సెంటర్ స్పెషల్

మహావిజేత 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాటలే తన దేహ మానసాల్ని చిత్రమైన ఊహల్లో తేలించాయి.
చంద్రహాసుడు! తన మనోఫలకం మీద ప్రత్యక్షమైనాడు!
ఫాలం మీద చంద్రవంక గంధపు చారల మీద కుంకుమరేఖ. సాహసమంతా ఏకీకృతమైనదన్నట్టు మెలితిరిగిన మీసం, నిశిత దృక్కులు!
తాను బిత్తరపోయింది. కళ్లు నులుముకుంది. చుట్టూ చూసింది.
తండ్రి శంబరులతో అంటున్నాడు, ‘ఈ పథకం అమలు చేసే కర్తవ్యం మీది. దానికి తగిన గుర్తింపునీ, మన్నననీ, సన్మానాన్నీ అందించే బాధ్యత మాది. సరేనా?’ అని. ఆ పథకమేమో, ఆ కర్తవ్యాలూ, బాధ్యతలూ ఏమో? తన శ్రుతి లోకంలోకీ, గతిలోకంలోకీ, స్థితిలోకంలోకీ రాలేదని!
వర్తమానంలోకి ప్రవేశించింది విషయ. ఎదురుగా వాన. తుంపరల్ని రాలుస్తోందిప్పుడు. పూలవాన అంటే ఇదేనా?
కుచ్చెళ్లు పైకి పట్టుకుని, అడుగులో అడుగు వేస్తూ, పాదాలను నేలకు ఆనించీ ఆనించకుండా, మునివేళ్ల మీద - మంటపం సోపానాలు దాటి, తుంపరలోకి వచ్చేసింది. కొన్ని క్షణాల సమయం ఆ ఆనందంతో పరవశించింది. వెనుతిరిగి వచ్చి ఒక పీఠం మీద కూర్చుంది.
సరిగ్గా ఇదే సమయంలో - అక్కడ,
చంపకమాలిని తన ‘కల’వరంలో తానున్నది.
‘ఈ ఘనుడికి సాటిదానివా? సరిజోడువా?’ అని ఎవరో అడిగినట్లనిపించింది.
‘సందేహం ఎందుకు? గుర్రంపై స్వారీ చేస్తూ కత్తి విసరగలను. మదగజానె్నక్కి బల్లెంతో అరిభంజనం చేయగలను. కుంతాల్ని ప్రయోగించగలను. బలిగోలల్ని విసరి రిపుల గుండెల్లో దించగలను. చక్రాయుధాల్ని గిరగిర గిరవాటు వేయగలను. పడతినైతేనేం ఖడ్గచాలనంలో నాకు తిరుగే లేదు. ఇంకా.. ఇంకా.. అవును.. చంద్రహాసముతో విహరించగలను?’
ఉలిక్కిపడింది. ఎవరికి చెప్పుకుంటున్నదీ స్వోత్కర్ష! ఏమిటా చివరి నేర్పుకు అర్థం? చంద్రహాసంతో విహరించగలను? అదేనా? శే్లషార్థమా? సిగ్గు దొంతరలో తేలియాడింది చంపకమాలిని మానసం. ఆ వివశత్వం వక్షద్వయాన్ని ఉప్పొంగజేస్తున్నది. నులివెచ్చని భావధార కనుకొలకుల్ని చెమరింపజేస్తున్నది.
తృటిలో భావాకాశం నుండి కిందకి దిగింది - చంపకమాలిని.
పక్కకి చూస్తే అద్దాల గవాక్షాల నుంచీ వర్షాస్నాతగా ప్రకృతి కురులార్చుకుంటూ, నునుసిగ్గుల సన్ననవ్వుల్ని రువ్వుతోంది. ఆమె అలా చూస్తూనే వున్నది. అలాగే భావ జలపాతంలో తడుస్తూనూ వున్నది.
రాత్రి గడుస్తున్నది!
33
ఈరోజు కుంతల నుండీ కళింద్ర రాజధానికి వర్తమానం వచ్చింది.
రాబోవు కరద దేవోత్సవానికీ, అష్టలో జరిగే చౌండేశ్వరీదేవి ఉత్సవాలకీ రాచవారూ ఇతర పరివారమూ విచ్చేస్తారనీ - అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయవలసిందనీ-
ముందుగా కరద రాజధానికి వస్తారు వారు.
ప్రముఖుల కందరికీ ఈ వార్తని చెప్పమనీ, వారందరితో ఒక చర్చాగోష్ఠిని ఏర్పాటు చేయమనీ రాచవారి పట్ల జాగరూకతతో వ్యవహరించాలనీ కుళిందకుడు ఆవేదిని ఆజ్ఞాపించాడు.
ఆ అంశం మీద వివరంగానే చర్చ జరిగింది. ప్రభువు చంద్రహాసుని అభిప్రాయం అడిగాడు.
