సాహితి

ఆంధ్ర భాషా నిలయ అర్చక శేఖరుడు జీవిత చరిత్రల రచనాధిషణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదిరాజు లక్ష్మీనరసింహారావు
(కనువెలుగు: 7-11-1928 : కనుమరుగు: 12-2-2016)

ఆయన దేవాలయ అర్చకుడు కాదు, పొత్తపుగుడి అర్చకుడు. ఆ పొత్తపుగుడి మామూలుది కాదు, తెలుగు నేల తెలంగాణలో, అందునా హైదరాబాదులో తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణా సమరశీల కార్యక్రమాలతో చరిత్ర పరీమళించి పవిత్రమైన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. ఈ గ్రంథాలయ అర్చక శేఖరుడే మాదిరాజు లక్ష్మీనరసింహారావు.
శతాబ్ద్ధాకవర్ష చరిత్ర గల గ్రంథాలయం... అర్ధ శతాబ్దకాలం జీతనాతాలు అడగని నిత్య అర్చకత్వం, పూవులతో కాదు, అంకితభావ నిస్వార్థ కార్యక్రమాలతో ఆ అపురూత సాహితీ నిధి సరస్వతిని ఆరాధించారు. పంచ ప్రాణాలూ ఆ గ్రంథాలయమే అన్నట్టు ఆమె పంచనే గడిపారు. ప్రాచీనాధునిక పుస్తక సేకరణ, వాటి రక్షణ, జ్ఞాన విభాగాల్ని పాఠక పరిశోధక జనాలకు పంపిణీ, సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణ, కలుపుగోరు తనంతో కార్యకర్తల సమీకరణ వంటి అంశాలలో ఆయనది ఒక ప్రత్యేక సేవా శైలి. యాభై ఏళ్ళ పాటు కార్యదర్శి పదవిలో ఆయన కొనసాగడం, సహ సేవావ్రతులు కొనసాగింపజేయడం ఆషామాషీ అంశం కాదు. నా బొందో అని నడుం కట్టుకుని వైయక్తికాంశాల్ని పక్కనపెట్టి సేవలు చేయడమే ఏకైక కారణం. ఆయన చేపట్టిన కార్యదర్శి స్థానంలో అంతకుమునుపు రాష్టవ్య్రాప్త కీర్తిమూర్తులయిన రావిచెట్టు రంగారావు, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజు రామరాజు వంటివారు సేవ చేశారు. వారి స్ఫూర్తిని పొంది తరువాత తరం వారు తన స్ఫూర్తినీ పొందే విధంగా ఆటుపోటులెదురైనా గ్రంథాలయ సేవలు నిర్వహించారు మాదిరాజువారు.
1975లో 25వ స్థాపన దినోత్సవం నాడు తమ ఉపన్యాసంలో మహాకవి డా. దాశరథి మాట్లాడుతూ ‘‘74 సంవత్సరాలు నిండిన ఈ మహా సంస్థకు నాకు అత్యంత సన్నిహిత ఆప్తుడు, ఉత్సాహవంతుడు, శాంత స్వభావుడు, మా ఖమ్మంవాడు ఎం.ఎల్.నరసింహారావు హయాంలో ఈ సంస్థ స్వయం పోషకమైంది. సాహిత్య, సాంస్కృతిక కళా సంబంధమైన కార్యక్రమాలకూ చక్కని కేంద్రమైంది. అతని కార్యదీక్షకు నా అభినందనలు’’ అనడం ఎదమెచ్చులు, నలుగురూ అంగీకరించేవే. రావినూతల శ్రీరాములు ‘‘్భషా నిలయంలో తాదాత్మ్యం చెంది పనిచేస్తున్న ఎం.ఎల్. బహుదా ప్రశంసనీయులు’’ అని అన్నారు.
కవి జె.బాపురెడ్డి ‘‘అభినందింతు త్రిదశకము / సభల నుపన్యాసములను సత్కార్యములన్ / శుభముగ జరిపిన సేవా / నభచంద్రుని మాదిరాజు నరసింహాఖ్యున్’’ అని ఓమారు ఓ సందర్భ ప్రశంస చేశారు. దశాబ్దాల సేవల వెలుగులిచ్చిన చంద్రుడాయన.
