లోకాభిరామం

మనిషి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి చెట్ల మీద నుంచి దిగి బతకాలని అనుకోవడం ఒక తప్పు అన్నారు. ఇక జీవం సముద్రంలో నుంచి నేల మీదకు రావడమే తప్పు అన్నారు మరి కొందరు - డగ్లస్ ఆడమ్స్
* * *
టెలివిజన్ వచ్చిన మొదట్లో నేను ఒక చిన్న పోర్టబుల్ టీవీ కొన్నాను. అది నలుపు తెలుపు రకం. అది నాకు రకరకాల భాషల సినిమాలను, దూరదర్శన్‌లోని సీరియళ్లను చూపించి రుణం తీర్చుకుని పాడయింది. చూస్తుండగానే బజారులో బోలెడు రకాల టీవీలు వచ్చాయి. నన్ను ఒకానొక పత్రిక వాళ్లు టీవీలను గురించి, అంటే ఛానళ్లు కాదు, టీవీ అనే యంత్రం గురించి వ్యాసం రాయమన్నారు. ఆ వ్యాసంలో నేను అందుబాటులో ఉన్న టీవీలను గురించి ఒక మాట అన్నాను. బజారులో కంచాలు అమ్మడంలేదు, డిన్నర్ సెట్ మాత్రమే అమ్ముతారు. అది తెచ్చుకుని అందులోని ఒక కంచాన్ని మాత్రం మనం వాడినట్టే ఉన్నాయి ఈ టీవీలు అన్నాను.
అప్పట్లో మొత్తం కలిసి ఐదు ఛానళ్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో బిబిసి ఒకటి. అది కూడా దయ దలచి విదేశాల కొరకు వాళ్లు తయారుచేసి విదిలించిన వార్తల రకం కాకుండా అసలు సిసలయిన చానల్-2 అనుకుంటాను. అందులో చాలా గొప్ప కార్యక్రమాలు వచ్చేవి. ఎక్కడ ఉన్నా సరే క్యుఇడి సమయానికి ఇంటికి చేరి ఆ కార్యక్రమాన్ని చూచేవాడిని. అలాగే అనుకోకుండా ‘అసెంట్ ఆఫ్ మాన్’ అనే సీరియల్ వేశారు. అది నిజానికి 1973లో తయారయింది. దాని గురించి విన్నాను. అది చూపిస్తున్నారనే సరికి ఆ పదమూడు వారాలు, పదమూడు ఎపిసోడ్‌లు చూచి ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లినట్టు గట్టిగా గుర్తుంది.
అసెంట్ అంటే ఎక్కి ఎత్తులకు చేరుకోవడం అని అర్థం. ఈ సీరియల్‌లో మానవ జాతి పుట్టి ఇంచుమించు ప్రస్తుత పరిస్థితికి చేరిన క్రమం గురించి చూపించారు. ఆ తీరు అద్భుతంగా ఉంది. సైన్సు గురించి అంతగా తెలియని వాళ్లు కూడా సీరియల్‌ను ప్రపంచమంతటా చూచి ప్రశంసించారు. బిబిసి వాళ్లు దాన్ని ఎన్నిసార్లు మళ్లీ చూపించారో లెక్కలేదు. చివరికి మన దేశంలో కూడా అప్పట్లోనే చూపించారంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటిదే మరో సీరియల్ కార్ల్‌సేగన్ సమర్పించిన ‘కాస్మాస్’. అది అంతరిక్షానికి సంబంధించినది. ఈ వ్యాసంలో దానికిప్పుడు చోటు లేదు. ఇక అసెంట్ ఆఫ్ మాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
గాంధీ సినిమా, ఇంగ్లీషులో వచ్చినది అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ సినిమాకు ఆటెన్‌బరో అనే మనిషి ఆధారంగా నిలుచున్నాడు. అంతర్జాతీయ సినిమా రంగంలో అతను అందెవేసిన చెయ్యి. అసెంట్ ఆఫ్ మాన్ సీరియల్ వెనుక కూడా ఆటెన్‌బరో ఉన్నాడు. అయితే ఆయన తెర మీద కనిపించలేదు. మొదటి నుంచి చివరి ఎపిసోడ్ దాకా తెర మీద జేకబ్ బ్రొనోవ్‌స్కీ అనే ఒక పెద్ద మనిషి కనిపిస్తాడు. అతను సైంటిస్ట్ కాదు. పూర్తి సైంటిస్ట్ కాకపోలేదు. నిజానికి అతడిని సాహిత్యకారుడిగా అందరూ గుర్తించారు. విలియమ్ బ్లేక్ అనే కవి గురించి పెద్ద సిద్ధాంతం కూడా రాశాడతను. చిత్రంగా జేకబ్ ఇంగ్లీషు తెలిసిన మనిషి కూడా కాదు. ఎప్పుడో గతంలో చిన్నవాడుగా ఉండగా వలస వచ్చి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. గణితం కూడా నేర్చుకున్నాడు. అతను 1973లో బిబిసి-2 కోసం 13 భాగాలుగా మానవ పరిణామం గురించి ఈ సీరియల్‌ను సమర్పించాడు.
మామూలుగా టీవీ కార్యక్రమాలకు ముందుగా స్క్రిప్టు రాసుకుంటారు. దానికి తగినట్టుగా సీన్‌లను ఊహించుకుంటారు. వాటిని షూట్ చేయించుకుంటారు. కామెంటరీకి తగినట్టుగా దృశ్యాలను అమరుస్తూ మొత్తం డాక్యుమెంటరీని తయారుచేస్తారు. కానీ ఈ సీరియల్ విషయంలో ఆ పద్ధతిని పక్కన పెట్టినట్టు చక్కగా కనిపిస్తుంది. బ్రొనోవ్‌స్కీ ఎక్కడికక్కడ సరిపడ గలగల మాట్లాడుతూ ఉంటాడు. చెప్పదల్చుకున్న విషయానికి తగిన ప్రదేశాలకు అతడిని అందరూ కలిసి తిప్పారని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ క్షణంలో ఆఫ్రికాలో నిలబడి మాట్లాడుతున్న మనిషి తరువాతి కొన్ని నిమిషాల్లో ప్రపంచంలోని మరో చోటికి తీసుకువెళ్లి విషయాన్ని ముందుకు సాగించిన వైనం అద్భుతంగా ఉంటుంది.
బ్రొనోవ్‌స్కీ మాటకారితనం సాటిలేనిది. కవిత్వంలాంటి మాటలు చెపుతాడు. కళ్లు తెరిపించే మాటలు చెపుతాడు. ‘ప్రకృతి చేసిన ప్రయోగంలో ఆటబొమ్మ మనిషి’ అని అర్థం వచ్చే ఒక మాటను ఒకానొక ఎపిసోడ్‌లో అతను అన్నప్పుడు నాకు కొంచెంసేపు ప్రపంచం తెలియలేదు. ఆలోగా చాలా దృశ్యాలు అర్థం కాకుండానే ముందుకు వెళ్లిపోయి ఉంటాయి. అట్లాగే సందర్భం గుర్తుకు రావడం లేదు గానీ, జెర్మనీలో మారణహోమాలు జరిగిన చోట ఏర్పడిన ఒక జలాశయం అంచున మోకాళ్లు వంచి కూర్చుని ఆ నీళ్లను తాకి అతను అన్న మాటలు నాకు చెవుల్లో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. మనసు కరిగింది అని మామూలుగానే అనేస్తూ ఉంటారు. బ్రొనోవ్‌స్కీ అక్కడ మనిషి పరిస్థితిని గురించి అన్న మాటలు అర్థమయితే మనసు కరగడం కాదు, బహుశా ఆవిరి అవుతుంది.
