ఈ వారం స్పెషల్

విఘ్నేశ్వరుని కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరో త్పత్తియు, చంద్రదర్శన దోష కారణంబును తన్నివారణమును చెప్పుదొడంగెను.
పూర్వము గజ రూపము గల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, ‘స్వామీ! నీ వెల్లప్పుడు నా యుదరమందే వసించి యండు’మని కోరెను. భక్తసులభండగు నా పరమేశ్వరుండాతని కోర్కె దీర్ప గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబున నుండెను.
కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల ననే్వషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్తుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, ‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి. ఇప్పుడు కూడా నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము’ అని విలపింప, శ్రీహరి యా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా, గజాసురుండు విని, వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానంద భరితుడై ‘మీకేమి కావలయునో కోరుకొనుండు ఒసంగెద’ ననిన, హరి వానిని సమీపించి ‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనగొనుటకై వచ్చె. కావున శివునొసంగు’ మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడుగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయ మనకొనుచు తన గర్భస్తుండగు పరమేశ్వరుని ‘శిరస్సు త్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’ మని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము దెలుప నాతడు నందిని ప్రేరేపించును. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి ‘దుష్టాత్ముల కిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’ నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కి కైలాసంబున కతివేగంబున జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుపిండితో ఒక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నంది నారోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోనికేగెను.
అంత పార్వతీదేవి భర్తంగాంచి, ఎదురేగి, అర్ఘ్య పాద్యాదులచే పూజించె. వారిరువురును పరమానందమున ప్రియ భాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంతనమ్మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణంబు నొసంగి ‘గజాననుడు’ అని నామం బొసగె. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనియెను.
కొంత కాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అతడు మహా బలశాలి. అతని వాహనరాజము నెమలి. అతడు దేవతల సేవా నాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.
విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ యాధిపత్యము తన కొసగుమనియు, ‘గజాననుడు మరుగుజ్జువాడు. అనర్హుడు. అసమర్థుడు గనుక ఇయ్యాధిపత్యము తన కొసంగు’ మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.
శివుడు ఆకుమారులను జూసి, ‘మీలో నెవ్వరు ముల్లోకము లందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యం బొసంగుదు’నని పరమేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబు నెక్కి వాయువేగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి, ప్రణమిల్లి ‘అయ్యా నా అసమర్థత తామెరింగియు నిట్లానతీయ దగునే! మీ పాద సేవకుడను. నా యందు కటాక్షముంచి తగు నుపాయంబు దెల్పి రక్షింపవే’ యని ప్రార్థింప, మహేశ్వరుడు దయాళుడై, ‘సకృత్ నారాయణేత్యు క్త్యాపుమాన్ కల్ప శతత్రయం గంగానది సర్వ తీర్థేషు స్నాతో భవతి పుత్రక’ - ‘కుమారా! ఒకసారి నారాయణ మంత్రంబు పఠించు’ మనగా, గజాననుడు సంతసించి, అత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.
అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడు కోట్ల ఏబది లక్షల నదులలో కూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపముందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని, ‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు’ మని ప్రార్థించెను.
అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునకు విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వ దేశస్తులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, పాలు, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్ఠుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యె. బలవంతంబుగ చేతు లానిన చరణంబు లాకాశంబు జూచె. ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమ నొందు చుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె. అంత రాజదృష్టి సోకి రాలు కూడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లడల దొర్లెను. అతండును మృతుండయ్యె. పార్వతి శోకించుచు చంద్రుని జూచి, ‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుండు మరణించెను గాన, నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల నొందుదురు గాక’ అని శపించెను.
ఋషిపత్నులకు నీలాపనిందలు
ఆ సమయంబున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్ని దేవుడు ఋషిపత్నులను చూచి మోహించి, శాప భయంబున అశక్తుడై క్షీణించుచుండగా, నయ్యది అగ్ని భార్య యగు స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషి పత్నుల రూపంబులు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె. ఋషులద్దానింగనుగొని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే యని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషి పత్నులు చంద్రుని చూచుటచే వారి కట్టి నీలాపనింద కలిగినది.
