ఈ వారం స్పెషల్

ఎండ ప్రచండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంతం వస్తే ఆనందమే ఆనందం అంటారు.
మొక్కలకు వచ్చే లేలేత చిగుళ్లు...కూ...కూ అనే కోకిల గానం, ఉగాది, శ్రీరామనవమి సంరంభం చెప్పుకోవడానికి బ్రహ్మాండంగానే ఉంటుంది. చైత్రమాసం చైతన్యానికి నాందిగా చెప్పుకుంటారు. ఇవన్నీ ఒకప్పుడు నిజాలే అయినా ఇప్పుడు పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. వసంతం అందమేమోగానీ వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. చెట్టునీడ, మామిడి చిగురు అందక కోకిలల సవ్వడి తగ్గిపోయింది. వసంతం అందం తరిగిపోయింది. మండువేసవి రాకముందే ఎండ ప్రచండంగా కాస్తోంది. సూరీడు ఇప్పుడే కళ్లురిమి చూస్తున్నాడు.
వేడి ధాటికి తట్టుకోలేక జనం విలవిలలాడుతున్నారు. ఇల్లుదాటి బయటకు రావడానికి చిన్నాపెద్దా జంకుతున్నారు. ఇంకా అసలువేసవి ప్రారంభం కాకముందే కళ్లముందు సూరీడు కన్పిస్తున్నాడు. వేకువలోనూ ప్రభాతభానుడు ప్రతాపం చూపించేస్తున్నాడు. బాలభానుడని మనం అనుకోవడమేగానీ ఆయన మాత్రం ఉగ్రరూపమే చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందల సంఖ్యలో జనం ‘వడగొట్టి’ ప్రాణాలు కోల్పోయారు. గడచిన వారం రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కనీసం 200మంది వడదెబ్బకు బలయ్యారు. వడగాల్పులను నివారించడం ఇప్పటికిప్పుడు మనవల్లకాదు. కానీ, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే వాటికి బలవకుండా ఉండే అవకాశం ఉంది. నిజానికి, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ వడగాల్పులు, అత్యధిక ఉష్ణోగ్రతల ముప్పు చేజేతులా తెచ్చుకున్నదే. అడవులు తగ్గిపోయి, యధేచ్ఛగా చెట్లు నరికేయడంవల్ల వచ్చిన ముప్పు ఇది.
ఎందుకింత వేడి..
భూమి వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చేశాయి. పచ్చనిచెట్లు, మొక్కలు అంతరించిపోతూండటంవల్ల ఈ సమస్య ఏర్పడుతోంది. సముద్రమట్టాలు పెరగడం, సముద్రజలాలపైనుంచి వచ్చే వేడిగాలులు పెరిగిపోవడం, పొడి ప్రాంతాలనుంచి వచ్చే గాలులు మరింత వేడిని తీసుకురావడం, చెట్లు లేకపోవడంవల్ల నీటిఆవిరితోకూడిన మేఘాలు ఏర్పడటం లేదు. ఒకటీఅరా మరీచకలున్నా చల్లబడటం లేదు. మేఘాలు లేనందువల్ల సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో భూమి వేడెక్కిపోతోంది. ఫలితంగా వేసవి ప్రారంభంలోనే ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే చివర్లో నమోదయ్యే రీతిలో ఇప్పుడే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసుకోవచ్చు. ఒక్క మనదేశంలోనే కాదు. ప్రపంచం అంతటా ఇదే పరిస్థితి. రుతువుల లక్షణాలు మారిపోతున్నాయి. ప్రకృతివైపరీత్యాల్లో ఎక్కువ ప్రాణనష్టం జరుగుతున్నది వేసవిలో వడగాల్పులవల్లేనంటే నమ్మాల్సిందే. ముఖ్యంగా అమెరికాలో హీట్‌వేవ్స్‌వల్ల మరణించేవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. మనదేశంలోనూ అదే పరిస్థితి. భారతదేశ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం 2015. ఈ ఏడు ఆ రికార్డు చెరిగిపోనుందని వాతావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. గతేడాది వడగాల్పులకు దేశవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 2500మంది మరణించారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్దసంఖ్యలో మరణాలు సంభవించలేదు. ఇక ఈ ఏడాది పరిస్థితి ఇప్పటికే భయపెడుతోంది.
