రాష్ట్ర వార్తలు

తెలుగు అకాడమితో గేమ్స్

  • బి.వి ప్రసాద్
  • 09/09/2014

ఇన్‌ఛార్జిగా సత్యనారాయణరెడ్డి నియామకం
ఏపీ అకాడమీకి తెలంగాణ అధికారి
పంపకాలకు ముందే టి.సర్కారు ఉత్సాహం
కుదరదంటున్న ఆంధ్ర ప్రభుత్వం
ఎన్‌ఏసి, నిథమ్ వివాదాల బాటలో అకాడమి
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలుగు అకాడమితో రెండు తెలుగు రాష్ట్రాలూ ఆటాడుకుంటున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పాఠ్య గ్రంథాలను అందించడంతో పాటు సివిల్ సర్వీసు అధికారులకు తెలుగు నేర్పించడం, వారికి పరీక్షలు నిర్వహించి సర్ట్ఫికెట్లు ఇవ్వడం, జనరంజక గ్రంథాలను, సివిల్ సర్వీసు పరీక్షలు- పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అవసరమైన గ్రంథాలను ముద్రించడంలో ముందున్న తెలుగు అకాడమి ఇరు రాష్ట్రాల రాజకీయాలతో బలవుతోంది. పుస్తకాలను ముద్రించాల్సిన బృహత్తర కార్యక్రమం పీకలమీద కత్తిలా వేలాడుతుంటే తెలుగు అకాడమి సంచాలకుడి పోస్టు విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ప్రభుత్వాలు సొంత ఎత్తుగడలతో అడుగులేస్తూ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి.. రాష్ట్ర విభజన సమయంలో తెలుగు అకాడమీని పదేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు సేవ చేసేందుకు వీలుగా విభజన జాబితాలోకి తీసుకురాకుండా షెడ్యూలు 10లో చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తరహాలో తెలంగాణ తెలుగు అకాడమీ ఏర్పాటు చేసుకునే వీలుంది. కానీ అలాంటి ప్రయత్నం చేయకుండానే ఉమ్మడి జాబితాలో ఉన్న సంస్థను సంస్కృతి, భాష శాఖ నుండి ఉన్నత విద్యాశాఖకు మార్చేసింది. తెలుగు అకాడమిని ఇరు రాష్ట్రాలకు సేవలందించేలా కొనసాగించాలనుకుంటే, ఇలాంటి నిర్ణయం తీసుకునేముందు ఏపీ సర్కారు అనుమతి తప్పనిసరి. అది ఇష్టం లేకుంటే కొత్తగా తెలంగాణ తెలుగు అకాడమిని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి అకాడమికే కొత్తగా జీవో 117 ద్వారా పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు ఎ సత్యనారాయణ రెడ్డిని సెప్టెంబర్ 6న తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వరుసగా సెలవులు రావడంతో ఆయన ఇంకా అకాడమి సంచాలకుడిగా రిపోర్టు చేయలేదు. ఈ అంశం ఇప్పుడు వివాదంగా రాజుకోబోతోంది.
తెలుగు అకాడమి ఆది నుంచీ అనేక వివాదాల మధ్య ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి కావడం కొత్తకాదు. గతంలో ఉన్నత విద్యాశాఖ ఆధీనంలో ఉన్న తెలుగు అకాడమిని మాధ్యమిక విద్యాశాఖలోకి ప్రభుత్వం మార్చింది. అంటే పని అంతా ఉన్నత విద్యాశాఖది చేస్తూ, పరిపాలనా పరమైన అంశాలకు మాత్రం మాధ్యమిక విద్యాశాఖ ఆధీనంలో ఉండేది. చైర్మన్‌గా అప్పటి ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవహరిస్తున్నా అజమాయిషీ ఇంటర్మీడియట్ బోర్డుది ఉండేది. నిజానికి ఇంటర్మీడియట్ బోర్డును అప్పట్లో మాధ్యమిక విద్యామంత్రి చూసేవారు. ఈ గందరగోళం నుంచి పూర్తిస్థాయిలో ఉన్నత విద్యకు తెలుగు అకాడమిని మార్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 31న జీవో 909 ద్వారా భాషా- సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తూ ఆ మంత్రిత్వ శాఖ ఆధీనంలోకి మార్చారు. అంతవరకూ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు వేరే మంత్రి ఉండగా, భాషాశాఖ నేరుగా ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండేది. ఉన్నత విద్య నుండి తెలుగు యూనివర్శిటీని సాంస్కృతిక శాఖలోకి మార్చి చేతులు కాల్చుకున్నాక, తిరిగి ఉన్నత విద్యాశాఖలోకి మార్చిన ప్రభుత్వం ఆ అనుభవం తర్వాతనైనా పాఠం నేర్చుకోకుండా తెలుగు అకాడమిని ఉన్నత విద్యాశాఖ నుండి సాంస్కృతిక శాఖలోకి మార్చింది. దాంతో తెలుగు అకాడమి కష్టాలు రెట్టింపయ్యాయి. ఈక్రమంలో రాష్ట్ర విభజన జరగడం, అప్పటికే సంచాలకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కె యాదగిరిని తాత్కాలిక ప్రాతిపదికపై మరో ఆరు నెలలు గడువు పొడిగించారు. ఆయన పదవీకాలం జూన్ 28తో ముగిసింది. తర్వాత కొత్త సంచాలకుడి నియామక అవసరాన్ని సిబ్బంది ఇరు రాష్ట్రాల దృష్టికీ తెచ్చారు. అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ఎత్తుగడలను గమనిస్తూ వచ్చాయి. ఉన్న అకాడమి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టయితే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకాడమిని ప్రారంభించాల్సి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం ప్రస్తుత అకాడమి ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుందని, కొత్త అకాడమిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సాంకేతిక ఇబ్బందులున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సంచాలకుడిగా సత్యనారాయణ రెడ్డిని నియమించింది. గతంలో నిథిమ్, ఎన్‌ఎసిల సంచాలకులుగా ఐఏఎస్ అధికారులను ఇరు రాష్ట్రాలూ నియమించినపుడు తలెత్తిన వివాదం తరహాలో ఇప్పుడు తెలుగు అకాడమిలో సరికొత్త సమస్య ఎదురవుతోంది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading