అదిలాబాద్

గులాబీ పార్టీలో గ్రూపుల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 16: ముందస్తు జమిలి ఎన్నికలకు కేంద్రం పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు రూపుమారుతున్నాయి. అధికారం చేపట్టి నాలుగేళ్ళు గడిచిపోతున్నా సిట్టింగ్ స్థానాల్లో శాసన సభ్యులకు తిరిగి టిక్కెట్ దక్కుతుందా అన్న విషయంలో సందిగ్దత నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఐదుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో గుబులు పట్టుకుంది. తిరిగి 2019 ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికి టికెట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినా నేతల్లో మాత్రం భయం వీడడం లేదు. మరోవైపు అధికార పార్టీలోని అసమ్మతి నేతలు టికెట్ల కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుండడంతో టీఆర్‌ఎస్ పార్టీలో రాజకీయం రంజుకుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ఎస్టీ నియోజకవర్గంలో ఎంపి నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుల మధ్య గత ఏడాది కాలంగా అంతర్గతంగా రగులుతున్న గ్రూపు విబేధాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎంపి గెడం నగేష్ ఉత్సాహం చూపుతూ బోథ్ నియోజకవర్గంలోని బజార్‌హత్నూర్, తలమడుగు, తాంసి, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల్లో తనకంటూ గ్రూపును తయారు చేసుకొని పర్యటనలు సాగిస్తుండడం ఎమ్మెల్యే బాపురావు వర్గీయులకు మింగుడు పడని సమస్యగా మారింది. తన నియోజకవర్గంలో తలదూర్చి అసమ్మతిని రాజేయడంపై కినుక వహించిన రాథోడ్ బాపురావు పార్టీలో తాజా పరిణామాలు, నగేష్ అనుసరిస్తున్న విధానాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రి జోగురామన్నకు పరిస్థితిని వివరించగా ఇటీవల బాపురావును సర్దిచెప్పినట్లు సమాచారం. మరోవైపు నగేష్ ఆదివాసీల ఓటు బ్యాంకుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టేందుకు తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం నేపథ్యంలో అధిష్ఠానం నుండి నగేష్‌కు ఎమ్మెల్యే టికెట్ కోసం ముందస్తు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈసారి టికెట్ దక్కదనే ప్రచారం జోరందుకోవడంతో మాజీ ఎంపి రాథోడ్ రమేష్ పల్లెల్లో తిరుగుతూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం ముమ్మరం చేశారు. దీంతో ఇరు వర్గాల మద్య అసమ్మతి సెగ రగులుతోంది. రమేష్ రాథోడ్ తన తనయుడు రితేష్ రాథోడ్‌ను ఎంపి బరిలో దించ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి రాజకీయ హామీ తీసుకున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ , బెల్లంపల్లి నియోజకవర్గంలోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో ఉద్యమ ఊపులో గట్టెక్కిన సిట్టింగ్‌లకు పెరిగిపోతున్న ఆశావాహుల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల ముసుగులో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ సీట్‌పై కొందరు నేతలు కనె్నసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉద్యమనేతగా ముద్రపడిన లోక భూమారెడ్డి అవకాశం వస్తే వదిలిపెట్టేది లేదంటూ తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. అదే విధంగా సేవా కార్యక్రమాలతో తన సామాజిక వర్గాన్ని నమ్ముకొని ముందుకు దూసుకెళ్తున్న రవికిరణ్ యాదవ్ కూడా బరిలో దిగేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలను సొంత పార్టీ నేతలే ముప్పుతిప్పలు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఉపాధి రంగాల్లో తెలంగాణ అగ్రస్థానం
* త్వరలో 42వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు * బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, జూలై 16: ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగ సమస్య పెచ్చుమీరిపోయిందని, ఏడాది కాలంలోనే ప్రభుత్వం వివిధశాఖల్లో 40వేల ఉద్యోగాలను భర్తీచేయడమేగాక త్వరలో 42 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని బిసి బాలుర వసతిగృహంలో సోమవారం బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి విద్యార్థులకు నోట్‌బుక్‌లు, దుప్పటు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతిగృహాల్లో నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నత ప్రమాణాలతో వసతులు కల్పించడం వల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. బయోమెట్రిక్ విధానంతో పిల్లల హాజరుశాతం గణనీయంగా పెరిగి క్రమశిక్షణ అలవర్తుందన్నారు. జనాభాలో 90శాతం ఉన్న ఎస్సీ, బిసి, మైనార్టీ పిల్లల కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకవచ్చి సంక్షేమ ఫలాలు అందిస్తోందని, ఉన్నత స్థాయిలో రాణించేందుకు పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు. కార్పోరేట్‌స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందించడంవల్లే ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయని, ప్రైవేట్‌రంగంలో 4లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. గత పాలకులు బడుగు బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించారని, వసతి గృహాల విద్యార్థు ల పట్ల చిన్నచూపు చూశారన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కేవలం 20వేల ఉద్యోగాలు భర్తీచేసినట్లు పేర్కొనడం హాస్యస్పదమన్నారు. చదువు ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తాయని, ఇందుకోసం సంక్షేమ వసతిగృహాలకు అధిక నిధులు వెచ్చిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. తల్లిదండ్రుల కలనెరవేర్చేలా ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే వసతిగృహాల్లో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అశోక్, బిసి సంక్షేమ అధికారి ఆశన్న, వసతి గృహ అధికారి శివకుమార్, మున్సిపల్ చైర్మెన్ రంగినేని మనీషా, టీఆర్‌ఎస్ నాయకులు బాబన్న, బండారు సతీష్, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.

కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి
* మూడు వరదగేట్ల ఎత్తివేత * 19వేల క్యూసెక్కుల నీటి విడుదల
కడెం, జూలై 16: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అతిపెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పెరుగుతుంది. గత వారం రోజుల నుండి ప్రాజెక్టు ఎగువప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలమూలంగా వేలాది క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుకు వరదతాకిడి ఏర్పడింది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, గత రెండు రోజుల క్రితం ప్రాజెక్టు నీటి మట్టం 698 అడుగులకు ఉండగా, గత రెండు, మూడు రోజుల నుండి ప్రాజెక్టు ఎగవ ప్రాంతాల్లో భారీ వర్షాలుకురియడంతో దాదాపు 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరదనీరు కడెం జలాశయంలోకి వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై కడెం ప్రాజెక్టుకు చెందిన 7,9,11 నెంబరు గల వరదగేట్లను ఎత్తివేసి 19వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. గత రెండుమూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులో వేలాది క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరదనీరు రావడంతో ఫ్రాజెక్టు వద్ద ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్‌రావు, డిఈ మహేశ్వర్‌రెడ్డి, జెఈలు శ్రీనాథ్, సమద్‌లు మకాంవేసి నీటిమట్టం పెరుగుదల గురించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ విషయాన్ని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వారి సలహాలు, సూచనలను పాటిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా గోదావరి లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదలశాఖ అధికారులు వారికి ఆదేశించారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నీటిమట్టం 697.600 అడుగులకు ఉండగా ఇన్‌ఫ్లో వరదనీరు 5 వేల క్యూసెక్కుల వరకు వస్తుందని అధికారులు పేర్కొన్నారు.