సెంటర్ స్పెషల్

మహావిజేత 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

36
పురుషోత్తమాచార్యుల వారి ఆశ్రమమే - ఇంకా విశాలంగా తీర్చిదిద్దబడింది.
ఉత్తర భారతం నుండి వచ్చిన మహా పండితులు, వేద వేదాంగ శాస్త్ర పారీణులు అయిన మాధవ దేశికుల వారు - ఇక్కడ తమ ప్రవచనాన్ని ఇస్తున్నారు.
ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. రాజధాని చందనావతిలోని జనమంతా ఇక్కడే ఉన్నారా అన్నట్టు నేల ఈనిన చందంగా చేరారు ప్రజలు.
ప్రముఖులంతా ఉన్నారు.
కుళిందకుడూ - రాణీ కూడా వచ్చి ఆసీనులయినారు.
దేశికులు మహాభారతంలో మానవ స్వభావాల గురించి తమ ప్రవచనం ప్రారంభించారు.
ఆ తర్వాత, ‘వ్యక్తి - ధర్మాచరణ’ గురించి చెబుతూ ధృతి, క్షమ, దయం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీ, విద్య, సత్యం, ఆక్రోధం - అని ధర్మ లక్షణాలు పదింటినీ పేర్కొన్నారు. ఒక్కొక్క దాని స్వభావాన్నీ వివరించారు. వీటిలో విద్య గురించి విశదంగా చెప్పారు.
సరిగ్గా అప్పుడే - ఉన్నట్టుండి - జనంలో కలకలం రేగింది. జనం చెల్లాచెదురుగా పరిగెత్తసాగారు. క్షణంపాటు - ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు. వేదిక మీద వున్నవారూ, కిందనున్న ప్రముఖులూ విస్తుపోయి చూస్తున్నారు.
‘అడవిలో నుంచీ ఏనుగుల గుంపు వచ్చేస్తోంది. అదిగో.. అదిగో’ అంటూ అరుపులూ కలకలం...
ఇంతలో ఒక వ్యక్తి వేదికకు నైరుతి వైపు ఉన్న సాలవృక్షం దరికి పరిగెత్తుకుంటూ వెళ్లి దాని నధిరోహించి లిప్తకాలంలో అక్కడ నుండీ పెద్దగా అరిచాడు. ‘్భయపడకండి.. వస్తున్నది రెండే మత్త్భాలు. గుంపు కాదు’ అని. జనంలో కలవరం కొంత తగ్గింది.
అందరూ ఆగ్నేయానికి పరుగెత్తసాగారు. కొందరు యువకులు నైరుతి దిశగా పరిగెత్తుకుపోయారు.
చంద్రహాసుడు -
‘బాగుంది. చక్కని ప్రయత్నం’ అని తానూ ఆ వైపే అడుగులు వేశాడు. అక్షయుడూ, ఇతర మిత్రులు కూడా కదిలారు. వాళ్లు వంశీవనం దాపు కొచ్చేసరికే ఒక వీరుడు ఒక ఏనుగు కాలికి ఇనుప గొలుసు వేసి బిగించి, ఒక పెద్ద వటవృక్షానికి దాన్ని కట్టేశాడు. మరో బలిష్ఠుడైన వీరుడు బరిసెనే అంకుశం చేసి రెండవ ఏనుగు పైకి ఎక్కి అదుపు చేసేశాడు. రెండూ నేల మీద పడుకుండిపోయాయి. అసహాయంగా తొండాల్ని గాలిలోకి ఎత్తి వంకర్లు తిప్పుతూ భీకరంగా ఘీంకారాలు చేస్తున్నాయి.
ఎవరీ వీరులని పరీక్షగా చూశారు అక్షయ చంద్రహాసులు. ఒకడు సుబలుడు, రెండవవాడు ముదువొల్ల! ఆశ్చర్యానందాలతో వారిని అభినందించారు. మిగిలిన వారంతా అక్కడికి చేరేరు. ‘సాలవృక్షాన్ని ఎక్కి జనాన్ని భయపడవద్దని చెప్పిన వీరుడు ఇతనే’ అని పోరన్నను ముందుకు నెట్టారు!
