అనంతపురం

చిత్రావతి నది సుందరీకరణకు రూ.14.65 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 4:్భగవాన్ సత్యసాయి బాబా వెలసిన పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది సుందరీకరణకు రూ.14.65కోట్లు మంజూరైనట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. సోమవారం పుట్టపర్తి విచ్చేసిన ఆయన చిత్రావతి సుందరీకరణ పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతు ఆధ్యాత్మిక పుట్టపర్తిని పర్యాటకంగా తీర్చిదిద్ది సత్యసాయి భక్తులకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రూ.2.65కోట్లతో కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వద్ద నుండి దుర్గమ్మ గుడి వరకు 30అడుగుల వెడల్పుతో ఇప్పటికే పనులు చేపట్టినట్లు తెలిపారు. చిత్రావతి నదిపై చెక్‌డ్యాం నిర్మించి నదిలో సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు పరివాహక ప్రాంతంలో 30అడుగుల వెడల్పుతో సుందరీకరణ, పార్కు ఏర్పాటు, విగ్రహాల ఏర్పాటు తదితర సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో భాగంగా చేపడుతామన్నారు. చిత్రావతి హారతి వేదిక నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పుడా చైర్మన్ కడియాల సుధాకర్‌నాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కడియాల రామ్మోహన్, టిడిపి కన్వీనర్ రామాంజనేయులు, కౌన్సిలర్ బెస్త చలపతి, దేశం నాయకులు శ్రీరామిరెడ్డి, గంగాధర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

నృసింహుని ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు
కదిరి, ఏప్రిల్ 4:ప్రసిద్ధి చెందిన శ్రీమత్ ఖాద్రి లక్ష్మి నరశింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.4.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, దేవాదాయ శాఖకు పంపినట్లు ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయం దిన దినాభివృద్ధి చెందుతోందన్నారు. ఇందుకు ఆలయం తరుపున చేపట్టవలసిన అభివృద్ధి పనులను గుర్తించి మరింత అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో బాగంగా రూ.4.80 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామన్నారు. ముఖ్యంగా ఇందులో రూ.22.1 లక్షల వ్యయంతో గోశాల నిర్మాణం, రూ.36 లక్షల వ్యయంతో ఉద్యానవనం వద్ద కల్యాణ కట్ట నిర్మాణం, అక్కడే మరో రూ.32.75లక్షల వ్యయంతో అత్యాధునిక మరుగుదొడ్ల నిర్మాణం, అదే ఆలయంలో లోపల, వెలుపల ఆయా ప్రాంతాలలో అధునాతన షీట్స్‌తో షెడ్ల నిర్మాణానికి రూ.29 లక్షలు, బృగుతీర్థం అభివృద్ధికి రూ.87 లక్షలు, ఆలయం పడమర గోపురానికి ఆనుకుని ఉన్న స్థలంలో (బందల దొడ్డివద్ద) విఐపి సూట్ గదులకోసం రూ.59 లక్షలు, ఇంకా వసంత వల్లభ వసతి గృహంలో స్టీల్ ఎన్‌క్లోజర్స్ ఏర్పాటుకు రూ.7.5 లక్షలు, ఉత్తర గోపురం వైపు గల మురికికాలువ నిర్మాణంకు రూ.1.45 లక్షలు, అదే విధంగా ఉత్తర గోపురం అభివృద్ధికి గాను రూ.49.9 లక్షలు వ్యయంతో ప్రతిపాదనలు పంపినట్లు ఆలయ ఈఓ వివరించారు. ఇదే సందర్బంలో ఆలయం ఆదాయం కూడా గత ఏడాది కన్నా ఈ ఏడాది పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో స్వామి వారికి రూ.8 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో ఆలయం హుండీ, కానులకు, ప్రసాదాలు, ఇంకా బ్రహ్మోత్సవాల వల్ల శ్రీవారి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. ఇందుకు తాము కూడా పలు అభివృద్ధి పనుల కోసం దేవాదాయ శాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు సిద్దం చేసి పంపామన్నారు. కాగా ఆలయం తరుపున గోశాల నిర్మాణానికి కటారుపల్లి వద్ద భూమి దాతలు ఇచ్చామన్నారు. కాని పట్టణానికి సమీపంలోనే స్వామి వారికి చెందిన భూమి వున్న విషయంపై దేవాదాయ శాఖ అధికారులకు వివరించామన్నారు. దీంతో కదిరి పట్టణ సమీపంలోనే గోశాల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం అనుమతి రాగానే పనులు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ.22.1 లక్షలు నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇంకా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో చలపతినాయుని సత్రం భవనంలో కల్యాణ మండపం నిర్మాణం చేసి, ఆలయం తరుపున అద్దెలకు ఇవ్వనున్నామన్నారు. అంతేగాక ఇది వరకు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉన్న స్థలంలో వున్న పాత భనవాలను తొలగించి, నూతనంగా విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టిన ఆలయం తరపున నిర్వహించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు మున్సిపల్ పాలకవర్గం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని, అంతేగాక ఈ స్థలం ఆలయానికి ఇస్తే బదులుగా ఆలయానికి చెందిన భూమి మున్సిపాల్టికి ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇది అంతా కూడా ప్రభుత్వం తరుపు రెండుశాఖల మద్య సమన్యయంతో చేయాల్సి ఉంటుందని, ఇందుకు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వద్ద ప్రస్తావించి ఆయన సహకారంతో ఆలయ అభివృద్ధికి కావాల్సిన సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు అన్ని వర్గాల వారు తమ వంతు సహకారం అందివ్వాలని ఆలయ ఈఓ కోరారు. ఏది ఏమైనా కదిరి శ్రీలక్ష్మి నరశింహస్వామి ఆలయం విశిష్టత,ప్రత్యేకత, గొప్పదనం రాష్ట్రంలోనే గాక తమిళనాడు, కర్నాటక, తెలంగాణ తదితర ప్రాంతాల్లో విస్తరించి దినదనాభివృద్ధి చెందాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందుకు స్వామి భక్తులు అందరు తమ వంతు సహకారం అందివ్వాల్సిన అవసరం ఎంతనైనా ఉందని చెప్పవచ్చు.

