క్రైమ్ కథ

బద్ధకస్తుడు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిలో అతను పట్టుపడేవాడే. చంపడానికి వచ్చిన ఎర్ల్ ఆ ఇంటి వెనుక పొదల్లో నక్కి ఆ ఇంటి వంకే చూస్తున్నాడు.
అరగంట క్రితం అతను ఛార్లీని చంపడానికి ఐదు నిమిషాల దూరంలో ఉండగా షెరీఫ్ ఫ్రెడ్ అడ్డంకి అయ్యాడు.
‘ఓ ఛార్లీ! తలుపు తెరు’ అన్న ఫ్రెడ్ మాటలు విన్న తక్షణం అతను ఛార్లీ ఇంట్లోకి ప్రవేశించే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
‘లేదా నేను తలుపు విరక్కొట్టుకుని లోపలకి వస్తాను’
వెంటనే అతను తన రివాల్వర్‌ని జేబులో ఉంచుకుని జారుకున్నాడు. ఫ్రెడ్ ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉంటే బహుశ తను హంతకుడిగా పట్టుబడి ఉండేవాడు అనుకున్నాడు.
డెబ్బై ఏళ్ల ఛార్లీ ఇంట్లో చాలా డబ్బు దాచుకుని బీదవాడిగా జీవిస్తున్నాడని ఆ గ్రామంలోని అందరికీ తెలుసు. ఛార్లీకి అనేక ఇళ్లు ఉన్నాయి. వాటిని అద్దెకి ఇచ్చి నెలనెలా వసూలు చేసుకుంటాడు. డబ్బు ఖర్చు చేయకుండా పిసినారి జీవితాన్ని గడుపుతున్నాడని కూడా అందరికీ తెలుసు. దూర ప్రయాణాలు చేయడు. కనీసం వారాంతంలో కూడా ఇల్లు వదిలి పిక్‌నిక్‌కో, పడవ ప్రయాణానికో వెళ్లడు. ఆయన ఇంట్లో కనీసం ఏభై వేల డాలర్ల దాకా నగదు ఉంటుందని ఎర్ల్ విన్నాడు.
దాన్ని దొంగిలించాలంటే ఆ ఇంట్లోకి చొరబడాలి. ఎప్పుడూ ఇల్లు కదలని ఛార్లీ తనని తప్పక చూస్తాడు. నిజానికి ఆ డబ్బుని ఆయన ఎక్కడ దాచాడో ఆయనతోనే చెప్పించాలి. తను ఎవరో తెలుసు కాబట్టి తన భద్రత దృష్ట్యా దొంగిలించాక ఆయన్ని చంపక తప్పదు. చంపడం విషయంలోగల మీమాంస వల్ల ఎర్ల్ ఈ పనిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. చివరికి ఆ మధ్యాహ్నం ఆయన్ని చంపడానికే నిశ్చయించుకుని వచ్చాడు.
షెరీఫ్ వచ్చాడని తెలీగానే ఎర్ల్ ఇంటి వెనక్కి వెళ్లి నక్కి దాక్కున్నాడు. నిజానికి షెరీఫ్ అతి బద్ధకస్థుడు. ‘అతని గొంతులోకి చేతిని పోనించి మాటలు బయటకి తీయాలి’ అని అతని మీద జోక్ కూడా ఉంది.
షెరీఫ్ ఫ్రెడ్, ఛార్లీ మంచి మిత్రులు. ఛార్లీ అతన్ని తప్ప ప్రపంచంలో ఇంకెవర్నీ నమ్మడు. ఆఖరికి బేంక్‌లని కూడా. అందుకే డబ్బుని ఇంట్లో దాస్తాడు.
ఎర్ల్ ఛార్లీ నించి డబ్బుని దొంగిలించడానికి ప్రేరణ లూయి. ఇరవై మూడేళ్ల ఎర్ల్ ఆమెని తన వేన్‌లో సరదాగా తిరగడానికి రమ్మని ఆహ్వానించాడు.
‘ఆ కంపు కొట్టే వేన్‌లోనా? అడగడానికి సిగ్గుండాలి’ ఆమె నిరాకరిస్తూ చెప్పింది.
ఎర్ల్ చికెన్ ఫీడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆ వేన్ ఆ కంపెనీదే.
