లోకాభిరామం

ఇల్లు కట్టి చూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఒక మాట ఉండేది. నిజంగానే ఆ మాట ఇప్పుడు ఎవరూ అనడం లేదు. ఎవరి ఇల్లు వాళ్లే నిలబడి కట్టించుకునే కాలం ఒకటి ఉండేది. ఇప్పుడు పల్లెల్లో కూడా గుత్తేదార్లు అనే కాంట్రాక్టర్లు వచ్చి ఇల్లు కట్టి పెడతారు. లేదా వాళ్లే ముందు ఇల్లు కట్టి వాటిని అమ్ముతారు. ఒకప్పుడు ఈ సౌకర్యం లేదు. ఒకప్పుడు అసలు పద్ధతులే వేరు.
పల్లెలో ఎక్కువగా ఉండేవి గుడిసెలే. వాటి గోడలు కూడా కర్రలతో తయారయ్యేవని చెపితే ఇప్పుడు బహుశా చాలామందికి అర్థంకాదు. అలువ తొక్కిన గోడలు అన్న మాట నా కారణంగా కాగితం మీదకు రావల్సిందే తప్ప బహుశ ఏ పుస్తకంలోను ఈ పద్ధతి గురించి రాసి ఉండరు. గుడిసె అంటే ముందు నలు చదరంగా ఉండే ఇల్లు కళ్లలో మెదలుతుంది. ఆ ఇంటికి మధ్యలో రెండు లేదా మూడు నిట్రాళ్లు అనే స్తంభాలు ఉంటాయి. వాటి మీద నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు వాసాలు ఉంటాయి. ఆ వాసం మీద నుంచి నాలుగు గోడల మీదకు సన్నని వాసాలుంటాయి. ఇక పైకప్పు, గడ్డిగాదం మొదలయిన వంటి పదార్థాలతో చిక్కగా తయారవుతుంది. ఆ మీద నుంచి అడ్డంగా కర్రలు పరచి పైనుండే కర్ర నుంచి కప్పు లోపలి అంచున ఉన్న కర్రకు నారతో కట్లు కట్టడం ఒక పద్ధతి. ఈ రకంగా కట్టిన చూరు అనే పైకప్పు గాలికి కదిలిపోకుండా ఉంటుంది. కప్పిన నైపుణ్యాన్నిబట్టి ఆ కప్పు మీద పడిన నీరు క్షణాల్లో జారుకుంటూ వచ్చి అంచుల వెంట కిందకు కారిపోతుంది. చూరెక్కి జారతాది చిటుక్కు చిటుక్కు వాన చినుకు అని జాలాదిగారు పాడారంటే ఆయన అసలయిన పల్లెటూరి మనిషి అని అర్థం. వచ్చినవాడు ఒక పట్టాన వదలకుండా వెళ్లిపోకుండా పెంకి పట్టుపడితే, చూరు పట్టుకుని వేలాడుతున్నాడు అనేవారు. అంటే ఇంటి పైకప్పు అంచును చేతికి పుచ్చుకుని కదలకుండా ఉన్నాడని అర్థం.
ఇంతకూ అలువ గోడ ఏమయింది? ఎక్కడికీ పోలేదు. గోడలేకుండా పై కప్పు నిలబడలేదు. ఈ గోడలో ఆ కాలం పద్ధతిలో రాళ్లు ఉండవు. తరువాతి కాలం పద్ధతిలో ఇటుకలు అంతకన్నా ఉండవు. ప్రకృతి తల్లి పంచిపెట్టే చిన్నాచితక చెట్ల నుంచి రకరకాల కర్రలు ఈ గోడ కొరకు ఏ ఖర్చు లేకుండానే అందుతాయి. ఇల్లు కట్టుకునే పరిధి మేరకు కొంచెం మట్టి చేర్చి మిట్టగా తయారుచేసి ఉంచుకుంటారు. గోడ ఉండవలసిన చోట సున్నం పోసి గీత గీసుకుంటారు. ఆ గీత వెంట వరసగా సన్నటి రాటలు అంటే కర్రలు అంటే స్తంభాల వంటివి పాతుతారు. వాటి మధ్యన మరీ ఎక్కువ ఖాళీ ఉండదు. ఒక మూర లేదా ఒకటిన్నర మూర దూరంలో ఈ కర్రలుంటాయి. ఇక అంతకన్నా పలచని కర్రలను ఈ కర్రల మధ్యన అల్లిబిల్లిగా అడుగు నుంచి అల్లుతూ పోతే గోడకు ఒక ఆధారం నిలబడుతుంది. శరీరంలోని అస్థిపంజరంలాగ ఈ అల్లిక గోడ ఉంటుంది. ఇక పాటి మన్ను తేవడం తరువాతి పని. ఊరి బయట ఎవరిదికానీ నేల నుంచి ఈ మట్టిని తెచ్చుకోవచ్చు. లేదంటే ఎవరో కలిగిన వారిని అడిగితే లేదనకుండా ఇస్తారు. ఆ మట్టిని నీళ్లతో కలిపి కాళ్లతో తొక్కి అసలు తయారుచేయాలి. అసలు అని ఒక పదార్థం ఉంటుంది అని నేను చెపితే ఇవాళ ముక్కున వేళ్లు వేసుకునేవారు ఉన్నారని నాకు తెలుసు. ఈ అసలు అనే జారుడు మట్టిని కర్రలతో అల్లిన గోడ మీద పద్ధతిగా పూయాలి. పద్ధతి అన్న మాటకు ఇక్కడ చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ సంగతులు ఎక్కడో పుస్తకంలో చదివి చెపుతున్నవి కావు. మా ఊళ్లో చాలమాంది ఇళ్లు ఇలాగే ఉండేవి. చివరికి మా అన్నగారు ఒకాయన లక్షణంగా ఇల్లు ఉండగా దానికి ఎదురుగా వంటింటిని మాత్రం అలువ పద్ధతిలో కట్టించుకున్నారు. ఆశ్చర్యం ఏమంటే ఆయనగారు రాత్రి ఆ వంటింట్లోనే పడుకునేవారు.
గుడిసె సిద్ధమయిన తరువాత అలుకు పూతలు ఉంటాయి. గుడిసె గోడలకు ఒకే రంగులో పూత అందం. గోడ కిందివేపు జాజు అనే ఎరుపు రంగుతో పట్టీలు వేయడం అంతకంటే అందం. దాని మీద తెల్లని ముగ్గులు తీర్చడం మరింత అందం. ఆ మధ్యన యశోదారెడ్డిగారి కథా సంకలనం విడుదలయిన సందర్భంగా సినారె గారు ఉపన్యాసంలో యశోదమ్మ పల్లెటూరి ఇంటిని వర్ణించిన తీరును ఉదాహరించారు. అసలయిన పాలమూరు యాసలో అలుకు పూతలను గురించి ఆమె రాసిన తీరును ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు గుడిసెలు లేవు. ఉన్నా సరే పాత పద్ధతిలో లేవు. బహుశా ప్లాస్టిక్ గోడలతో, ప్లాస్టిక్ తలుపులతో, పైన రేకులతో గుడిసెలు కడుతున్నారేమో!
ప్రకృతి సిద్ధమయిన పదార్థాలతో కట్టుకున్న ఆనాటి గుడిసెలో హాయిగా ఉండేది. ఎయిర్ కండిషనింగ్ లాంటి సుఖం ఉండేది. పుట్టిన పొగ పైకప్పులోనుంచి సులభంగా వెళ్లిపోయేది. మొత్తం మీద చాలా సౌకర్యంగా ఉండేది. ఈ కాలంలో పనులు సులభంగా జరుగుతున్నాయేమో గానీ వాటిలో సుఖం మాత్రం కరువయింది. ఇళ్లు మామూలుగా ఉన్నవాళ్లు కూడా ఆ ఇంట్లో కొంత భాగాన్ని పాత పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం ఇప్పటికీ కొనసాగుతున్న అలవాటు. ముఖ్యంగా పెద్ద ఇళ్లల్లో కూడా వంటిల్లు మాత్రం పెంకుటిల్లుగానే ఉండడం నాకు తెలుసు. నాన్న కట్టిన కొత్త ఇంట్లో వంటిల్లు ఇప్పటికీ అదే పద్ధతిలో ఉంది.