విధులకు డుమ్మా సాగదిక!
నల్లమాడ, ఏప్రిల్ 4:జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు పద్ధతిని అమలులోకి తీసుకురావటంతో విధులకు డుమ్మా కొట్టే వైద్య ఆరోగ్యసిబ్బందికి చెక్‌పెట్టినట్టయ్యింది. జిల్లా వ్యాప్తంగా 80ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 594 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. 80ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 42 ఆరోగ్య కేంద్రాల ద్వారా 24గంటల వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ఆసుపత్రులలో కాన్పులు, కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు జరుగుతాయి. మిగిలిన 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యసిబ్బంది అందుబాటులో వుండి వైద్యసేవలు అందజేస్తున్నారు. గతనెల 28వ తేదీనుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా వైద్యసిబ్బంది హాజరు నమోదవుతున్నట్టు జిల్లా అధికారుల ద్వారా తెలిసింది. ఇంటర్‌నెట్ సౌకర్యం లేకపోవడంతో కొక్కంటి, గరుడచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదని సమాచారం. బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైన గత వారం రోజుల నుండి ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యులు ఉదయం 9లోపే హాజరై సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు ఆరోగ్య కేంద్రాల్లోని స్ట్ఫా నర్సులు, ఆరోగ్య కేంద్రం వున్న గ్రామాల్లో విధులు నిర్వహించే ఏ ఎన్‌యంలు, సూపర్‌వైజర్లు కూడా 9గంటలకు హాజరై బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్రలు వేసి హాజరును నమోదు చేసుకోక తప్పడం లేదు. కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఇతర గ్రామాల్లో వున్న ఆరోగ్య ఉపకేంద్రాల్లో విధులు నిర్వహించే ఏ ఎన్‌యంలకు, సూపర్‌వైజర్లకు బయోమెట్రిక్ భయం తప్పింది.వారు సంబంధిత ఆరోగ్య కేంద్రానికి హాజరుకాకుండానే విధులు నిర్వహించే ఉపకేంద్రాలకు చేరుకునే వెసలుబాటు వుండటంతోవారుమాత్రంఊపిరిపీల్చుకుంటున్నారు. ప్రతి నెలా నిర్దేశించిన తేదీలల్లో వైద్యులు గ్రామాల్లో పర్యటించాల్సి వుంది. ఆ సమయంలో కూడా కచ్చితంగా వారు విధులు నిర్వహించే ఆరోగ్య కేంద్రానికి హాజరై గ్రామాల పర్యటనకు వెళ్ళాలన్న నిబంధన వుంది. అయితే చాలామంది వైద్యులు వారు నివాసం వుంటున్న పట్టణాల నుంచి ఆరోగ్య కేంద్రానికి హాజరు కాకుండానే గ్రామాల పర్యటనకు వెళ్ళి ఇళ్ళకు చేరుకునేవారు. కొంత మంది వైద్యులు విధులకు హాజరు కాకుండానే తాము గ్రామాల పర్యటనలో వున్నామని విధులకు డుమ్మా కొట్టేవారు. అయితే ప్రస్తుతం కచ్చితంగా ఆరోగ్య కేంద్రానికి హాజరై బయోమెట్రిక్ యంత్రంలో తమ హాజరును నమోదు చేసుకున్నాకే పల్లెలకు కూడా వెళ్ళాల్సి వుండటంతో విధులకు డుమ్మా కొట్టే వైద్య సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. బయోమెట్రిక్ ద్వారా హాజరు విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డిప్యూటి డియం హెచ్‌వోలు, జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించే అవకాశం వుండటంతో గతంలో విధుల సమయపాలనకు తిలోదకాలిచ్చే వైద్య సిబ్బంది జీర్ణించుకోలేక తప్పదన్నట్లు విధులకు ఉదయం 9గంటలకే హాజరవుతూ రోగులకు తమ సేవలందిస్తున్నారు. వైద్యుడి రాకకోసం గంటల తరబడీ ఆరోగ్య కేంద్రాల్లో నిరీక్షించే రోగులుండే ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ ఏర్పాటుతో రోగులకోసం వైద్యులే నిరీక్షించే రోజులొచ్చాయ్ అనడంలో అతిశయోక్తిలేదు. కాగా రాబోయే రోజుల్లో ఉదయం 9గంటలకు హాజరై బయోమెట్రిక్‌లో తమ వేలిముద్రలేసి విధులు నిర్వహించకుండా వెళ్ళిపోయి తిరిగి 4గంటల సమయంలో వేలిముద్రలేసి విధులకు హాజరయ్యామనిపించుకునే వైద్యులు తయారవ్వకుండా సంబంధిత శాఖ జాగ్రత్తలూ తీసుకోవాల్సిన అవసరం లేకపోలేదు. ఈ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు పద్దతిని అన్ని పెద్దాసుపత్రుల్లో ఏర్పాటు చేస్తే పూర్తీ స్థాయిలో పేదలకు ప్రభుత్వ వైద్య సేవలందుతాయని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఉద్ధృతమవుతున్న విప్రో ఉద్యోగుల ఆందోళన

