Others

ఆడంబరాలు .. అనుబంధాలకు బీటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా పనిమనిషి అత్తగారు ధనిష్టా పంచకంలో మరణించింది. ఇల్లు ఆరు నెలలు పాడుపెట్టాలని చెప్పారు (శ్రామిక వర్గంలో ఇటువంటి నమ్మకాలున్నట్లుగా ఇదివరలో వినలేదు). ప్రస్తుతం ఆ కుటుంబం ప్రభుత్వమిచ్చిన ఇంట్లో నివసిస్తోంది. నెలకి రెండు వేలయినా పెట్టనిదే అద్దెకు ఇల్లు దొరకదు. ఆరునెలలకే కావాలంటే అద్దెకిచ్చేవారు తటపటాయిస్తారు. ఇప్పుడు నివశిస్తున్న ఇంటికి దూరంగా వెళ్లిపోతే పనికిరావడం కష్టం. పురోహితుడు పరిష్కారం చెప్పాడు. హోమం చేయించుకుంటే ఇల్లు ఖాళీ చెయ్యక్కర్లేదట (ఇటువంటి మధ్యేమార్గాలుంటాయా). అయిదారువేలు ఖర్చయింది. చిట్టీ పాడి డబ్బు తెచ్చుకున్నానని చెప్పింది.
అప్పటికీ నేను ‘‘నువ్వు పూజించే ఎల్లమ్మ తల్లికి మొక్కుకో. ఆ తల్లి నిన్ను చల్లగా చూస్తుంది. హోమం ఖర్చు ఎలా పెట్టుకోగలవు’’ అన్నాను. తను ఒప్పుకోలేదు. మా ఇళ్ళల్లో పనిచేస్తున్నపుడు బాగానే ఉంటుందనీ, ఇంటికెళ్ళేసరికి కడుపునొప్పి ప్రారంభవౌతోందనీ అంది. పూర్వమైతే పల్లెలో ఇళ్ళు పాడుపెట్టాల్సినా కష్టముండేది కాదు. వెనకనున్న దొడ్డివైపు పాకలాంటి ఇల్లుండేది. బంధువుల ఇళ్ళల్లో సద్దుకోడమూ ఇబ్బందిగా ఉండేది కాదు. ఆధునిక కాలంలో సాధ్యం కాని ఆచారం, పాటించలేకపోతే ఖర్చుతో కూడిన పరిష్కారం.
ధనిష్టా పంచకంలో మరణం సంభవించినపుడు ఇల్లు పాడుపెట్టడం కొంతవరకూ అర్థం చేసుకోవచ్చు. మతపరమైన, జ్యోతిషానికి సంబంధించిన నమ్మకాలుంటాయి. అటువంటివి లేని చోట్లా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. మా పనిమనిషే ఇంకో విషయం చెప్పింది. ఆమె తమ్ముడి కూతురు ‘పెద్దమనిషి’ (రజస్వల, పుష్పవతి) అయింది. ఫంక్షన్‌కి వెడుతున్నాననీ, రెండు రోజులు రాననీ చెప్పింది. సింపుల్‌గా ఇంట్లో వాళ్ళమే చేసుకుందామని చెప్పాననీ, మరదలు వినలేదనీ అంది. ‘పదివేలు ఖర్చుంటుందా’ అని అడిగాను. నా అమాయకత్వానికి జాలిపడుతున్నట్లుగా చూసి ‘యాభై వేలకి తక్కువ కాదు. ఇంకా ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్ళకీ ఇలాగే చెయ్యకపోతే ఊరుకుంటారా అని అడిగాను. వినలేదు. మరదలకి డబ్బు లెక్కలేదు. భర్త ఎంతకని అప్పు తెస్తాడు అనైనా ఆలోచించదు’ అంది.