సీరియల్ చిత్రీకరణ కూడా చాలా సృజనాత్మకంగా జరిగింది. బహుశా ఈ ఎపిసోడ్స్ అన్నీ యూట్యూబ్‌లో దొరుకుతాయి. లేదంటే అమెజాన్ లాంటి ఆన్‌లైన్ అంగళ్లలో తప్పకుండా దొరుకుతాయి. చాలా కాలమయింది, బోలెడు కాపీలు అమ్ముడయ్యాయి. కనుక పదమూడు సీడీలు లేదా డీవీడీల ధర చాలా తక్కువగానే ఉంటుంది. ఆసక్తిగల వాళ్లందరూ వాటిని సంపాదించి చూడండి. నేనేదో వాళ్లకు లాభం కలగాలని చెప్పడం లేదు. మధురాహారం దొరికితే పంచుకుని తినాలని మనవాళ్లు అన్నారు. మంచి పుస్తకం, సినిమా లాంటి వాటిని కూడా అందరూ ‘అనుభవించాలని’ నా తపన.
అసెంట్ ఆఫ్ మాన్ విషయంలో బ్రొనోవ్‌స్కీ మాటల తీరు బాగా నచ్చిన వాళ్లెవరో సీరియల్‌లోని మాటలన్నీ పుస్తకంగా రావాలి కదా అని ప్రతిపాదించినట్టున్నారు. ఆలోచన రావాలేగానీ ఆచరణకు ఆలస్యం చెయ్యని మనుషులు వాళ్లు. మొత్తం సీరియల్‌ను అక్షర రూపంలోకి మార్చారు. అందులో మరీ సులభంగా అర్థం కానివి అనిపించిన చాలా తక్కువ భాగాలను మాత్రం తొలగించి పుస్తకంగా ప్రచురించారు. చిత్రం చెప్పుకోవాలంటే 1972లో జేకబ్ బ్రొనోవ్‌స్కీ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ’73లో అతని సీరియల్ వచ్చింది. వెంటనే గొప్ప హిట్ అయ్యింది. అతనికి అనుకోనంత పేరు వచ్చింది. కానీ 1974లో బ్రొనోవ్‌స్కీ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు. అతని పుస్తకం మాత్రం ఇనే్నళ్ల తరువాత కూడా సంచలనం సృష్టిస్తున్నది. ఈ మధ్యనే రిచర్డ్ డాకిన్స్ అనే పరిణామ పరిశోధకుని ముందు మాటతో పుస్తకం సరికొత్త ఎడిషన్ బయటకు వచ్చింది. అసలు పుస్తకం, సినిమా రాక ముందే నకళ్లు ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమయ్యే ఈ కాలంలో అసెంట్ ఆఫ్ మాన్ ఆ రకంలో అందడం లేదు అంటే, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నదీ మనం అర్థం చేసుకోవచ్చు.
బ్రొనోవ్‌స్కీ తరువాత పరిణామం గురించి, మానవుల తీరు గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. అందులో జారెడ్ డయమండ్ లాంటి వారి రచనలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయినా సరే, అసెంట్ ఆఫ్ మాన్ మాత్రం ఒక ప్రామాణిక వ్యాఖ్యానంగా నిలిచిపోయింది. సైన్సు పుస్తకం అనిపించకుండా ఇంచుమించు కథ చెప్పిన పద్ధతిలో జేకబ్ చేసిన వ్యాఖ్యానం రచయితలు అందరికీ ఆదర్శంగా నిలబడింది.
ఝలక్: నేను జీవశాస్త్రం చదువుకున్నాను. ఈ ప్రపంచంలో జీవులు, అందులో మనిషి అనే మరో జీవి పుట్టి ఈనాటి స్థితికి వచ్చిన తీరు గురించి చదవడం నాకు చాలా ఇష్టమయిన విషయాల్లో ఒకటి. ‘ఇవాళ మనం, ఇలాగే ఎందుకు ఉన్నాము’ అన్న ప్రశ్నకు జవాబుగా ఒక పుస్తకం రాయాలని నాకొక కోరిక కలకాలంగా మనసులో ఉంది. అందుకు పూర్వరంగంగా ఎంతో సమాచారం సంపాదించుకున్నాను. అసెంట్ ఆఫ్ మాన్ సీరియల్‌ను ఎన్నిసార్లు చూచానో గుర్తులేదు. అంటే ఆ ఎపిసోడ్‌లు చాలా రోజులుగా నా దగ్గర ఉన్నాయనే కదా అర్థం.

( చిత్రం) జేకబ్ బ్రొనోవ్‌స్కీ

కె.బి. గోపాలం