వడగాల్పులంటే...
ఆంగ్లంలో హీట్‌వేవ్స్‌గా పిలిచే వడగాల్పులకు ఓ కొలమానం చెబుతున్నారు. వాతావరణశాఖ నిబంధనల ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ ఉంటే వడగాల్పులకు అవకాశం ఉంటుంది. అదే కొండ ప్రాంతాలోల 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే వడగాల్పులు వీస్తాయి. వాతావరణంలో తేమశాతం తగ్గిపోయి, పొడిగాలులు వీస్తే వడగాల్పులున్నట్లు లెక్క. సముద్రజలాలపైనుంచి వచ్చే గాలులు వేడిని, తేమను మోసుకొస్తాయి. పొడిప్రాంతాలనుంచి వచ్చేగాలులు కేవలం వేడిని తెస్తాయి. వీటిమధ్య సమతుల్యత లోపిస్తే వడగాల్పుల ప్రభావం ఉంటుంది. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతై తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తాయని హెచ్చరిస్తోంది.. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్టుమెంటు. మనదేశానికి సంబంధించి ఎల్‌నినో ప్రభావంవల్ల (పసిఫిక్ సముద్రంపైనుంచి వచ్చే వేడిగాలులు) ఇక్కడ వాతావరణం వేడెక్కుతోంది. ఇక పాకిస్తాన్‌వైపునుంచి వచ్చే పొడిగాలులు (అన్నీ కొండ ప్రాంతాలే) వేడిని మోసుకువస్తున్నాయి. ఇక కాలుష్యం దానికి తోడవుతోంది. దీంతో ఉక్కపోత, వేడి పెరిగి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాం. వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, దిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో వేసవి మండిపోతోంది. సరే ప్రకృతిని ఇప్పటికిప్పుడు దారికితెచ్చుకోలేం. కనుక వేసవి సమస్యను ఎదుర్కొనే యత్నం చేయాల్సిందే.
ఇదీ ప్రభావం
ఎండలు పెరిగిపోవడంవల్ల మనకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆరోగ్య, ఆహార సమస్యలు ఏర్పడుతున్నాయి. వర్షాలు లేకపోవడం, నీటి నిల్వలు, వ్యవస్థలు లేకపోవడంవల్ల నీటిఎద్దడి ఏర్పడుతోంది. ఫలితంగా కరవు వస్తోంది. పంటలు తగ్గిపోయి ఆహార భద్రత కరవవుతోంది. మంచినీళ్లు, తిండి లేకుండా బతకడం కష్టమే. మనకే కాదు, ఈ పరిస్థితుల్లో పశుపక్ష్యాదులూ ప్రాణాలు కోల్పోతున్నాయి. కూరగాయల సాగు నిలవడం లేదు. ఈ ఉక్కిరిబిక్కిరి జీవితంలో కంటినిండా నిద్రకూడా కరవే. వాతావరణంలో తేమలేకపోవడం, వేడి పెరిగిపోవడంవల్ల వడదెబ్బ కొడుతుంది. సమయానికి చికిత్స జరిగితే పరవాలేదు. లేదంటే ముప్పే.
వడదెబ్బ తీవ్రత ఇదీ..
నేరుగా ఎండలో తిరగడం, వడగాల్పులు వీచేసమయంలో బయట తిరగడంవల్ల వడదెబ్బ తగలవచ్చు. ఇది ప్రత్యక్షంగా తెలిసే విషయం కాదు. వేడిగాలులన్నీ వడగాల్పులు కావు. అధికంగా చెమట పట్టడం, నిస్త్రాణ, నీరసం, విరేచనాలు, వాంతులు, భరించలేని తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రజ్వరం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ మూడు స్థాయిల్లో ఉంటుంది.
మొదటిది ‘హీట్‌క్రాంప్స్’. ఈ దశలో రోగి ముఖం, శరీరం వాస్తుంది. అప్పుడప్పుడు అపస్మారకస్థితిలోకి వెళుతూంటారు. 102 డిగ్రీల ఫారన్‌హీట్ జ్వరంతో బాధపడతారు. ఈ దశలో చికిత్స ప్రారంభమైతే గండం గట్టెక్కినట్లే. శరీరంలో లవణాలు, నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం, పదేపదే శరీరాన్ని చల్లటినీళ్లలో ముంచిన వస్త్రాలతో అద్దడం, ద్రవపదార్థాలు తీసుకోవడం, గాలితగిలేట్లు చూసుకోవడంతో ప్రమాదంనుంచి బయటపడవచ్చు. ఇక రెండో దశ ‘హీట్‌ఎగ్జాస్ట్’. ఈ దశలో రోగి పై లక్షణాలతోపాటు జ్వరం మరింత ఎక్కువగా ఉంటుంది. మూడోదశ ‘హీట్‌స్ట్రోక్’. ఈ దశలో రోగి దాదాపు ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరినట్లే. 104 డిగ్రీల ఫారన్‌హీట్‌తో జ్వరం, కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. చికిత్స చేసినా ప్రయోజనం చాలాతక్కువ.
