AADIVAVRAM - Others

అరసవల్లి ఆదిత్యుని వైభవం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణాలతో విజ్ఞానపు వెలుగులను వెదజల్లుతూ శక్తిచైతన్య మూర్తిగా..జగదేక చక్రవర్తిగా అశేష భక్తజనం పూజలందుకుంటున్న దైవం అరసవల్లి సూర్యనారాయణమూర్తి. విశ్వానికి వీరుడిగా వినువీధిలో విహరిస్తూ మూడుపూటలా తన రూపాన్ని మార్చుకుంటూ కర్మసాక్షిగా కీర్తిగాంచిన వాడు ఆదిత్యుడు. సమభావ, సామ్యవాద సిద్ధాంతాలతో పక్షపాతం లేకుండా అందరిపై తన కిరణాలను ప్రసరింపచేస్తూ ప్రాణికోటిని పోషిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్యుడు. తేజోమయుడు, తిమిర సంహారుడైన సూర్యభగవానుడి పుట్టినరోజు మాఘ శుద్ధసప్తమి. నిత్యఆరాధన జరుగుతున్న ఏకైక దేవాలయంగా ఖ్యాతి గడించిన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో ఏటా నిర్వహించే ప్రధానమైన ‘రథసప్తమి’ వేడుక ఫిబ్రవరి 14న జరుగుతున్న నేపథ్యంలో ఆదిత్యుని వైభవంపై ప్రత్యేక కథనం...
సూర్యార్చన - విశిష్టత
సూర్యార్చన ఎంతో విశిష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. మత్స్యపురాణంలో ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అంటూ సూర్యారాధన సకల రోగాలను పోగొట్టి ఆరోగ్యం ప్రసాదిస్తుందని ఉంది. రావణ సంహారంకోసం రాముడు ఆదిత్యహృదయం పఠించి యుద్ధంలో విజయం పొందినట్లు వాల్మీకి రామాయణంలో ఉంది. సూర్యదేవుని ఆరాధన వల్లే సత్రాజిత్తు శమంతకమణిని పొందినట్టు భాగవతంలో ఉంది. స్కందపురాణంలో ‘దినేశం శుభార్థం’ అని సకల శుభాలకు సూర్యారాధన అవసరమని ఉంది. సాంబపురాణంలో దూర్వాసుని శాపం వల్ల కలిగిన కుష్ణురోగాన్ని సాంబుడు సూర్యోపాసనవల్ల పొగొట్టుకొన్నట్టు, మహాభారతంలో ధర్మరాజు అరణ్యవాస సమయంలో ఆదిత్యుని ఉపాసించి అక్షయపాత్ర పొందినట్టు ఉంది. అంధుడైన అమర మహాకవి మయూర శతకం రచించి తన అంధత్వం పోగొట్టుకొన్నట్లు ప్రతీతి. సూర్యోపాసన వల్ల సమస్త నేత్ర రోగాలు తొలగిపోయి వంశంలో అంధత్వం రాదని అక్షుపనిషత్తులో ఉంది. పరమాత్ముని నేత్రాల నుంచి సూర్యుడు జన్మించిన కారణంగా సూర్యారాధనవల్ల నేత్ర రోగాలు నయవౌతాయన్న నమ్మకంతో భక్తులు సూర్యదేవునికి బంగారు, వెండి కళ్ళు కానుకగా సమర్పిస్తారు. అంధులు, కుష్ఠురోగులు, బొల్లి, శోభి వంటి మచ్చలున్నవారు, మూలవ్యాధి రోగులు ‘త్వమేవ శరణం మమ’ అని ఆదిత్యుని స్తుతిస్తే రోగవిముక్తులవుతారన్నది భక్తుల విశ్వాసం.
సూర్య నమస్కారాలు
శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు అయితే సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య నమస్కారం 12 ఆసనాల సమాహారం. ప్రణమాసనంతో ప్రారంభమయ్యే సూర్య నమస్కారంలో హస్త ఉత్తానాసన, పాదహస్తాసన, అశ్వసంచలనాసన, భుజంగాసన, పర్వతాసన, అష్టాంగ నమస్కారం వంటివి ఉన్నాయి. 12 ఆసనాలకు వరుసగా మిత్రాయ, రవయే, సూర్యాయ, భావనే, ఖగాయ, పూష్ణే, హిరణ్యగర్భాయ, మరీచయే, ఆదిత్యాయ, సవిత్రే, అర్కాయ, భాస్కరాయ అంటూ 12 మంత్రాలున్నాయి. అరసవల్లి దేవాలయంలో త్రిచ, మహాసౌరం, అరుణం విధానాల్లో సూర్య నమస్కార పూజలు అర్చకులు చేస్తారు. ‘శరీర, వర్తమాన, వర్తిష్యమాన, వాత, పిత్త, కఫ, హృద్రోగ, క్షయ, పాండు, కుష్ఠు, శూల, అతిసార, దంతక్షయ, మేహవ్యాధి నివారణార్థం ఆరోగ్య సిధ్యర్థం’ అంటూ సంకల్పించి భక్తులు సూర్యనమస్కార పూజల్లో పాల్గొంటారు.
