భగత్‌సింగ్

ఆఖరి అంకం (భగత్‌సింగ్ 46)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...........................
తెల్ల రాక్షసులు ఏమి చేశారు? ముగ్గురు జాతీయ వీరుల
శరీరాలను ముక్కలు చేసి, గోనెసంచుల్లో మూటలు
కట్టించారు! రాత్రి సద్దుమణిగాక తమ జైలు వెనక గోడలో
కొంత భాగాన్ని తామే దొంగల్లా బద్దలు కొట్టించారు.
ఆ సందులో నుంచి ఒక ట్రక్కును లోపలికి తెప్పించారు.
గోనెసంచులను అందులో వేసుకుని దొంగల్లా పారిపోయి,
70 మైళ్ల దూరంలో ఫిరోజ్‌పూర్ సమీపాన సట్లెజ్ నది ఒడ్డున ఒకచోట శరీర భాగాలను కుప్పపోసి, కిరోసిన్
కుమ్మరించి తగులబెట్టారు.
....................

ఒక కోర్టు తరవాత ఒక కోర్టులో ఎవరి దారిన వారు పిటీషన్ల మీద పిటీషన్లు...
ఏ రాష్ట్రంలో చూసినా ధర్నాలు, హర్తాళ్లు, ఊరేగింపులు, బహిరంగ సభలు...
లక్షల సంతకాలతో వైస్రాయికి వేడికోళ్లు... వెయ్యి దేవుళ్లకు ఆపదమొక్కులు.
తన క్షేమం కోసం తల్లడిల్లుతూ యావద్భారతం ఉద్విగ్నంగా, మహోద్రిక్తంగా ఉన్నా తన ప్రాణం గురించి భగత్‌సింగ్‌కి మాత్రం చింత లేదు. జైలు వార్డెను చరత్‌సింగు సౌజన్యంతో తమ్ముడు కుల్బీర్‌సింగు ద్వారా ద్వారకానాథ్ దాస్ లైబ్రరీ నుంచి కావలసిన పుస్తకాలన్నీ తెప్పించుకుని, అరిస్టాటిల్, ప్లేటో, రూసో, బెర్ర్డాండ్ రసెల్ నుంచి ట్రాట్స్కీ, మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ వరకూ... వర్డ్స్‌వర్త్, బైరన్ మొదలుకుని ఒమర్‌ఖయ్యాం, గాలిబ్ దాకా ఎందరో తత్త్వవేత్తల, విప్లవ నాయకుల, మహాకవుల గ్రంథాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ, వాటిలో తనకు నచ్చిన భాగాలను బౌండ్ నోట్‌బుక్‌లో పొందికగా ఎత్తి రాసుకుంటూ పుస్తక ప్రపంచంలో హాయిగా మునిగితేలేవాడు. సమకాలిక జాతీయ, అంతర్జాతీయ, సామాజిక పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ దోపిడికి తావులేని సమసమాజ స్థాపనకు విప్లవకారుల కర్తవ్యాలు వగైరా అంశాలపై మిత్రులకు, సహచరులకు పెద్ద ఉత్తరాలు రాస్తూండేవాడు. చావు చేరువైందన్న దిగులు ఏ కోశానా లేకుండా... ప్రియురాలిని చేరడానికి తహతహలాడే ప్రేమికుడిలా ఉరితాడును ఎప్పుడెప్పుడు ముద్దాడుతానా అని హుషారుగా ఎదురుచూస్తూండేవాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు.
జైల్లో ఉన్నంతకాలమూ ఆప్త బంధువులు అనుమతి దొరికినప్పుడల్లా భగత్‌సింగ్‌ను చూసి వెళుతూండేవాళ్లు. తనను చూడగానే బావురుమన్న, చెల్లెళ్లను, పిన్నమ్మలను తిరిగి వెళ్లేలోపు ఒకటి రెండుసార్లయినా చతురోక్తులతో భగత్ నవ్వించేవాడు. ఇంటి పట్టున ఉన్నది చిన్నతనంలో కొద్ది సంవత్సరాలే అయినా అతడికి కుటుంబమంటే చాలా ఇష్టం. పుడుతూనే కుటుంబానికి శుభాలు చేకూర్చిన ముద్దుల ‘్భగన్‌వాలా’ అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. తమ కళ్ల ముందే అతడు ఉరికంబమెక్కబోతున్నాడంటే ప్రతి ఒక్కరికీ చిత్తక్షోభ.
విప్లవ ఖైదీల పనుపున దాఖలైన అపీలును ప్రివీ కౌన్సిల్ కొట్టేసి, ఉరితీతకు అన్ని అడ్డంకులు తొలిగాయనుకున్నాక అధికారులు భగత్‌సింగును 1931 మార్చి 3న కలిసేందుకు దగ్గరి బంధువులకు అనుమతినిచ్చారు. అదే వారి ఆఖరి కలయిక అని ప్రభుత్వానికి తెలుసు. వారికి తెలియదు.
భగత్‌సింగ్‌కి పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచిన తాత అర్జున్‌సింగ్, కొడుకు తన ఉత్తర క్రియలు చేస్తాడని ఆశపడ్డ తండ్రి కిషన్‌సింగ్, అలాగే నాయనమ్మ, పిన్నమ్మ, తమ్ముళ్లు, చెల్లెళ్లు - అందరినీ ఒకేసారి చూసేసరికి భగత్‌కి ప్రాణం లేచి వచ్చింది. అందరూ ఏకధారగా కన్నీరు కారుస్తూండటం చూసి అతడికి మనసు వికలమైంది. నాకు కళ్లనీళ్లతో వీడుకోలు ఇవ్వకండి - అని భగత్ ముందే కబురంపినా - కటకటాల వెనుక.. మృత్యువుకు కొద్ది అంగుళాల దూరంలో నిలబడ్డ అతడిని చూసేసరికి ఎవరికీ దుఃఖం ఆగలేదు.