ఏం చేయాలి...
ఎండలో, వేడిగాలులు వీచేటప్పుడు బయటకు రాకూడదు. నేరుగా ఎండలో తిరగకూడదు. టోపీ, తెల్లటివస్త్రాలు, కూలింగ్ గ్లాసులు ధరించాలి. వీలైనంత ఎక్కువసేపు నీడలో గడపాలి. శుభ్రం చేసిన మంచినీరు, లవణాలు ఎక్కువగా ఉండే ద్రవపదార్థాలు, చలువచేసే ఆహారం తీసుకోవాలి. ఒఆర్‌ఎస్ ద్రావకం అన్నింటికన్నా మేలైన పరిష్కారం. ఇప్పటికే వేడి తట్టుకోలేని జనం కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, తాటిముంజలు, సబ్జా, బార్లీవంటివాటిని వాడటం మొదలెట్టేశారు. కూల్‌డ్రింక్‌లు, శీతల పానీయాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కూలర్లు, ఏసి మిషన్ల క్రయవిక్రయాలు పెరిగిపోయాయి. కాస్త డబ్బున్నవారికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. కష్టమల్లా మధ్య, దిగువ తరగతి దీనులకే.
గతేడాది ఏం జరిగిందంటే...
చరిత్రలో ఎన్నడు లేనంతస్థాయిలో ఉష్ణ్రోగ్రతలు మనదేశంలో 2014లో నమోదయ్యాయని బాధపడుతూంటే ఆ మరుసటి సంవత్సరం, అంటే 2015లో అంతకంటే ఎక్కువే రికార్డయింది. గతేడాది ఏప్రిల్ నెలాఖరుకు నమోదైన ఉష్ణ్రోగ్రతలు ఈసారి మార్చి నెలాఖరుకే రికార్డయ్యాయి. గతేడాదికన్నా ఈసారి సాధారణ ఉష్ణ్రోగ్రతలు నాలుగైదు డిగ్రీలు పెరిగాయి. నిజానికి వడగాల్పులవల్ల 1990నుంచి ఇప్పటివరకు మనదేశంలో 20వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 1979లో వడగాల్పులకు 2500 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతేడాది దాదాపు అదేస్థాయిలో మరణాలు సంభవించాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
హైదరాబాద్‌లో అప్పుడు..
గతేడాది హైదరాబాద్‌లో సూర్యుడు నిప్పులుగక్కాడు. మే 21న 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంకన్నా దాదాపు 7 డిగ్రీలు ఎక్కువన్నమాట. అదేరోజు ఒడిశాలోని ఝార్సుగూడలో దాదాపు 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై ఒకేరోజు 12మంది వడదెబ్బకు గురై మరణించారు. మే 22న అలహాబాద్‌లో అత్యధికంగా 47.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒడిశాలోని టిట్లాగర్‌లో మే 25న 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇవి మేలో నమోదైన ఉష్ణోగ్రతలు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పలుచోట్ల నమోదయ్యాయి. సాధారణంకన్నా దాదాపు నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఎండలు కాస్తున్నాయన్నమాట.
దిల్లీలో కరిగిన రోడ్లు
గత ఏడాది ఎండ తీవ్రతకు ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. మే 21న దిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత 42.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ వేడికి నగరంలోని ఇండియాగేట్‌వద్ద తారురోడ్లు కరిగిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణకు వేసిన జీబ్రాలైన్లు చెరిగిపోయాయి. ఎండమావులు కళ్లకు స్పష్టంగా కన్పించాయి. పొరుగుదేశం పాకిస్తాన్‌లో ఇంతకంటే పరిస్థితి దారుణం.
ప్రమాదకర స్థాయిలో
అతి నీలలోహిత కిరణాలు
