అదిలాబాద్

పంట క్షేత్రాల్లో అక్రమంగా గంజాయి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 22: పచ్చని పంట పొలాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న పంటక్షేత్రంపై శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగువేల గంజాయి మొక్కలతో పాటు ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు రెండు క్వింటాళ్ల గంజాయి నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్ మండలంలో కొండకోనల నడుమ మారుమూల గిరిజన పల్లె లోహార గ్రామానికి చెందిన రైతు సూర్యవంశీ నివర్తి తన పంట చేనులో పత్తి, కంది పంటలు సాగుచేస్తూనే మద్యలో ఎవరికి తెలియకుండా మూడు ఎకరాల్లో గంజాయి పంటను సాగుచేశాడు. గంజాయి చేతికి వచ్చే దశలోనే సమాచారం ఎక్సైజ్ అధికారులకు తెలియడంతో శనివారం మాటువేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కె.రమేష్, ఎస్సై కిషన్, సిఐ ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ అధికారి రాజేశ్వర్, సిబ్బంది లంక విఠ్ఠల్, పి.రాజేశ్వర్, బాపురావు, రషీద్‌ఖాన్, సిబ్బంది హుటాహుటిన లోహార గ్రామానికి వెళ్ళి పంట చేనులో సాగుచేస్తున్న నాలుగువేల మొక్కలను స్వాధీనపర్చుకొని ధ్వంసం చేశారు. ఆ తర్వాత రైతు సూర్యవంశీ నివార్తి ఇంట్లో నిల్వ ఉంచిన రెండు క్వింటాళ్ల గంజాయి నిల్వలను స్వాదీన పర్చుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ సంకరి రమేష్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని అన్నారు. కాగా, సిబ్బంది చాకచక్యంగా దాడులు నిర్వహించి భారీ గంజాయి నిల్వలను స్వాధీనపర్చుకొని అక్కడే ధ్వంసం చేయడం పట్ల ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సర్వేశ్వర్‌నాథ్ సిబ్బందిని అభినందించారు. అయితే ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగుచేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, త్వరలోనే అక్రమ గంజాయి సాగు నిల్వలపై దాడులు చేస్తామని సూపరింటెండెంట్ అనిత తెలిపారు.

పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
* కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన రైతు జెఏసీ నాయకులు
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 22: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ శనివారం రైతు జెఏసీ నాయకులు కలెక్టర్ బుద్ద ప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు జెఏసీ నాయకులు దారట్ల కిష్ఠు, ముడుపు ప్రభాకర్ రెడ్డి, బండి దత్తాత్రిలు మాట్లాడుతూ అతివృష్టి వల్ల రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగిందని అన్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల దెబ్బతిన్న, రంగు మారిన సోయా, పెసరి, మినుము, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలుచేసి రైతుల గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు. మార్కెట్‌లో విక్రయించడానికి వచ్చే రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సిసిఐ) ద్వారా పత్తి సీజన్ ముగిసేవరకు కొనుగోళ్లు జరిపేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో రైతు జె ఏసీ నాయకులు పోశెట్టి, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రాజు, గంగారెడ్డి, విఠ్ఠల్, కస్తాల సుధాకర్ తదితరులు ఉన్నారు.

రైతు సమస్యలపై బిజెపి ధర్నా
ఉట్నూరు, అక్టోబర్ 22: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలనువెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సంధర్భంగా పలువురు బిజెపి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం చోద్యంచూస్తుందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక నష్టపోయిన రైతాంగం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాల్సి ఉండగా దశలవారీగా మాఫీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెండింగ్ బకాయిలకు వడ్డీ బ్యాంకర్లు విధిస్తుండడం వల్ల రైతులు మరింత అప్పులో కూరుకుపోతున్నారని అన్నారు. ఇటీవల భారీ వర్షాల వల్ల రైతులు పండించిన పంటలకు తీవ్ర నష్ట వాటిల్లిందని, వాటిపై సర్వేచేయించి యుద్దప్రతిపాదికన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బిజెపి గిరిజన మోర్చా జాతీయ కార్యదర్శి గుగ్లావత్ శ్రీరాం నాయక్, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, నాయకులు రమేష్, ఉశన్న, రాజన్న, శ్రీకాంత్, రమణ, వెంకటేష్, సునిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో ట్రిపుల్ ఐటి విద్యార్థినికి బంగారు పతకం
