఐఎఎస్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి, ప్రస్తుత కమిషనర్ మూర్తి ఇలా అందరూ రాజకీయ నేతల ఆగ్రహానికి గురై బదిలీ అయిన వారే. గతంలో ఉన్న కలెక్టర్ శ్రీకాంత్ ఎన్నికలను ఎటువంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించారు. రెవెన్యూ బదిలీల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఎంత ఒత్తిడి చేసినా లెక్క చేయలేదు. దీనికి ఫలితం సంవత్సరం తిరగకముందే బదిలీ. ఎస్పీగా ఉన్న సెంథిల్‌కుమార్ బాధ్యతలు తీసుకున్న వెంటనే సిబ్బందిని పరుగులు తీయించారు. పోలీసు పవర్ ఏమిటో చూపించారు. నేతలు ఎంత ఒత్తిడి చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. పోలీసుశాఖ బదిలీల్లోనూ సైతం ఎక్కడా రాజకీయ మచ్చ పడనీయలేదు. ఫలితం 9నెలలకే బదిలీ. నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు అస్తవ్యస్తంగా ఉన్న కార్పొరేషన్‌ను గాడిలో పెడతారని అందరూ ఊహించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే కొన్ని కార్యక్రమాలను చేపట్టారు. కాని అవి ముందుకు కదల్లేదు. మేయర్‌కు కమిషనర్‌కు భేదాభిప్రాయాలు వచ్చాయి. మేయర్ ఫిర్యాదు చేయడంతో మంత్రి సైతం కమిషనర్‌ను హెచ్చరించారు. మేయర్ చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు. పలు ఫైల్స్‌ను సైతం పెండింగ్‌లో పెట్టడంతో ఆగ్రహించిన మేయర్ మంత్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి కమిషనర్‌ను బదిలీ చేయించారు. 7నెలలు కూడా నిండకముందే ఆయన బదిలీ అయ్యారు. ఇదిలా ఉంటే జడ్పీ సిఇఓ జితేంద్ర, జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళిని అధికార పార్టీ నేతలు టార్గెట్ చేసి వారిని బదిలీ చేయించారు. ప్రస్తుతం కార్పొరేషన్ కమిషనర్ మూర్తిని కూడా అధికార పార్టీ నేతలు బదిలీ చేశారు. కర్నూలు కమిషనర్‌గా ఉన్న మూర్తిని నెల్లూరు కమిషనర్‌గా నియమించారు. ఆయన ముక్కుసాటిగా వెళుతూ కార్పొరేషన్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. తన మాట వినడం లేదని మేయర్‌తో పాటు అధికార పార్టీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పలు మార్లు సమావేశంలోనే మంత్రి నారాయణ కమిషనర్ మూర్తిని హెచ్చరించారు. చెప్పిన మాట వినకుండా ఉంటే బదిలీ తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ఆయన స్థానంలో గుంటూరు ఆర్జేడీ వెంకటేశ్వరరావును నియమించారు. ఇదిలా ఉంటే ఎస్పీ గజారావుభూపాల్‌ను సైతం బదిలీ చేయనున్నట్లు సమాచారం.

ప్రాణం తీసిన సరదా
* ఒకరిని కాపాడిన స్థానికులు
* గల్లంతైన బాలుడి కోసం గాలింపు
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 5: పెన్నానదిలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల సరదా ఒక ప్రాణాన్ని బలిగొన్నది. శుక్రవారం ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లారు. వారిద్దరూ మునిగిపోతుండటంతో గుర్తించిన యువకులు ఒక విద్యార్థిని కాపాడగా, మరో విద్యార్థి నీటిలో కొట్టుకుపోయాడు. లక్ష్మీపురంలోని వీవర్స్ కాలనీకి చెందిన నితీష్‌కుమార్, షఫీ అనే విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి స్కూల్‌కు వెళ్లకుండా ఈతకు వెళ్లడంతో ఈ సంఘటన జరిగింది. మరొక విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

షాపింగ్ కాంప్లెక్స్‌గా మారనున్న పాత జడ్పీ
* నిరుపయోగంగా ఉన్న ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం
* పరిశీలించిన జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 5: నగరంలోని పాత జిల్లా పరిషత్ కార్యాలయం, ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయాలను జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సిఇఓ బి రామిరెడ్డి, ఎస్‌ఇ దామోదరం శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చడంతో కొంత కాలంగా పాత భవనం నిరుపయోగకరంగా ఉండటంతో జిల్లా పరిషత్‌కి నిధులను సమకూర్చే విధంగా ఆలోచనచేసి పాత భవంతులను పడగొట్టి ఆ స్థలంలో కొత్తగా మూడు అంతస్తులతో షాపింగ్ కాంప్లెక్సులను నిర్మించి బాడుగలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గతంలో జిల్లా కలెక్టరు దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయాన్ని నూతనంగా నిర్మించిన జడ్పిలోకి మార్చామని, సుమారు రెండు వందల అంకణాలు ఇక్కడ స్థలం ఉన్నట్లు గుర్తించారని, ఇక్కడ బహుళ అంతస్తుల దుకాణాలను ఏర్పాటుచేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా పరిషత్‌కు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలియజేశారు. ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం ముందు భాగంలో కొంతమేరకు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దాని మీద కూడా నివేదికను తెప్పించుకుని అక్కడి స్థలాన్ని సర్వే చేయించి ఆక్రమణలను తొలగించే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌కు సక్రమంగా నిధులు అందడం లేదని, రావాల్సివున్న బకాయిలు కూడా సరిగా రావడం లేదని, త్వరలో ప్రభుత్వపరంగా డెమాలిష్ చేసేందుకు టెండర్లను ఆహ్వానించి ఆక్రమణకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించి ఇంజనీరింగ్ విభాగం నుండి భవన నిర్మాణ చిత్రాన్ని తయారుచేయించి జడ్పికి ఆదాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీనివలన రాబోవు రోజులలో జడ్పికి కోట్ల రూపాయలు ఆదాయం చేకూరుతుందన్నారు. ఈ ప్రక్రియను త్వరలోనే మొదలుపెడతామని తెలిపారు. అలాగే షాపింగ్ కాంప్లెక్సులు పూర్తి అయిన వెంటనే వాటిని ఆన్‌లైన్లో పెట్టి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. వారితోపాటు పంచాయితీరాజ్ ఎస్‌ఇ దామోదరం, అధికారులు పాల్గొన్నారు.

పిహెచ్‌సిల్లో డ్రగ్ స్టోర్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి
* డిఎంహెచ్‌ఓ వరసుందరం ఆదేశం
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 5: జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న డ్రగ్ స్టోర్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వరసుందరం ఆదేశించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఫార్మసిస్ట్‌లకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ స్టోర్‌లో మందులను ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. కాలం చెల్లిన మందులను ఉంచుకోకుండా వాటిని వెంటనే పడవేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే స్టాకు తెచ్చుకోవాలన్నారు. రికార్టులు, రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. ఈ ఔషధి ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఓలు ప్రతి 15రోజులకొకసారి ఈ డ్రగ్ స్టోర్స్‌ను తనిఖీ చేయాలన్నారు. వైద్యాధికారులు ప్రతి రోజు ఈ ఔషధి, ఓపి, ఐపి, ఆర్‌సిహెచ్, హెచ్‌ఎంఐఎస్ తనిఖీ చేయాలన్నారు. రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఫార్మసీ సూపర్‌వైజర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
కలువాయి, ఫిబ్రవరి 5: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను శుక్రవారం కలువాయి ఎస్సై కొండపనాయుడు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదువందల గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకున్నారు. నెల్లూరుకు చెందిన ముంతాజ్‌బేగమ్, కావలికి చెందిన వనె్నపుకొండలు అనే స్మగ్లర్లను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. మండలంలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వెదనపర్తికి చెందిన మొగళ్ల మస్తాన్‌సాహెబ్, నెల్లూరుకు చెందిన ఎస్‌కె సిరాజులను కూడా గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.

