పశ్చిమగోదావరి

ఆ(గ్రి)గ్రహ ‘గోల్డ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 12: వందలు, వేల మంది డిపాజిటర్లు, ఏజెంట్ల భవిష్యత్‌ను అంధకారబంధురం చేసిన అగ్రిగోల్డ్ సంస్ధపై తీవ్రస్ధాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నాటి పరిణామాల్లో ఆ సంస్ధ ఛైర్మన్, ఎండిలను అరెస్టు చేసి ఏలూరుకు తీసుకురావటంతో బాధితులంతా ఒక్కసారిగా తమ ఆగ్రహాన్ని, అక్రోశాన్ని వెళ్లగక్కారు. అగ్రిగోల్డ్ సంస్ధ గత కొనే్నళ్లుగా డిపాజిట్లు సేకరించటం, అధిక వడ్డీలు ఇస్తామని చెప్పటం వంటి వ్యవహారాలతో దాదాపు ఏడు రాష్ట్రాల్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకుంటూ వచ్చింది. అవిధంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించటమే కాకుండా అదే స్ధాయిలో ఆస్తులను కూడా కూడబెట్టుకుంది. అయితే చివరకు ఈసంస్ధ నష్టాల్లో కూరుకుపోయి కట్టిన డిపాజిట్లను తిరిగి చెల్లించలేని పరిస్ధితికి చేరుకుంది. ఈనేపధ్యంలోనే రాష్టవ్య్రాప్తంగా అగ్రిగోల్డ్ సంస్ధపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానిలో పెదపాడు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు తొలిది అనే చెప్పాలి. ఆతర్వాత వందల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. చివరకు న్యాయస్ధానంలో చొరవ తీసుకుని పూర్తిస్ధాయిలో విచారణకు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఈ కేసులను సిఐడికి అప్పగించింది. అతర్వాత కూడా ఈ కేసులో దర్యాప్తు మందకొడిగా సాగుతోందంటూ న్యాయస్ధానం పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. సిఐడికి అక్షింతలు వేసింది. ఈనేపధ్యంలో గురువారం సిఐడి పోలీసులు రంగంలోకి దిగి హైదరాబాద్‌లో ఉన్న అగ్రిగోల్డ్ సంస్ధ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండి అవ్వా వెంకట శేషు నారాయణరావులను అరెస్టు చేసింది. అంతకుముందు వారిద్దర్ని ఎనిమిదిగంటలకు పైగా ప్రశ్నించినట్లు సమాచారం. కాగా తొలి కేసు నమోదైన పశ్చిమగోదావరి జిల్లాకు వారిని శుక్రవారం తీసుకువచ్చారు. కాగా ఈవ్యవహారం పత్రికల్లో పతాకశీర్షికకు ఎక్కటంతో ఛైర్మన్, ఎండిలను ఏలూరు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఆ సంస్ధలో పనిచేసిన ఏజెంట్లు, డిపాజిట్‌లు వేసి దెబ్బతిన్న బాధితులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకున్నారు. వారంతా తొలుత జిల్లా కోర్టు వద్ద మోహరించారు. అరెస్టు అయిన ఛైర్మన్, ఎండిలను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో వారిని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈపరిణామాలు ఇలాఉంటే సిఐడి పోలీసులు ఈ పరిస్ధితిని గమనించి అనూహ్యంగా ఛైర్మన్ రామారావు, ఎండి నారాయణరావును నేరుగా జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎ హరిహరనాథశర్మ బంగ్లాకు తీసుకువెళ్లారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట వీరిద్దర్ని హాజరుపర్చారు. ఆయన వారికి 14రోజులు రిమాండ్ విధించారు. అక్కడ న్యాయపరమైన సాంకేతిక అంశాలు పూర్తవుతున్న తరుణంలో ఆప్రాంతానికి కొంతమంది ఏజెంట్లు, బాధితులు చేరుకున్నారు. ఈసందర్భంగా వారంతా అగ్రిగోల్డ్ సంస్ధ యాజమాన్యంపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. జనవరి మొదటివారంలోగా సమస్యలన్నీ సర్దుమణుగుతాయని ఆతర్వాత వ్యాపారం ముందుకు తీసుకువెళ్లవచ్చునని