‘వెనక భాగంలో వేయచ్చు కాని కేబిన్‌లో వాసన వేయదు’
‘నేనే నువ్వయితే ఓ అమ్మాయిని అందులో రమ్మని పిలిచి అవమానపరిచేదాన్ని కాదు’ ఆమె ఎకసెక్కంగా చెప్పింది.
ఎర్ల్‌కి తెలుసు. ఎర్రటి స్పోర్ట్స్ కారులో తను వారానికి ఎంత సంపాదిస్తాడో అంతకి ఓ భోజనాన్ని అమ్మే రెస్ట్‌రెంట్‌కి తీసుకువెళ్తే లూయి వస్తుందని. అలా ఒకరిద్దరితో ఆమె అప్పటికే వెళ్లిందని తెలిసాక తను కూడా ఆమెని అలాంటి కారులో అలాంటి రెస్ట్‌రెంట్‌కి తీసుకెళ్లాలని భావించాడు. అప్పడే ఛార్లీ ఇంట్లో దొంగతనం చేయాలన్న ఆలోచన కలిగింది.
ఛార్లీ ఇంటి వెనక చెట్లలో ఆ వేన్‌ని ఆపి ఎవరి కంటా పడకుండా ఇంట్లోకి వచ్చాడు. కాని షెరీఫ్ వచ్చి అతనికి తెలీకుండానే ఆ పథకం విఫలం చేశాడు.
‘తలుపు తెరు మిత్రమా!’ షెరీఫ్ అరుపు ఎర్ల్‌కి వినిపించింది.
ఆయన తలుపు తెరవకపోవడంతో షెరీఫ్ తిట్టుకుంటూ పోలీసు కార్లో వెళ్లిపోయాడు.
ఎర్ల్ ఆ మధ్యాహ్నం కస్టమర్లకి వేగంగా చికెన్ ఫీడ్‌ని అందించి ఛార్లీ ఇంటి వెనక్కి చేరుకున్నాడు. తను ఏమయ్యాడా అని తన మేనేజర్ అనుకోక మునుపే ఈ పనిని పూర్తి చేసుకుని తన కంపెనీ గోడౌన్‌కి చేరుకోవాలని అనుకున్నాడు.
కొద్ది నిమిషాలు ఆగి ఎర్ల్ మళ్లీ పొదల వెనక నించి ఆ ఇంటి తలుపు దగ్గరికి వెళ్లి దాన్ని తట్టాడు. కొద్దిసేపటికి ఛార్లీ కంఠం వినిపించింది.
‘ఎవరది?’
‘ఎర్ల్‌ని’
‘ఏమిటి? ఏం కావాలి?’
‘నా బాస్ మీకు దీన్ని ఇవ్వమని పంపాడు’
‘ఏమిటది?’
‘నాకు తెలీదు. దీనికి రంగు కాగితం చుట్టి ఉంది’
‘నేనేమీ ఆర్డర్ చేయలేదే?’
‘మీరు తలుపు తెరిస్తే ఇచ్చి వెళ్తాను’ ఎర్ల్ విసుగు నటిస్తూ చెప్పాడు.
పది, పదిహేను క్షణాల దాకా లోపల నిశ్శబ్దం. తన బాస్‌కి ఫోన్ చేయడానికి వెళ్లాడా అనే భయం ఎర్ల్‌లో ప్రవేశించింది. అదే జరిగితే ఇక ఛార్లీ దగ్గర దొంగతనం చేయలేడు. చేస్తే తనే మొదటి అనుమానితుడు అవుతాడు.
తలుపు లోపల గడియ తీస్తున్న శబ్దం వినిపించింది.
‘ఏం పంపాడు?’ ఛార్లీ తలుపు తెరిచి ఎర్ల్ చేతుల వంక చూస్తూ అడిగాడు.
ఎర్ల్ ఛార్లీని లోపలకి నెట్టి, లోపలికి ప్రవేశించి తలుపు మూసి గడియ పెట్టాడు.
‘ఏమిటిది?’ ఛార్లీ కోపంగా అడిగాడు.
ఎర్ల్ జేబులోంచి రివాల్వర్ తీశాడు. ఛార్లీమొహంలో వెంటనే ఆశ్చర్యం తొంగి చూసింది.