ఆదిత్యుని ఆలయం
అరసవల్లి ఆదిత్యుని ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఏడో శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ పరిపాలించిన సమయంలో ఇక్కడ సూర్యదేవునికి నిత్య భోగ, ధూప-దీప, ఉత్సవాలు జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో దేవాలయ పరిసర ప్రాంతాలు ధ్వంసమైనప్పటికీ గర్భాలయం చెక్కుచెదరకపోవడం విశేషంగా చెప్తారు. అనంతరం 1788లో యలమంచిలి పుల్లాజీ ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు. 1999లో ఆదిత్యాలయం గర్భగుడిని వరుదు బాబ్జీరావు అందంగా కట్టించారు. ఇక రెండు శతాబ్దాలకుపైగా ఇప్పిలి వంశం వారే అర్చకత్వ పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీముఖలింగం గ్రామానికి చెందిన ఇప్పిలి అక్కన్న, సూరప్ప దంపతులకు సూర్యుడు కలలో సాక్షాత్కరించి సూర్యారాధన పూజలు చేయాలని చెప్పినట్టు, అంతేగాక వీరికి నాగావళి నదిలో దొరికిన తాళపత్ర గ్రంథాల్లో సూర్య భగవానుని పూజా విధానం ఉన్నదనే కథనం ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి నేటికీ ఈ వంశీయులే పురుషసూక్త, తృచ, సౌర, సూర్యమానసిక విధానాల్లో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.
నయన మనోహర రూపం
ఇక్కడి ఆలయంలోని మూలవిరాట్టును విశ్వకర్మ చెక్కినట్టు స్థలపురాణం చెబుతోంది. అభయముద్రలో ఉన్న ఆదిత్యుడిని కృష్ణశిలతో రూపొందించారు. అయిదున్నర అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పుతో లక్షలాది సాలగ్రామాల సమ్మిళితమై మూర్త్భీవించిన మహత్తర మూలవిరాట్టు ఇది. గర్భాలయంలో బీజాక్షరాలతోకూడిన సౌర యంత్రాన్ని ప్రతిష్ఠించారు. మూలవిగ్రహం పాదపద్మాలవద్ద త్రికాల ప్రతిరూపాలైన ఉష, ఛాయ, పద్మిని దేవేరులు కొలువుతీరారు. ద్వారపాలకులుగా ఎడమవైపు పింగళకుడు, కుడివైపు మాతరుడు, పైన సనక సనందనాదులు, దిగువన సప్తాశ్వరథానికి సారథ్యం వహిస్తున్న అనూరుడు, రథంపై అభయముద్రలో సూర్య భగవానుడు.. ఇదీ స్వామి నయన మనోహరరూపం. విగ్రహానికి మధ్యలో సూర్యకఠారిగా పిలవబడే కత్తి ఉంది. రథసప్తమి పర్వదినం రోజున అరుదైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు కలుగుతుంది.
రథసప్తమి విశిష్టత
సూర్యజయంతినే రథసప్తమి, మాఘసప్తమిగా వ్యవహరిస్తారు. ఆ రోజున బంగారు, వెండి లేదా రాగి పాత్రలో దీపారాధన చేసి ‘నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణార్క నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే’ అనే శ్లోకాన్ని చదివి దీపాన్ని నీటిలో విడిచిపెడితే సర్వరోగ నివారణ జరుగుతుందని ప్రతీతి. రథసప్తమినాడు సూర్యోదయానికి ముందు ఏడు జిల్లేడు ఆకులు తలపై ఉంచుకొని ఇంద్రపుష్కరిణిలో స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఆ రోజు అరసవల్లిలో మహిళలు పుష్కరిణిలో స్నానమాచరించి పిడకల పొయ్యిమీద క్షీరాన్నం వండి చిక్కుడు ఆకుల్లో నివేదన చేయడం ఆనవాయితీ. సూర్యుడి పుట్టిన రోజు భాను (ఆది)వారం కావడం, అదేరోజు ఈసారి రథసప్తమి పర్వదినం రావడం విశేషంగా చెప్పవచ్చు. ఆ రోజున వేకువజామున ఒంటిగంటకు స్వామివారి సుప్రభాతసేవ, ఉషఃకాలార్చన అనంతరం ఐదు గంటలవరకూ మహాక్షీరాభిషేకం, ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ నిజరూప దర్శనం, విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహానివేదన తర్వాత నాలుగు గంటల నుంచి విశేష పుష్పాలంకరణసేవ, సర్వదర్శనం ఉంటాయి. రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ఏకాంతసేవ ఉంటుంది. భాస్కరభట్ల సీతారామశాస్ర్తీ రచించిన ఏకాంత సేవ రూపకాన్ని గానం చేస్తుండగా అర్చకులు దేవేరులతో కూడిన స్వామివారికి అనివెట్టి మండపంలో సపర్యలు చేస్తారు.