‘వీరంతా ఇంత ధైర్యంతో సమయస్ఫూర్తితో గొప్ప సాహసం చేశారు’ అంటూ ‘అంతా అన్న మహాత్యం’ అన్నాడు అక్షయుడు.
‘మహత్యం కాదు బాబూ... మహత్వం అనాలి’ నవ్వుతూ అన్నాడు చంద్రహాసుడు.
అందరూ నవ్వుకుంటూ కదిలారు.
దుర్గి మనసులో మాత్రం ఆనందమో, విభ్రమమో, అలజడో తెలియని కలవరం రేగింది!
ఇంటికి వచ్చిన తర్వాత కూడా దుర్గికి జరిగిన ఘటన గురించిన ఆలోచనలే మనసులో సుడి తిరుగుతున్నాయి.
‘జీవితం ఏ చట్రంలోనూ ఇమడదు. ఏ సరళ రేఖలోనూ సాగిపోదు’ - అని చంద్రహాసుడు తరచుగా అనేది ఇందువల్లనేనేమో! తలపులు సాగిన కొద్దీ ఈ సుబలుని వికార చేష్టలూ, మార్పూ కూడా ఆ జీవిత నిర్వచనానికి ఉదాహరణే అని అనిపించింది దుర్గికి!
37
కుంతల రాజకుమారి, పరివారం - కరద, అష్ట మండలాల పర్యటన విషయంలో ఏర్పాట్ల కోసం కరదకు అడివప్ప, అష్టకు వివరి బయలుదేరి వెళ్లారు. వలసిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు కళింద్రకు వర్తమానమూ వచ్చింది.
కానీ హఠాత్తుగా కరద నుండి వార్త! ప్రాసాదం మరమ్మతులు సాగుతున్నవి కానీ, కర్మకరులుగా రావలసిన కొందరు గిరిజనులు రాకుండా ఆందోళనలు చేస్తున్నారని! వారి పట్ల దక్షణ్ణ వివక్షత చూపుతున్నాడనేది కారణం. అదీ దినబత్తెముల విషయంలోనే! చేసిన పనిని బట్టీ, శ్రమ విలువను బట్టీ దినబత్తెములు నిర్ణయింపబడినవనీ, చెల్లింపులు ఆ విధంగానే జరుగుతున్నాయనీ, అయినా వారు మొండి వైఖరితో ఆందోళనకు దిగారనీ అడివప్ప వివరణ ఇచ్చాడు.
విషయం అల్పమైనదయి వుంటే - అడివప్ప పరిష్కరించే వాడే. దీని వెనుక ఏదో ప్రోద్బలం ఉండి వుండవచ్చు. దానిని ఉపేక్షించకూడదు. మొక్కగా వంగనిది మ్రానై వంగదు అని తీవ్రంగానే ఆలోచించారు చంద్రహాస - అక్షయులు.
ఆ రాత్రే - ప్రభువుకూ, సింగన్నకూ, మంత్రివర్యులకూ విషయ వివరణ చేసి, మరునాడు కరద వెళ్లారు.
కరదలో మొదటిరోజు పనుల ఆరంభం నుండీ జరిగిన నియామకాల్నీ, సంప్రదించిన వివిధ కర్మకర వర్గ నాయకుల పేర్లనూ పరిశీలించాడు చంద్రహాసుడు.
ఆందోళనకు దిగిన గిరిజన వర్గ నాయకుని పిలిపించాడు, చర్చలు జరిగాయి. భవనం బయట ఆ గిరిజన వర్గం వారు గుమిగూడారు. గుసగుసలు, హెచ్చరికలు, నినాదాలూ చేస్తున్నారు.
భవనం లోపల - ‘ఎట్టి పరిస్థితులలోనూ మేము పని చేయము’ అన్నాడు నాయకుడు.
‘అదేమి నిర్ణయం? మీరు అడిగిన నాతం ఇవ్వడానికి అంగీకరిస్తే...’ రెట్టిస్తూ అడిగాడు అక్షయుడు.
‘అయినా సరే... కళింద్ర వారికి సహకరించడం మాకు సమ్మతము కాదు’ అన్నాడతను.
