సెంటర్ స్పెషల్

మీసాలకృష్ణుడు ( లోకాభిరామమ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధువర్గము వాండ్లు నన్ను ‘ఏనుగొండ గోపి’ అంటరు. నా స్వభావము నచ్చనివాడు ‘కోపి’ అనిగూడ అంటరు. నాన్నను ‘ఏనుగొండ వేంకట నరసింహాచార్యులు’! కానీ, ఆయన మాత్రం తన గురించి రాయవలసి వచ్చిన ఒక సందర్భంలో తన పేరు ‘మార్చాల వేదాంతాచార్య’ అని రాసుకున్నడు. ఏనుగొండ, మా నాయనకు అమ్మమ్మ ఆస్తి. అమ్మమ్మ ఊరు. అంటే మేము నిజానికి మార్చాలవాండ్లము. ఈ మార్చాల, పాలమూరు జిల్లాలో కల్వకుర్తి పక్కన ఉంటుంది. మా ఇంటి పేరు కారంచేడు వారు. కారంచేడు, వంగీపురము, సాత్తులూరు అనే ఇంటి పేర్లుగల వారు భగవద్రామానుజుల ఆజ్ఞ కారణముగ ఆంధ్ర దేశమునకు వచ్చినట్లు నాకొక తమిళ పరిశోధకుడు వివరించినడు. మాకు ఏ మాత్రము సంబంధం లేని వారు మరొక కారంచేడు వాండ్లు కూడ ఉన్నరు. ఇది పరిశోధించుకోవలసిన అంశము. అయితే ఇక్కడ సంగతి అది కాదు. మార్చాలలోని కారంచేటి వాండ్ల సంగతి ఇది.
మా తాతలు మూడిండ్ల వాండ్లు. ప్రతి యింట్లో ఒక రామాచార్యులు. ఒక రంగాచార్యులు. చిన్న ఇంటి రంగాచార్ల మనుమడిని నేను. పెద్ద ఇంటి రామాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధ చిత్రకారులు. తాతగారు ఫొటోగ్రఫీలో కూడా మేటి! ఆయన చిత్రకళను గురించి, ఛాయాగ్రహణ కళ గురించి మా తరం, తరువాతి తరం వారికి ముక్క తెలియదు. ఇంట్లో వాండ్లకు మాకే తెలియకుంటే, ఇంక ప్రపంచానికి తెలిసే వీలేలేదు గద! మా వాండ్లంత జన్మలో అంగీ (షర్టు) తొడగని సాంప్రదాయపరులు. రామాచార్ల తాతగారు చిత్రకారులన్న సంగతి అప్పటి పెద్దలు, నాయకులు అందరికి తెలుసు. అటువంటి వారి సాయంతోనే తాతగారు బందరులో పద్ధతిగా చిత్రకళను అభ్యసించినరు. ప్రఖ్యాత రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు, తాతకు సహాధ్యాయి అంటే నాకే ఆశ్చర్యం అయింది. అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు కూడ, పాలమూరు జిల్లా నాయకుడు. ఆయనకు తాతగారి మీద గౌరవము మెండు. అట్లనే మా అమ్మవాండ్ల అన్నయ్య గారయ్యే, నందిగామ కృష్ణదేశికాచార్యులు అప్పట్లో గొప్ప వకీలు. ముఖ్యమంత్రి తమ ఊరి నుంచి పట్నం చేరాలంటే నందిగామ మీదుగనే పోవాలె. తోవలో అయ్యగారిని సేవించి, (అంటే దర్శించి) సంప్రదింపులు చేసేవాడని మా వాండ్లు చెప్పుకుంటరు.
మందుముల నరసింగరావుగారు మరొక నాయకుడు. ఆయన స్వయంగ మార్చాలకు వచ్చి, తాతగారిని సేవించి, ‘అయ్యా! పట్నం రాండి! మీకు అధికార గౌరవం కలిగిస్తము’ అన్నడట. ‘పంతులూ! ఇంట్లో అగ్నిహోత్రము, ఇంటి ముందు వేంకటేశ్వరుడు (గుడిలో), ఆ పక్కన భూమాత (పొలము), అన్ని వదులుకోని, లౌక్యము చేయమంటవా?’ అని అడిగినరట, తాత! అది మా వాండ్ల పద్ధతి. ఇవాళటి మా లోపల చాలమందికి లౌక్యము చేతగాలేదు.
మా వంశంలో రాతలు, కూతలు, గీతలు చాతనయిన వాండ్లు శానమందే ఉన్నరు. ఒకరిద్దరు మాత్రమే కొంత పేరు సంపాయించుకున్నరు. ప్రపంచమంతట వ్యాపించినా మా వాండ్లంత, నిశ్శబ్దంగనే ఉన్నరు. నిష్క్రియగ మాత్రము వేరు! సారంగ అనే వెబ్ పత్రిక వెనుకనున్న ముగ్గురిలో ఒకరు రాజ్ కారంచేడు. అతను రామాచార్ల తాత మనుమలలో ఒకడు. అంటే నాకు తమ్ముడన్నమాట!
రామాచార్లు తాతగారు, ప్రభుత్వానికి గౌరవ ఫొటోగ్రాఫరుగ కొంతకాలం కొనసాగినట్లు తెలుస్తుంది. కానీ, వారు తీసిన ఛాయాచిత్రాలు మాత్రం అందుబాటులో లేవు.