హిందూపురం, ఏప్రిల్ 4: స్థానిక తూమకుంట చెక్‌పోస్టు పారిశ్రామిక వాడ విప్రో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు గత ఐదు నెలలుగా వేతనాలు పెంచాలంటూ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం, తరచూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, యాజమాన్యం తీరుపై కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం వంటి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యం సోమవారం క్రమశిక్షణగా విధులకు హాజరు కావాలని గేటు వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేసి తగు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో న్యాయమైన తమ డిమాండ్‌ను పరిష్కరించడం పోయి నోటీసు బోర్డు వేయడం ఏమిటంటూ ఉద్యోగ, కార్మికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గేటు ముందు ఎర్రజెండా చేతబట్టి బైఠాయించి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 150 రోజులుగా కష్టానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని న్యాయమైన డిమాండ్‌ను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళగా పట్టించుకోలేదన్నారు. దాదాపు 25 మార్లు యాజమాన్యానికి తమకు చర్చలు జరిగినా ఇప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం, కర్నూలు కార్మిక శాఖ అధికారులతో పదిమార్లు చర్చలు జరిగినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. బెంగళూరులో ఉన్న విప్రో సంస్థలో తమ తోటి ఉద్యోగ, కార్మికులకు గరిష్టంగా రూ.35 వేలు వేతనం లభిస్తుండగా ఇక్కడ కేవలం రూ.14 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. దాదాపు 110 మంది ఉద్యోగ, కార్మికులు న్యాయమైన పోరాటం సాగిస్తూ గరిష్టంగా రూ.19 వేల వేతనం చెల్లించాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ర్యాలీ

