లోకాభిరామం

రెండు సినిమాలు - రెండు రైళ్లు (లోకాభిరామమ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్న నేర్పించిన అలవాట్లలో తాంబూలం కొనసాగడం లేదు. పుస్తకాలు చదవడం ఈ జన్మానికి వదలదు. సినిమాలు చూడడం మానేశాను. కానీ, అప్పుడప్పుడు కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. అంటే పాతవి అని చెప్పనవసరం లేదు. వాటిని చూడకుంటే నిద్ర పట్టదు. అట్లా ఈ మధ్య రెండు సినిమాలు మళ్లీ చూచాను. (్ఛదస్తమా? చూశాను అనాలా?) సినిమాలను మళ్లా, మళ్లీ, మరోసారి చూడడం కూడా ఛాదస్తమే. కానీ, చదివిన పుస్తకాన్ని మళ్లీ చదవడం, పాత సినిమాను మరోసారి చూడడంలో ఒక ఆనందం ఉంది. అవి ఈసారి మరోలాగ, మాదిరి, వలె కనపడతాయి. నిజం చెప్పక తప్పదు. ఈ సినిమాలు, ఈసారి కూడా నాకు అర్థం కాలేదు. అయినా చాలా బాగున్నాయి.
ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తలనొప్పికి తన దగ్గర మంచి ఉపశమనం ఉంది, అంటాడు, ఆ తలను నరికితే సరి, అని నెమ్మదిగా చెపుతాడు. అది ఆ మనిషి ఆలోచనల గురించి చెప్పడానికి మాత్రమే ఉటంకించిన, అనగా ఎత్తి చూపిన సంగతి. ఆయన సినిమాలలో సైకో, డయల్ ఎమ్ ఫర్ మర్డర్ లాంటివి చాలా పేరు పొందినవి. కానీ నా దృష్టిలో అతను 1938లో తీసిన ‘లేడీ వ్యానిషెస్’ అనే బొమ్మ నిజంగా ఒక మాస్టర్ పీస్.
అది మంచు ప్రాంతంలోని మారుమూల దేశం. అక్కడి నుంచికి రైలు బయలుదేరాలి. కానీ ఆలస్యమవుతుంది. ఆలోగా అందరూ ఒక హోటేల్‌లో ఉంటారు. అక్కడ చేరిన రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు, మాటల తీరు మొదలయిన వాటిని చూస్తుంటే, అది ఒక ట్రెయినింగ్ సెషన్ వలె కనబడుతుంది. అక్కడ అంత మంది పాత్రల మధ్యన ఒక పెద్దావిడ ఉంటుంది. రైలు బయలుదేరేలోగా ఆమె మీద రెండు హత్యా ప్రయత్నాలు జరుగుతాయి (యా?) మనకు అంతు పట్టదు.
సినిమా, అందునా ఒక మిస్టరీ తీయడంలో హిచ్‌కాక్ చూపిన పరిణత నైపుణ్యం మనలను ముగ్ధులను చేస్తుంది. జరిగిన ప్రతి చిన్న పెద్ద సంఘటన, ప్రతి డైలాగు కథతో గట్టిగా ముడిపడి ఉంటాయి. పెద్దావిడ మీద పడవలసిన ఇటుకరాయి, ఒక అందమయిన అమ్మాయి తల మీద పడుతుంది. పెద్దావిడ, ఆ అమ్మాయికి తోడుగా ఉంటానంటుంది. వాళ్లు కలిసి టీ తాగుతారు. అక్కడ ఒక టీ బ్రాండు గురించిన ప్రసక్తి వస్తుంది. ముసలావిడ తన పేరు చెపుతుంది. చప్పుడు కారణంగా వినిపించడం లేదని, కిటికీ అద్దం మీద వేలితో రాస్తుంది. ఇద్దరూ వచ్చి తమ తమ సీట్లలో కూచుంటారు. కొంతసేపటికి చూస్తే పెద్దావిడ కనిపించదు. అమ్మాయి ఆమెను గురించి పెద్ద గోల చేస్తుంది. అసలు అటువంటి మనిషి రైల్లో రానే లేదంటారు అందరూ. ఆడ, మగ, రకరకాల వాళ్లు, వాళ్ల ప్రవర్తన, కథను రానురాను ఆసక్తికరంగా మారుస్తాయి. ఒక మెదడు డాక్టరు ఉంటాడు. అతడిని మొదటిసారి చూడగానే ఎందుకో నాకు అనుమానం తోచింది.
కథ వివరాలు మరీ చెపితే బాగుండదు. ఆసక్తిగల వాళ్లు యూ ట్యూబ్‌లో ఈ బొమ్మను చూడవచ్చు. అయితే ఇంగ్లీషు వర్షన్ వెతికి పట్టుకోండి. కదిలే రైలు ఇఫెక్టు కోసం వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లను 1938లో చూపించిన తీరు చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని లోపాలున్నాయి. చూచేవాళ్లు వాటిని గుర్తించే ప్రయత్నం చేయండి. మరింత సరదాగా ఉంటుంది. అద్దం మీద రాసిన నాలుగు అక్షరాలు తరువాత కనిపిస్తాయి. రైలు ఒక సొరంగంలో పోయినందు ఆ అక్షరాలు కనిపించకుండా పోతాయి. అద్భుతం అనిపిస్తుంది. ‘ఎడ్జ్ ఆప్ సీట్’ అని సినిమా గురించి ఒక అనుభవం గురించి చెపుతారు. అంటూ, కొన్ని బొమ్మలను, తాపీగా సీట్లో చేరగిలబడి, పాప్‌కార్న్ నములుతూ చూడడం కుదరదు!