తమకు ఇన్నాళ్లు చెపుతూ వచ్చారని, అయితే అనూహ్యంగా అరెస్టు అయి తమను నట్టేట ముంచారని వారంతా గగ్గోలు పెట్టారు. శివన్నారాయణ అనే ఏజెంటు మాట్లాడుతూ తన పరిధిలోనే తాను ఆరు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేశానని, అవిధంగా ఏలూరులోను, జిల్లాలోను వందలమంది ఏజెంట్లు యాజమాన్యాన్ని నమ్మి కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశారని పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు డిపాజిట్లు చేసినవారంతా తమను నానా తిట్లు తిడుతున్నారని, కొంతమంది భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయాడు. ఈవిధంగానే మరికొంతమంది ఏజెంట్లు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరోవైపు సాంకేతిక అంశాలు పూర్తి కావటంతో ఛైర్మన్ రామారావు, ఎండి నారాయణరావులను ఇన్‌ఛార్జి జిల్లా న్యాయమూరి బంగ్లా నుంచి పోలీసు వాహనాల్లో శరవేగంగా తీసుకుని వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈలోగా ఈ సమాచారం అందుకున్న బాధితులు, ఏజెంట్లు కూడా ఆసుపత్రికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఛైర్మన్, ఎండిలను నేరుగా వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రిలోకి తీసుకువెళ్లి వైద్యుల వద్ద హాజరుపర్చారు. అక్కడ వారికి ఆరోగ్యపరీక్షలను నిర్వహించగా వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తేలటంతో వారిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఏలూరులోని జిల్లా జైలుకు తరలించేందుకు సిఐడి, స్ధానిక పోలీసులు ఉద్యుక్తులయ్యారు. వారిని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో అక్కడ గూమికూడి పెద్దసంఖ్యలో ఉన్న ఏజెంట్లు, బాధితులు ఒక్కసారిగా తీవ్రస్ధాయిలో శాపనార్ధాలు పెట్టడం మొదలుపెట్టారు. వారిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు వారిని తప్పించుకుంటూ ఛైర్మన్, ఎండిలను అతికష్టంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి అక్కడ నుంచి శరవేగంగా తరలిపోయారు. ఆసమయంలోనే ఏజెంట్లు, బాధితులు యాజమాన్యం తీరును మరోసారి తూర్పారపట్టారు. తమ కష్టం అంతా అవసరానికి ఆదుకుంటుందని, అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ ఛేశామని, ఇప్పుడు ఛైర్మన్, ఎండిల వ్యవహారం కారణంగా ఆ సొమ్ము అంతా గల్లంతు అయిందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ పలువురు ధ్వజమెత్తారు. ఈలోగా ఛైర్మన్, ఎండిలను పోలీసువాహనాల్లో జిల్లా జైలుకు తరలించారు. అక్కడ కూడా మరికొంతమంది ఏజెంట్లు, డిపాజిటర్లు గుమికూడి యాజమాన్యం తీరుపై ధ్వజమెత్తారు. ఎట్టకేలకు పోలీసులు వారిద్దర్ని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. ఈసందర్భంగా ఛైర్మన్ వెంకట రామారావు మాట్లాడుతూ డిపాజిటర్లకు ఇవ్వాల్సిన ప్రతి నయాపైసా చెల్లించి తీరుతానని స్పష్టం చేశారు. మరోవైపు సిఐడి డిఎస్పీ రాజ్‌గోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌కు వీరిద్దర్ని తరలిస్తున్నామని, మరింత విచారణ నిమిత్తం తిరిగి కస్టడీకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏదీఏమైనా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అటు ఆసుపత్రి, ఇటు న్యాయమూర్తి బంగ్లా, మరోవైపు జిల్లా జైలు వద్ద స్వల్ఫ ఉద్రిక్తతలు, హైడ్రామా నడిచాయి. చివరకు ఛైర్మన్, ఎండిలు జైలుకు చేరారు.