రెండు ధాన్యం లారీల పట్టివేత
తడ, ఫిబ్రవరి 5: నెల్లూరు నుండి రెడ్‌హిల్స్‌కు ఎలాంటి వే బిల్లులు లేకుండా వెళుతున్న రెండు ధాన్యం లారీలను గురువారం అర్ధరాత్రి తనిఖీ కేంద్ర అధికారులు పట్టుకొన్నారు. నెల్లూరు నుండి రెడ్‌హిల్స్‌కు 17 టన్నులతో తరలి వెళుతున్న రెండు లారీలను అధికారులు పట్టుకొన్నారు. ఈ పట్టుకొన్న వాహనాల ద్వారా ఒక్కో లారీకి 30 వేల చొప్పున పెనాల్టి రూపేణా వసూలవుతుందని అధికారి తెలిపారు. ఇదే తరహాలో చెన్నై నుండి విజయవాడకు కంప్యూటర్ ట్యాబ్‌ల లారీని పట్టుకొన్నామని, ఈ లారీలోని సరుకు విలుల 65 లక్షల రూపాయలుంటుందని, ట్యాక్సు, పన్ను రూపేణా 3.50 లక్షలు వసూలు చేసామని ఎఓ తెలిపారు.

టెండర్లలో తికమక
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 5: ప్రభుత్వం ఇసుక తవ్వకం, అమ్మకాలకు సంబంధించి మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇసుక రీచ్‌లకు ఆన్‌లైన్ టెండర్లు వేసుకోవాలని తెలిపింది. ఎక్కువ పరిమాణంలో ఇసుక లభ్యతను బట్టి రీచ్‌లను టెండర్ విధానంలో అప్పగించాలని నిర్ణయించింది. తక్కువ నిల్వలు ఉన్న రీచ్‌లను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 25 ఇసుక రీచ్‌లకు ఆన్‌లైన్ టెండర్లు పిలిచారు. ఈనెల 9వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. ఇసుక రీచ్‌లకు టెండర్లు ఆన్‌లైన్‌లో వేయాల్సి ఉంది. ఈ విధానంపై ఔత్సాహికులకు అవగాహన లేదు. మీ-సేవా కేంద్రాలు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా టెండర్లు వేసే విధానం నిర్వాహకులకు తెలియకపోవడంతో సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎలా దరఖాస్తు చేయాలో తెలియక మండల కేంద్రాల నుండి మీ-సేవా, ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులు జిల్లాకేంద్రాలకు పరుగులు తీస్తుండగా, జిల్లాకేంద్రంలో పలువురు పక్క జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. ఆన్‌లైన్ టెండర్లు ఎలా వేయాలి, ఏ అంశాలు అందుబాటులో ఉంచుకోవాలి అనే వివరాలపై స్పష్టత లేదు. దీనిపై ఎవరికీ అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద రీచ్‌లు టెండర్లు పిలిచినప్పటికీ చిన్న రీచ్‌లపై స్పష్టత లేదు. చిన్న రేవులను పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. చిన్న రీచ్‌లు ఎన్ని ఉన్నాయి, వాటి నిబంధనలు ఏమిటి, ఎప్పటి నుండి పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలి, వీటిని పంచాయతీలకు అప్పగిస్తే ప్రభుత్వ కట్టడాలకు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు చేపట్టే నిర్మాణాలకు ఇసుక ఉచితంగా లభించే అవకాశం ఉంటుంది.

నగరానికి 25వేల ఇళ్లు మంజూరు
* మేయర్ అబ్దుల్ అజీజ్ వెల్లడి
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 5: నెల్లూరు నగరానికి మొత్తం 25వేల ఇళ్లను మంజూరు చేసినట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. శుక్రవారం మేయర్ ఛాంబర్‌లో హౌసింగ్, తహశీల్దార్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలు, స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని తెలిపారు. అందులో 4800 మందికి స్థలం ఉంటే, వారికి ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు హౌసింగ్ బోర్డు సిద్ధంగా ఉందన్నారు. స్థలం లేకపోయినా ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన పేదలందరూ వినియోగించుకోవాలని మేయర్ కోరారు.

