అదిలాబాద్

గిరిజన సెగ్మెంట్లలో రూపు మారనున్న సమీక ‘రణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 17: ముందస్తు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తికాకముందే రాజకీయ వాతావరణం రోజుకో రీతిలో రంగులు మారుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో లంబాడాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు సాగిస్తున్న ఉద్యమం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదివరకే బోథ్, ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గాల్లో టీ ఆర్ ఎస్ పార్టీ లంబాడా అభ్యర్థులను ఖరారు చేయగా ఆసిఫాబాద్‌లో ఆదివాసీ తెగకు చెందిన సిట్టింగ్ అభ్యర్థి కోవ లక్ష్మికి టికెట్ కేటాయించారు. అయితే టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలోనే ఆదివాసీ సంఘాలు ఎన్నికల కార్యాచరణపై తుడుం మోగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లంబాడాలను తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తూనే మరోవైపు కీలకమైన ఈ ఎన్నికల్లో ఆదివాసీ అభ్యర్థులనే గెలిపించుకుంటామని ప్రతిజ్ఞబూనడం రాజకీయ నేతల్లో కలవరం పుట్టిస్తోంది. అంతేగాక ఖానాపూర్‌లో రేఖానాయక్, బోథ్‌లో రాథోడ్ బాపురావును ఓడించడమే గాక ఆదివాసీల పట్ల వివక్ష చూపుతున్న మంత్రి జోగురామన్నను వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తుడుం దెబ్బ ఆల్టిమేటం జారీ చేయడం అధికార పార్టీలో హడలెత్తిస్తోంది. తుడుం దెబ్బ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, ఈ క్రమంలో ఇదే జరిగితే ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదని ఇంటలీజెన్సీ వర్గాలు అంచనాకు వస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలను పరిశీలిస్తే బోథ్, ఆసిఫాబాద్‌లో లంబాడాల కంటే ఆదివాసీల ఓట్లే అధికంగా ఉండడంతో రాజకీయ సమీకరణలు రూపుమారే అవకాశాలు లేకపోలేదు. పైగా గిరిజనేతరుల మద్దతును కూడగట్టుకొని ఆదివాసీ అభ్యర్థులు ప్రచారం సాగించేలా వ్యూహం రూపొందిస్తున్నారు. బోథ్ నుండి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే తుడుం దెబ్బ అధ్వర్యంలో ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తానని ఇంద్రవెల్లిలో జరిగిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు తేల్చిచెప్పడం కొసమెరుపు. ప్రస్తుతం కాంగ్రెస్ నుండి ఆత్రం సక్కు ఆసిఫాబాద్ టికెట్‌ను ఆశిస్తుండగా బోథ్ నుండి సోయం బాపురావు, కోసెరావు, కుమ్రం కోటేశ్వర్ ఆదివాసీ తెగ నుండి టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఖానాపూర్‌లో 22,500 ఓట్లు లంబాడా తెగకు చెందినవి కాగా 18వేల పైచిలుకు ఓట్లు ఆదివాసీ తెగ నుండి ఓటరు జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ గిరిజనేతరుల ఓట్ల మద్దతు కీలకం కావడంతో లంబాడా, ఆదివాసీ అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆసిఫాబాద్, బోథ్‌లో ఆదివాసీల ఓట్ల ప్రాబల్యం అధికంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అదే తెగకు చెందిన అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం కన్పిస్తోంది. ఖానాపూర్‌లో టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు తనయుడు కొట్నాక్ రమేష్, లీనారావు కాంగ్రెస్ నుండి టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనరల్ స్థానంలో పోటీ చేస్తున్న మంత్రి జోగురామన్నకు ఆదివాసీల సెగ దడ పుట్టించనుంది. రామన్నకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తామని ఇప్పటికే ఆదివాసీ సంఘాల ప్రకటించడంతో ఆదిలాబాద్ రూరల్, బేల మండలాల్లో అధికంగా ఉన్న వారి ప్రభావం ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించనుంది. ఇదిలా ఉంటే బిజెపి కూడా గిరిజనుల ఓట్లపైనే గాలం వేస్తూ పావులు కదుపుతూ అభ్యర్థులను రంగంలో దించేలా కసరత్తు సాగిస్తోంది. కాంగ్రెస్‌తో మహాకూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కిరాకపోగా అభ్యర్థుల ఎంపిక లో కూడా జాప్యం జరగడంతో ఆ పార్టీ ఆశావాహుల్లో అయోమయం నెలకొంది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారుతో ప్రచారం ముమ్మరం చేస్తుండగా మిగితా పార్టీలు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ప్రభావం చూపనున్న ఆదివాసీల బ్యాలెట్ తీర్పు ఎటుదారి తీస్తుందోనన్నది సర్వత్రా ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.