‘ఏమిటిది? ఏం చేస్తున్నావు?’ నివ్వెరపోతూ ప్రశ్నించాడు.
‘నీ డబ్బు తీసుకోడానికి వచ్చాను. అది ఎక్కడ దాచావో కాని వెంటనే తీసుకురా’ ఆజ్ఞాపించాడు.
ఛార్లీ ఓ అడుగు వెనక్కి వేసి చెప్పాడు.
‘మూర్ఖుడిలా ప్రవర్తించకబ్బాయ్’
‘నీ డబ్బు లేదా నీ ప్రాణం. ఏది నీకు ముఖ్యం?’
‘అది కాదబ్బాయ్’
ఎర్ల్ రివాల్వర్ గొట్టాన్ని ఆయన ఛాతీకి ఆనించి కఠినంగా చెప్పాడు.
‘రెండోసారి. ఆఖరి సారి. నీ డబ్బు లేదా నీ ప్రాణం. చెప్పు. ముందుగా ఏం తీసుకోను?’
‘అక్కడ’ ఛార్లీ ఓ గుటక వేసి చెప్పాడు.
తర్వాత నాలుగు అడుగులు వెనక్కి వేసి డైనింగ్ రూం వైపు చూపించాడు.
డైనింగ్ టేబిల్ మీద విస్కీ సీసా కనిపించింది.
‘ఆ టేబిల్‌లోనా?’ ఎర్ల్ అడిగాడు.
‘అవును. రెడు టేబిల్ మేట్స్ కింద ఉన్నాయి’
ఎర్ల్ ఆయన్ని పక్కకి తోసి వెళ్లి డైనింగ్ టేబిల్ మీది నాలుగు టేబిల్ మేట్స్‌ని పక్కకి జరిపాడు. ఒక దాని కింద ఉన్న ఇనప మూత కనిపించింది.
‘తాళం తెరు’ ఎర్ల్ ఉత్సాహంగా ఆజ్ఞాపించాడు.
‘నువ్వు చేసేది సరైన పని కాదు. నువ్వు ఇప్పుడైనా వెళ్లిపోవచ్చు. జరిగింది నేను ఎవరికీ చెప్పను’
‘తెరవమన్నాను’
ఆయన చిన్నగా నిట్టూర్చి జేబులోంచి ఓ తాళం చెవిని తీసి డైనింగ్ టేబిల్ దగ్గరికి నడిచాడు. దాని రంధ్రంలోకి తాళం చెవిని చొప్పించి తెరవగానే ఎర్ల్ లోపలకి చూశాడు. లోపల రెండు అంగుళాల లోతులో ఇరవై, ఏభై డాలర్ల నోట్ల కట్టలు కనిపించాయి.
ఎర్ల్ ఏం చేయాలా అని ఆలోచించాడు. రివాల్వర్ మడమతో ఆయన బట్టతల మీద బలంగా మోదాడు. ఛార్లీ చిన్నగా మూలుగుతూ నేలకూలాడు. కొద్ది క్షణాలాగి చూశాడు. ఛార్లీలో కదలిక లేదు. ఒంగి ఛాతీ మీద చేతిని ఉంచి చూశాడు. ఇంకోసారి ఆయన్ని కొట్టాల్సిన అవసరం లేదని ఎర్ల్ గ్రహించాడు. తను ఓ మనిషిని చంపాడన్న ఆలోచన కలగగానే అతనికి కాళ్లల్లోంచి వణుకు పుట్టింది.
టేబిల్ మీది విస్కీ సీసాని అందుకుని మూత విప్పి అందులోంచి నాలుగు గుక్కలు విస్కీ తాగాడు.
బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. కిటికీలోంచి చూస్తే షెరీఫ్ కారు కనిపించింది. అతనికి తను కనపడకుండా నక్కి డబ్బు కట్టలున్న పెట్టెని తీసుకోడానికి ఐదు క్షణాలు పట్టింది. వెనక తలుపు తెరుచుకుని బయటపడటానికి మరో ఐదు క్షణాలు పట్టింది. ఇంటి వెనక చెట్లలోకి పరిగెత్తి వచ్చిన కాలి బాటలో తన వేన్ దగ్గరికి చేరుకున్నాడు.