* విద్యార్థిని అభినందించిన విసి సత్యనారాయణ
బాసర, అక్టోబర్ 22: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటికి చెందిన ఎ.స్నేహిత విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించింది. ఈ నెల గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌లో రూరల్ అసోసియేషన్ తరపున నిర్వహించిన అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో 66వ కెజిల విభాగంలో ఎ.స్నేహిత బంగారు పతకాన్ని సాధించిందని కళాశాల పిడి శ్యాంబాబు తెలిపారు. శనివారం పథకం సాధించిన విద్యార్థినిని కళాశాల వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ ఘనంగా అభినందించారు. బాక్సింగ్ పోటీల్లో మరింత రాణించేందుకు కళాశాల తరపున ఎల్లవేలల ప్రోత్సాహం అందిస్తామని విసి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎవొ రాజేశ్వర్, సెక్యూరిటి ఆఫీసర్ వజిరొద్దిన్, రాకేష్‌కుమార్, రవికిరణ్, సోని,తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో వౌళికసదుపాయాలు కల్పించాలి
* జిల్లా జాయింట్ కలెక్టర్ శివలింగయ్య
నిర్మల్, అక్టోబర్ 22: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పౌరసరఫరాల అధికారులు, ఐకెపి, డిసిఎంఎస్ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమీక్షించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలుచేసి వెంట వెంటనే రవాణా అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులకు ఇబ్బంది కలగకుండా టెంట్, కొనుగోలు కేంద్రాన్ని సూచించే ఫ్లెక్సీలను పెట్టాలన్నారు. అలాగే తూకం వేసిన ధాన్యాన్ని గన్నీ బ్యాగుల్లో నింపి వెంటనే చుట్టాలన్నారు. పనులు బాద్యతగా తీసుకుని చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో సరైనన్నీ గన్నీబ్యాగులు, తూకం మిషన్‌లు,తేమ మిషన్‌లు, ఒకవేళ వర్షం వస్తే తడవకుండా ఉండేందుకు టార్ఫాలిన్‌లు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడికక్కడ గోదాములను గుర్తించి రైతులు తీసుకువస్తున్న ధాన్యాన్ని రవాణా చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్‌లకు తరలించాలన్నారు. ధాన్యం తరలించేటప్పుడు ఏ సెంటర్‌కు ఏ రైస్‌మిల్‌కు ధాన్యం తరలిస్తున్నారనే విషయాన్ని ఆయా సంచులపై పేర్లు రాయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుచేస్తే శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఎపిఎం, గోపాల్, డిపిఎం తదితరులు పాల్గొన్నారు.

పిహెచ్‌సిల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
* పలు ఆరోగ్య కేంద్రాల తనికీ, ఎఎన్‌ఎం పనితీరుపై ఆరా
కడెం, అక్టోబర్ 22: నిర్మల్ జిల్లాలోని కడెం,దస్తురాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం పలు హెల్త్ సబ్‌సెంటర్లను నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరితి సందర్శించి పలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గ్రామాల్లో ఉన్న ఎఎన్‌ఎంల పనితీరుపై ఆరాతీస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, సిబ్బందికి హడలెత్తించారు. ముందుగా మండల కేంద్రమైన దస్తురాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఇలంబరితి సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ ఆసుపత్రిలోని వైధ్యాధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టార్లను ఆయన పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పలు గ్రామాల హెల్త్ సెంటర్లను, ఎఎన్‌ఎంలు స్థానికంగా ఉండి వైద్య సేవలు గ్రామాలకు అందిస్తున్న విషయాలపై కలెక్టర్ ఆరాతీశారు. దస్తురాబాద్‌లో సబ్‌సెంటర్‌ను పరిశీలించగా స్థానిక ఎఎన్‌ఎం విధుల్లో లేకపోవడం వలన కలెక్టర్ ఎఎన్‌ఎం గురించి చరవాణిలో వాకబుచేయగా స్థానిక ఎఎన్‌ఎం ఇస్తారాణి దేవునిగూడెం వివాహంలో ఉండి విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పడంతో అక్కడి నుండి వెంటనే దేవున్ని గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులను కలిసి ఏ ఎన్ ఎం ఇస్తారాణి ఆరాతీయగా ఆమె విధుల్లో లేకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎఎన్ ఎంపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా డిఎంహెచ్‌వో జలపతినాయక్‌కు ఆదేశించారు. దేవునిగూడెం గ్రామంలో పలు రిజిస్టార్లను కలెక్టర్ తనిఖీలు చేశారు. దేవునిగూడెం గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయించాలని, రోడ్డు కోసం అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, అటవీశాఖ నుండి అనుమతి ఇప్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత గొడిసిర్యాల, రేవోజిపేట్ గ్రామాలను సందర్శించి స్థానిక హెల్త్ సబ్‌సెంటర్లకు వెళ్లి కలెక్టర్ ఆరాతీశారు. ఈ గ్రామాల్లో స్తానిక సబ్‌హెల్త్ సెంటర్లలో ఎఎన్‌ఎంలు ఉండడం, విధులు సక్రమంగా నిర్వర్తించడం, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించి ఎఎన్‌ఎం విధులపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. రేవోజిపేట్ గ్రామస్తులు, రైతులు గ్రామంలో పశువైద్యశాల ఉన్న పశువైద్యాధికారి లేకపోవడంతో పశువులకు వైద్యం అందడంలేదని, గ్రామానికి రెగ్యులర్ పశువైద్యాధికారిని నియమించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న కడెం మండల పశువైద్యాధికారి విజయ్‌కుమార్‌తో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కడెం దస్తురాబాద్ మండలానికి తాము ఒకే పశువైద్యాధికారి ఉండడం పశువులకు వైద్యం అందించలేకపోతున్నామని వైద్యాధికారి విజయ్‌కుమార్ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. రేవోజిపేట్ గ్రామంలో 3 రోజులు ఉండి పశువులకు వైద్యం అందించాలని వైద్యాధికారికి విజయ్‌ను ఆదేశించారు. ఆ తర్వాత దోస్తునగర్ గ్రామంలో కలెక్టర్ బలంబరితి సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏ ఎన్ ఎంలపై ఆరాతీశారు. గ్రామంలోనే ఎఎన్‌ఎంలిద్దరు విధులు నిర్వహిస్తున్నందుకు వారి విధుల పట్ల సంతృప్తివ్యక్తంచేశారు. అక్కడ స్థానిక ఎఎన్‌ఎంల వైద్య ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పలురికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు, గర్భిణీలకు వండిపెడుతున్న ఆరోగ్యలక్ష్మిపథకం, మద్యాహ్న భోజనంను కలెక్టర్ పర్యవేక్షించారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంపై అంగన్‌వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నిర్మల్ డిఎంఅండ్‌హెచ్‌వో జలపతినాయక్, దస్తురాబాద్ సర్పంచ్ గాజర్ల గంగామణి, ఎంపిటిసి మల్లేష్‌రెడ్డి, ఉప సర్పంచ్ కమలాకర్‌గౌడ్, హెల్త్ సూపర్‌వైజర్లు, దస్తురాబాద్ ఆర్‌ఐ రవీందర్‌నాయక్, తదితరులు ఉన్నారు.

దేశీదారు నియంత్రణకు ఉమ్మడిగా దాడులు
* జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, అక్టోబర్ 22: అక్రమ దేశీదారును నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడిదాడులు చేపట్టాలని జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ ఎక్సైజ్ అధికారులకు సూచించారు. శనివారం స్థానిక పోలీసు కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ అధికారి కె.అనీత, స్థానిక ఇన్స్‌పెక్టర్ సర్వేశ్వరనాథ్‌తో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్రమ మద్యం నివారణకు, గుడుంబ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్, పోలీసు సిబ్బంది ఉమ్మడిగా దాడులు నిర్వహించాలన్నారు. గుడుంబ రహిత జిల్లాగా కొనసాగాలంటే తయారీ కేంద్రాలపై నిరంతరం దాడులు చేయడం, వారిపై నిఘా ఉంచడం ఒక్కటే మార్గమని అన్నారు. ముఖ్యంగా సరిహద్దుల గుండా అక్రమ దేశీదారును నియంత్రించడంతో పాటు గుడుంబ తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నూతనంగా నాలుగు పోలీసు స్టేషన్‌లతో నిఘా మరింత పెరుగుతుందని, డివిజన్ స్థాయిలో ప్రత్యేక ఉమ్మడి టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించాలని సూచించారు. ఎక్సైజ్ అధికారుల దాడుల్లో రక్షణగా అన్ని వేళల్లో పోలీసులు అందుబాటులో ఉంటారని, పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, అక్రమంగా తరలించడానికి సౌకర్యంగా ఉండే రోడ్డు మార్గాలను అనే్వశించి దాడులు నిర్వహించాలన్నారు. రైలుమార్గంలో సైతం పోలీసులు నిఘాను అప్రమత్తం చేయాలన్నారు.