తల యెత్తి అందరి వైపూ చూసి చెప్పాడు చంద్రహాసుడు. ‘రెండు ప్రదేశాల్లోనూ రాచవారికి చేయవలసిన భద్రతా ఏర్పాట్ల గురించి జాగ్రత్త అవసరం ప్రభూ. అష్ట మండలానికి సంబంధించినంత వరకూ సమస్యలేవీ రావని నా నమ్మకం. అక్కడ పూర్వపు మండలాధిపతిని ప్రజలే సమయించారు. శాంతి నెలకొన్నది. వారంతా సుఖంగా జీవనం సాగిస్తున్నారు. కరదలో పరిస్థితి వేరు. ప్రజా జీవనం ప్రశాంతంగా వున్నా, వీరశివుడు కుంతలలో చెరసాలలో వున్నాడు. ఆయన విశ్వాసపాత్రులు - అంటే మనకు శత్రువులు ఎవరైనా - ఆశ చావని వారుంటే, ఈ సమయంలో వారు తమ పడగలు విప్పాలని ప్రయత్నం చేయవచ్చు. అందువలన అక్కడ మనం ఎక్కువ జాగరూకతతో వుండాల్సిన అవసరం వున్నది’
చివరికి ప్రభువు తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు, ‘కరద మండలంలో వున్న దక్షణ్ణకు సహకరించేందుకు అడివప్పను అక్కడికి పంపుదాం. ప్రత్యేకించి ఆయన శిష్యులు - దొడ్డణ్ణ, హాలప్ప లిరువురూ కరదలో మన గూఢచారుల్ని సావధానుల్ని చేసి వారిని పర్యవేక్షిస్తారు. ఇక, అష్టమండలానికి సింగన్న తన ఉపసేనానుల్లో మరొకరిని కూడా పంపుతాడు. రెండు మండలాలకు మన ఆశ్వికులను వీరికి తోడు చేసి పంపండి. ఇతర వివరాలూ, సంఖ్యాదికాలూ, మీరూ చంద్రహాస అక్షయులూ నిర్ణయించుకోండి’ చివరి వాక్యం అంటూ మంత్రి చేతనుల వారిని చూశాడు.
‘చాలా బాగుంది’ అన్నారాయన.
సింగన్న తన ఆలోచనల పరిభ్రమణం నుండి విడివడి పలికాడు, ‘అష్టమండలానికి కూడా’ అని అర్థోక్తిలో ఆపి.. ‘మన యువ వీరుల్ని ఒకరినో, ఇద్దరినో అక్కడికి పంపితే ఎలా ఉంటుంది?’ అంటూ ప్రభువు కళ్లల్లోకి సూటిగా చూడలేక కళవళపడుతూ ‘అఁహఁహఁ... కేవలం నాకు తోచిన మాట’ అన్నాడు.
కుళిందకుడు ఒక్క క్షణం ఆలోచించాడు.
‘సరి. అలాగైతే మన ఉపసేనాని ‘వివరి’ని కుంజరునికి సహకారంగా అష్ట మండలానికి పంపవచ్చు’ సింగన్న వైపు చూస్తూ అన్నాడు ప్రభువు.
‘అలాగే.. ప్రభూ’ అన్నాడు సింగన్న.
అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. సమావేశం ముగిసింది.
34
అగ్నివర్మ భారంగా నిద్ర నుండి లేచి ప్రాతఃస్మరణ పూర్తి చేసుకుంటూ తల్పం దిగాడు. వెంట వెంటనే దైవకార్యాలు జరుపుకున్నాడు. రాత్రి ఎక్కువ సమయం నిద్ర లేదు. ఆయాసంతో బాధ పడీపడీ ఏ అర్ధరాత్రికో నిద్ర పట్టింది.
చంపకమాలిని వచ్చింది. అప్పటికప్పుడే ఆమె పులు కడిగిన ముత్తెంలా మెరుస్తూ వున్నది. ఆమె ముఖ దర్శనమే ఆ తండ్రికి అమితమైన మానసిక ప్రశాంతిని పంచుతుంది.
ఆమె రాకను గమనించి వాత్సల్యంతో ‘రా అమ్మా’ అన్నాడు.
వచ్చి కూర్చుంది. ‘ఎలా వున్నారు?’ అడిగింది.
‘రాత్రి పొద్దుపోయేవరకూ ఇబ్బందిగానే ఉంది తల్లీ. ఎప్పుడో ఒక రాత్రివేళ దగ్గు కాస్త తెరపి ఇచ్చింది. పడుకున్నాను’
‘మీరు ప్రతిదినమూ వసుంధర రజిత చేత చేయించి ఇచ్చిన ఔషధాన్ని సేవించండి. కొంత ఉపశమనంగా ఉంటుంది’
‘అవును. దాని సేవనం తర్వాతనే రాత్రి నిద్రకు వొరిగాను’ అన్నాడు.