అక్కడ ఉన్నంతసేపూ కొడుకును రెప్పవాల్చకుండా కళ్ళారా చూసుకుంటూ, అందరి కంటే ఆఖరున దగ్గరికి వెళ్లి ఇనుపచువ్వలలోంచి చేయ పెట్టి బిడ్డ తలను నిమిరింది విద్యావతి. ఆమె కళ్లలో పొర్లుకొస్తున్న దుఃఖాన్ని చూసి, ‘అమ్మా! నువ్వు ఏడిస్తే నేనూ తట్టుకోలేను. భగత్‌సింగ్‌ని ఉరి తీసినప్పుడు అతడి తల్లి కన్నీరు పెట్టిందని ఎవరూ అనకూడదు. ఈ దౌర్బల్యం నీకుగాని, మన స్వాతంత్య్ర యోధుల వంశానికి గాని తగదు’ అన్నాడు భగత్.
విద్యావతి తమాయించుకుని బిడ్డ ఒళ్లు నిమురుతూ అన్నది: ‘నీ వంటి బిడ్డను కన్నందుకు నేను గర్వపడుతున్నానురా! మరణం ఎవరికైనా తప్పదు. కాని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేదే ఉత్తమ మరణం. నా కొడుకు ఒక ఉదాత్త ఆదర్శం కోసం, ఇంత త్యాగం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నా కోరికల్లా ఒక్కటే! మా అబ్బాయి ఉరికంబం మీద నిలబడినప్పుడు కూడా ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని అరవాలి. నిస్తబ్ధమైన జాతిని అది మేలుకొలపాలి.’
‘నువ్వనుకున్నట్టే జరుగుతుందమ్మా!’ అన్నాడు కుమారుడు.
తిరిగి వెళ్లే ముందు కిషన్‌సింగ్ కొడుకుకి చెప్పాడు: ‘గాంధి - ఇర్విన్ ఒప్పందంలో విప్లవ ఖైదీల ఊసే లేదు. కాంగ్రెసు ఖైదీలను మాత్రమే విడిచిపెడతారు. మీ ముగ్గురిని ఉరి తీయాల్సి వస్తే కరాచీ కాంగ్రెసుకు ముందే ఆ పని కానివ్వమని మహాత్మాగాంధి చెప్పాడట.’
‘కరాచీ సభలు ఎప్పుడు?’ అని అడిగాడు భగత్.
‘ఈ నెలాఖరున’ అన్నాడు తండ్రి.
‘అయితే సంతోషించాల్సిందే. ఎండాకాలం ఈ ‘సెల్’లో మాడిపోవటం కంటే చావటం మేలు. నేను మళ్లీ భారతదేశంలోనే పుడతాను. నా దేశం విముక్తమయ్యే దాకా ఎన్ని జన్మలైనా ఎత్తి బ్రిటిషు వాళ్లతో పోరాడుతూనే ఉంటాను’ అన్నాడు భగత్.
వెళ్లిపోయే ముందు తమ్ముళ్లకు ‘దిగులుపడకండిరా. నేను పోయాక దేశసేవ మానకండి. జాతి కోసం మిమ్మల్ని మీరు త్యాగం చెయ్యండి’ అని చెప్పాడు.
[Sardar Bhagat Singh, G.S.Deol, pp.87-88]