పేపరు మిల్లుకు తాళం
ఆసిఫాబాద్, అక్టోబర్ 22: ఇబ్బడి ముబ్బడిగా పేరుక పోయిన అప్పుల కారణంగా మూతపడ్డ సిర్పూర్ పేపరు మిల్లును శనివారం ఐడిబిఐ బ్యాంకు ప్రతినిధులు స్వాధీన పరుచుకున్నారు. పేపరు మిల్లు యాజమాన్యం ఆయా బ్యాంకులకు బాకీ పడ్డ సుమారు 420 కోట్లలో అధికంగా ఐడిబిఐ బ్యాంకుకే చెల్లించాల్సి ఉంది. అప్పుల్లో కూరుక పోయిన పేపరు మిల్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈకంపెనీని ఫెప్సిల్ సంస్థ కొనుగోలు చేయనుందనే వార్తలతో పేపరుమిల్లు కార్మికుల్లో ఒకింత ఆశలు చిగురించాయి. కాని శనివారం ఐడిబిఐ బ్యాంకు ప్రతినిధులు అరవింద్, ప్రదీప్‌బాబు, రమేష్ సాయంత్రం 5-30 గంటలకు స్థానిక తహశీల్దార్ సురేష్ కదం సమక్షంలో ఈ మిల్లుకు తాళం వేశారు. ఎమ్మెల్యే కోనేరు కోణప్ప చొరవతో ఇప్పుడిప్పుడే పేపరు మిల్లు తిరిగి తెరుచుకుంటుందనే గంపెడాశతో ఉన్న కార్మిక వర్గాల్లో ఐడిబిఐ బ్యాంకు చర్యలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

నేడే కానిస్టేబుళ్ళ తుది రాత పరీక్ష
* నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
* హాజరుకానున్న 5343 అభ్యర్థులు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, అక్టోబర్ 22: ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కానిస్టేబుళ్ళ రిక్రూట్‌మెంట్ తుది రాత పరీక్ష ఆదివారం ఆదిలాబాద్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్ల పంపిణీ ఆన్‌లైన్ ద్వారా జారీ చేయగా నాలుగు జిల్లాల నుండి 5343 మంది అభ్యర్థులకు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంటవరకు పరీక్ష నిర్వహిస్తుండగా, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని జిల్లా ఎస్పీ మిట్ట శ్రనివాస్ తెలిపారు. గంట ముందే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని తెలిపారు. ఇదిలాఉంటే, పరీక్ష దృష్ట్యా జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు, ఇంటర్‌నెట్ సెంటర్లు మూసిఉంచాలని పోలీసులు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షలు సజావుగా సాగేందుకు 400 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులు నిర్వర్తిస్తారన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిఐ స్థాయి అధికారుతో పాటు 20 మంది పోలీసులు, ఇద్దరు మహిళా పోలీసులు విధుల్లో ఉంటారని అన్నారు. చీఫ్ పరీక్ష ఎగ్జామినర్‌గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.అశోక్‌తో పాటు హైదరాబాద్ జెన్‌టియు ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ పి.వసంత్‌కుమార్, చీఫ్ అబ్జర్‌వర్‌గా గ్రామీణ సిఐ పోతారం శ్రీనివాస్ బయోమెట్రిక్ విధానం అధికారిగా నియమించడం జరిగిందన్నారు.

చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి
* ఎమ్మెల్యే రేఖానాయక్
కడెం, అక్టోబర్ 22: రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి జలాశయాల్లో, చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేసి పెంపకం చేపడుతుందని తద్వారా ఈ పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులకు మరింత ఉపాధి అవకాశం కలుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధి కోసం మంజూరుచేసిన 18 లక్షల 50 వేల చేపపిల్లలను కడెం జలాశయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖ మాట్లాడుతూ గతంలో పాలించిన పాలకప్రభుత్వాలు ఏనాడు కూడా మత్స్యకారుల అభివృద్ది, సంక్షేమం కోసం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసి ఆర్ మత్స్యకారుల సంక్షేమం కోసం వారి ఉపాధి కోసం దాదాపు వందకోట్ల బడ్జెట్ నిధులు మంజూరుచేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఈ రోజు వందశాతం సబ్సీడితో మత్స్యకారుల ఉపాధి కోసం కడెం జలాశయంలో చేపపిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. కడెం, ఖానాపూర్‌లలో మత్స్యకారుల కోసం కమ్యూనిటి హాల్ భవనాలు మంజూరుచేయడం జరిగిందని ఆమె అన్నారు. అలాగే కడెంలో కూడా మత్స్యకారుల కోసం దాదాపు 10 లక్షల రూపాయల నిధులు కమ్యూనిటి భవనం కోసం మంజూరయ్యాయన్నారు. అలాగే కడెంలో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకోసం స్థలం కేటాయించాలని స్థానిక గంగపుత్ర సంఘం నాయకులు ఎమ్మెల్యే రేఖకు విన్నవించగా స్పందించిన ఎమ్మెల్యే స్థానిక నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు కోరగా పై అధికారులు స్థలం కేటాయించడానికి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాక జెడి ఎ శంకర్‌రాథోడ్, జిల్లా మత్స్యశాఖ అధివృద్ది అధికారి ఎడి బాలకృష్ణ, ఖానాపూర్ మార్కెట్ కమిటి ఛైర్మెన్ సక్కారాం శ్రీనివాస్, ఆత్మఛైర్మెన్ రాజారెడ్డి, పెద్దూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య, ఎంపిటిసి జాడి గంగాధర్, మార్కెట్ కమిటి డైరెక్టర్ రఫిక్ అహ్మద్, మండల కో ఆప్షన్ సభ్యుడి అయాసొద్దిన్, టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బుక్యబాపురావు, సత్యనారాయణ, ఎస్సారెస్పీ ఎస్ ఈ సత్యనారాయణ, కడెం ప్రాజెక్టు ఈ ఈ వెంకటేశ్వర్‌రావు, టి ఆర్ ఎస్ పార్టీ కడెం మండల అధ్యక్షులు నల్లజీవన్‌రెడ్డి, మండల ప్రధానకార్యదర్శి సతీష్, మండల నాయకులు రాజేశం, సాగర్, నాయకులు, మత్స్యపారిశ్రామిక సంస్థ జిల్లా అధ్యక్షులు పహల్వాన్, గంగపుత్ర సంఘం కడెం మండల అధ్యక్షులు గడప దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఏడాది కోటి మొక్కల పెంపకం
* జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ప్రకాష్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, అక్టోబర్ 22: భూమి స్వభావం, వాతావరణానికి అనుకూలంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని, జిల్లాలో వచ్చే ఏడాది నిర్దిష్ట కార్యాచరణతో వివిధ శాఖల ద్వారా నర్సరీల్లో కోటి మొక్కలు పెంచేందుకు ప్రణాళిక అమలుపర్చాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి కో అర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బుద్ద ప్రకాష్ మాట్లాడుతూ హరితహారం పథకం అమలులో గత సంవత్సరం జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి మొక్కకు లెక్కలు చూపుతూ భావితరాలను దృష్టిలో పెట్టుకొని 30శాతం పచ్చదనం ఉండేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాటుపడాలని కలెక్టర్ సూచించారు. హరితహారం పథకం పకడ్బందీగా నిర్వహించడానికి గాను మండల అభివృద్ధి అధికారులు ప్రధాన బాధ్యత వహించాలని, గ్రామ, మండలస్థాయిలో సర్పంచ్‌లు, అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసి ప్రణాళికబద్ధంగా ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలన్నారు. 2017 సంవత్సరానికిగాను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ద్వారా 13లక్షలు, సామాజిక అటవీశాఖ, టెటోరియల్ ద్వారా 60 లక్షలు, ఐటిడిఏ ద్వారా 20 లక్షలు, హార్టికల్చర్ ద్వారా 2లక్షలు, మున్సిపల్ కమిషనర్ ద్వారా 5లక్షల చొప్పున లక్ష్యం కేటాయించి, నర్సరీల ద్వారా లక్ష్యానికితగ్గకుండా మొక్కలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలవారీగా అధిక సంఖ్యలో మొక్కలునాటిన గ్రామాలను ఎంపిక చేసి నివేదికలు అందించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను జిల్లాలో నిర్వహిస్తున్న నర్సరీల వద్దకు తీసుకవెళ్ళి పెంచుతున్న మొక్కల వివరాలు, మొక్కలు నాటాల్సిన అవశ్యకత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అటవీ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా తక్కువ లక్ష్యంతో ఎక్కువ మొక్కలు నాటి ప్రణాళికబద్దంగా మొక్కలు సంరక్షించాలన్నారు. గతంలో అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్‌ను తిరిగి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి తిరిగి అడవుల జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా అటవీ అధికారి రాంబాబ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరితహారం పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలు, నర్సరీల ద్వారా పెంచుతున్న మొక్కల వివరాలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ, మండలాల వారీగా నర్సరీలలో పెంచుతున్న మొక్కల వివరాలు అందించాలని జిల్లా అటవీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఐలయ్య, జిల్లా పరిషత్ సి ఈవో జితేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రాజేశ్వర్ రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య, హార్టికల్చర్ డిడి నర్సింగ్‌దాస్, ఆర్‌అండ్‌బి ఈఈ వెంకట్ రెడ్డి, పిఆర్ ఈఈ మారుతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుబ్బారాయుడు, అటవీ రేంజ్ అధికారి శివకుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనీత ఇతర అధికారులు పాల్గొన్నారు.