అక్షర

అతిశయోక్తులు లేని అద్భుత కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచార్య చాణక్య
- ఒక దేశభక్తుని పోరాటగాథ
పేజీల సంఖ్య: 200
వెల: రూ.180/-లు
ప్రతులకు: సద్గుణబాల పక్షపత్రిక
ఇ.నెం.2-4-740/4/2,
హరిశ్చంద్రపేట,
కాచిగూడ, హైదరాబాద్-027.
9441433188, 9441216122

రాజకీయాలు అంటేనే కుట్రలు, కుతంత్రాలు, హత్యలు సహజమనే ధోరణి అధికంగా కన్పిస్తుంది. కానీ, రాజకీయాలకు అసలైన నిర్వచనం సుపరిపాలన, ప్రజాక్షేమం, నిష్పక్షపాతం, నీతి, నిజాయితీ, సత్యాన్ని ఆచరించడం, దేశ, ధర్మాలను రక్షించడం. దేశం సురక్షితంగా ఉంటేనే అందులో ఇమిడి ఉండేవన్నీ పది కాలాలపాటు నిలువగలవు. కులము, ప్రాంతము, భాషా, వర్ణము, వర్గము ఇలా ఎన్నోరకాలైన బేధభావాలు మనుషులను దూరంచేస్తున్నాయి. వీటన్నిటిని రూపుమాపాలంటే అందరిలో సమైక్యత సాధించడం అవసరం. అందుకోసం చాణక్యుడు పడిన తపనను కళ్లకుకట్టినట్లుగా రచయిత డి.ఆర్. ఎస్.నరేంద్ర వర్ణించిన తీరు ‘‘ఆచార్య చాణక్య- ఒక దేశభక్తుని పోరాటగాథ ’’లో దర్శించవచ్చు. పుస్తకం ప్రారంభిస్తేచాలు చివరివరకు చదివించే విధంగా కథనం రూపొందించబడింది. ఎక్కడ అపోహలు, అతిశయోక్తులకు తావులేకుండా ఇదేదో అభూతకల్పన అని కొట్టిపారేయకుండా సహజమైన తీరులో చాణక్యుని జీవితం కొనసాగుతుంది. అలెగ్జాండర్ దండయాత్ర నుండి మొదలుపెట్టి చంద్రగుప్తుని మగధ సామ్రాజ్యానికి పట్ట్భాషిక్తుని చేసేవరకు చాణక్యుని పోరాట గాథ ఉత్కంఠగా సాగుతుంది. పాటలీపుత్రం చేరుకునే ముందు చాణక్యునికి గతం జ్ఞాపకం వస్తుంది. మానావమానాలను పక్కనపెట్టి దేశంకోసం పోరాడిన తీరు రచయిత చక్కగా తెలియజేశారు. ప్రత్యర్థుల మనసులో ఏమున్నదో అంచనావేయడం, అది ఏ సమయంలో ప్రకటితమవుతుందో క్షణాలతోసహా లెక్కకట్టి అందుకు తగ్గట్లుగా ప్రతి వ్యూహాలను రూపొందించి విజయం సాధించిన చాణక్యుని జీవితం అందరికి స్ఫూర్తినిస్తుంది. రాజకీయాలలో ఉండేవారికే కాదు. దేశ భవిష్యత్తును నిర్మాణంచేసే ఉపాధ్యాయుల పాత్రను ఈ రచనలో ప్రముఖంగా ప్రస్తావించారు.
మహాసామ్రాజ్యాధినేతలు ఒకరు అలెగ్జాండర్ అయితే మరొకరు ధననందుడు. ఇరువురిని ఎదుర్కొన్న సమయంలో చాణక్యునివద్ద ఉన్న సాధనాసంపత్తులు ఏమిలేవు కేవలం ఉపాధ్యాయ వృత్తి తప్ప. దాని ఆధారంగా దేశకార్యం ఎలా సాధ్యమవుతుంది అంటే చాణక్యుని పుస్తకం చదివితేనే తెలుస్తుంది. తక్షశిలలో కులపతి అన్న మాటలు పాటలిపుత్రంలో ధననందుని చేతిలో అవమానం పాలైనప్పుడు జ్ఞప్తికి వస్తాయి. ‘‘లే చాణక్యా! దేశాన్ని రక్షించే బాధ్యత శాసనం చేయలేనప్పుడు ప్రభుత్వాలు చేతులు ముడుచుకుని కూర్చుని ఉన్నప్పుడు ఈ మహత్కార్యం ఉపాధ్యాయుల చేతిలో ఉంది. లే! నిద్రాణమైన భారత జాతిని మేల్కొల్పు! భారతదేశాన్ని జాగృతం జేయి! లే! ఇదే మంచి తరుణం. ప్రజలందరిని సమైక్యతాయజ్ఞంలో భాగస్వాములను చేయవలసినదే! పుణ్యభూమి! కర్మభూమి అయిన భారతదేశాన్ని సనాతన సంస్కృతిని రక్షించవలసినదే! మానవుల జీవితం ధర్మబద్ధంగా కొనసాగాలంటే మన దేశాన్ని రక్షించుకోవలసినదే! లే! దేశానికి మార్గదర్శనం చేసే అవకాశం ఉపాధ్యాయులకు వచ్చింది. దీనిని కర్తవ్యంగా స్వీకరించి ముందుకు కదులుదాం. ఈ మాటలు మనసులో మెదలుతునే ఉన్నాయి. నెమ్మదిగా లేచిన చాణక్యుడు తన శిఖ ముడిని విప్పాడు. ‘‘ఈ ధననందుని పదవినుండి తొలగించి సర్వనాశనం చేస్తాను. దేశద్రోహానికి పాల్పడుతున్న ఒక్కొక్క రాజును సరైన మార్గంలో పెట్టేంతవరకు ఆచార్య చాణక్యుని పుత్రుడైన నేను నా శిఖకు ముడివేయను’’. ఇలా చాణక్యుని ప్రతిజ్ఞకు అసలైన కారణాన్ని తెలిపారు. ప్రపంచ విజేత కావాలని వచ్చిన అలెగ్జాండర్‌ను భారతీయులు ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టారో ఈ పుస్తకంలో వివరించబడింది. భారతదేశంనుండి తిరిగి వెళ్తూ అలెగ్జాండర్ మనోగతం భారతదేశం యొక్క శౌర్యపరాక్రమాలకే కాదు ఆధ్యాత్మిక శక్తికి అద్దంపట్టే విధంగా రచయిత వివరించారు. ఇంకా చాణక్యుని యొక్క రాజనీతిజ్ఞత, దేశభక్తి, నిరాడంబరత, అంతకుమించి శత్రువులకు అంతుచిక్కని వ్యూహాలను రూపొందించిన తీరుతెన్నులు తెలుసుకోవాలనుకుంటే ‘‘ఆచార్య చాణక్య- ఒక దేశభక్తుని పోరాటగాథ’’ పుస్తకం చదవ వలసిందే! అల్లిబిల్లిగా అల్లుకుని ఉన్న కథాంశం అయినప్పటికి ఎక్కడ గజిబిజి లేదు. 200 పేజీల విస్తృతమైన కథనంలో పాఠకుల ఉత్కంఠకు ఎక్కడ అంతరాయం కలగదు అని ముందు మాటలో రాజవౌళిగారు చెప్పినది సత్యం.

-గౌరిగారి గంగాధర్‌రెడ్డి