ఎర్ల్ ఆ వేన్‌ని ఎత్తు ప్రదేశంలో హేండ్ బ్రేక్ వేసి ఆపాడు. అందువల్ల దాన్ని స్టార్ట్ చేయకుండా క్లచ్ మీద కాలుంచి కిందకి తోసి ఎక్కి కొద్దిదూరం వెళ్లాక స్టార్ట్ చేశాడు. తన వేన్ స్టార్ట్ అవడం షెరీఫ్‌కి వినిపించనంత దూరంలో స్టార్ట్ చేశాడు.
అర మైలు దూరంలోని హోస్ పాండ్‌గా పిలువబడే ఓ సరస్సు సమీపంలో వేన్‌ని ఆపి వేన్‌లోని ఖాళీ చికెన్ ఫీడ్ సంచుల్లో రివాల్వర్‌ని, ఆ పెట్టెని ఉంచి తాడు బిగించి కట్టి దాన్ని వేన్‌లోని ఆరు చికెన్ ఫీడ్ సంచీల కింద దాచాడు. ఆ రాత్రో, తెల్లవారుఝామునో దాన్ని ఎక్కడైనా పాతి పెట్టాలని, ఈలోగా ఎవరూ దాన్ని కనుక్కోలేరని ఎర్ల్ నమ్మాడు.
తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా తన బాస్‌తో ఏదో విషయంలో పోట్లాడితే ఉద్యోగం లోంచి తీసేస్తాడు. ఆ డబ్బుతో ఊరు వదిలి వెళ్లిపోవడంతో తను ఎందుకు మాయం అయ్యాడా అని ఎవరూ అనుమానించరు. కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చి లూయితో తనకి లాటరీలో డబ్బు తగిలిందని చెప్పి...
ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని అతనికి ఎంతో ఉద్వేగంగా ఉంది. ఊహల్లోనే అది అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది.
బాస్ ఎర్ల్ వంక కోపంగా చూసి అడిగాడు.
‘ఇవాళ ఉదయం నీ పెట్రోల్ బిల్‌ని చూశాను. క్రితం వారం నువ్వు గర్నీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించావు కదా?’
‘అవును సర్’
‘ఇంకెప్పుడూ అక్కడికి వెళ్లకు. కూపర్ పెట్రోల్ బంక్‌లో కొట్టించు. మన చికెన్ ఫీడ్‌ని కొనేది గర్నీ కాదు. కూపర్. అర్థమైందా?’
‘ఐంది సార్’
‘ఇది నీకు ఉద్యోగంలో చేరిన రోజే చెప్పాను. కొత్తగా గర్నీ దగ్గరికి ఎందుకు వెళ్లావు?’
‘మర్చిపోయాను సార్’
‘ఇంకోసారి మర్చిపోతే నువ్వు ఈ ఉద్యోగాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది’ బాస్ హెచ్చరించాడు.
తను ఉద్యోగం వదలడానికి బాస్ మంచి సూచనని చేశాడని ఎర్ల్ భావించాడు.

ఇంకో మూడు వారాలు లేదా నెల తర్వాత ఉద్యోగ విరమణ చేయాలని అనుకున్నాడు.
కడుపులో తిప్పినట్లు అవడంతో విస్కీ పని చేస్తోంది అనుకుని ఎర్ల్ రెస్ట్‌రూంలోకి వెళ్లి వాష్ బేసిన్ వంపు తిప్పి మొహాన్ని చన్నీళ్లతో కడుక్కున్నాడు. అతను లోడింగ్ ప్లాట్‌ఫాం దగ్గరికి వచ్చేసరికి కిటికీలోంచి బయట షెరీఫ్ కారు కనిపించింది.
‘ఏం జరిగింది? షెరీఫ్ ఎందుకు వచ్చాడు?’ ఎర్ల్ ఓ సహోద్యోగిని ప్రశ్నించాడు.
‘్ఛర్లీ’
‘్ఛర్లీ? ఏమైంది?’ ఏం తెలీనట్లుగా అమాయకంగా అడిగాడు.
‘్ఛర్లీ విషం తీసుకుని మరణించాడట’
‘ఏం తీసుకుని?’
‘విషం. విషంతో ఆత్మహత్య చేసుకున్నాడట’
ఎర్ల్ ఫ్రెడ్ దగ్గరకి వెళ్లి అడిగాడు.
‘నేను విన్నది నిజమా? ఛార్లీ విషం తీసుకుని మరణించాడా?’
‘అవును ఎర్ల్. ఎలా ఉన్నావు? ఛార్లీ పిచ్చివాడన్న నా నమ్మకం రుజువైంది. ఇంట్లోంచి బయటకి రాని వాళ్లు పిచ్చివాళ్లేగా మరి?’
ఎర్ల్ మనసులో ఓ డజను ప్రశ్నలు ఉదయించాయి. కాని ఒక్కటీ షెరీఫ్‌ని అడిగే ధైర్యం చేయలేదు.
షెరీఫ్ జేబులోంచి ఓ తెల్లటి కవర్ని బయటకి తీసి, దాని వంక చూసి తెరవబోయి ఆగి మళ్లీ జేబులో ఉంచుకుని చెప్పాడు.
‘తన మరణానికి అరగంట ముందే ఛార్లీ దీన్ని నాకు ఇచ్చాడు. నా లంచ్ పూర్తయ్యేదాకా తెరవద్దని కోరాడు. నాకు ఆయన ఈ చర్య వింతగా తోచింది. ఏదో ప్రాక్టికల్ జోక్ వేస్తున్నాడని అనుకున్నాను. లంచ్ తర్వాత చదివాను’
‘ఆత్మహత్య చేసుకోబోతున్నానని రాశాడా?’ బాస్ ప్రశ్నించాడు.
‘అవును. వెంటనే ఛార్లీ ఇంటికి వెళ్లాను. ముందు తలుపు నా కోసమే తెరిచి పెట్టాడనుకుంటా. డైనింగ్ టేబిల్ పక్కన ఇది పడి ఉంది’
జేబులోంచి చిన్న భరిణని తీసి చూపించాడు.
‘ఇది ఆర్సెనిక్ విషం కలిసిన మందు. ఇది కడపులోకి వెళ్తే భరించలేని బాధ కలిగి మరణిస్తాడు. కాకపోతే దీన్ని రక్తంలో నెమ్మదిలా కలిసేలా రూపొందించారు’
‘నేనోసారి ఈ విషయాన్ని నా గోడౌన్‌లోని ఎలుకలకి తినిపించాను. అవి పడ్డ బాధ చూశాక తిరిగి దీన్ని వాడలేదు. ఇప్పుడు ఎలుకల బోనులని వాడుతున్నాను’ బాస్ చెప్పాడు.
‘అది తెలిసీ ఛార్లీ ఈ విషానే్న ఎందుకు వాడాడు?’ ఓ ఉద్యోగి ఆశ్చర్యంగా అడిగాడు.
‘్ఛర్లీ పిచ్చివాడని చెప్పాగా? అందుకని వాడినట్లున్నాడు’ షెరీఫ్ చెప్పాడు.
‘లేదా ఇది బాధ పెట్టి చంపే విషమని తెలిసి ఉండదు’ బాస్ చెప్పాడు.
‘కావచ్చు. నేను వెళ్తాను’ షెరీఫ్ లేచి నిలబడ్డాడు.
తను కొట్టిన దెబ్బకి ఆయన మరణించాడు కాని ఆ ఉత్తరం చదివిన షెరీఫ్ ఛార్లీ విషం తాగి మరణించాడని భావిస్తున్నాడు. ఇదీ తన మంచికే అని ఎర్ల్ సంతోషపడ్డాడు. ఐతే ఆయన తన ఆత్మహత్య గురించి చెప్తే అవకాశం ఇవ్వకుండా తను మొరటుగా ప్రవర్తించాడు. లేదా ఆ విషయం తనకి చెప్పి, బహుశ ఆ డబ్బుని తీసుకోమని చెప్పేవాడేమో?
‘విషాన్ని ఎలా తీసుకున్నాడు?’ వెళ్తున్న షెరీఫ్‌ని బాస్ అడిగాడు.