వాతావరణంలో మార్పులు, ఓజోన్ పొరకు కొన్నిచోట్ల చిల్లులు పడడం తదితర కారణాలతో అతి నీలలోహిత కిరణాల ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు యువి ఇండెక్స్ 10 కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. చర్మానికి నష్టం కలిగించే అతి నీలలోహిత కిరణాల స్థాయిని యువి ఇండెక్స్ ద్వారా తెలియచేస్తారు. వేసవిలో మధ్యాహ్నం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యువి ఇండెక్స్ ఎక్కువ ఉన్న కొద్దీ చర్మంపై అది చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చర్మం నల్లగా ఉన్న కొద్దీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో యువి ఇండెక్స్ 10 నుంచి 12 వరకూ ఉంటోంది. ఎక్కువ సేపు ఈ కిరణాల ప్రభావానికి గురైతే చర్మం ఎర్రబారుతుంది. ఈ కిరణాల ప్రభావాన్ని అధ్యయం చేసేందుకు దేశంలో ఒకే కేంద్రం ఉంది. పూనేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీట్రియాలజీ సంస్థ ఢిల్లీ, ముంబాయి, పూనేల్లో మాత్రమే అతినీల లోహిత కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వీటి ప్రభావం తెలుసుకోవాలంటే విదేశీ వెబ్‌సైట్‌లను ఆశ్రయించాల్సిందే. ఈ కిరణాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. సముద్రమట్టం నుంచి ఆయా ప్రాంతాలు ఉన్న ఎత్తు, మేఘాలు, గాలిలో ధూళికణాల వల్ల ఈ కిరణాల ప్రభావం తక్కువగా ఉంటుంది.
హీట్ ఇండెక్స్
చాలా సందర్భాల్లో పగటిపూట వాస్తవంగా నమోదైన ఉష్ణోగ్రత కన్నా అధికంగా ఉన్నట్లు అనుభూతి చెందుతుంటాం. మనం ఉన్నచోట ఉష్ణోగ్రత ఎంత అని శరీరం గుర్తిస్తుందో దానే్న హీట్ ఇండెక్స్ అంటారు. చాలా దేశాల్లో ఉష్ణోగ్రతతో పాటు హీట్ ఇండెక్స్‌ను వాతావరణశాఖలు తెలియచేస్తుంటాయి. సాధారణంగా శరీర ఉష్ణోగ్రతను చెమట పట్టడం లేదా చెమట ఆవిరి కావడం ద్వారా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. మనం పనిచేస్తున్న సమయంలో శరీరంలోని శక్తి కేలరీల రూపంలో ఖర్చవుతుంది. ఈ సమయంలో కొంత ఉష్ణం శరీరం నుంచి వెలువడుతుంది. చెమట పట్టడం, చెమట ఆవిరి కావడం ద్వారా ప్రకృతి సహజంగా ఆ ఉష్ణాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. కానీ అలా చల్లబరిచే వీలు లేని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాతావరణంలో తేమ శాతం, ఉష్ణోగ్రత 80 డిగ్రీల ఫారన్‌హీట్ కన్నా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో శరీరం నుంచి వెలువడే వేడిని తనంత తానుగా చల్లబరుచుకునే వీలు తక్కువగా ఉంటుంది. ఇది వడదెబ్బ, తదితర అంశాలకు కారణమవుతుంది. చెమట ఆవిరిగా మారేందుకు వీలు లేని సమయంలో, వాతావరణం బాగా వేడిగా ఉన్నట్లు శరీరం అనుభూతి చెందుతుంది. ఈ అనుభూతిని మదించేదే హీట్ ఇండెక్స్. ఉష్ణోగ్రత, వాతావరణంలోనూ సాపేక్ష తేమ శాతాన్ని కలిపి ఒక ప్రత్యేక ఫార్ములా ద్వారా హీట్ ఇండెక్స్ మదింపు చేస్తారు. ఈ ఏడాది ఎండలు మరింత ముదరనున్నాయి. భూతాపం తగ్గడానికి ప్రజలు చైతన్యవంతమై రంగంలోకి దిగితే భావితరాలు పదికాలాలపాటు చల్లగా ఉంటారు. మనకు ఎలాగూ ఈ ఉక్కిరిబిక్కిరి తప్పదు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం మినహా మనకు మరోదారిలేదు.
*
........................................................................
ఇన్‌పుట్: ఎ.రవి, పి.ఎస్.వెంకటేశ్వరరావు (విశాఖ)
..............................................................................................................................................

హైదరాబాద్ భగభగమంటుంది

48 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వొచ్చు

‘ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఈసారి వేసవికి భగభగలాడవచ్చు. గతేడాదికన్నా ఈసారి సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వచ్చు. సాధారణంగా ఎండాకాలంలో పగటిపూట ఎండ బాగా ఉంటుంది. సాయంత్రం కాగానే ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకోవటం కన్పించేది. కానీ ఈ సారి ఎండలు కొడుతున్నాయే తప్ప, తెలంగాణలో మేఘాలు కమ్ముకోవటం కన్పించలేదు. అందువల్ల వేడి పెరిగిపోయింది. మార్చి 22 నుంచి జూన్ 22 లేక 23ల మధ్య సూర్యుడు దక్షిణం నుంచి భూ మధ్యరేఖ మీదుగా ఉత్తరానికి ప్రయాణిస్తుండటంవల్ల సూర్య కిరణాల తీవ్రత ఎక్కువగా అనిపిస్తోంది. భూమిపైకి సూర్య కిరణాలు నేరుగా పడటంవల్ల, మేఘాలు లేక అవి నేలను తాకడంవల్ల భూవాతావరణం పెరిగిపోతోంది. దీనికి కాలుష్యం తోడై, తేమ తగ్గి మండుటెండలు కాస్తున్నాయి. తారు రోడ్లు, గుట్టలు, ట్రాఫిక్, కాలుష్యం ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరం వంటి పట్టణాల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగానే కన్పిస్తోంది. నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలోనూ ఆకాశం మేఘావృతం కావటంతో సూర్య కిరణాల ప్రభావం తగ్గినట్టు కన్పించేది. కానీ ఈసారి అలా లేదు. దక్షిణ దిశ నుంచి రావల్సిన చల్లటి గాలులు కూడా వీయకపోవటంతో వాతావరణంలో తేమ తగ్గి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఏప్రిల్ మాసంలో ఇప్పటి వరకు తెలంగాణలోని నిజామాబాద్‌లో 43 డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో 44ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఎండాకాలంలో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇదే స్థాయిలో గతంలో 1966లో కూడా ఎండలు మండిపోయాయి. ఈ సారి ఇప్పటికే 41 డిగ్రీల పై చిలుకు నమోదు కావటం, మున్ముందు ఎండలు మరింత మండిపోతాయనేందుకు సంకేతం. ఈ నెలాఖరులోగా తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటనున్నాయి. ఆ తర్వాత దక్షిణ నుంచి ఉత్తరానికి సూర్యుడు 23.5 డిగ్రీల కోణంలో కదులుతున్నపుడు మే నెలాఖరులో గానీ, జూన్ మొదటి వారంలో గానీ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల పై చిలుకు నమోదయ్యే అవకాశాలున్నాయి. మే మాసంలో మధ్యాహ్నం పనె్నండు గంటలకే సూర్యుడు నడినెత్తినకొచ్చే అవకాశాలున్నాయి. అపుడే ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. గతంలో ఇంతకన్నా వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో కొన్ని సార్లు ఆకాశం మేఘావృత కావటం, క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అకాల వర్షాలు కురవటం వల్ల తీవ్రత ఎక్కువగా అన్పించలేదు. గత వేసవి ప్రారంభంలోనూ, ఆగస్టు మాసంలోనూ ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరంలో కన్పించాయి. ఆ పరిస్థితులు ఈ వేసవిలో కన్పించకపోవటం వల్ల ఎండ తీవ్రత, వేడిమి ఎక్కువగా ఉంది. పదేళ్లలో ఎన్నడూలేని విధంగా హైదరాబాద్‌లో ఈసారి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే మేలు.’

-మల్లాది నర్సింహారావు, వాతావరణ శాఖ అధికారి (హైదరాబాద్)

ఇంత తీవ్రత ఎందుకంటే..

‘వేసవి ప్రారంభంలో ఉత్తరార్ధగోళం పరిధిలో సూర్య సంచారం ప్రారంభమవుతుంది. మార్చిలో దక్కన్ పీఠభూమి భాగంలో ప్రారంభమైన సూర్యసంచారం క్రమంగా మే చివర నాటికి ఉత్తరాదికి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఉత్తరాది నుంచి వీచే పొడి వేడిగాలుల కారణంగానే దక్షిణ భారతంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఈ సంచారానికి అనుగుణంగానే అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతాన్ని బలంగా తాకే అల్పపీడనంవల్ల ఉత్తరాది వేడిగాలులు కొంతమేర ఉపశమనం కల్గిస్తూ మే చివరి వారానికి నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. ఇదే సందర్భంలో వేసవి ఆరంభంలోనే ఛత్తీస్‌గఢ్ లేదా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన రేఖ ఒకటి కొనసాగుతూ ఉంటుంది. ఉత్తరాది నుంచి వీచే వేడిగాలులు ఈ అల్పపీడన రేఖను పశ్చిమ దిశగ తాకి తూర్పు దిక్కుకు మళ్లుతాయి. ఈ క్రమంలో పశ్చిమ దిశలో ఉన్న ప్రాంతాలు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వేడిగాలులు పశ్చిమ దిక్కు నుంచి తూర్పుదిక్కుకు మళ్లే సందర్భంలో బంగాళాఖాతం నుంచి వచ్చే తేమతో కలిసి కొంతమేర ఎండల తీవ్రతను తగ్గిస్తుంటాయి. ఈ కారణం వల్లే శ్రీకాకుళం నుంచి కోస్తాతీరం వెంబడి ఉండే ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెద్దగా కన్పించదు. అయితే అల్పపీడనరేఖ పూర్తిగా భూ భాగం నుంచి తొలగిపోయి, సముద్రంపై స్థిరంగా నిలిచిన సందర్భాల్లో మాత్రం కోస్తాలో కూడా ఎండల ప్రభావం తీవ్రంగా కన్పిస్తుంది. ఉదాహరణకు విశాఖ నగరంలోనే రెండురకాల ఉష్ణోగ్రతలు నమోదు కావడాన్ని గమనించాలి. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న వాల్తేరులో నమోదయ్యే ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఎయిర్‌పోర్టు వద్ద ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అల్పపీడనరేఖకు తూర్పున పెద్దగా నమోదు కాని ఉష్ణోగ్రతలు, పశ్చిమంలో మాత్రం తమ ప్రభావాన్ని చూపుతుంటాయి. ఇవే పరిస్థితులు కళింగపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో తరచూకన్పిస్తుంటాయి.

-ప్రొ. పివి రామారావు, విశ్రాంత సంచాలకులు, వాతావరణశాఖ, విశాఖపట్నం.

* ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 57.8 డిగ్రీల సెల్సియస్. 1922 సెప్టెంబర్ 13న లిబియాలో ఈ ఉష్ణోగ్రత నమోదైంది.
* భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 50.6 డిగ్రీల సెల్సియస్. రాజస్థాన్‌లోని అల్వార్‌లో 1956 మే పదవ తేదీన ఇది నమోదైంది.
* ‘హీట్‌వేవ్’ అన్న పదాన్ని 1892లో న్యూయార్క్‌లో తొలిసారి ఉపయోగించారు.
* రష్యాలో వాతావరణం విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా చల్లటి వాతావరణమే అక్కడ ఉంటుంది. కానీ 2010లో అక్కడ వేసవి మండిపోయింది. ఆ ఒక్క ఏడాది వేసవిలో వడగాల్పులకు 50వేలమంది మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. యూరోప్‌లో ఏటా వడగాల్పులకు మరణించేవారి సంఖ్య చాలా ఎక్కువ.
* వాతావరణంలో వేడి పెరిగితే మనుషులకు పనిచేసే శక్తి దాదాపు 45 శాతం తగ్గిపోతుందని నాసా అంచనావేసింది.

యువి ఇండెక్స్ ప్రభావ కేటగిరి

0-2 మధ్యలో నామమాత్రం

3-4 తక్కువ

5-6 మోస్తరు

7-9 ఎక్కువ

10+ చాలా ఎక్కువ

రక్షణ చర్యలు

చర్మరక్షణకు ఎస్‌పిఎస్ 15 సన్‌స్క్రీన్ వాడాలి

సన్‌స్క్రీన్ వాడాలి. రక్షణకు వస్త్రాలు, టోపీ ధరించాలి.
సన్‌స్క్రీన్, రక్షణకు వస్త్రాలు, కంటి రక్షణకు సన్‌గ్లాసెస్ వాడాలి
సన్‌స్క్రీన్, వస్త్రాలు, కళ్ల అద్దాలు వాడాలి.

ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రాకపోవడం మేలు.

-బి.శ్రీధర్