వజ్రకరూర్, ఏప్రిల్ 4: దాహం తీర్చాలని మండల కేంద్రంలో సోమవారం కొనకొండ్ల మేజర్ పంచాయతీ గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. గ్రామం నుండి దాదాపు 200 మంది మహిళలు, గ్రామస్తులు మండల కేంద్రానికి ట్రాక్టర్ల ద్వారా చేరుకుని బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయానికి ఖాళీ బిందెలతో ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జిల్లా టిడిపి నాయకులు వేణు, మోహన్, నారాయణ స్వామిలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలికారు. అనంతరం ధార్నాలో టిడిపి నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి 1నుండి 4 వార్డుల్లో నీరులేక నానాపాట్లు పడుతున్నామన్నారు. ప్రస్తుతం వార్డుల్లో దాదాపు 7000 జనాభాకు చుక్క నీరు కూడా అంద డం లేదని మీకోసం అధికారుల దృష్టి కి తీసుకెళ్లారు. ఈ వార్డులు ఎత్తు ప్రదేశంలో ఉండటంతో నీరు చేరుకోక, కింది ప్రాంతంలో ఉన్నవారు పైపులైన్‌కు రంధ్రాలు వేసి నీరు పట్టుకుంటున్నారని ఆరోపించారు. దీనికి తోడు అక్రమంగా మోటర్లు పెట్టి నీటిని వాడుకోవడంతో పై వార్డుకు తీవ్ర అ న్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి నీటికోసం అధికారులను అడిగి అలసిపోయామని పేర్కొన్నారు. కొనకొండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురూగా వున్న సత్యసాయి ట్యాంక్ నుండి నేరుగా పైపులైన్ వేసి పైవార్డుల కు నీరు అందించాలని వారు డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఇందిరమ్మ, సర్పంచ్ మారుతి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఏప్రిల్ 4 : క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతామని బెట్టింగ్ రాయుళ్లు, బుకీలపై ప్రత్యేక నిఘా ఉంచామని అనంతపురం డిఎస్పీ జె.మల్లికార్జునవర్మ హెచ్చరించారు. ఆయన సోమవారం పోలీసు కాన్ఫరెన్సు హాలులోనిర్వహించిన మీడియా సమావేశంలోనగరంలోని వివిధ ప్రాంతాల్లో బెట్టింగులు చేస్తున్న పదిమందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలోని సిండికేటు నగర్‌లోబెట్టింగులు చేస్తున్న కోమల మహమ్మద్ రఫీ, గొల్ల గోపాల్, కవ్వల పెద్దిరాజు అలియాస్ మహేష్, ముత్తులూరి లోకేష్ అలియాస్ బాలు, గాలం మారుతీప్రసాద్ లను అరెస్టు చేసి వీరి వద్ద నుంచీ రూ.3,80,500 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరితోపాటు రాజీవ్ చిల్డ్రన్ పార్కు, హౌసింగ్ బోర్డు కాలనీ లలోబెట్టింగులు చేస్తున్న నీరుగంటి వీధికి చెందిన దంపెట్ల శివయ్య, యర్రగుంట నారాయణరెడ్డి, సాకే కేశవర్ధన్, సాకే రామాంజినేయులు, షేక్ సాదిక్‌లను అరెస్టు చేసి వీరి వద్ద నుంచి రూ.1,21,500 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలా మొత్తంగా పదిమందిని అరెస్టు చేసి పది సెల్‌ఫోన్లు, రూ.5.02 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం కీలక బుకీగా ఉన్న శివారెడ్డి అనే వ్యక్తి కోసం ప్రత్యేక గాలింపుబృందాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఇందులో ఎంతటివారు ఉన్నా ఉపేక్షించేదని లేదన్నారు. బెట్టింగు రాయుళ్లను అరెస్టు చేసిన రూరల్ సిఐ ఎం.ఆర్. కృష్ణమోహన్, ఎస్సైలు జగదీష్, నాగేంద్రప్రసాద్, వెంకటరమణలను ఆయన అభినందించారు.