రైతు కళ్లల్లో ఆనందం, కాల్వల్లో నీళ్లు చూడాలి
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 12 : రైతు కళ్లల్లో ఆనందం, కాల్వల్లో నీళ్లు చూడాలన్నదే తన కోరిక అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల ప్రగతి తీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎవరిపైనా తనకు వ్యతిరేక భావం లేదని అన్ని శాఖలను సమన్వయ పరుస్తూ నిర్ధేశించిన లక్ష్యాలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయించడానికి తాను నిరంతరం సమీక్షలు నిర్వహిస్తానని అంతేతప్ప ఏ ఒక్కరిపై తనకు ద్వేషభావం కానీ, కోపంకానీ లేదని స్పష్టం చేశారు. ఆరు దశాబ్ధాల నుండి పోలవరం ప్రాజెక్టు కార్యరూపంలోనికి రాలేదని కనీసం తన హయాంలో పోలవరం డ్యామ్ సగం పనైనా చూడాలన్నదే తన ఆశయమని ఆ దిశగా సేద్యపు నీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకే వారంవారం సమీక్షలు చేస్తున్నానని అధికారులు కష్టపడి పనిచేస్తే ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడం కష్టం కాదని చెప్పారు. చింతలపూడి ప్రాంతంలో లిఫ్ట్ కోసం భూసేకరణ చేస్తున్నామని ప్రభుత్వ మార్కెట్ ధర ఎకరం 4 లక్షలుంటే కొత్త చట్టం ప్రకారం పది లక్షల రూపాయలు పరిహారమిచ్చినా ఇంకా ఎక్కువ మొత్తం కావాలంటూ కొంతమంది రైతులు కోర్టును ఆశ్రయించారని అటువంటి రైతులతో చర్చించి విశాల దృక్పధంతో ఆలోచన చేసి ప్రభుత్వంతో సహకరించేలా చూడాలని ఏలూరు ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్‌ను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఎస్‌ఇ ఎక్కడ
బహుళ ప్రయోజనాలు గల పోలవరం ప్రాజెక్టును 2018 నాటికల్లా పూర్తి చేయాలని ఒక వైపు ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఈ ప్రాజెక్టు పనుల ప్రగతి తీరును సమీక్షిస్తుంటే హెడ్‌వర్క్స్ ఎస్ ఇ ఎక్కడని ఈ సమావేశానికి ఎస్‌ఇ రాకుండా దిగువుస్థాయి ఎఇ, డిఇలను సమావేశాలకు పంపితే పనులపై నిర్ణయాలు ఎలా అమలు జరుగుతాయని కలెక్టర్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎస్ ఇ శ్రీనివాసయాదవ్ ఈ సమావేశానికి హాజరుకాలేదని, ఎందువల్ల సమావేశానికి రాలేదని ఆ శాఖ ఇఇని ప్రశ్నిస్తే విజయవాడలో మీటింగ్‌కు వెళ్లారని చెబుతున్నారని, కనీసం తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారే ఇష్టానుసారం వెళితే ఎలా, క్రమశిక్షణ లేకపోతే ఎలా, తాను ఏదైనా అంటే మనోభావాలను గాయపరిచారని అంటున్నారని, అయితే చెప్పిన పని చేయకపోతే అక్కడ మనోభావాలు దెబ్బతినవా అంటూ కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు సంబంధించి భూమిని ఎంతో కష్టపడి సేకరించినప్పటికీ ఆ భూములను స్వాధీనం చేసుకోమని ఇరిగేషన్ అధికారులను కోరితే ఆ భూమిని తీసుకోవడానికి జాప్యం చేస్తున్నారని పలువురు భూసేకరణ అధికారులు కలెక్టరు దృష్టికి తీసుకురాగా దీనిపై కలెక్టరు స్పందిస్తూ 48 గంటల్లో భూమిని స్వాధీనం చేసుకుని నివేదిక సమర్పించాలని అలా చేయకపోతే ఇరిగేషన్ ఇఇ చంద్రరావుపై చర్య తీసుకుంటామని నిర్లక్ష్య వైఖరిపై ఎస్‌ఇపై ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి డి ఇ లేఖ వ్రాస్తామని కలెక్టర్ చెప్పారు. తాడువాయి, పెద్దిపల్లి గ్రామాలలో భూసేకరణ చేసిన తర్వాత రైతులకు పరిహారం చెల్లించే విషయంలో బిల్లులు పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఆ బిల్లులను చెల్లించవద్దని తమకు ఫోన్ ద్వారా భూసేకరణ అధికారి చెప్పారని, పే అండ్ అకౌంట్స్ అధికారి కలెక్టరు దృష్టికి తీసుకురాగా ఈ బిల్లులు చెల్లించకుండా ఎందుకు ఆపాలి? 