దేవతలును, మునులను ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్ని హోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్త ఋషులను సమాధానపరచె. వారితో కూడ బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె.
అంత దేవాదులు, ‘ఓ పార్వతీ దేవీ! నీ శాపంబు లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు’ మని ప్రార్థింప, పార్వతి సంతసించి, ‘ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాద’ని శాపావకాశంబు నొసంగె. అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.
శమంతకోపాఖ్యానము
ద్వాపరయుగంబున ద్వారకావాసి యగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు, స్వామీ! సాయం సమయమయ్యె, ఈనాడు వినాయక చతుర్థి, పార్వతీదేవి శాపంబుచే చంద్రుని జూడరాదు గాన నిజ గృహంబున కేగెద శెలవిండు!’ అని పూర్వ వృత్తాంత మంతయు శ్రీకృష్ణునికి తెల్పి, నారదుడు స్వర్గ లోకమున కేగెను.
అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుండుగాన, తాను మింటి వంక చూడక గోష్టమునకు బోయి పాలు పితుకుచు, పాలలో చంద్రుని ప్రతిబింబమును జూచి, ‘ఆహా! ఇక నా కెట్టి యపనింద రానున్నదో’ యని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి, ద్వారక పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను. శ్రీకృష్ణుడాతనిని మర్యాద చేసి ‘ఆ మణిని మన రాజునకి’మ్మనెను. అతడది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతియైన నివ్వడనిన, పోనిమ్మని శ్రీకృష్ణు డూరకొనెను.
అంత నొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన నొక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి, వాని జంపి యా మణిని గొనిపోవుచుండగా, నొక భల్లూక మా సింగమును దునిమి యా మణిని గొనిపోయి తమ కుమార్తె కాటవస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి నాలించి, ‘కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి, రత్నమపహరించె’ నని నగరమున చాటె. కృష్ణుడది విని నాడు క్షీరమున చంద్ర బింబమును జూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన బంధుసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా, నొక్కచోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలి జాడలును పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను. ఆ దారి పట్టి బోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూచి, పరివారంబు నచట విడిచి, కృష్ణుండు గుహ లోపలికేగి అచట బాలిక ఉయ్యాలపై కట్టబడి వున్న మణిని జూచి అచటకు బోయి, ఆ మణి చేతపుచ్చుకుని వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక యేడ్వదొడంగెను. అంత దాది, వింత మానిసి వచ్చెననుచు కేకలువేసెను. అంతట జాంబవంతుడు రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, నఖంబున గ్రుచ్చుచు, కోరల గొఱకుచు, ఘోరముగా యుద్ధము చేయ, కృష్ణుడు వానింబడద్రోసి, వృక్షముల చేతను, రాళ్ల చేతను, తుదకు ముష్ఠి ఘాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువ దెనిమిది దినంబుల యుద్ధ మొనర్చ జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి జెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారి యగు శ్రీరామచంద్రునిగా నెఱింగెను. ‘ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరమని ఆజ్ఞ మొసంగ నా బుద్ధి మాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరుకుంటిని. కాలాంతరమున నది జరుగగలదని నెలవిచ్చితిరి. ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబట్టె. జీవితేచ్ఛ నశించె. నా అపరాధములు క్షమించి కాపాడు’ మ’ని ప్రార్థింప, శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి, ‘్భల్లూకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుగొన నిటు వచ్చితిని గాన మణి నొసంగుము. నే నేగెద’నని జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తమ కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి, కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి, పిన్న పెద్దలను జేర్చి యావద్వృత్తాంతమును చెప్పి శమంతకమణి నొసగిన నా సత్రాజిత్తు ‘అయ్యో! లేని పోని నింద మోపి దోషంబునకు పాల్పడితి’నని విచారించి మణి సహితముగా తన కూతురగ సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపుమని వేడుకొనెను. శ్రీ కృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభ ముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, ‘మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి’ యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై, ‘్భద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదంబున చంద్ర దర్శన మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతక మణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరు గాక!’ అని ఆనతీయ, దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.
‘సర్వేజనాస్సుఖినోభవంతు!’