శ్రీసిటీలో మరో కొత్త ఎలక్ట్రానిక్ కంపెనీకి భూమి పూజ
తడ, ఫిబ్రవరి 5: చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న న్యూక్లియర్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తమ డిష్ యాంటీనాల తయారీ కేంద్రానికి శుక్రవారం శ్రీసిటీలో భూమిపూజ నిర్వహించారు. ఆ సంస్థ ఎండి, సిఇఓ రామన్ భూమి పూజ చేసి ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 ఎకరాల స్థలంలో 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కర్మాగారం వచ్చే ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని, 45, 60, 100 మీటర్ల అడ్డుకొలత గల డిష్ యాంటీనాలను ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేస్తామన్నారు. 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తమ వ్యాపార విస్తరణకు ఈ ఉత్పత్తి కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నూతన పారిశ్రామిక విధానంతో పురోగమిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకొన్నామని, అన్ని వౌలిక వసతులతో కూడిన కేంద్రంగా శ్రీసిటీ ఉన్నందున ఈ కేంద్రాన్ని ఎంచుకొన్నట్టు తెలిపారు.

ఆత్మకూరులో సైబర్ మోస బాధితుడు
ఆత్మకూరు, ఫిబ్రవరి 5: అతనికి తెలియకనే బ్యాంక్ ఖాతాలో నుంచి నగదు మాయమైంది. ఆన్‌లైన్ షాపింగ్ చేయడం వల్ల నగదు సుమారుగా నలభై వేల రూపాయల మొత్తం డెబిట్ అయినట్లుగా సదరు బ్యాంక్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. అలాంటి లావాదేవీనే తనకు తెలియదని బాధితుడైన ఆత్మకూరు పట్టణంలోని సోమశిల కూడలి వద్ద నాయిబ్రాహ్మణ కులవృత్తి నిర్వహించుకునే పెంచలయ్య వాపోతున్నాడు. తానెప్పుడూ ఆన్‌లైన్ మార్కెటింగ్ అంతటి దూరం వెళ్లలేదన్నా, అసలు అలాంటి దానిపై అవగాహన అంటూ కూడా తనకు లేదని బాధితుడు లబోదిబోమంటున్నాడు. అతనికి మాత్రమే తెలిసిన పిన్ నెంబర్‌ను సైతం ఎలా పసిగట్టి సొమ్ము అపహరించుకుపోయారనేది అంతుపట్టని తతంగం. బ్యాంక్ అధికారులు సంబంధిత ఏటిఎం కార్డుద్వారా జరిగిన ఆన్‌లైన్ షాపింగ్, దొంగ కొనుగోలుదారుడి అడ్రస్ వంటి వివరాలను రాబట్టి బాధితుడికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలి’
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 5: బిసిలకు తక్షణం రిజర్వేషన్లు కల్పించాలని, ఓసి సామాజిక వర్గాలను బిసిలలో చేర్చడం సరికాదని బిసి సంక్షేమ సంఘం సీమాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని రామ్మూర్తినగర్‌లో ఉన్న సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు గత ఎన్నికల మ్యానిఫెస్టోలో బిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఓసిలు ఆర్థికంగా ముందంజలో ఉన్నారని, వారిని బిసిలలో చేర్చితే బిసిలకు లబ్ధిచేకూరదన్నారు. ప్రధానంగా బిసిలలో వాల్మీకి, రజక, వడ్డెర సామాజిక వర్గాల వారికి వెంటనే కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి వారిని రాజకీయ, విద్య, వైద్య, ఉద్యోగ రంగాలలో అవకాశాలను కల్పించినపుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు. బిసిలకు 33 శాతం రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. బిసిలలో ఓసిలను చేర్చడం చంద్రబాబు నాయుడు పునరాలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందన్నారు. బిసిలను ఓసిలలో చేర్చకూడదని ఈనెల 8న నగరంలోని విఆర్‌సి కూడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించనున్నామన్నారు. ఈసమావేశంలో బిసి నాయకులు ఎస్‌వి నారాయణ యాదవ్, ధనుంజయ, విజయకుమార్, రమణయ్య, చంద్రశేఖర్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.