48 గంటల్లో వ్రాతపూర్వకంగా సమాచారం ఇవ్వకపోతే ఆ బిల్లుల సొమ్ము 23 కోట్లు రైతులకు చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, డిఆర్‌వో కె ప్రభాకరరావు, డిఎఫ్‌వో శాస్ర్తీ, నరసాపురం సబ్ కలెక్టర్ ఎ ఎస్ దినేష్‌కుమార్, ఐటిడిఏ పివో షాన్ మోహన్, ఆర్‌డివోలు ఎన్ తేజ్‌భరత్, బి శ్రీనివాసరావు, లవన్న, ఇరిగేషన్ ఎస్ ఇ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
12 ఇ ఎల్ ఆర్ 19 : ఏలూరులోని జడ్పీ అతిధిగృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ
ముఖ్యమంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
ఏప్రిల్ 30న విశ్వరూప మహాసభ : మంద కృష్ణ
పనితీరును ప్రదర్శించే ఇవోపిఆర్‌డిలకు రూ.5వేల బహుమతి
కలెక్టర్
భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 12 : జిల్లాలో పనితీరును ప్రదర్శించే ఇవోపి ఆర్‌డిలకు అయిదు వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ప్రకటించారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీల్లో పన్ను వసూళ్లు, ఆన్‌లైన్ అమలు తీరు తదితర అంశాలపై ఇవోపి ఆర్‌డిలతో ఆయన సమీక్షించారు. జిల్లాలో జనన, మరణ పాత రికార్డుల ఆన్‌లైన్ చేయడంలో గణపవరం ఇవోపిఆర్‌డి అపర్ణ చూపిన శ్రద్ద ప్రశంసనీయమని మండలంలో 19 వేల రికార్డులకు గాను 13 వేల రికార్డులు ఆన్‌లైన్‌లో పొందుపరిచి అగ్రస్థానంలోనిలవడం అభినందనీయమని చెప్పారు. జిల్లాలో 20 వేలు పైబడి ఉన్న జనన మరణ రికార్డులను వచ్చేవారంలోగా ఆన్‌లైన్ చేసి ఎవరు ముందుంటే వారందరికీ ప్రోత్సాహక బహుమతిగా అయిదు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు. జిల్లాలో జనన మరణ ధృవీకరణ పత్రాలు కోసం ఇచ్చే ధరఖాస్తులను పరిశీలించి నిర్ణీత సమయంలోగా సంబంధిత వ్యక్తులకు అందించాలని చెప్పారు. పంచాయితీలకు అధిక ఆదాయం సమకూర్చేందుకు పన్నులను నూరుశాతం వసూలు చేయాలని తద్వారా గ్రామాల అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పన్నులు సక్రమంగా చెల్లిస్తే వచ్చే ఆదాయం ద్వారా ఆయా పంచాయితీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుందనే విషయం ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జనన మరణ రికార్డులు, ఎసెస్‌మెంట్లు, డేటా నమోదు, పన్నుల వసూళ్లు వంటి ప్రతీ విషయంలోనూ ఏలూరు డివిజన్ చాలా వెనుకబడి వుందని, ఇదే పరిస్థితి కొనసాగితే సంబంధితాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డిపివో జి రాజ్యలక్ష్మి, డివిజనల్ పంచాయితీ అధికారులు, ఇవోపిఆర్‌డిలు, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
ఏప్రిల్ 30న విశ్వరూప
మహాసభ : మంద కృష్ణమాదిగ