కార్యదర్శి అనేది మన దృష్టిలో... కార్యకర్తననేదీ ఆయన దృష్టిలో. అందరికీ చెందిన ఆంధ్రోద్యమాన్ని గురించి ప్రసకిజ్త చేస్తూ వావిలాల గోపాలకృష్ణయ్య ‘‘శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయమంటే ఆంధ్రోద్యమానికి పచ్చి బాలెంతరాలు’’ అని అభివర్ణించారు. ఉద్యమాలకే కన్నతల్లి అయిన ఆంధ్ర భాషా నిలయానికి మాదిరాజు వివిధ సేవలు ఉద్యమ భాగస్వామ్య కిరణాలే! విప్లవాలకు సంస్కరణలకూ గుమ్మం అనదగ్గ ఖమ్మం జిల్లాలో పండితాపురంలో పుట్టి అక్కడి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఖమ్మంలో ఉన్నత విద్యాభ్యాసాన్ని హైదరాబాదులో కళాశాల విద్యాభ్యాసాన్ని సాగించారు.
నిజాం దుష్ట పాలనకు వ్యతిరేకంగా విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర భావాలతో కార్యకలాపాలకు ఇష్టం చూపారు. స్వాతంత్య్రయోధుడుగా తామ్రపత్ర గ్రహీత అయ్యారు. ఒకవైపు గాంధేయవాదంపై మొగ్గు. ఒకవైపు గ్రంథపఠనం, మరొకవైపు పత్రికా వ్యాస రచనలు. ఎం.ఏ డిగ్రీ పొందాక ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకునిగా తెలుగు సాహిత్యపు రుచుల్ని విద్యార్థులకు పంచేవారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు, అక్కిరాజు రమాపతిరావు వంటి వారితో తెలుగు అకాడమీలో మాదిరాజు పరిశోధక అధికారిగా పనిచేశారు. విద్యార్థి సంఘ నాయకునిగా ఆం.ప్ర. స్వాతంత్య్ర సమర సంఘ సాధారణ కార్యదర్శిగా, తెలంగాణా స్వాతంత్య్ర సమర యోధుల సంఘం కోశాధికారిగా, ఉస్మానియా విద్యాలయం సెనేట్ మెంబరుగా, దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలకు సలహా సంఘ సభ్యునిగా, హైదరాబాదు ఫిలిం సెన్సారు బోర్డు సంఘం సభ్యునిగా, ఆయన తన సేవల్ని సమాజపరం చేశారు. తెలుగుకే కాదు, ఉర్దూకూ యధోచిత సేవ చేశారు. ఆయన ఉర్దూ అకాడమీ వారి తెలుగు - ఉర్దూ నిఘంటు పథక సంఘం సభ్యునిగా కొన్నాళ్లున్నారు. గాంధేయ సిద్ధాంతాలిష్టమైన ఈ స్వాతంత్య్ర యోధుడు హైదరాబాదు గాంధీభవన్ వారి గాంధీ శాంతి సంస్థకూ సేవ చేశారు. గాంధీభవన గ్రంథాలయానికి గౌరవ కార్యదర్శిగా చేశారు. కొందరు ప్రముఖుల పేర్లతోనున్న ట్రస్టులెన్నిటికో ఉత్తమ సేవల్ని అందించారు. సాహిత్య సాంస్కృతిక అంశాలపై ఆకాశవాణి కేంద్రాలద్వారా, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ఉపన్యాసాలిచ్చారు. ఎన్నో సంస్థల్లో చురుకైన కార్యకర్త అయి మెరుగైన సేవలందించిన సాంఘిక సేవకుడు ఎం.ఎల్.ను సమాజం గౌరవ పురస్కారాలతో అభినందించింది. 1984లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జీవిత చరిత్రలకు ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని ప్రదానం చేసింది. గ్రంథాలయోద్యమంలో వీరి సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అయ్యంకి వెంకట రమణయ్య పురస్కారాన్ని ఇచ్చింది. భోపాల్‌కు చెందిన అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం ‘సాహిత్యశ్రీ’ అనే జాతీయ బిరుదును ఇచ్చి గౌరవించింది. ప్రముఖ వ్యక్తిగా ఖమ్మం ప్రజల్లో ప్రజా పరిషత్ గౌరవించింది. 2002లో పూజ్య సద్గురు కె.శివానందమూర్తిచే సత్కరింపబడ్డారు. ముఖ్యంగా ఎం.ఎల్ గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టా కట్టబెట్టడం ఆనందకర అంశం.
