ఆటాపోటీ

ఊరిస్తున్న ఐపిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విందు మరోసారి అభిమానులను ఊరిస్తున్నది. ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరిగే ఈ ‘పొట్టి క్రికెట్’ను నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనాధికారుల కమిటీ సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచంలో పెను తుపాను సృష్టించిన ఐపిఎల్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా, ఎన్ని వివాదాల్లో చిక్కుకొని అల్లాడుతున్నా, అభిమానులకు మాత్రం ఆనందాన్ని పంచుతూనే ఉంది. విస్తారమైన అధ్యయనాలు, లోతైన విశే్లషణలు, అంతులేని మేధోమథనం నుంచి పుట్టుకొచ్చిన ఐపిఎల్‌లో యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ నుంచి ఇంగ్లీష్ కౌంటీస్ వరకూ వివిధ రకాల టోర్నీల లక్షణాలు కలబోతగా ఉన్నాయి. అందుకే, ఐపిఎల్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నది. ఈ టోర్నీలో ఫ్రాంచైజీల విధానాన్ని ఇంగ్లీష్ కౌంటీలు, యుఫా సాకర్ నుంచి తీసుకున్నారు. వాటి మాదిరిగానే ఐపిఎల్‌ను బిసిసిఐ ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు ఈవెంట్‌గా తీర్చిదిద్దారు. ఈ టోర్నీతోనే చీర్‌లీడర్లు క్రికెట్‌లో తొలిసారి రంగ ప్రవేశం చేశారు. అప్పటి వరకూ సాకర్, రగ్బీలకు మాత్రమే పరిమితమైన ఈ విధానం ఐపిఎల్ రంగ ప్రవేశం చేసిన కొత్తల్లో క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. ఇది టి-20 ఫార్మెట్ కావడంతో మూడు గంటల్లోనే ఫలితం తేలడం అందరినీ ఆకట్టుకుంది. అంతేగాక, క్రికెట్‌లో పేరొందిన ఎంతోమంది ప్రస్తుత క్రికెటర్లతోపాటు మాజీ ఆటగాళ్లను చూసే అవకాశం రావడంతో ఐపిఎల్ మ్యాచ్‌లకు అభిమానులు క్యూ కడుతున్నారు. సినిమా స్టార్లు వివిధ ఫ్రాంచైజీల్లో భాగస్వాములుగా ఉండడం ఐపిఎల్‌కు సరికొత్త సొబగులు అద్దింది. ఇక, ఈ టోర్నీలో ఆడితే లభించే భారీ పారితోషికాలు క్రికెట్ దిగ్గజాలను సైతం క్యూ కట్టిస్తున్నాయి. వివిధ జాతీయ జట్లలో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువకులు, ఇప్పటికే ఆయా జట్ల తరఫున ఆడుతున్న వారు, ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన వారు ఢీ కొనడం అంతకు ముందు ఎన్నడూ ఒకే టోర్నీలో కనిపించకపోవడంతో, ఐపిఎల్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తొమ్మిదేళ్లు అదే రీతిలో ఆరాధిస్తునే ఉన్నారు.