ఈ సినిమాలో హీరోయిన్ అనవలసిన అమ్మాయి, పెళ్లి చేసుకోవడానికి పోతున్నాను అంటుంది. కానీ, సినిమా చివరికి ఆమె, హీరోతో ప్రేమలో పడుతుంది. సినిమా మొత్తంలో ఈ సంగతి మనకు అర్థంకాదు. హిచ్‌కాక్ ఈ సంగతిని చూపించిన చిన్న ‘చమక్కు’కు హ్యాట్సాఫ్! తరువాతి వివరాలను ఎక్కడ చూచి ఆనందిస్తారో మీ యిష్టం!
ఇక రెండవ రైల్ సినిమా కూడా అపరాధ పరిశోధన పద్ధతిలోనే నడుస్తుంది. ఇది అసమాన రచయిత్రి అగాథా క్రిస్టీ రచన. ఇందులో హెర్క్యూల్ పోయ్‌రో అనే డిటెక్టివ్ ఉంటాడు. ఆయనకు అర్జెంట్‌గా లండన్ వెళ్లవలసి వస్తుంది. కానీ రైల్లో టికెట్ దొరకదు. కానీ రైలు కంపెనీ యజమాని సాయంతో ఆయన రైలు ఎక్కుతాడు. ఇక్కడ సినిమా మొత్తంగా, రైల్లోనే సాగుతుంది. మొదట్లో నేల మీద జరిగినట్లు చూపించిన కొన్ని షాట్‌లు నాకు అర్థంకానే కాలేదు.
ఇంతకూ చిత్రం పేరు చెప్పనే లేదు గదూ? ‘మర్డర్ ఆన్ ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్’ అనే ఈ సినిమాలో మరి మర్డర్ జరగాలి కదా! జరుగుతుంది. ఇక్కడ రైల్లో మొత్తం పనె్నండు మంది ప్రయాణికులు మాత్రమే ఉంటారు. నమ్మగలరా? ఆ రైల్లో నాలుగే పెట్టెలు. అందులో ఒకటి వంటకు, మరొకటి భోజనాలకు! అదీ ఆ రైలు ప్రత్యేకత. ఇంతకూ, మరీ కురిసిన మంచు కారణంగా రైలు ఎక్కడో దిక్కుమాలిన చోట చిక్కుకుపోతుంది. అక్కడ డ్రామా మొదలవుతుంది. మర్డర్ జరుగుతుంది. ధనవంతుడిని అని చెప్పుకునే ఒక వ్యక్తి పనె్నండు కత్తిపోట్లకు గురవుతాడు. అతను, అంటే హతుడు, తాను చెప్పుకున్న పేరుగల మనిషి కాదని, ఒకప్పుడు పెద్ద ఘాతుకం చేసిన నేరస్థుడు అని డిటెక్టివ్ బయటపెడతాడు. రైల్లోని ప్రతి ఒక్కరూ, నేను కాదంటే నేను కాదంటారు. కానీ, ఆ మనిషిని అవకాశం వస్తే నేనే చంపి ఉండాలి, అంటారు. సినిమా కొంచెం, అదుపు తప్పిందేమో అనిపిస్తుంది. రైల్లో ఎక్కిన అందరికీ, గతంలో జరిగిన ఒక ఘోరంతో ఏదో ఒక రకంగా సంబంధం ఉంది, అంటే కొంచెం, అతిగా అనిపిస్తుంది. కానీ హత్య కొరకు, అది ఒక పథకంగా జరిగిందేమో అని కూడా అనిపిస్తుంది.
హెర్క్యూల్ పోయ్‌రో అనే డిటెక్టివ్ పాత్ర చాలా చిత్రమయినది. ఆయన పరిశోధనలు, టీవీ సీరియల్స్‌గా ప్రపంచమంతటా ప్రజాదరణ పొందాయి. వాటికి ఆధారమయిన కథలను తెలుగులో అందించే ప్రయత్నంలో ఉన్నానంటే, భవదీయునికి ఆ రచనల పట్లగల ఆసక్తిని మీరు అర్థం చేసుకోవచ్చు. షెర్లక్ హోమ్స్ రచనలు త్వరలోనే తెలుగులో మీ ముందుకు రానున్నాయి. ఈ రెండు పాత్రలు అన్ని రకాలుగా రెండు ఎదురుబదులు ధృవాలు. వారి తీరును చదివి, చూచి అనుభవించవలసినదే, ఇది వరకే వాళ్లిద్దరినీ టీవీలోనయినా చూచిన వారు నా మాటను ఒప్పుకుంటారు. అరవయి పైబడిన పాయ్‌రో పాత్రలో డేవిడ్ సుబెట్ అనే నటుడు నటించడు. జీవిస్తాడు. జేమ్స్‌బాండ్ దారిలో షెర్లక్ హోమ్స్ పాత్రలో చాలామంది నటించారు. జెరెమీ బ్రెట్ మాత్రం ఆ పాత్ర కొరకే పుట్టినట్టు ఉంటాడు.
చిత్రంగా ఈ ఎపిసోడ్స్, చిత్రాలు నెట్‌లో దొరుకుతున్నాయి. ఆసక్తి గలవాళ్లు చూచి ఆనందించవచ్చు. నేను అదే పని చేస్తున్నాను గనుక ఈ మాట. అంతకన్నా మరేమీ లేదు!
chitram...
‘లేడీ వ్యానిషెస్’ లోని ఓ దృశ్యం

కె.బి. గోపాలం