‘ఉత్తరంలో రాసినట్లుగా విస్కీ బాటిల్‌లో కలిపి. పావువంతు పైనే విస్కీ ఖాళీ ఐంది. ఓ ఎద్దుని చంపడానికి అందులో సగం చాలు. ఇక మనిషో లెక్కా? ట్రయోక్సైడ్ ఆఫ్ ఆర్సెనిక్ ఆలస్యంగా పనిచేసే విషమే ఐనా వృద్ధాప్యంలోని ఛార్లీ మీద త్వరగా పని చేసి ఉంటుందని పోలీస్ డాక్టర్ అభిప్రాయపడ్డాడు’
‘ఈ డేట్స్ బ్రాన్ విషం చాలా శక్తివంతమైంది’
ఎర్ల్ తనలో చెలరేగే భయాన్ని అణచుకునే ప్రయత్నం చేశాడు. ఛార్లీ బదులు తను తాగిన ఆ విస్కీలోని విషం తన మీద ఎంత సేపటిలో పని చేస్తుంది? అన్న ప్రశ్న అతనిలో ఉదయించింది. కడుపులో స్వల్పంగా నొప్పి అనిపించింది. షెరీఫ్ కారు వెళ్లిపోయాక ఎర్ల్ సాధ్యమైనంత శాంతంగా తన వేన్ దగ్గరికి నడిచి, డ్రైవింగ్ సీట్లో కూర్చుని తలుపు మూసి స్టార్ట్ చేశాడు. బెల్ విల్ గ్రామంలో అతను ఆ కారుని ఎన్నడూ నడపనంత వేగంగా నడిపాడు. అక్కడికి అతి సమీపంలోని డాక్టర్ విటేకర్ ఇల్లు మైలు దూరంలో ఉంది. సరిగ్గా ఆరో నిమిషంలో తన వేన్‌ని ఆయన ఇంటి ముందు ఆపి, తలుపు తెరుచుకుని కిందకి దూకి వేగంగా ఆయన ఇంటి తలుపు దగ్గరికి పరిగెత్తాడు. ఇంటి ముందున్న ఆయన కారుని చూసి డాక్టర్ ఇంట్లోనే ఉన్నాడని గ్రహించాడు.
డాక్టర్ విటేకర్ ఎర్ల్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
‘నేను పొరపాటున ట్రయోక్సైడ్ ఆఫ్ ఆర్సెనిక్‌ని మింగాను. దయచేసి...’
‘నా దగ్గర స్టమక్ పంప్ చేసే పరికరాలు ఇంట్లో లేవు. నా హాస్పిటల్‌కి వస్తే...’
ఆయన హాస్పిటల్ పదహారు మైళ్ల దూరంలో ఉంది. ఎర్ల్ వేగంగా బయటికి పరిగెత్తాడు. ఐదు మైళ్ల దూరంలోని డాక్టర్ హేమిల్టన్ హాస్పిటల్‌కి సరిగ్గా పదిహేను నిమిషాల్లో చేరుకున్నాడు. పద్దెనిమిది నిమిషాల తర్వాత ఆయన ఎర్ల్ కడుపులోకి రబ్బర్ ట్యూబ్‌ని ఎక్కించాడు. ఇంజక్షన్ సిరంజిలోకి మందుని ఎక్కిస్తూ అడిగాడు.
‘నువ్వు పురుగులు చంపే స్ప్రే నీ లంచ్ మీదకి వొలికిందని గ్రహించి కూడా తిన్నావా? నీ సేండ్‌విచెస్ మీద ఆర్సెనిక్ ఉందని తెలీదన్నమాట?’
‘తెలీదు డాక్టర్’
‘దురదృష్టవశాత్తు ఆర్సెనిక్‌కి రుచి, వాసన ఉండవు’
పది నిమిషాల తర్వాత డాక్టర్ హేమిల్టన్ చెప్పాడు.
‘ఏడు వందల ఏభై డాలర్లు’
ఎర్ల్ తన జీవితంలో అత్యంత ఆనందంగా చేసిన ఖర్చది.
‘నీకు ఒకటి రెండు రోజులు మత్తుగా అనిపించచ్చు. లేదా అనిపించకపోవచ్చు కూడా. అనిపిస్తే కంగారు పడకు’
ఎర్ల్ బయటకి వచ్చి వేన్ ఎక్కి తన పథకం విజయవంతం అయినందుకు సంతోషంగా పోనించాడు. ఇక తను ఎర్ర స్పోర్ట్స్ కారుకి, లూయికి కొద్ది వారాల దూరంలో మాత్రమే ఉన్నాడు.