తాతలందరు ముందు వేద పండితులు. తరువాత సంస్కృతం, తెలుగు సాహిత్యాలను తలకెక్కించుకున్నవారు. కవులు, రచయితలు. ఆ తరువాతనే రామాచార్లు తాతగారు కళల్లో ప్రతిభను చాటుకున్నారు. కానీ, అది అంత బలంగా జరగలేదని అనుమానం. వారి కళాఖండాలు చాలాచోట్ల ఉన్నాయి. కానీ, ఎవరికీ పట్టకుండ ఉన్నాయి. వాటికి మొట్టమొదటి ఉదాహరణ ‘మీసాల కృష్ణుడు’.
తాతగారికి సురవరం ప్రతాపరెడ్డితో మంచి మైత్రి. ప్రతాపరెడ్డికి పురాణ పాత్రల గురించిన ఆలోచనలు మొదలయినయి. కృష్ణుడు అనంగనే, ఒక నంగిరిపింగిరి, ఆడంగి బొమ్మ ఎందుకు గీస్తరని ఆయనకు అనుమానం వచ్చింది. కృష్ణుడంటే, ఒక యోధుడు. ప్రతాపశాలి! రాజు! ఆయనకు దారుఢ్యంగల దేహం, అందుకు తగినట్లు స్మశ్రువులు అనగా మీసాలు ఉండవలె, ఉండవచ్చు గదా! అని రెడ్డిగారికి తోచింది. ఆ సంగతి ఆచార్యవర్యులతో ప్రస్తావించి, అటువంటి బొమ్మ మీరే రాయాలన్నరు! ‘చిత్తరువులు రాయడం’ అనేది ఆ కాలపు మాటలలో ఒకటి! తాతగారు మీసాల కృష్ణుని బొమ్మ వేశారు! అది రెడ్డిగారు నడిపే పత్రికలో, లేదా మరొక ప్రచురణలో అచ్చయింది. రెడ్డిగారు ఆ బొమ్మను తమ కార్యాలయంలో గర్వంగా తమ సీటు వెనుక గోడ మీద ప్రదర్శనగా అలంకరించి ఉంచారు.
ఆ తరువాత ఎక్కడో, ఆ కళాఖండం గురించి చర్చ జరిగింది. దాన్ని అడివి బాపిరాజు వేశారు, అన్నరట! అప్పుడు కొంత వివరం బయటపడింది.
కొన్ని సంవత్సరాలు క్రితం, మిత్రుడు, రచయిత రమణ ఆ బొమ్మను ఫేస్‌బుక్‌లో ప్రదర్శించాడు. వివరం లాగితే, ప్రస్తుతం బొమ్మ, ప్రతాపరెడ్డిగారి కూతురు సరోజనమ్మ యింట్లో ఉందని తెలిసింది.
ఇదంత ఇట్ల ఉండగా, యాదగిరిగారనే పండితుడు, చిత్రకారుడు, ఒకప్పుడు తాతగారిని సేవించి, అంటే దర్శించి ఉన్నాడు. ఆయన, తాతగారి గురించి పరిశోధించి, వారి కళాఖండాలను, శ్రమకోర్చి వెతికి వివరాలు జమగూర్చాడు. తాతగారి సంతతి వారు హైదరాబాదులో ఉంటున్నారు. వారి సహకారంతో ఈ మధ్యన యాదగిరిగారు ఒక చక్కని పుస్తకాన్ని వెలువరించారు! ఆ పుస్తకం ఆవిష్కరణ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగింది. ఆ సభకు మా బంధువర్గమంతా తరలివచ్చారు. అంతకు మించి సాహిత్య, కళాకారులకు చెందిన పెద్దలెందరో వచ్చారు. ఉద్దంత వేద పండితులయిన పాండురంగాచార్య ఘనాపాఠిగారి చేతుల మీదుగా, తాతగారిని గురించిన పుస్తకం ఆవిష్కరణ జరిగింది. పాండురంగాచార్యులు మా బంధువర్గంలోని వారే!
అన్నింటికన్నా ఆనందకరమయిన విషయం, మీసాల కృష్ణుడు, ఆ సభలో అందరికీ దర్శనమిచ్చాడు. సురవరం ప్రతాపరెడ్డిగారు మనుమరాలు ఆ చిత్రపటాన్ని సగౌరవంగా వెంటబెట్టుకుని వచ్చి, సభలో పాల్గొన్నారు! అది కళాప్రపంచంలోని వారందరిని నిజంగ పండుగ! మా పెద్దలు ఆ సభలో నన్ను మాట్లాడమన్నరు. అది నాకు మా తాతగారల ఆశీర్వచనం అనిపించింది! సభ నిజంగ పండుగలాగ జరిగింది. దానితోటి మా వాండ్లకందరికి, కొత్త ఉత్సాహం పుట్టింది. తాతగారల రచనలు పొయినవి పోగా, కొన్ని మిగిలి ఉన్నయి. రామాచార్లు తాతగారి రెండవ కుమారుడు నరసింహాచార్లు కూడ సుశిక్షితులయిన కళాకారుడు. ఆయన కళాసృష్టి కూడ మరుగున పడి ఉంది.
కులములోన గుణవంతుడుంటే, కులము వాని వలన పేరు పొందుతుంది అని గద పెద్దల మాట. ఇట్ల మరుగున పడిన మాణిక్యాలు ఇంక ఎంతమంది ఉన్నరో మరి!

కె.బి. గోపాలం