శ్రామిక వర్గంలోనే కాదు మధ్యతరగతిలోనూ ఇదే పరిస్థితిని గమనించవచ్చును. పెళ్ళిళ్ళలో అయితేనేమి, చావులో అయితేనేమి, గృహప్రవేశాలకైతే ఏమి, ఆడపిల్లలు రజస్వల అయినప్పుడైతేనేమి ఖర్చుకి లెక్క ఉండడంలేదు. ధనవంతులైతే చేసుకోవచ్చు, మనం వారితో తూగగలమా అన్న ఆలోచన ఎక్కడా కనిపించడంలేదు. కుటుంబ నియంత్రణ కూడా కొంతవరకూ కారణమేమో. ఒక్కగానొక్క ఆడపిల్ల, ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అన్న భావం మధ్యతరగతిలో బాగా వ్యాపించింది. పని సులువుగా అయిపోడానికి ఫంక్షన్ హాళ్ళూ, కాటరింగ్ సర్వీసూ, డెకరేటర్స్, హోటల్స్ ఉండనే ఉన్నాయి. అన్నిటినీ మించి క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ పేరుతో అప్పులివ్వడానికి బాంకులున్నాయి. భర్తకు తెలియకుండా అప్పు చెయ్యాలంటే కాల్‌మనీ ఫెసిలిటీ ఉండనే ఉంది.అప్పు చెయ్యడానికి ఫంక్షన్స్ ఒక్కటే కారణం కాదు. బజారులో ఉన్న ప్రతి వస్తువూ ఇంట్లో ఉండాలన్న కోరిక పెరిగిపోతోంది. ధనవంతులతో సమానంగా అన్నీ అమర్చుకుని వారిలా జీవించడాన్ని సోషల్ క్లైంబింగ్ అని అంటారు. అన్నీ కొనుక్కోడానికి డబ్బుండాలి. లేకున్నా కొనుక్కునే సదుపాయాన్ని సరుకులు అమ్మేవారే కల్పిస్తున్నారు. లోన్స్, ఇన్‌స్టాల్‌మెంట్ స్కీములు, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు.
కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారన్నట్లుగా ‘‘ముందు ఆస్తి చూసి అప్పిస్తారు. ఆ తరువాత మనిషిని పీక్కుతింటారు’’. ప్రస్తుతం ఆస్తి ఉన్నా లేకున్నా అప్పులిచ్చేవారున్నారు. అప్పుతీసుకున్నవాణ్ణో, ష్యూరిటీ ఇచ్చినవాణ్ణో పట్టుకుని నెత్తురు పీల్చేస్తున్నారు. అప్పు ఇస్తామని వెంటబడేదీ వాళ్ళే, తీర్చకపోతే నెత్తురు పీల్చేదీ వాళ్ళే.
ఈ సమస్యకి పరిష్కారమేమిటి? అప్పు చేసేముందు ఆలోచించి కానీ అడుగువెయ్యకపోవడమే. పిల్లలు బాగా తెలివైనవారైనప్పుడు వారి ఉన్నత విద్యకై అప్పు చెయ్యవచ్చును. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే అప్పు చెయ్యవచ్చు. మనం చేసిన అప్పును జాగ్రత్తగా మదుపు చేసి దానిపై వచ్చే ఆదాయంతో అప్పు తీర్చెయ్యగలమన్న నమ్మకముంటే అప్పు చెయ్యవచ్చు. కేవలం ఫంక్షన్స్ గ్రాండ్‌గా చెయ్యడానికో, విలాస వస్తువులు కొనుక్కుందుకో అప్పు చెయ్యడం ఎంత మాత్రమూ తగదు.అప్పు తెచ్చి జాగ్రత్తగా మదుపు చేసి ఆదాయంలో అప్పు తీర్చడమనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. షేర్ మార్కెట్ దూసుకుపోతున్నప్పుడో, బంగారం పెరుగుతున్నప్పుడో అప్పు చేసి లాభాలు సంపాదించాలనుకోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం సర్వసాధారణం. ఆదాయం చాలా రెట్లు పెరిగి తీరుతుందన్న నమ్మకముంటేనే కానీ అప్పు చెయ్యరాదని ఆర్థికశాస్తవ్రేత్తలు చెప్తారు. పెరిగిపోతుందని కన్సలెంట్స్ లెక్కలు చూపిస్తారు కానీ ఎవరంతట వారు లెక్కలు వేసుకోవాలి, అందుకు తగినట్లుగానే నిర్ణయాలు తీసుకోవాలి.అప్పు విషయంలో యధా రాజా తధా ప్రజ అన్నది నిజమేననిపిస్తుంది. బ్రిటీషు వారు మన దేశాన్ని వదిలిపోతున్నపుడు మిగులు బడ్జెట్ ఇచ్చేవెళ్ళారు. దేశ ప్రథమ ప్రధానమంత్రిగారు పెద్ద స్టీలు ఫాక్టరీలు కట్టి దేశాభివృద్ధిని సాధించాలనుకున్నారు.
వకీల్, బ్రహ్మానంద వంటి వారిచ్చిన వేజ్- గూడ్స్ మోడల్ (సామాన్య పౌరులకి ఆదాయం పెంచి, వారిచే వస్తువులు కొనిపించడం) నచ్చలేదు. గ్రోత్‌మోడల్ అనుకున్నంతగా ఫలించలేదు. అప్పుల ఊబి నుంచి దేశమే బయట పడనప్పుడు దేశ పౌరులు కూరుకుపోకుండా ఉండడం సాధ్యమా?

-పాలంకి సత్య