ఏలూరు, ఫిబ్రవరి 12 : దళితులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎం ఆర్‌పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఎస్‌సిల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని, దీనిపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించినా ఏ పోలీసు స్టేషన్‌లోనూ ఆ ఫిర్యాదులను తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 30న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలోనే విశ్వరూప మహాసభను నిర్వహించనున్నట్లు మంద కృష్ణ చెప్పారు. స్థానిక జడ్పీ అతిధిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో వుండి చంద్రబాబు ఎస్‌సి కులంలో ఎవరైనా పెట్టాలని కోరుకుంటారా? అంటూ ఎస్‌సిల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానం చేయడం అభ్యంతరకరమన్నారు. వాస్తవానికి రాజ్యాంగంలో దళితులకు రక్షణగా వున్న అంశాలు ముఖ్యమంత్రికి వర్తించవా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణాలోనూ ఫిర్యాదులు చేసేందుకు పోలీసుస్టేషన్లకు వెళితే అక్కడ వాటిని నమోదు చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చట్టాలున్నాయా? అంటూ ధ్వజమెత్తారు. ఇంతకుముందు వై ఎస్ ఆర్ సిపి నేతలు భూమా నాగిరెడ్డి, రోజాలపై అట్రాసిటీ కేసులు పెట్టారని, మరికొంతమంది ఎమ్మెల్యేలపై కూడా ఈ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేస్తే ఎందుకు కేసులు నమోదు కావడం లేదని ప్రశ్నించారు. అదే విధంగా కాపునాడు నాయకులు ముద్రగడ పద్మనాభం తన ఉద్యమానికి ఎస్‌సి నాయకులు కూడా మద్దతు పలుకుతున్నారని బహిరంగంగానే చెప్పారని, అలాంటి నాయకులు ఇప్పుడు ఎస్‌సిలను ఉద్దేశించి స్వయంగా ముఖ్యమంత్రే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఖండించలేకపోయారని ప్రశ్నించారు. కాగా ఏప్రిల్ 30న దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పది లక్షల మందితో విశ్వరూప మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభను ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలోనే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎం ఆర్‌పి ఎస్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, పలివెల చంటి, శెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.
రెండోరోజూ కొనసాగిన దస్తావేజు లేఖర్ల నిరసన
*రూ.కోట్లలో ప్రభుత్వానికి నష్టం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 12: జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్ల ఆందోళన రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఆయా కార్యాలయాల ప్రాంగణంలో ఉన్న చెట్లవద్ద దుకాణాలను మూసివేసి పెన్‌డౌన్ చేశారు. జిల్లా అంతటా కూడా దస్తావేజు లేఖర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఆయా కార్యాలయాల వద్ద తమదైన శైలిలో నిరసన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలను మీ-సేవకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ అప్పటి నుండి కూడా దస్తావేజు లేఖర్లు ఏదో ఒక ప్రాంతంలో నిరసన తెలియజేస్తూ వచ్చారు. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రైవేటీకీకరణకు నిరసనగా లేఖర్లు, స్టాంపువెండర్లు రెండురోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. రెండవ రోజు కూడా ఈ బంద్ కొనసాగడంతో కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. రెండురోజులుగా లేఖర్లు పెన్‌డౌన్ చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో నష్టం వాటిల్లిందనేది అధికారుల అంచనా.