ఈల వేస్తూ అతను తిరిగి చికెన్ ఫీడ్ ఫేక్టరీకి చేరుకున్నాడు. బయట షెరీఫ్ కారు కనిపించింది. మత్తుగా ఉండటంతో సరాసరి బాత్‌రూమ్‌లోకి వెళ్లి మొహం కడుక్కుని వచ్చాడు.
‘హలో ఎర్ల్!’ షెరీఫ్ ఫ్రెడ్ పలకరించాడు.
‘హలో షెరీఫ్’
‘నీ కోసమే షెరీఫ్ వేచి ఉన్నాడు’ బాస్ చెప్పాడు.
‘నా కోసమా? దేనికి?’ ఎర్ల్‌కి భయం కలగలేదు. ఆశ్చర్యం వేసింది.
‘రివాల్వర్‌ని, ఆ డబ్బుని ఎక్కడ దాచావో ఊహించి స్వాధీనం చేసుకోవడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు ఎర్ల్’ షెరీఫ్ చెప్పాడు.
‘ఎం డబ..’ ఎర్ల్ ఆగిపోయాడు.
షెరీఫ్ జేబులోంచి తెల్ల రంగు కవర్ తీసి చూపించి మళ్లీ జేబులో ఉంచుకుని చెప్పాడు.
‘ఈ ఉత్తరం మా అమ్మాయి నించి. నేను ఇంకో ఐదు నెలల్లో తాతయ్యని అవబోతున్నానని రాసింది’
‘కాని ఇందాక అది ఛార్లీ ఇచ్చిన కవర్ అని అన్నారు?’
‘అవును. ఈ పెట్టె కూడా గొంతు నొప్పికి వాడే మాత్రల పెట్టె’
‘విషం కాదా? ఆర్సనిక్ కాదా?’ ఎర్ల్ అడిగాడు.
‘కాదు. నిజానికి ఛార్లీ ఒకవేళ ఆత్మహత్య చేసుకోదలచుకున్నా విషాన్ని విస్కీలో కలుపుకోడు. ఎందుకంటే ఆయనకి ఆల్కహాల్ అలవాటు లేదు. నాకా అలవాటు ఉంది కాబట్టి ఆ సీసాని అక్కడ నేనే ఉంచాను. అబ్బాయ్. ఛార్లీ తలుపు తెరిచి హంతకుడ్ని లోపలికి అనుమతించాడంటే, హంతకుడు ఆయనకి తెలిసినవాడై ఉండాలి. ఛార్లీ కొత్త వాళ్లకి తలుపు తీయడు’
‘మరి ఆ ఉత్తరం, ఆ భరిణె? ఆ అబద్ధాలు ఎందుకు చెప్పారు?’ ఎర్ల్ అర్థంకాక అడిగాడు.
‘డైనింగ్ టేబిల్ మీది సీసాలోని విస్కీని హంతకుడు తాగాడని నేను గుర్తించాను. ఫుల్ బాటిల్‌లో కొంత తరుగు కనిపించింది. తన ఒంట్లో విషం ఉందని తెలిసిన ఏ వ్యక్తయినా ఈ ప్రపంచంలో వెంటనే చేసే పని ఒక్కటే. డాక్టర్ దగ్గరికి వెళ్లడం. ముప్పై మైళ్ల పరిధిలో కేవలం నలుగురు డాక్టర్లు మాత్రమే ఉండటతో వాళ్లకి ఫోన్ చేసి, ఆర్సెనిక్ విషం విరుగుడు కోసం ఎవరు వచ్చారు అని అడిగితే ఇద్దరు నీ పేరు చెప్పారు. ఎర్ల్! మనం పోలీసుస్టేషన్‌కి వెళ్లాలి పద’
‘మీరు నన్ను ఉచ్చులోకి లాగారు’ ఎర్ల్ కోపంగా అరిచాడు.
‘అవును. నేను బద్ధకస్థుడ్ని కాని బుర్రని వాడుతూంటాను. అనేక చోట్లకి తిరిగి పరిశోధించడం నాకు చిరాకు’ షెరీఫ్ నవ్వుతూ చెప్పాడు.
.............................................................
జొనాథన్ క్రెయిగ్ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి