అదిలాబాద్

మలివిడత ఎన్నికల్లో ఓటెత్తిన పల్లె జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 25: పకడ్బందీ ఏర్పాట్ల మద్య శుక్రవారం జరిగిన పంచాయతీ మలి విడత ఎన్నికల్లో పల్లె ఓటర్లు మరోసారి తమ చైతన్యాన్ని నిరూపించారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోనూ 85 శాతానికి పైగా ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 362 గ్రామపంచాయతీల్లో మలివిడత ఎన్నికలు నిర్వహించగా సమస్యాత్మక కేంద్రాల్లో, నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. గుడిహత్నూర్ మండలం ముత్నూరు తాండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన పవార్ కళాబాయి ఓటమి చెందడంతో తీవ్ర మనస్థాపంతో ఇంటికి వెళ్ళి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. బోథ్‌లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాల్లో రెండో విడతగా 489 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 123 చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో 362 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరిగింది. నాలుగు గ్రామపంచాయతీల్లో ఎస్టీ రిజర్వుడ్ అభ్యర్థులు లేక ఎన్నికలు రద్దయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 149 పంచాయతీలకుగాను 65 పంచాయతీలు ఏకగ్రీవంగా శుక్రవారం మిగితా 84 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. నిర్మల్ జిల్లాలో 106 గ్రామపంచాయతీలు, మంచిర్యాల జిల్లాలో 88 గ్రామపంచాయతీలు, ఆసిఫాబాద్ జిల్లాలో 107 గ్రామపంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా తొలి రెండు గంటల్లోనే గ్రామాల్లో పోలింగ్ శాతం పుంజుకుంది. మారుమూల గిరిజన గూడేల్లో ఈసారి అనూహ్యంగా ఓటింగ్ పెరగడం గమనార్హం. అన్ని పంచాయతీల్లో దాదాపు తెరాస బలపర్చిన అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాల్లో మరోమారు గులాబి పార్టీ తిరుగులేని ఆదిపత్యాన్ని చాటుకొని పల్లెల్లోను పట్టు నిలుపుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని 8 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు గావించారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు అధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామపంచాయతీ ఎన్నికల సరళిని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రం నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిపై ఆరా తీశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 87.62 శాతం పోలింగ్
ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలో ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 87.62 శాతం పోలింగ్ జరగడం విశేషం. 80 శాతం పైగా గిరిజన గ్రామపంచాయతీలే ఉండగా పల్లె ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో 86.50 శాతం పోలింగ్ జరగగా నిర్మల్ జిల్లాలో 85.37 శాతం పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 83.06 శాతం పోలింగ్ జరగగా నేరడిగొండ మండలంలో అత్యధికంగా 88.75 శాతం, తలమడుగు మండలంలో 87.18, గుడిహత్నూర్ మండలంలో 81.64, బోథ్ మండలంలో 80.34, బజార్‌హత్నూర్ మండలంలో 80.87 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం పోలింగ్ సామాగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

ఓటమిభారంతో మహిళా అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

గుడిహత్నూర్, జనవరి 25: మండలంలోని ముత్నూరు తాండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీచేసి ఓటమిపాలైన పవార్ కళాబాయి ఓటమి భారంతో తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం పోలింగ్ అనంతరం మధ్యాహ్నం రెండుగంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టగా ఉత్కంఠభరితంగా సాగిన లెక్కింపులో కళాబాయి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జాదవ్ సులోచన బాయికి 164 ఓట్లు రాగా నాల్గవ స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి కళాబాయికి 84 ఓట్లు వచ్చాయి. ఓటమి అవమానంగా భావించిన పవార్ కళాబాయి ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కాగా, సర్పంచ్ ఎన్నికల్లో కళాబాయి వరసగా రెండోసారి ఓటమి చెందడంతో ఆమె మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
ఆసిఫాబాద్, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా అధికారులు, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం జెడ్పీఎస్‌ఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం తొలిసారిగా 1951లో దేశంలో ఎన్నికలు జరిగాయని, అంతకంటే ముందు దేశం అస్తవ్యస్థంగా ఉండిందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలే నాయకున్ని ఎన్నుకోవచ్చని, ఇందుకోసం ఓటును వజ్రాయుధంగా ఉపయోగించుకోచ్చని కలెక్టర్ సూచించారు. నేటి విద్యార్థులే భావి తరాల ఓటర్లు అవుతారన్నారు. ప్రతి 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకే ప్రతి ఏడు జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈసమావేశంలో ఎస్పీ మల్లారెడ్డి, ఆర్డీఓ సిడాం దత్తు, డిఎఫ్‌ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఉత్తమ సేవలకు విశిష్ట పురస్కారం
కలెక్టర్ తరపున అవార్డు స్వీకరించిన జేసీ సంధ్యారాణి

ఆదిలాబాద్, జనవరి 25: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి ఏలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల క్రతువు పూర్తిచేసిన ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యకు విశిష్ట పురస్కారం లభించింది. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణికి అవార్డును ప్రదానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంచాయతీల్లో ఏలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, శాంతిభద్రతల పరిరక్షణలోనూ కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపడంతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అంతేగాక గిరిజన ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో వర్గవిబేధాలకు తావులేకుండా ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగియడంపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగాన్ని అభినందించింది. రిపోలింగ్‌కు ఆస్కారం లేకుండా సకాలంలో ఫలితాలు వెల్లడించడమే గాక ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించడం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల కమిషన్ భావించింది. రాష్ట్రంలో బూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యకు ఉత్తమ పురస్కారాన్ని అందించారు. రెండో విడత పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో కలెక్టర్ హైదరాబాద్‌కు వెళ్ళకుండా జెసి సంధ్యారాణిని పంపించారు. జెసి సంధ్యారాణికి అవార్డును ప్రదానం చేయగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ ఎన్నికల అధికారి బుద్ద ప్రకాష్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.
25 ఎన్ ఆర్ ఎంపి 1: గంజాల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు
ప్రశాంతంగా ముగిసిన మలివిడత పోలింగ్
* ఏడు మండలాల్లో సాఫీగా జరిగిన ఎన్నికలు
* 85.37 శాతం పోలింగ్ నమోదు
నిర్మల్, జనవరి 25: నిర్మల్ జిల్లాలో మలివిడతలో భాగంగా శుక్రవారం జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిశాయి. మలివిడత ఎన్నికలు జరిగిన దిలావర్‌పూర్, నర్సాపూర్(జి), నిర్మల్, సోన్, కుంటాల, లోకేశ్వరం, సారంగాపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లుచేశారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించిన పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మొదటి విడత మాదిరిగానే పురుషుల కంటే మహిళలు అధికసంఖ్యలో ఓట్లు వేశారు. మొత్తం మీద మలివిడతలో జరిగిన ఏడు మండలాల పరిధిలో 85.37శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే దిలావర్‌పూర్‌లో 84.79, నర్సాపూర్(జి)లో 83.14, నిర్మల్‌లో 85.09, సోన్‌లో 86.13, కుంటాలలో 85.91, లోకేశ్వరంలో 87.20, సారంగాపూర్‌లో 84.96 శాతం పోలింగ్ నమోదైంది. దిలావర్‌పూర్‌లో మొత్తం ఓటర్లు 16,928 మంది ఉండగా 14354 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నర్సాపూర్(జి)లో 17,567 మంది ఓటర్లుండగా వీరిలో 14605 మంది ఓట్లు వేశారు. ఏడు మండలాల పరిధిలో 51,599 మంది పురుషులు, 65,682 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నవారిలో ఉన్నారు.
బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ
మలివిడత ఎన్నికలు జరిగిన ఏడు మండలాల పరిధిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టిబందోస్తును చర్యలను చేపట్టారు. జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఎన్నికలు జరిగిన అన్ని మండలాల్లో ఎస్పీ పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటుహక్కు పొందాలి
* యువత ఓటు నమోదులో బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలి
* జిల్లాలో వందశాతం పోలింగ్ లక్ష్యంగా కృషిచేయాలి
* కలెక్టర్ ప్రశాంతి
నిర్మల్, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా తమపేరు తప్పనిసరిగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికలలో 82 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 2014 ఎన్నికల్లో 70శాతం ఉన్న ఓటింగ్ కాస్త మెరుగుపడిందని, రాబోయే ఎన్నికల్లో వందశాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పటిష్టవంతం చేయాలన్నారు. ఎన్నికలలో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా యువత బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలన్నారు.సీనియర్ సిటిజన్స్ మడిపల్లి భద్రయ్య, జి.హన్మంత్‌రెడ్డి, టి.నారాయణ, లింబాద్రి, ఎ.నర్సింలను సత్కరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన జె.రాహుల్‌కు మొదటి బహుమతి, ఎల్.సురేష్‌కు ద్వితీయ బహుమతి, వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి పొందిన యు.లక్ష్మీనర్సింహ, టి.శ్రీచరణ్ అలాగే జూనియర్స్‌లో ఉపన్యాస పోటీల్లో అబ్రహంకు మొదటి బహుమతి, జె.సోనుకు ద్వితీయ బహుమతి, వ్యాసరచన పోటీల్లో పి.గాయత్రికి మొదటి బహుమతి, ఆరె సుశ్మితకు ద్వితీయ బహుమతి, ప్రశంసాపత్రంతోపాటు మెమోంటోలు ప్రదానం చేశారు. బెస్ట్ బీఎల్‌వో అవార్డును జి.వసంతకు ప్రదానం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ రాజ్యాంగ ప్రతీ పౌరునికి ఓటుహక్కు కల్పించిందన్నారు. ఓటు హక్కుపొందిన వారందరూ తమ ఓటును నిర్భయంగా తమకు నిచ్చిన వ్యక్తికి వేసుకోవచ్చన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వేచ్చగా, నిర్భయంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ.్భస్కర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి అమ్రేష్‌కుమార్, డీ ఆర్‌డీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ప్రసూనాంభ, డీపీ ఆర్‌వో కలీం, తహశీల్దార్ అతిక్ ఉద్దిన్, జిల్లా పింఛన్ల సంఘం కార్యదర్శి ఎంసి లింగన్న, సీనియర్ సిటిజన్ విద్యార్థిని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.