ఆటాపోటీ

చీకటి వెలుగుల ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత టెస్టు క్రికెట్ చీకటి వెలుగుల సుదీర్ఘ ప్రయాణం చేసి, అరుదైన మైలురాయకి చేరింది. న్యూజిలాండ్‌తో గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ భారత్‌కు 500వ టెస్టు కావడం విశేషం. ఇప్పటి వరకూ ఆడిన 499 టెస్టుల్లో భారత్ 129 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 157 పరాజయాన్ని చవిచూసింది. 212 మ్యాచ్‌లు డ్రాకాగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సికె నాయడు నాయకత్వంలో భారత్ మొట్టమొదటి టెస్టు మ్యాచ్ స్వాతంత్య్రానికి పూర్వం, 1932లో ఇంగ్లాండ్‌పై ఆడింది. స్వతంత్ర భారత దేశంలో టెస్టు జట్టుకు మొదటి కెప్టెన్ లాలా అమర్‌నాథ్. తొలి సెంచరీ చేసింది కూడా అతనే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ, 84 సంవత్సరాల కాలంలో మొత్తం 31 మంది జట్టుకు నాయకత్వం వహించగా, విరాట్ కోహ్లీ 32వ కెప్టెన్. మహేంద్ర సింగ్ ధోనీ అత్యధికంగా 60 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. 27 విజయాలు సాధించాడు. 18 పరాజయాలను ఎదుర్కొన్నాడు. 15 టెస్టులు డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ హఠాత్తుగా టెస్టు కెరీర్‌కు గుడ్‌బై ప్రకటించగా, ఆ బాధ్యతను స్వీకరించిన కోహ్లీ ఇంత వరకూ 14 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. ఏడు విజయాలు సాధించాడు. రెండు టెస్టుల్లో ఓటమిని చవిచూశాడు. ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. ధోనీ తర్వాత ఎక్కువ టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించి, ఎక్కువ విజయాలను సాధించిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అతను 49 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 21 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 13 పరాజయాలు అతని ఖాతాలో ఉన్నాయి. 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మహమ్మద్ అజరుద్దీన్, సునీల్ గవాస్కర్ చెరి 47 టెస్టుల్లో టీమిండియా సారథులుగా వ్యవహరించారు.
ఇంగ్లాండ్‌తోనే అధికం..
భారత క్రికెట్ జట్టు ఎక్కువ టెస్టులను ఇంగ్లాండ్‌తో ఆడింది. మొత్తం 112 మ్యాచ్‌ల్లో ఆ జట్టును ఢీకొని 21 విజయాలు సాధించింది. 43 పరాజయాలను ఎదుర్కొంది. 48 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అయితే, అత్యధిక విజయాలను పటిష్టమైన ఆస్ట్రేలియాపై నమోదు చేయడం విశేషం. ఆ జట్టుతో 90 టెస్టులు ఆడిన టీమిండియా 24 విజయాలను అందుకుంది. 40 పరాజయాలను చవిచూసింది. 25 టెస్టులు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ టై అయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో 59 టెస్టులు ఆడింది. తొమ్మిది విజయాలు సాధించింది. 12 మ్యాచ్‌ల్లో ఓడింది. 38 టెస్టులు డ్రాగా ముగిశాయి. కాగా, అతి తక్కువ టెస్టులు బంగ్లాదేశ్‌తో ఆడింది. 8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలను కైవసం చేసుకుంది. రెండు డ్రా అయ్యాయి. ఇతర జట్ల విషయానికి వస్తే, న్యూజిలాండ్‌తో 54 మ్యాచ్‌ల్లో 18, దక్షిణాఫ్రికాపై 33 మ్యాచ్‌ల్లో 10, శ్రీలంకతో 38 మ్యాచ్‌ల్లో 16, వెస్టిండీస్‌పై 94 మ్యాచ్‌ల్లో 18, జింబాబ్వేపై 11 మ్యాచ్‌ల్లో 7 చొప్పున విజయాలను నమోదు చేసింది.
పది వికెట్ల తేడాతో..
పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండేసి పర్యాయాలు 10 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ మరో మూడు జట్లు ఇంగ్లాండ్, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై ఈ ఫీట్‌ను ఒక్కోసారి సాధించింది. మొత్తం మీద ఏడు సార్లు ఈ ఘనతను అందుకున్న భారత్ ఐదు పర్యాయాలు ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 239 పరుగులు (2007/ మీర్పూర్), ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 219 పరుగులు (1998/ కోల్‌కతా), న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్ 198 పరుగులు (2010/ నాగ్‌పూర్) తేడాతో విజయాలను కైవసం చేసుకుంది. శ్రీలంకపై ఇన్నింగ్స్ 144, బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల ఆధిక్యంతో విజయాలు కూడా భారత్ ఖాతాలో ఉన్నాయి.
