అదిలాబాద్

ప్రధాన పార్టీలలో టికెట్ల హై..టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: అధికార టీఆర్‌ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల కోసం టికేట్లను ఖరారు చేయడంతో ప్రధాన విపక్ష పార్టీలలో టెన్షన్ పెరుగుతుంది. ప్రతిపక్షాల మధ్య పొత్తులపై అవగాహన కుదరకపోవడం ఆశావహులు ఆయా పార్టీల నుండి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటంతో నియోజక వర్గాలలో ఉత్కంఠత నెలకొంది. టి ఆర్ ఎస్ పార్టీ జిల్లాలోని 10 నియోజక వర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన కొన్ని చోట్ల ఆసమ్మతి సెగలు వ్యక్తం అవుతునే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్, టిడిపి, సీపీఐ, టిజేఎస్‌ల మధ్య పొత్తులపై చర్యలు కొనసాగుతుండటంతో సీట్ల సర్దుబాట్లలో తమ టికేట్లు ఎక్కడ గల్లంతు అవుతాయో అనే అందోళన ఆశావహులలో వెంటాడుతుంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ ప్రచారం అన్ని నియోజక వర్గాలలో జోరందుకోగా మరో వారం రోజులలో ఆశీర్వాద యాత్రల పేరిట అపద్దర్మ ముఖ్యమంత్రి కేసి ఆర్ అన్ని నియోజక వర్గాలలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు అంతా ఈ సారి తమ రాజకీయ ప్రాబల్యం చాటుకునేందుకు కే సి ఆర్ బహిరంగ సభపైనే ఆశలు పెంచుకున్నారు. అయితే బోథ్ నియోజక వర్గంలో టికేట్ ఆశించి భంగ పడ్డ ఎంపి గెడం నగేష్, చెన్నూర్‌లో నల్లాల ఓదెలు వర్గంలో ఆసమ్మతి జ్వాలలు రగులుతునే ఉన్నాయి. వీరు ఆ పార్టీ అభ్యర్థులకు ఏమేరకు సహాకరిస్తారన్నది చర్చనీయాంశం అయింది. మరోవైపు కాంగ్రెస్, టిడిపి, టిజేఎస్, సిపిఐల మధ్య సీట్ల సర్దుబాటుపై పొత్తుల చర్చలు కొలిక్కి రాకపోవడంపై అభ్యర్థులలో హై టెన్షన్ మొదలైంది. ఈసారి తమకు ఉమ్మడిజిల్లా నుండి ఒక్క సీటు అయిన దక్కకపోతుందా అని టిజేఎస్, సిపిఐ, టిడిపి భావిస్తుండగా మరోవైపు ఆయా నియోజకవర్గాలలో పోటీలో ఉన్న అభ్యర్థులను బేరీజు వేసుకొని రంగంలోకి దిగేలా టిజేఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఖానాపూర్, బోథ్ నియోజక వర్గాలలో లంబాడ అభ్యర్థులకు టికేట్లు ఖరారు కాగ, కాంగ్రెస్ తరుపున ఖానాపూర్ నుండి రమేష్ రాథోడ్ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన టిఆర్‌ఎస్‌కు గుడ్‌బాయ్ చెప్పి ఆయన కుటుంబంతో పాటు అనుచరులు అంతా పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామాలను పసిగట్టిన టిజేఎస్ తెలంగాణ ఉద్యమంలో క్రీయ శీలకంగా వ్యవహరించిన భీం రావును ఖానాపూర్ నుండి పోటీ చేసి ఆదివాసీ, గిరిజనేతర ఓట్లతో గట్టేక్కేలా ఆశలు పెంచుకుంది. ఖానాపూర్, మంచిర్యాల, ముథోల్ సీట్లను తెలంగాణ జన సమితి ఆశలు పెంచుకోగా కూటమి పొత్తులలో భాగంగా పార్టీకి పట్టు ఉన్న ముథోల్ సీటును తమకు కేటాయించాలని ఆ పార్టీ నిర్మల్ అధ్యక్షులు పట్టుబడుతున్నారు. పొత్తు కుదిరితే టిడిపి నుండి తానే ముథోల్‌లో అభ్యర్థిగా రంగంలో ఉంటాననిప్రచారం గావిస్తున్నారు. బెల్లంపల్లి సీటు పై మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, సిపి ఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ సిపిఐ తరుపున సీటును ఆశిస్తు కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. సింగరేణి కార్మిక క్షేత్రంలో ఏఐటియూసికి పట్టు ఉన్నందున కార్మికుల ఓట్ల ప్రభావం నేపథ్యంలో బెల్లంపల్లి సీటును సిపిఐకి కేటాయించాలని ఒత్తిడి పెరుగుతుంది. గతంలో కూటమి తరుపున గుండా మల్లేష్ ఎమ్మెల్యేగా గెలుపోందిన అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.
ఆదివాసీల ఓట్లు ఎటువైపు..?
గిరిజన వర్గపోరు నేపథ్యంలో ఆదీవాసీ, లంబాడిల మధ్య ఈసారి ఎన్నికలలో ప్రచ్చన్న పోరుకు వేధిక కానుంది. ఆసిఫాబాద్, ఖానాపూర్, బోధ్ నియోజక వర్గాలలో ఆదివాసీల తెగల అభ్యర్థులకే ప్రధాన పార్టీలు టికేట్లు ఖరారు చేయాలని అల్టీమేటం జారీ చేసిన తుడుం దెబ్బ ఈ సారి వ్యూహాత్మకంగానే ఓట్లు మావే సీట్లు మావే అనేనినాదంతో తమ అభ్యర్థులను రంగంలోకి దించేలా పథకం రూపోందిస్తుంది. బోథ్ నియోజక వర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావుకు కాంగ్రెస్ టికేట్ దక్కక పోతే తుడుం దెబ్బ తరుపున పోటీలో ఉంటానని ఆదీవాసీల ఓట్లతో గెలుపోందడం ఖాయమని పేర్కొంటున్నారు. ఖానాపూర్‌లోను బలమైన ఆదివాసీ అభ్యర్థిని రంగంలోకి దించేలా తుడుం దెబ్బ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఆసిఫాబాద్‌లోను మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కాంగ్రెస్ టికేట్ దక్కకపోతే తుడుం దెబ్బ జెండాపై పోటీ చేయనున్నారు. ఆదివాసీల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించిన ఆపద్దర్మ మంత్రి జోగు రామన్నను ఓడించేలా తుడుం దెబ్బ నేతలు తీర్మాణం చేయడం గమనార్హం. ఆదిలాబాద్‌లో జోగు రామన్నకు వ్యతిరేకంగా గోండ్వానా సంఘర్షణ సమితి పేరిట అభ్యర్థిని బరిలో నిలిపేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏది ఏమైనా మూడు నియోజక వర్గాలలో ఆదివాసీల ఓట్ల ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీలలో సవాల్‌గా నిలుస్తుంది.