టిడిపి ప్రజావ్యతిరేక పాలనపై ఉద్యమం

కదిరి, ఏప్రిల్ 4:రాష్ట్రంలో సాగుతున్న టిడిపి ప్రజా వ్యతిరేక పాలనపై ఉద్యమం చేపడుతామని వైకాపా నేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు వివిద కులాల మద్య తగువు పెట్టి రాజకీయ లబ్ధికి కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన బెంగళూరు నుంచి పులివెందులకు రోడ్డుమార్గంలో వెలు తూ పట్టణ సమీపంలోని కుటాగుళ్ళ వద్ద ప్రజల కోరిక మేరకు కొద్ది సేపు నిలిచి ప్రజలతో మాట్లాడారు. ఈ సం దర్భంగా ఆయనను గిరిజన విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాల నాయకులు కలసి తమ సమస్యను వివరిస్తూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, ఇదే జరిగితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు జగన్ దృష్టికి తెచ్చారు. ఇందుకు జగన్ స్పందిస్తూ పై విధంగా అన్నారు. వాస్తవానికి విరుద్దంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, ఈ విషయంలో అసెంబ్లీలో తాను వైకాపా తరుపున ప్రస్తావించి ఆయా కులాలను వివిద రిజర్వేషన్ల వర్గాల్లో చేర్చడంను వ్యతిరేకిస్తామని హామీ ఇచ్చారు. దీనికి ముందు ఆయన పలువురు మహిళలను పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్బంలో వైకాపా నేత జగన్ ఓబుళదేవరచెరువు మండల కేంద్రం లో సైతం తన వాహనం నుంచి కిందకు దిగి ప్రజలకు త్వరలో జరగనున్న ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపివచ్చినట్లు తెలిపారు. జగన్ వెంట కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్ బాషా తదితరులు ఉన్నారు.

మట్కా నిర్మూలనకు కృషి : డీఎస్పీ
గుత్తి, ఏప్రిల్4: సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలను విచ్ఛినం చేసే మట్కాను నిర్మూలించడానికి కఠినంగా వ్యవహరిస్తామని తాడిపత్రి డీఎస్పీ చితానందరెడ్డి హెచ్చరించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మార్పు పేరుతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి సరైన అవగాహన లేకపోవడం వల్ల మట్కాకు బానిసలౌతున్నారన్నారు. ఈ ప్రాంతంలో మట్కా యథేచ్ఛగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికైనా మట్కా కంపెనీ నిర్వాహకులు తమ పద్ధతులను మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సదస్సులో గుత్తి సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్‌ఐ చాంద్‌బాషా, కౌన్సిలర్ సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సామూహిక వివాహాల ఏర్పాట్ల పరిశీలన

రామగిరి, ఏప్రిల్ 4: పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 21న నిర్వహించనున్న ఉచిత సామూహిక వివాహాల ఏర్పాట్లను మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్, ఎస్‌పి రాజశేఖరబాబులు సోమవారం సాయంత్రం పరిశీలించారు. సామూహిక వివాహాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానుండడంతో బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి దిగేందుకు వీలుగా హెలీప్యాడ్‌ను పరిశీలించారు. 3ప్రాంతాలను పరిశీలించి ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించే తిరుమల దేవరగుడి ప్రాంగణ సమీపంలో హెలీప్యాడ్ స్థలాన్ని ఎంపిక చేశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించు స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలీప్యాడ్ నుంచి వచ్చు మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నిశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వస్తుండడంతో ఏప్రిల్ 21న తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బి, ఫైర్, ట్రాన్స్‌కో, డిపిఓ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించి ఆ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి సమీక్షించారు. ఎస్పీ, కలెక్టర్ ఉచిత సామూహిక వివాహాలకు తెచ్చిన వస్తు సామాగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుమల దేవర ఆలయ ప్రాంగణానికి వచ్చిన వారు దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు రుణమేళాలో భాగంగా కలెక్టర్ చేతుల మీదుగా చెక్కులు కూడా అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా ఏప్రిల్ 21న ఉచిత సామూహిక వివాహాలకు హాజరుకావాలని కోరుతు మండలంలో సోమవారం విస్తృతంగా తప్పెట్లతో ప్రచారం నిర్వహించారు. గంతిమర్రి గ్రామంలో తప్పెట్ల ప్రచారాన్ని ప్రారంభించారు. గంతిమర్రి, కుంటిమద్ది, పోలేపల్లి, రామగిరి పంచాయితీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉచిత సామూహిక వివాహాలకు కుటుంబ సమేతంగా విచ్చేసి పెళ్ళి జంటలను ఆశీర్వదించాలని ప్రచారం చేశారు.