జీవిత చరిత్రల రచయితగా...
తెలంగాణ ముద్దుబిడ్డడై ఖ్యాతిగాంచిన ఎం.ఎల్. తెలంగాణ సంబంధ గ్రంథాలు వ్రాసి మాతృరుణ విముక్తులయ్యారు. ‘తెలంగాణ వైతాళికులు’, ‘హైదరాబాద్ స్వాతంత్య్ర ఉద్యమం - తెలంగాణ’, ‘శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం చరిత్ర’, ‘తెలంగాణ ప్రముఖులు’ వంటి వీరి గ్రంథాలు మరుగున పడిన ఎన్నో చారిత్రక అంశాలను, ప్రముఖ సేవాదురంధరుల లోతు బతుకుల్ని తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి. జీవిత చరిత్రల రచయితల్లో పదికాలాల పాటు గుర్తుంచుకోదగ్గ ధిషణుడైన రచయిత మాదిరాజు వారనడానికి ఆయన రాసిన వినోబా జీవితం - ఉద్యమం, లోకనాయక్ జయప్రకాశ్, మొరార్జీ దేశాయి, స్వామి దయానంద తీర్థ, ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు, ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, రాజీవ్‌గాంధీ, సుభాష్‌చంద్ర బోసు, మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమర సేనానులు, బూర్గుల రామకృషాణరావు, జమలాపురం కేశవరావు వంటివి అక్షర సాక్ష్యాలై నిలుస్తున్నాయి.
ఆయనకి కవిత్వం కూడా ఒక ఇష్టమైన అంశం. గాంధీ మహాత్ముని స్తుతిస్తూ రాసిన కైతల్ని ‘కావ్యాంజలి’గా ఇవ్వడం వారి సేకరణ ధిషణత్వానికి దర్పణం. సత్యాగ్రహ శాస్త్రం, గాంధీ కథ అనే అనువాదాల ద్వారా ఆయన అనువాద రచయితల్లోనూ పేర్కొనబడిన వారయ్యారు. 35 పుస్తకాలను ఆయన రాశారు. అందులో ఎక్కువ భాగం జీవిత చరిత్రలే కావడం విశేషం. ఆఫ్రికా, అమెరికా చరిత్రల రచయిత కార్టర్ జి.వుడ్‌సన్ ‘ఆయా రంగాల్లో సుశిక్షిత నిపుణులైన పూర్వుల చరిత్రలు జీవిత చరిత్రలు పోగొట్టుకుంటే వాటి ఉత్తేజానే్న పోగొట్టుకొనడం అవుతుంది’ అన్నాడు. అటువంటి ఉత్తేజ దారిద్య్రం కలగకుండా వుండాలంటే మాదిరాజు రాసిన జీవిత చరిత్రలు చదివి తీరాలి. అందులోని స్ఫూర్తినిచ్చే అక్షర భావాలు మన హృదయాల్ని తాకడంలో ఆ కీర్తిశేషుడు జీవించినట్లే వుంటుంది.
శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో స్ఫూర్తిమూర్తుల చిత్రాలెన్నో వున్నాయి. ఇప్పుడందులో చేరవలసిన చిత్రం మాదిరాజు వారిదయిందంటే అది కాల చిత్రమే. యాభై ఏళ్ళు తనకు సేవ చేస్తూ తన శారదా వరణంలో నడయాడిన తన పుత్రరత్నం మాయమైన సందర్భాన కన్నీళ్ళు పెట్టుకున్న శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం చదువుల తల్లిని ఓదార్చగల వారెవ్వరు?
ఆ ఆంధ్ర భాషా నిలయ అర్చక శేఖరుణ్ణి, జీవిత చరిత్రల రచనాధిషణుణ్ణి ఆ తల్లి రూపురేఖల్లోనే దర్శించుకుందాం మరి!

- సన్నిధానం నరసింహశర్మ, 9292055531