‘పట్టిసం’ను పరిశీలించిన కర్నాటక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ
పోలవరం, ఫిబ్రవరి 12: కర్ణాటక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కపిల్ మోహన్ శుక్రవారం పట్టిసం ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఉదయం 11గంటలకు వచ్చిన ఆయన కాంట్రాక్టు ఏజన్సీ క్యాంపు కార్యాలయంలోని మ్యాఫ్‌ను పరిశీలించారు. హెడ్ వర్క్స్ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని అంతా కలియతిరుగుతూ ప్రతి పనినీ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. కపిల్ మోహన్ అధికారికంగా పర్యటించలేదని, పట్టిసం ఎత్తిపోతల నిర్మాణం అత్యంత వేగంగా పూర్తికావడం, కృష్ణా- గోదావరి నదుల అనుసంధానం అనే ప్రచారం కావడంతో సెలవుపై హైదరాబాద్‌లో ఉన్న ఆయన పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని చూడాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్టు తెలిసింది. ఈయన వెంట మెగా కాంట్రాక్టు ఏజన్సీ సిజిఎం రంగరాజు, డిఇ కె శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి
రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 12: సమాజంలో మహిళలు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. మహిళలు చట్టాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రప్రథమంగా భీమవరం కెజిఆర్‌ఎల్ కళాశాలలో స్ర్తిల సమస్యల కోసం నిర్భయ హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు. ఈ హెల్ప్‌లైన్‌ను ఎంపి సీతారామలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. కళాశాల అధ్యక్షులు, మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపి సీతారామలక్ష్మి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. స్ర్తిల సమస్యలు తెలుసుకుని వారికి సలహాలు, సూచనలు ఈ హెల్ప్‌లైను ద్వారా అందిస్తారన్నారు. కళాశాలలో నిర్భయ హెల్ప్‌లైను ఏర్పాటుచేయడం పట్ల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మెంటే రామ్ మనోహర్, జాయింట్ సెక్రటరీ మెంటే సోమేశ్వరరావు, ఆరేటి రామకృష్ణ, పిజి కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ మెంటే లక్ష్మణరావులు మాట్లాడారు. ఈ హెల్ప్‌లైనుకు సంబంధించిన విధి విధానాలు, కార్యనిర్వాహణ తదితర వాటి గురించి కళాశాల ప్రిన్సిపాల్, హెల్ప్‌లైను వ్యవస్థాపకులరాలు మెంటే రాణీరత్నకుమారి వివరించారు. అనంతరం నిర్భయ హెల్ప్‌లైను పోస్టర్లను ఎంపి తోట సీతారామలక్ష్మి, అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు ఆవిష్కరించారు. ఫార్మశీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్వేది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
నరసాపురం సబ్ కల్టెర్ దినేష్‌కుమార్
నరసాపురం, ఫిబ్రవరి 12: అంతర్వేది ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తిచేసినట్టు నరసాపురం సబ్ కల్టెర్ దినేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల పర్యవేక్షణలో యాత్రికులకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దూర ప్రాంతాల నుండి తరలి వచ్చే యాత్రికులను గోదావరి నది దాటించేందుకు రెండు పంట్లును సిద్ధం చేశామన్నారు. పడవలు, లాంచీలపై ప్రయాణించవద్దని సూచించారు. ఒక్కో పంటుపై 140 మంది ప్రయాణించవచ్చునని తెలిపారు. రోజుకు 35 వేల మంది భక్తులు తరలివస్తారని అంచనావేసి అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశామన్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్, గోదావరి నది వద్ద పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్తు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మండలంలోని బియ్యపుతిప్ప రేవు నుండి రాకపోకలను నిషేధించామన్నారు. ఉత్సవాలలో ముఖ్యంగా 17న స్వామివారి కల్యాణం, 18న రథోత్సవం, 21, 22 తేదీలలో పూర్ణమి సందర్భంగా భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు. గోదావరి పంటు వద్ద నిరంతర పర్యవేక్షణకు స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 8 మంది గజ ఈతగాళ్లు, 8 లైఫ్ జాకెట్లును సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే భీమవరం నుండి 60, నరసాపురం, పాలకొల్లు నుండి అంతర్వేది వరకు 45 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీలు ఏర్పాటు చేశామన్నారు. ఒక సిఐ, ముగ్గురు ఎస్సైలు, 10 మంది ఎఎస్సైలు, 45 మంది పోలీసు కానిస్టేబుల్స్, ఆరుగురు మహిళా పోలీసుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు 08814-274944 ఫోను నెంబరుతో 24 గంటలూ పనిచేసే కంట్రోలు రూమ్ ఏర్పాటు చేసినట్టు సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సమావేశంలో ఎంపిడిఒ కన్నమనాయుడు, డిటి సుందరరాజాలు పాల్గొన్నారు.