వంటిల్లు పూరిగుడిసె కానవసరం లేదు. గోడలు మంటితో లేదా ఇటుకలతో కట్టి పై కప్పును మాత్రం పెంకులతో ఏర్పాటు చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది. పెంకులు మళ్లీ రెండు రకాలు. మా వంటింటి మీద గూనపెంకులు ఉన్నాయని నా అనుమానం. ఇవి ఊళ్లోనే తయారవుతాయి. గొట్టాల్లాగా ఉంటాయి. ఆ గొట్టాన్ని నిలువుగా రెండు ముక్కలు చేస్తే రెండు దోనెలు మిగులుతాయి. ఒక వరుస దోనెలు కాలువగా పక్కపక్కనే ఉంటే రెండు కాలువలు అంచుల మీద మరో దోనెల వరుస బోర్లించినట్లు వస్తుంది. ఈ రకమయిన పెంకుటింట్లో చల్లదనానికి కొదువ ఉండదు. ఒక సమస్య అసలు ఉండదు. అయితే ఈ కప్పు మీద కాస్త బరువు పడితే పెంకులు విరుగుతాయి. కనుక వాటిని ఏటేటా తిరగబెట్టి, పగిలిన వాటిని మార్చవలసి ఉంటుంది.
నేను ఒకటికి నాలుగు ఇళ్లు కట్టడంలో తలమునకలయి చూచాను. కానీ పల్లెలో మా ఇంటిని కట్టినప్పుడు మాత్రం చదువు పేరున మరెక్కడో ఉన్నాను. కనుకనే నాకు వంక ఇంటిని కట్టిన వివరాలు అంతగా గుర్తులేవు. గూనపెంకులు పోతే ఇక బెంగుళూరు పెంకులు అనే వెడల్పాటి నలుచదరం రకం అంగట్లో కొని తేవాలి. వాటిని పేర్చడానికి మళ్లీ రకరకాల పద్ధతులున్నాయి. అన్నయ్య పాలమూరులో కట్టిన ఇంటి పైకప్పు పలాస్ర్తిలతో తయారయ్యింది. ఆ రకం పలాస్ర్తిలను వాసాల మీద అడ్డంగా ఏర్పరచిన చెక్కల మీద పరిచి ఆ పైన కొంత సిమెంటు కూడా పూసి అప్పుడు బెంగుళూరు పెంకులు వేయడం నాకు బాగా తెలుసు. కానీ ఆ కప్పు గుడిసె కప్పులాగ ఉండదు. అందులో నుంచి గాలి, పొగ బయటకు పోవడం ఉండదు. అందుకే నాన్న కొత్త ఇంట్లో కేవలం తడికెలు పరిచి దాని మీద పెంకులు వేయించినట్టున్నాడు.
పెంకుటిల్లు అని కథలు, నవలలు వచ్చినట్టు నాకెందుకో అనిపిస్తుంది. ఇది బీద పద్ధతి కాదు. అటు ధనవంతుల పద్ధతీ కాదు. నిజమయిన మధ్యతరహా పద్ధతి. కానీ పల్లెల్లో కూడా ఈ మధ్యన పెంకుటిళ్లు కనిపించడం లేదు. ఆశ్చర్యంగా ఇప్పుడు నేనుంటున్న అయిదంతస్తుల బిల్డింగ్ ముందు ఒక గొప్ప ధనవంతుని ఇంటి మీద పెంకులు కనిపిస్తాయి. అయితే అవి కేవలం అలంకారం కోసం ఏర్పాటు చేసినవి మాత్రమే. వాటి మీద చక్కగా రంగు కూడా పూసి ఉంచారు. ఈ రకంగా పాతకాలంలో సౌకర్యాలుగా ఉన్న పాత వస్తువులు చాలామటుకు అలంకారాలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటివి ఉండేవని చెప్పడానికయినా ఒకచోట నిజంగా పాత పద్ధతి ఊరును ఏర్పాటు చేయాలని నాకొక గట్టి కోరిక.

కె.బి. గోపాలం