రాచ వ్యవహారాలన్నీ సంక్షిప్తంగా ముచ్చటించింది. వాటిలో ముఖ్యమైనది - కుకునూరులోగల కాళికాలయ పునరుద్ధరణ గురించిన విశేషాలు. ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అది. దాని గురించి అనేకమార్లు స్థానీయులు పాలనాధికారులకు తెలిపినా వెంటనే పనులు జరగలేదు. దీనికి ప్రముఖ కారణం ఎక్కువగా గిరిజనులు ఆ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండటం. అందునా ముఖ్యంగా అప్పుడప్పుడూ జంతు, నర బలులు జరుపుతారన్న వార్తలు అధికారుల దృష్టికి రావడం. వాటి అవాంఛనీయతని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఆవశ్యకం. దీనిని మరచి అసలు ఆలయ పునరుద్ధరణనే నిర్లక్ష్యం చేయటం గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆలయ ప్రధానార్చకులు - గాలవుల వారికి ఈ వివరాలన్నీ వర్తమానం పంపాడు. గురువుగారూ, చంపకమాలినీ ఆ వివరాలను విచారింపజేసి ఆలయ పునరుద్ధరణ గావింపజేశారు. ఈ సంగతులన్నీ ఎప్పటికప్పుడు మహారాజుకు తెలియజేస్తూనే ఉన్నారు.
ప్రభువుకు అన్నీ తెలిసినప్పటికీ పునశ్చరణ చేసి అన్నది చంపకమాలిని, ‘ప్రస్తావవశాన మీకీ విషయాలన్నీ గతంలో చెబుతూ వచ్చాను. ఇప్పుడా ఆలయం నిత్య పూజాదికాలతో శోభాయమానంగా ఉన్నదట. అవకాశం చూసుకుని ప్రభువులు ఆలయ దర్శనం చేయాలని తమ కోరికని తెలుపుకున్నారు. ఇప్పుడు గిరిజనులంతా చాలా ఆనందంగా ఉన్నారు’
‘సరి. చూద్దాం. నీ చొరవ వలన మంచి పనులు చాలా జరుగుతున్నాయి’ అన్నాడు అగ్నివర్మ.
అప్పుడు చంపకమాలిని - తన కరద, అష్టమండలాల యాత్రాకాంక్షని వెల్లడించింది. ‘మహామాత్యులు మీకు మనవి చేసే ఉంటారు’
‘అవును... వారు ప్రస్తావించారు’ సాలోచనగా ఆమె వైపు చూస్తూ అన్నారు.
‘నేనుగా ముందు మీకు చెప్పాలనుకున్నా, మీ ఆరోగ్యం దృష్ట్యా మిమ్మల్ని వదలి వెళ్లవలసి వస్తుందనే సంకోచంతో చెప్పలేదు. విషయ, విరజా ఉత్సాహపడుతున్నారు. మిగిలిన వారు కూడా వెళ్లాలనే ఉవ్విళ్లూరుతున్నారు. నేను రానంటే వాళ్లూ వెళ్లరు గదా అని’ అర్థోక్తిలో ఆగింది.
‘వెళ్లిరా తల్లీ, నీకూ కొంత ఆటవిడుపుగానూ, మానసికోల్లాసంగానూ ఉంటుంది. వసుంధరా, పరిచారికాలూ వున్నారు కదా. రాజవైద్యులు అహరహమూ మన పట్ల శ్రద్ధతో కనిపెట్టుకునే ఉంటారు’
ఆపైన కొద్దిసేపటికి ఆస్థాన పౌరాణికుడు గోపతి వచ్చారు.
‘పురాణ శ్రవణం మనసుకి కొంత ఊరట నిస్తుందని ఈ వేళ నేనే వారిని పిలువనంపాను’ కూతురి సందేహాస్పద దృక్కులకి సమాధానంగా అన్నాడు.
‘మంచి ఆలోచన’ అన్నది. గోపతికి అభివాదం చేసింది. లేచి, ‘నేను వస్తాను మరి’ అని సెలవు తీసుకుంది.
క్షణాల తర్వాత సన్నివేశానుగుణంగా సర్దుకు కూర్చుని గళమెత్తారు గోపతి.
శ్రీమద్రామాయణం సుందరకాండ ప్రవచనం మొదలైంది.
35
పద్మిని ఎదురుగా దుర్గి.
రేగిన జుట్టు, ఒడలిన ముఖం, ఏడ్చినట్లుగా ఎర్రబడి ఉబ్బిన కళ్లు!
ఆమెను చూసీ చూడగానే విచలిత అయింది పద్మిని.
ఏం జరిగిందని విచారించింది. చెప్పింది దుర్గి.
దుర్గి చెప్పిన విషయం విని మ్రాన్పడిపోయింది పద్మిని.
నమ్మశక్యం కాని వార్త అది. గుండె దడదడలాడింది. నిజానికి తల్లిని కోల్పోయిన ఆడపిల్లగా దుర్గి ఈ ఘటనకి ఎంతగా భయభ్రాంతులకు లోనయి బాధపడిందో! కళింద్ర నగరంలో నాగరికత విస్తరించిందనే అభిప్రాయంతో వున్న తనకు ఆ దుర్ఘటనతో తాముగా సాధించుకున్న అభివృద్ధి తప్పటడుగులు వేస్తోందని తెలిసి ఆవేదన కలిగింది పద్మినికి.
‘ఇట్లా కాదు. ఈ దారుణాన్ని ముందుగా అన్నలకి చెప్పాలి పద’ అని బయల్దేరింది.

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600