అత్యధిక స్కోరు..
టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా సాధించిన అత్యధిక స్కోరు 9 వికెట్లకు 726 డిక్లేర్డ్. 2009లో శ్రీలంకపై ముంబయిలో జరిగిన టెస్టులో ఈ స్కోరు చేసింది. 2010లో, కొలంబో టెస్టులో 707 పరుగుల స్కోరును నమోదు చేసింది. 2004లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో ఏడు వికెట్లకు 705 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంకతో 1986లో జరిగిన కాన్పూర్ టెస్టులో 7 వికెట్లకు 676 పరుగులు సాధించి డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది. 2004లో జరిగిన ముల్తాన్ టెస్టులో పాకిస్తాన్‌పై 5 వికెట్లకు 675 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది.
అత్యల్పం 42
ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో భారత్ చేసిన అత్యల్ప స్కోరు 42 పరుగులు. ‘క్రికెట్ మక్కా’గా పిలిచే లార్డ్స్ మైదానంలో 1974లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడింది. ఆ మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 42 పరుగులకే కుప్పకూలింది. అజిత్ వాడేకర్ కెప్టెన్సీని ఆటగాళ్లు వ్యతిరేకించారని, తమ అసంతృప్తిని ఆ విధంగా తెలిపారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏక్‌నాథ్ సోల్కర్ చేసిన 18 పరుగులు ఆ ఇన్నింగ్స్‌లో భారత్‌కు అత్యధిక వ్యక్తిగత స్కోరు. మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. కాగా, 1947లో ఆస్ట్రేలియాపై 58 (బ్రిస్బేన్ టెస్టు), 1952లో ఇంగ్లాండ్‌పై 58 (మాంచెస్టర్ టెస్టు), 1996లో దక్షిణాఫ్రికాపై 66 (దర్బన్ టెస్టు), 1948లో ఆస్ట్రేలియాపై 67 (మెల్బోర్న్ టెస్టు) భారత్ ఒక ఇన్నింగ్స్‌లో చేసిన అత్యల్ప స్కోర్లలో ఉన్నాయి.
ఇన్నింగ్స్ పరాజయాలు
భారత జట్టు టెస్టుల్లో ఐదు పర్యాయాలు ఇన్నింగ్స్ తేడాతో పరాజయాలను చవిచూసింది. 1958లో జరిగిన కోల్‌కతా టెస్టును ఇన్నింగ్స్ 336 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఇంగ్లాండ్‌ను ఢీకొని, 1974లో ఇన్నింగ్స్ 285 (లార్డ్స్), 2014లో ఇన్నింగ్స్ 224 (లండన్), 2011లో ఇన్నింగ్స్ 242 (బర్మింహామ్) పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంక 2008లో జరిగిన కొలంబో టెస్టులో భారత్‌ను ఇన్నింగ్స్ 239 పరుగుల ఆధిక్యంతో ఓడించింది.
అత్యధిక పరుగులు
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ తెండూల్కర్‌ది అగ్రస్థానం. అతను 200 మ్యాచ్‌లు (329 ఇన్నింగ్స్) ఆడి 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ రికార్డు కూడా. రాహుల్ ద్రవిడ్ 163 టెస్టులు (284 ఇన్నింగ్స్)లో 52.63 సగటుతో 13,265 పరుగులు సాధించాడు. సునీల్ గవాస్కర్ 125 టెస్టులు (214 ఇన్నింగ్స్) ఆడి, 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. టెస్టుల్లో పది వేలకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ ఈ ముగ్గురే.
మేటి భాగస్వామ్యాలు
మన దేశం తరఫున టెస్టుల్లో మేటి భాగస్వామ్యాల రికార్డులో వినూ మన్కడ్, పంకజ్ రాయ్ 413 పరుగుల స్కోరు నంబర్ వన్ స్థానంలో ఉంది. వీరు 1956లో న్యూజిలాండ్‌పై చెన్నై టెస్టులో మొదటి వికెట్‌కు ఈ స్కోరు సాధించారు. 2006లో పాకిస్తాన్‌తో లాహోర్‌తో జరిగిన టెస్టులో వీరేందర్ సెవాగ్, రాహుల్ ద్రవిడ్ మొదటి వికెట్‌కు 410 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ఆస్ట్రేలియాపై ఐదో వికెట్‌కు 376, చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్ ఆస్ట్రేలియాపై రెండో వికెట్‌కు 370, సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియాపై నాలుగో వికెట్‌కు 353 చొప్పున భాగస్వామ్యాలను నమోదు చేసి, ‘టాప్-5’లో స్థానం సంపాదించారు.
ఒక్క రోజే కుప్పకూలి..