అతని పొగరు మాటలకు అందరూ విస్మయం చెందారు. చంద్రహాసుని వైపు చూశారు. అతను గంభీరంగా వున్నాడు. క్షణమాత్రపు ఆలోచనతో ‘ఇతన్ని బంధించండి’ అని దృఢ స్వరంతో ఆజ్ఞాపించాడు.
అందరూ విభ్రమం చెందారు!
భటులు అతన్ని బంధించారు. ‘ఇతన్ని దక్షణ్ణ వారి కార్యాలయంలో ప్రవేశపెట్టండి’ అక్షయుడు అన్నాడు. ఆ నాయకుని ట్రు నుంచీ అటే తరలించారు. ‘మంచి ఆలోచన. నాకు చాలా సంతృప్తిగా వున్నది’ అన్నాడు చంద్రహాసుడు.
లోపల ఏమి జరుగుతున్నదో తెలియక కేకలు వేస్తూ వేచి చూస్తున్నారు - బయట వున్న గిరిజనులు. ఆ రాత్రంతా అలాగే గడిచింది.
మరునాడు, తెలతెలవారుతూండగానే - పర్వత ప్రాంతం నుంచీ శంబరుని బంధించి తెచ్చారు - దక్షణ్ణా, భటులూ!
గిరిజనుల ఆందోళన వెనుక ఇతని హస్తమే వున్నదనీ, అతడు కుంతల సామ్రాజ్య సేనాని ప్రసేనునికి ‘కావలసిన’ వాడనీ తేటతెల్లమయింది. ఆ మధ్యాహ్నమే - గిరిజన కర్మకరుల సమావేశం నిర్వహించి వాస్తవాన్ని వెల్లడించారు. వారంతా తమ నాయకుని దూషిస్తూ, వెంటనే పనుల్లోకి చేరుతామని - ముందుకు వచ్చారు.
రాజప్రాసాదం మరమ్మతులూ, ఇతర పనులూ ముమ్మరమైనాయి. శంబరుడు వీరశివుని అనుయాయి అనీ, ప్రసేన, దుష్టబుద్ధి వారి మనిషిగా గూఢచర్యం నెరపుతూ, వారి పన్నాగంలో భాగస్వామి అయ్యాడనీ తేలిపోయింది. కుళిందకునికి ఈ వార్తలన్నీ తెలియజేశారు. అడివప్ప సూచన మేరకు కరదలో మరికొన్ని రోజులు వుండి రాజధానికి నీటి ఏర్పాటు కూడా పూర్తి చేసి చంద్రావతికి తిరిగి వచ్చారు అక్షయ చంద్రహాసులు.
38
చందనావతి! మండలేశ్వరుని భవనం!
అష్టలో ఉత్సవ ఏర్పాట్లు గురించీ, పాలనా వ్యవహారాల గురించీ చర్చ సాగుతోంది.
‘కుంజరుడూ, వివరీ మాకు ఎలాంటి వర్తమానమూ పంపలేదు. అక్కడి స్థితిగతులేమిటో పూర్తిగా తెలియదు’ సాలోచనగా అన్నాడు కుళిందకుడు.
‘ప్రత్యేకమైన విశేషాలేమీ లేవేమో మరి’ అన్నాడు అక్షయుడు. చంద్రహాసుడేమీ మాట్లాడలేదు.
‘మీరిరువురూ అష్టకు కూడా ఒకసారి వెళ్లి వస్తే బాగుంటుందేమో. కుంతల రాజకుమారి పర్యటన గురించి గాలవుల వారు ప్రత్యేకంగా నాకు మరోసారి కబురు చేశారు. ఏర్పాట్లలో లోటుపాట్లు వుంటే ఇబ్బందవుతుంది’ అన్నాడు ప్రభువు.
‘మీరు ఆ విషయాలు చూసుకుని వస్తేనే బాగుంటుంది’ అన్నారు ఆచార్యులు కూడా.
వీరి మాటలు వింటుంటే, హఠాత్తుగా చంద్రహాసుని మదిలో ఒక ప్రశ్న జనించింది. ‘కరదలో వలెనే అష్టలోనూ వేరే పన్నాగమేమైనా ఉండి ఉంటే?’ వెళ్లి రావటమే మంచిదనిపించింది.
ఆ మర్నాడే ఇద్దరూ అష్టకు బయల్దేరారు.

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600