మహిళపై కత్తితో దాడి
మహిళకు తీవ్రగాయాలు: నిందితుడుని పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు
వీరవాసరం, ఫిబ్రవరి 12: వీరవాసరం శివాలయం వీధిలో శుక్రవారం సాయంత్రం ఒక మహిళ పై కత్తితో దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో గ్రామస్తులు నివ్వెరపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శివాలయంలో వీధిలో నివసిస్తున్న కాటం అన్నపూర్ణ ఇంటికి ఇల్లు అద్దెకు కావాలంటూ ఒక యువకుడు వచ్చాడు. అన్నపూర్ణ తన భర్త సత్యకృష్ణ వెంగళరావు ఫోన్ చేసి చెప్పడంతో వెంగళరావు ఇంటికి వచ్చి ఆ యువకుడితో మాట్లాడారు. వెంటనే ఆ యువకుడు ఎటిఎంకి వెళ్ళి వస్తానని వెళ్ళిపోయాడు. అయితే వెంగళరావుతన షాపుకు వెళ్ళిపోవడం జరిగింది. మరల కాసేపటికి ఆ యువకుడు ఇంట్లోకి వచ్చి అన్నపూర్ణ మెడలో ఉన్న వస్తువులు దొంగలించడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో యువకుడు బ్యాగ్‌లోంచి వైద్యులు ఉపయోగించే బ్లేడుతో ఆమె పై దాడి చేశారు. అన్నపూర్ణ కుటుంబ సభ్యులు పెంచుకుంటున్న శునకం ఆరవడం ప్రారంభించడంతో పక్క ఉన్న మహిళలు బయటకు వచ్చారు. ఈలోపు యువకుడు పారిపోయాడు. గాయాలపాలైన అన్నపూర్ణ ఇంట్లోంచి రోడ్డు పైకి వచ్చి రక్తపుమడుగుల్లో పడిపోయింది. వెంటనే స్ధానికులు సపర్యలు చేసి, పారిపోయిన దొంగ గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు. వెంటనే స్ధానిక యువకులు గ్రామాన్ని చుట్టుముట్టారు. దొంగతనం జరిగిన ఇంటికి సమీపంలోని ఒక తోటలో ఆ యువకుడు దాకున్నాడు. స్ధానికులు ఆ యువకుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. గాయపడిన అన్నపూర్ణను భీమవరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు అప్పగించిన దొంగ బ్యాగ్‌ను పోలీసులు తనిఖీ చేయగా అందులో యువకుడి పేరు పోలోజు నవదీప్‌కుమార్‌గా గుర్తించారు. అతని బ్యాగ్‌లో నల్లగొండ జిల్లా చౌట ఉప్పల్ మండల్ మల్కాపూర్ గ్రామంలోని అశోకస్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కటెక్చర్ కళాశాల పేరు మీద ఉన్న హాల్ టిక్కెట్టు, యువకుడి ఆధార్‌కార్డులు లభించాయి. అయితే ఈ యువకుడు గతంలో వీరవాసరం పాలిటెక్నిక్ కళాశాలలో చదివి మధ్యలో వెళ్ళిపోయినట్లుగా కళాశాల విద్యార్ధులు చెబుతున్నారు. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గ్రామంలో పాకడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నెలరోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్న ఇంటి పక్కనే రెండు ఇళ్ళల్లో వరుస చోరీలు జరిగాయి. చోరీలకు పాల్పడిన వ్యక్తులు ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ యువకుడు ఇక్కడకు రావడం, తన బ్యాగ్‌లో దాడి చేయడానికి ఉపయోగించే బ్లేడును చూస్తే దొంగతనాల్లో ఆరితేరినట్లు కనిపిస్తుంది. ఆ యువకుడు నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భర్త వెంగళరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరవాసరం ఎస్సై శ్యామ్‌సుందర్ కేసు నమోదు చేశారు.