ఇంగ్లాండ్‌తో 1952లో ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో ఆడిన టెస్టులో భారత్ ఒకే రోజు రెండు ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు సాధిస్తే, అందుకు సమాధానంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులకు కుప్పకూలింది. విజయ్ మంజ్రేకర్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితోపాటు విజయ్ హజారే (16) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 82 పరుగులకు ఆలౌటైంది. హేమూ అధికారి (27), విజయ్ హజారే (16), ఖోకన్ సేన్ (13 నాటౌట్) మాత్రమే డబుల్ ఫిగర్స్‌కు చేరుకున్నారు. ఒక్క రోజులోనే రెండు ఇన్నింగ్స్‌లోనూ అలౌటైన భారత్ ఆ టెస్టును ఇన్నింగ్స్ 207 పరుగుల తేడాతో చేజార్చుకుంది.
ద్విపాత్రాభినయం..
ఇంగ్లాండ్, భారత్ జట్లకు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన ఏకైక ఆటగాడు ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ (సీనియర్ పటౌడీ). అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (జూనియర్ పటౌడీ) భారత కెప్టెన్‌గా సేవలు అందించాడు. అతను బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్‌ను పెళ్లాడాడు. వారి కుమారుడే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.
2000 దశకంలో..
భారత టెస్టు క్రికెట్ 2000 దశకంలోనే మెరుగుపడింది. 1932 నుంచి ఇప్పటి వరకూ ఆడిన 499 టెస్టుల్లో 34 శాతం మ్యాచ్‌లను 2000 తర్వాత ఆడింది. అయితే, 53 శాతం విజయాలను సాధించగలిగింది. విదేశాల్లోనూ టీమిండియా ఎక్కువ మ్యాచ్‌లను 2000 తర్వాతే గెలిచింది. ఇది విదేశాల్లోని మొత్తం విజయాల్లో 69 శాతం.
విజయం కోసం..
భారత జట్టు ఒకానొక దశలో విజయం కోసం అల్లాడింది. ఒక్క విజయం కూడా లేకుండా 31 మ్యాచ్‌లు ఆడింది. 1981-82 సీజన్ నుంచి 1984-85 సీజన్ వరకూ మొత్తం నాలుగు సంవత్సరాల, రెండు రోజుల పాటు భారత్ ఒక్క విజయం కూడా లేకుండా 31 టెస్టులు ఆడింది. వీటిలో 22 మ్యాచ్‌లు డ్రాకాగా, 9 మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది.
వరుస విజయాలు..
టెస్టుల్లో భారత్ సాధించిన వరుస విజయాల సంఖ్య ఆరు. 2013లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియాపై నాలుగు, వెస్టిండీస్‌పై రెండు చొప్పున విజయాలను నమోదు చేసింది. అంతకు ముందు, 2009-10 సీజన్‌లో వరుసగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై నాలుగు టెస్టుల్లో గెలిచింది. అదే విధంగా 1993లో ఇంగ్లాండ్, జింబాబ్వే జట్లపైన కూడా వరుసగా 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ గణాంకాలు, వివరాలు, విశేషాలు అన్నీ నిజానికి భా రత టెస్టు క్రికెట్ ప్రస్థానానికి పూర్తిగా అద్దం పట్టవు. ఎ న్ని విశేషాలను, ఇంకెంత సమాచారాన్ని ఇచ్చినా, ఇంకా చెప్పాల్సింది మిగిలిపోతునే ఉంటుంది. 84 సంవత్సరా ల సుదీర్ఘ ప్రయాణంలో భారత టెస్టు క్రికెట్ ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంది. వెలుగునీడలను చూసింది. బ్రిటిష్ వలస దేశంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టి, ప్రపం చ క్రికెట్‌ను శాసించే స్థాయకి చేరింది. అయతే, ఇది ఒ క్కసారిగా వచ్చిపడిన అదృష్టంకాదు.. దశాబ్దాలపాటు చేసిన కృషి ఫలితం. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసి సి) సైతం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని ధిక్కరించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నదంటే, భారత్ ఏ స్థాయలో ఎదిగిందో ఊహించడం కష్టం కాదు. క్రికె ట్‌ను ఒక మతంలా ఆరాధించే మన దేశం నుంచి ఎం తోమంది అంతర్జాతీయ వేదికపై అత్యున్నత ప్రమాణా లను నెలకొల్పారు. రంజిత్ సింగ్, దులీప్ సింగ్ వంటి వారు బ్రిటిషర్లకే క్రికెట్ పాఠాలు నేర్పారు. సికె నాయు డు, లాలా అమర్‌నాథ్, ఏక్‌నాథ్ సోల్కర్, కపిల్ దేవ్, మహమ్మద్ అజరుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి మేటి ఎంతో మంది ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. జయాపజయాలను సమాంగా తీసుకొని, భవిష్యత్తులో నూ భారత క్రికెట్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అలరి స్తుందని ఆశిద్దాం.

- శ్రీహరి