అదిలాబాద్

భారీ వర్షం.. అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 17: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. గురువారం నుండి కురుస్తున్న కుంభవృష్టికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూరు, కాగజ్‌నగర్ డివిజన్‌లలో రహదారులు, అప్రోచ్‌రోడ్లు వరద ఉదృతికి కొట్టుకుపోవడంతో శుక్రవారం సాయంత్రం వరకు 70 గ్రామాలు జల దిగ్భంధంలోనే చిక్కుకుపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థంగా మారడంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలలో కాస్తా వర్షాలు తేరుకోవడంతో ఇప్పుడిప్పుడే ముంపు బాధితులు కోలుకుంటున్నారు. రాంనగర్, ఖానాపూర్, మహాలక్ష్మివాడ, తిర్పెల్లి, జి ఎస్ కాలనీ, హనుమాన్ నగర్, పిట్టల్‌వాడ, హనుమాన్ నగర్ కాలనీల వరద ముంపు బాధితులు దెబ్బతిన్న తమ ఇండ్లను మరమ్మత్తులు చేసుకుంటూ సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1650 ఇండ్లు వరద తాకిడికి దెబ్బతినగా వీటిలో 200లకు పైగా ఇండ్లు పూర్తిగా కూలిపోయినట్లు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 23వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 96వేల ఎకరాల్లో పత్తి పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. జైనథ్, బేల, తాంసి, తలమడుగు, భీంపూర్, ఇచ్చోడ, తలమడుగు, బజార్‌హత్నూర్ మండలాల్లో వేలాది ఎకరాలు పంట కోతకు గురికాగా సారవంతమైన భూములు సైతం వరదల్లో కొట్టుకుపోయాయయని గుర్తించారు. దీంతో రూ.36 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాగజ్‌నగర్, బెజ్జూర్, కౌటాల, జైనథ్, బేల, తాంసి మండలాల్లో పెన్‌గంగా పరివాహక ప్రాంతాలు వరద ఉదృతికి 12వేల ఎకరాల్లో పంట కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. పలు గ్రామాలు ఇప్పటికీ జల దిగ్భంధంలోనే చిక్కుకుపోవడంతో వందలాది కుటుంబాలు నిలువనీడ లేక నిరాశ్రయులుగా మిగిలారు. ఎక్కడ చూసినా రైతుల దైన్యపరిస్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. జిల్లా సరిహద్దులోని పెన్‌గంగా అంతరాష్ట్ర వంతెన స్థాయిలో వరద ఉదృతి పెరగడంతో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ స్వయంగా అక్కడికి వెళ్ళి పలు గ్రామాలను అప్రమత్తం చేశారు. కాగజ్‌నగర్ డివిజన్‌లోని వెంకట్రావ్‌పేట్ అంతరాష్ట్ర వారది పెన్‌గంగా నది వద్ద వరద ఉదృతిని సమీక్షించిన డిఎస్పీ సాంబయ్య పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టారు. బేల మండలంలోని సాంగి, పాటగూడ, జంబాడ, తోయగూడ, సాంగ్వి, సైద్‌పూర్ గ్రామాల్లో 300 ఎకరాల్లో వేసిన పత్తి పంట మొత్తం కొట్టుకుపోగా వంద ఎకరాల్లో భూమి కోతకు గురికావడంతో భవిష్యత్తులో విత్తులు విత్తుకునేందుకు సైతం మట్టిలేకుండా పోయిందని ముంపు రైతులు శుక్రవారం కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. మంత్రి జోగురామన్న శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడ, జైనథ్ మండలంలోని కాప్రి, తరోడ, ముంపు గ్రామాలను సందర్శించి, బాధితులను పరామర్శించారు. పెన్‌గంగా బ్యాక్ వాటర్‌తో బెదోడ గ్రామం శుక్రవారం నీటమునగడంతో గ్రామస్తులు పిల్ల పాపలతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్ళారు. జిల్లా కలెక్టర్ దివ్య భారీ వర్షంలో తడుస్తూ ఇంద్రవెల్లి, సిరికొండ ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి, ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించారు. లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాల్లోకి ఆశ్రయం పొందాలని పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని రాంపూర్‌గూడను సందర్శించి పొంచి వ్యాధుల నేపథ్యంలో క్లోరినేషన్‌కు ఆదేశించారు. అదే విధంగా గ్రామ ప్రజలకు శుద్దజలాన్ని తెప్పించి వారికి పంపిణీ చేశారు. మరోవైపు కాంగ్రెస్, బిజెపి నేతలు సైతం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వెంటనే ఏరియల్ సర్వే నిర్వహించి, బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే ఉట్నూరు ఏజెన్సీ మండలాల్లో శుక్రవారం 23 సెం.మీటర్ల వర్షపాతం రికార్డు కాగా ఇచ్చోడ, సిరికొండ, జైనథ్, బేల, తాంసి, భీంపూర్ మండలాల్లో 845 గృహాలు నీట మునిగి సామాగ్రి కొట్టుకుపోగా వీటిలో 200 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. భారీ వరదలకు ఆదిలాబాద్ జిల్లాలోనే 770 విద్యుత్ స్థంభాలు నేలకూలగా 30 గ్రామాలకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏజెన్సీలోని జైనూర్, గాదిగూడ, భీంపూర్, నార్నూర్ మండలాల్లో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహించడంతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ డివిజన్‌లో సుమారు 65వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి తీరని నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బెజ్జూర్, కౌటాల, కాగజ్‌నగర్ మండలాల్లో 260 ఇండ్లలోకి వరద నీరు చేరింది. జైనథ్ మండలంలోని తర్నం, తరోడ వంతెనలు కొట్టుకుపోవడంతో ఆరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.