ఇతర ప్రధాన ఉత్సవాలు
అరసవల్లిలో రథసప్తమి ప్రధాన వేడుక కాగా, తెప్పోత్సవం, వార్షిక కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా జరిగే తెప్పోత్సవంలో ఇంద్రపుష్కరిణిలో స్వామి, దేవేరుల ఉత్సవమూర్తులను హంసవాహనంపై ఊరేగిస్తారు. విద్యుత్‌కాంతుల నడుమ దేదీప్యమానంగా జరిగే ఆదిత్యుని నావికోత్సవం ఆద్యంతం కన్నులపండువగా సాగుతుంది. నావలో అర్చకులు శ్రీచక్రార్చన, క్షీరాబ్దివ్రతం, అభిషేకం, అర్చన, నక్షత్ర దీపారాధన, మంత్రపుష్పం, స్వస్తి, తదితర ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా చైత్రశుద్ధ సప్తమి నుంచి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు స్వామివారి వార్షిక కల్యాణమహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. కల్యాణాంగధ్వజారోహణం, సుగంధద్రవ్యమర్దన, కల్యాణోత్సవం, ఆగ్నేయస్థాలీపాకతోమాల, రథోత్సవం, తిరుమంగయాళ్వారుల చరిత్ర-సంవాదం, చక్రతీర్థం, ధ్వజావరోహణం, పుష్పయాగం వంటివి ఈ ఉత్సవాల్లోని ప్రధాన కార్యక్రమాలు.
కిరణ స్పర్శ
దివి నుంచి భువికి జారే రవికిరణాలు సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడి ధృవమూర్తిని స్పృశించే మహాద్భుతం అరసవల్లిలో కనువిందు చేస్తుంది. ఏటా ఉత్తరాయణం, దక్షిణాయన పుణ్యకాలాల్లో మార్చి 9, 10, 11 తేదీల్లో, అక్టోబరు 1, 2, 3 తేదీల్లో భానుడి తొలి కిరణాలు అరసవల్లి ఆదిత్యుని మూలవిరాట్‌ను తాకుతాయి. ఇంద్ర పుష్కరిణిపైన ఉదయించిన తొలి రవికిరణాలు ప్రవేశ గోపురం, అనివెట్టి లేదా ఉత్సవ మండపం, విశేషమండపం, బేడామండపం, భోగామండపం, అంతరాలయం, గర్భగుడి గుండా ప్రసరించి స్వామి సన్నిధి చేరతాయి. ఈ కిరణ ప్రసారం సవ్యంగా సాగిపోవడంలో ఆలయ ప్రవేశగోపురం ప్రధాన పాత్ర పోషిస్తుంది. 1909-10 ప్రాంతంలో ఆలయ ధర్మకర్తలుగా ఉన్న ఇప్పిలి చిన్నసన్యాసిరావు, పెద్దసన్యాసిరావు సోదరులు సొంత డబ్బువెచ్చించి ప్రవేశ గోపురాన్ని నిర్మించారు. తొలి సూర్యకిరణాలు ఆలయంలోనికి నేరుగా ప్రవేశించి స్వామి విగ్రహాన్ని తాకే విధంగా ఆలోచించి, ప్రవేశ గోపురం నిర్మాణం చేపట్టడం విశేషం. ఇందుకోసం ప్రత్యేకంగా కాశీ నుంచి వాస్తుశిల్పిని రప్పించి రెండు సంవత్సరాల కాలంలో దీని నిర్మాణం పూర్తి చేసారు. ఆ శిల్పి నిర్మాణకౌశలమే ఆదిత్యుని కిరణస్పర్శ అద్భుతానికి ప్రధానకారణంగా చెప్పుకోవాలి. సూర్యోదయం సృష్టికి మూలం. మధ్యాహ్న భానుడి ప్రచండరూపం జగత్ కల్యాణతాండవం. సూర్యాస్తమయ సమయం సాక్షాత్తూ వైకుంఠవాసుని లీలామానుష విగ్రహరూపం. త్రిమూర్తి స్వరూపుడైన సూర్యుడు కొలువైన అరసవల్లి సూర్యజయంతి వేడుకలకు సర్వాంగసుందరంగా సిద్ధమవుతూ భక్తులకు ఆహ్వానం పలుకుతోంది.

-యు. శ్రీనివాస్