బ్యాట్స్‌మెన్‌దే పైచేయి
ఈసారి ఐపిఎల్‌లోనూ బ్యాట్స్‌మెన్‌దే పైచేయగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. నిరుడు జరిగిన తొమ్మిదో ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ రాణిస్తే, బౌలర్లు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ జట్లకు చెందిన కెప్టెన్లు అద్భుతంగా రాణించడం నిరుటి ఐపిఎల్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మొత్తం మీద బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం నిరుడు స్పష్టంగా కనిపించింది. ఒక వికెట్‌కు సగటున 28.36 పరుగులు జత కలిశాయంటే, బౌలర్లపై బ్యాట్స్‌మెన్ ఏ విధంగా పైచేయి సాధించారో స్పష్టమవుతుంది. 2014లో వికెట్‌కు సగటున 28.18 పరుగులు నమోదైతే, ఆ రికార్డు నిరుడు తుడిచిపెట్టుకుపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ 973 పరుగులు సాధించాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను అగ్రస్థానాన్ని సంపాదించాడు. అంతేగాక, ఐపిఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో పట్టికలో సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ 848 పరుగులతో కోహ్లీ తర్వాత, రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఒక సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా క్రిస్ గేల్ (2012లో 733 పరుగులు), మైఖేల్ హస్సీ (2013లో 733 పరుగులు) పంచుకుంటున్న రికార్డును వీరు బద్దలు చేశారు. వార్నర్ సాధించిన పరుగుల్లో 468 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే తరుణంలో వచ్చినవే కావడం విశేషం. ఒక ఐపిఎల్ సీజన్‌లో ఈ విధంగా లక్ష్యాన్ని ఛేదించే
క్రమంలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. 2014లో రాబిన్ ఉతప్ప 457 పరుగులతో నెలకొల్పిన రికార్డును వార్నర్ అధిగమించాడు. ఎబి డివిలియర్స్ 687 పరుగులు చేసి, ఒక ఐపిఎల్ సీజన్‌లో ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించని బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును నెలకొల్పాడు. 2013లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్లాట్‌లో రాకుండా 578 పరుగులు చేయగా, డివిలియర్స్ ఆ రికార్డును తుడిచేశాడు. ఇన్ని రికార్డులు నెలకొన్న తొమ్మిదో ఐపిఎల్‌ను ఈ ఏడాది టోర్నీ మరిపిస్తుందా లేక పేలవంగా మారుతుందా అన్నది చూడాలి.
కెప్టెన్ల వీరవిహారం
తొమ్మిదో ఐపిఎల్‌ను కెప్టెన్ల టోర్నీగా చెప్పుకోవాలి. దాదాపుగా అన్ని జట్ల కెప్టెన్లు ఈటోర్నీలో రాణించడం విశేషం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు సాధించి ఒక రికార్డును, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులను నమోదు చేసి మరో రికార్డును సృష్టించాడు. తొమ్మిదో ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ కూడా అతనే. రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన జట్టుకు టైటిల్‌ను సాధించిపెట్టాడు. మొత్తం మీద బ్యాట్స్‌మెన్ విజృంభణ కొనసాగితే, బౌలర్లు, ప్రత్యేకించి స్పిన్నర్లు నానా ఇబ్బంది పడ్డారు. తొమ్మిదో ఐపిఎల్ గ్రూప్ దశలో 56 మ్యాచ్‌లు జరిగాయి. రెండు క్వాలిఫయర్స్, ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్‌తో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య అరవైకి చేరింది. వీటిలో 41 మ్యాచ్‌ల్లో వివిధ జట్లు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించాయి. 19 మ్యాచ్‌ల్లో మాత్రం ఛేజింగ్‌లో విఫలమయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడడం ఐపిఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈసారి ఐపిఎల్‌లో కెప్టెన్ల హవా ఎంత వరకు కొనసాగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బ్యాటింగ్‌తో పోలిస్తే నిరుడు బౌలింగ్ బలహీనంగా కనిపించింది. అందులోనూ స్పిన్నర్లు మరింత దారుణంగా విఫలమయ్యారు. ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితా ‘టాప్-5’లో యుజువేంద్ర చాహల్ ఒక్కడికే స్థానం లభించింది. స్పిన్నర్లలో అతనిని మినహాయిస్తే మిగతా వారెవరూ బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేదు. స్పిన్నర్లు సగటున 40.57 పరుగులు సమర్పించుకున్నారంటే వారి వైఫల్యం ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు. మొదటి ఐపిఎల్ స్పిన్నర్లు సగటున 35.32 పరుగులిస్తే, ఈసారి వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎడమ చేతివాటం స్పిన్నర్లు 320 ఓవర్లు బౌల్ చేశారు. వీరిలో అక్షర్ పటేల్ ఒక్కడే 13 వికెట్లు పడగొట్టాడు. మిగతా వారు పది వికెట్ల స్థాయిని అందుకోలేదు. ఈ ఐపిఎల్‌లో ఒకే ఒక హ్యాట్రిక్ అక్షర్ పటేల్ పేరుమీద నమోదైంది. తొమ్మిదో ఐపిఎల్ బ్యాటింగ్‌కు పెద్దపీట వేస్తే, ఈసారి బౌలర్లు రాణి స్తారేమో చూడాలి. బౌలర్ల హవా కొనసాగితే, పదో ఐపిఎల్ సరికొత్త ఈవెంట్‌గా మారడం ఖాయం. - ఎస్‌ఎంఎస్
**
జోరుగా పందాలు

ఐపిఎల్ అంటేనే డబ్బు. కోట్లకు కోట్లు చేతులు మారతాయి. అందుకే ఈ టోర్నీలో ప్రతి మ్యాచేకాదు.. ప్రతి బంతి కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అభిమానుల్లో ఉన్న ఈ ఆసక్తినే బుకీలు తమ వ్యాపార వస్తువుగా మార్చేసుకుంటున్నారు. ఫలితంగా మ్యాచ్‌లపై బెట్టింగ్ జోరు పెరిగింది. దీనితోపాటే అవినీతి కూడా ఐపిఎల్‌లోకి చొరబడింది. ఆరో ఐపిఎల్ (2013)లో రాజస్థాన్ రాయర్స్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను స్పాట్ ఫిక్సింగ్ నేరంపై పోలీసులు అరెస్టు చేయడంతో, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో పలు మలుపులు తిరిగి ఈ కేసు చివరికి సుప్రీం కోర్టుకు చేరడం, లోధా కమిటీ ఏర్పాటు కావడం, ఆ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి బిసిసిఐకి పాలనాధికారుల కమిటీని నియమించడం జరిగిపోయాయి. ఒక రకంగా భారత క్రికెట్ ప్రక్షాళనకు ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉపయోగపడింది.

**
రెండు జట్లపై వేటు

స్పాట్ ఫిక్సింగ్ కేసులో రెండు ఫ్రాంచైజీలు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై వేటు పడింది. ఈ రెండు జట్లను రెండు సంవత్సరాలపాటు ఐపిఎల్ నుంచి లోధా కమిటీ సస్పెండ్ చేసింది. దీనితో నిరుడు జరిగిన తొమ్మిదో ఐపిఎల్‌లో తాత్కాలిక జట్లుగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ టోర్నీలోకి అడుగుపెట్టాయి. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై చెన్నై, రాజస్థాన్‌లపై వేటు పడినప్పుడు, ఆరు జట్లతోనే ఐపిఎల్‌ను కొనసాగించాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే, అప్పటికే ప్రజల్లో ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని, తాత్కిలిక ప్రాతిపదికపై రెండు ఫ్రాంచైజీలను తీసుకోవాలని బిసిసిఐ నిర్ణయించింది. కొత్త ఫ్రాంచైజీలకు రివర్స్ బిడ్స్‌ను ఆహ్వానించింది. ఈ బిడ్స్‌లో తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ టోర్నీలో రంగ ప్రవేశం చేశాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, చెన్నై తిరగి ఐపిఎల్‌లోకి వచ్చేస్తాయ.
**
టాప్ బ్యాట్స్‌మన్ కోహ్లీ

ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్న భారత కెప్టెన్ కోహ్లీ 2008 నుంచి 2016 వరకు 131 ఐపిఎల్ ఇన్నింగ్స్ ఆడాడు. 4,110 పరుగులు చేశాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు, ఇప్పుడు గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ రైనా కూడా నాలుగు వేలకుపైగా పరుగులు సాధించాడు. అతను 143 ఇన్నింగ్స్‌లో 4,098 పరుగులు చేసి, కోహ్లీకి గట్టిపోటీనిస్తున్నాడు. రోహిత్ శర్మ 138 ఇన్నింగ్స్‌లో 3,874 పరుగులు చేసి, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా, ఒక ఐపిఎల్ సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. నిరుడు అతను 16 ఇన్నింగ్స్‌లో 973 పరుగులు సాధించాడు. అదే సీజన్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించిన డేవిడ్ వార్నర్ 17 ఇన్నింగ్స్‌లో 848 పరుగులు చేశాడు. 2012లో క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) 14 మ్యాచ్‌ల్లో 733, 2013లో మైఖేల్ హస్సీ (చెన్నై సూపర్ కింగ్స్) 17 ఇన్నింగ్స్‌లో 733 చొప్పున పరుగులు సాధించారు.
నిరుడు ఐపిఎల్‌లో కెప్టెన్లు సగటున 45.18 పరుగులు చేశారు. అంతకు ముందు ఏడాది సగటున 33.93 పరుగులుకాగా, అప్పటి రికార్డును తొమ్మిదో ఐపిఎల్‌లో వివిధ జట్ల కెప్టెన్లు అధిగమించారు. అంతేగాక, కెప్టెన్లు స్ట్రయిక్ రేట్ (137.64), అత్యధిక అర్ధ శతకాలు (38), అత్యధిక సిక్సర్లు (124) విభాగాల్లోనూ కెప్టెన్లదే అగ్రస్థానం. మొత్తం మీద నలుగురు ఆటగాళ్లు కలిసి ఈ ఐపిఎల్‌లో ఏడు శతకాలు సాధించారు. వీటిలో కోహ్లీ ఒక్కడే నాలుగు సెంచరీలు చేశాడు. క్వింటన్ డికాక్, స్టీవెన్ స్మిత్, ఎబి డివిలియర్స్ మిగతా మూడు సెంచరీలను పంచుకుంటున్నారు.
**
చాహల్ ప్రతిభ
యుజువేంద్ర చాహల్ ఒక్కడే నిరుటి ఐపిఎల్‌లో రాణించిన స్పిన్నర్. అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. నిరుడు 23 వికెట్లు పడగొట్టిన అతను ఈసారి 21 వికెట్లు సాధించాడు. అతనిని మినహాయిస్తే, భారత జాతీయ జట్టుకు ఎంపికకాని బౌలర్లు ఎవరూ ఇప్పటి వరకూ ఐపిఎల్‌లో 20కి పైగా వికెట్లను పడగొట్టలేదు. టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్న చాహల్ రెండుసార్లు 20కి మించి వికెట్లు కూల్చడం విశేషం. కాగా, పవర్ ప్లేలో ధవళ్ కులకర్ణి 14 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్ చరిత్రలో పవర్ ప్లే సమయంలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది. మిచెల్ జాన్సన్ 16, మోహిత్ శర్మ 15 చొప్పున వికెట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈరెండు 2013 సీజన్ ఐపిఎల్‌లో నమోదయ్యాయి.
భువీ టాప్
నిరుడు భువనేశ్వర్ కుమార్ మొత్తం 23 వికెట్లు సాధించి, ఈసారి ఐపిఎల్‌లో ఎక్కువ వికెట్లు కూల్చిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. యుజువేంద్ర సింగ్ చెరి 21 వికెట్లు సాధించగా, షేన్ వాట్సన్ 20 వికెట్లతో మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ధవళ్ కులకర్ణి 18 వికెట్లు కూల్చాడు. బంగ్లాదేశ్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ముస్త్ఫాజుర్ రహ్మాన్ 17 వికెట్లు పడగొట్టి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును స్వీకరించాడు.
**
విజేత జట్లు ఇవే
ఇప్పటి వరకూ జరిగిన తొమ్మిది ఐపిఎల్ టోర్నీల్లో టైటిళ్లు సాధించిన జట్లు ఇవే..
2008: రాజస్థాన్ రాయల్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ సెమీ ఫైనలిస్ట్ జట్లు- ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).
2009: డక్కన్ చార్జర్స్ (రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ సెమీ ఫైనలిస్ట్ జట్లు-్ఢల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్).
2010: చెన్నై సూపర్ కింగ్స్ (రన్నరప్ ముంబయి ఇండియన్స్/ సెమీ ఫైనలిస్ట్ జట్లు-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డక్కన్ చార్జర్స్).
2011: చెన్నై సూపర్ కింగ్స్ (రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ సెమీ ఫైనలిస్ట్ జట్లు- ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్).
2012: కోల్‌కతా నైట్ రైడర్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ సెమీ ఫైనలిస్ట్ జట్లు- ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబయి ఇండియన్స్).
2013: ముంబయి ఇండియన్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ సెమీ ఫైనలిస్ట్ జట్లు- రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్).
2014: కోల్‌కతా నైట్ రైడర్స్ (రన్నరప్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ సెమీ ఫైనలిస్ట్ జట్లు- చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్).
2015: ముంబయి ఇండియన్స్ (రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్/ సెమీ ఫైనలిస్ట్ జట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ రాజస్థాన్ రాయల్స్).
2016: సన్‌రైజర్స్ హైదరాబాద్ (రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ సెమీ ఫైనలిస్ట్ జట్లు- గుజరాత్ లయర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్).
నిరుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా టైటిల్‌ను అందుకోగా, ఈసారి దానిని నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ఆసక్తి రేపుతున్నది.