ప్రివీ కౌన్సిలులో కేసు కొట్టేసినా, గాంథీ - ఇర్విన్ ఒప్పందం వౌనం దాల్చినా... ఏదో జరుగుతుంది; భగత్‌సింగ్ ఉరి ఆగుతుంది - అని జనాలకు ఏ మూలో కాస్త ఆశ ఉండేది. లాహోర్ సెంట్రలు జైలు చుట్టూతా, ఆ పరిసరాల్లోనూ ఎన్నడూ లేనంతగా పోలీసు, మిలిటరీ గార్డుల బందోబస్తును చూశాక ‘అంతా అయిపోయింది. రేపోమాపో ఉరితీత తప్పదు’ అని అందరికీ అర్థమైంది. పరిస్థితి మరీ ఉద్రిక్తమైంది.
మార్చి 24న భగత్‌సింగ్‌ను ఉరి తీయనున్నారని పత్రికల్లో వార్తలు రావడంతో అందరూ అదే నిజమనుకున్నారు. అంతకంతకూ ఉద్రిక్తమవుతున్న పరిస్థితిని, భగత్‌సింగ్ పట్ల దేశమంతటా పెల్లుబుకుతున్న అభిమానాన్ని చూశాక ప్రభుత్వానికి కాళ్లు ఒణికాయి. ఉరిశిక్షను ఉదయం 7 గంటలకు అమలుజరపటం, మృతదేహాలను దగ్గరి బంధువులకు అప్పగించటం రివాజు. ప్రజల ఆగ్రహానికి గంగవెర్రులెత్తిన బ్రిటిషు సర్కారు ఆ రెండు సంప్రదాయాలనూ తుంగలో తొక్కింది. (మార్చి 24న ఉరికి మహాత్మాగాంధీ ఆక్షేపణ తెలిపాడు కనకేమో) భగత్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను మార్చి 23 సాయంత్రం 7 గంటలకు ఉరి తీయాలని దుర్ముహూర్తం నిర్ణయించింది. ఆ విషయం మూడో కంటికి తెలియకుండా గోప్యంగా ఉంచాలనీ, మృతదేహాలను కూడా మాయం చేసి, మర్నాడు మధ్యాహ్నమే చావుకబురు చల్లగా చెప్పాలనీ మూడు రోజుల ముందు నిశ్చయించింది.
ఉరి తీయడానికి ముందు బందీల దగ్గరి బంధువులను చివరి చూపుకు అనుమతించాలని నిబంధన. దాన్ని తోసిరాజనడం కుదరదనుకున్నారేమో - 23 ఉదయం 10 గంటలకు కావాలనుకుంటే మీవాడిని చూసిపోవచ్చని ఖైదీల కుటుంబాలకు తక్కువ వ్యవధిలో కబురు చేశారు. కుటుంబంలోని అందరినీ వెంటబెట్టుకుని కిషన్‌సింగ్ జైలు దగ్గరికి సమయానికి చేరుకున్నాడు. అక్కడికి 80 మైళ్ల దూరంలోని ల్యాల్‌పూర్ నుంచి సుఖ్‌దేవ్ పినతండ్రి రెండు లారీల్లో ఆప్తబంధువులను తోడ్కొని వచ్చాడు. రాజ్‌గురు తల్లి మాత్రం రాగలిగింది.
ఏం లాభం? భగత్‌సింగ్ తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులకు... సుఖ్‌దేవ్ తల్లి, సోదరుడికి, రాజ్‌గురు తల్లికి మాత్రమే అనుమతి - అన్నాడు జైలు సూపర్నెంటు. ఇదేమి అన్యాయం? తాత, నాయనమ్మ, చెల్లెళ్లు మాత్రం బంధువులు కారా? అందరినీ అనుమతించాల్సిందేనని పట్టుబట్టాడు కిషన్‌సింగ్. మిగతా వాళ్లను వదిలేసి తాము మాత్రం లోపలికి వెళ్లటం ఇష్టంలేక సుఖ్‌దేవ్ తల్లి, రాజ్‌గురు తల్లి వారితోబాటే బయట ఉండిపోయారు. ఎన్ని గంటలు వాదులాడి, పై అధికారులకు ఎన్ని టెలిగ్రాంలు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో ఎవరూ ఎవరినీ చూడకుండానే అందరూ వెనక్కి తిరిగారు.
బయట జరుగుతున్నదేదీ భగత్‌సింగ్‌కి తెలియదు. సాధారణంగా పొద్దుగుంకాక బారక్స్‌కి తిరిగొచ్చే ఖైదీలు ఆ రోజు మధ్యాహ్నమే గూటికి చేరటం, జైలర్ల మొగాలు సీరియస్‌గా ఉండటం, వాతావరణంలో ఉద్రిక్తత గమనించి, ‘ఓహో! ఇవాళేనేమో’ అనుకున్నాడు.

లాహోర్ సెంట్రల్ జైలులో ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న సిబ్బంది, అధికారులు తమ సర్వీసులో ఎంతోమందిని చూశారు. కాని భగత్‌సింగ్ అంతటి ధైర్యశాలి, స్నేహశీలి, మంచి మనిషి వారికి మునె్నన్నడూ తారసపడలేదు. ఉన్న కొద్దికాలంలోనే అతడు అందరికీ ఇష్టుడయ్యాడు. అతడిని బాగా అభిమానించే వారిలో వార్డెన్ మహమ్మద్ అక్బర్ ఖాన్ ఒకడు. ఆ రోజు ఉదయమే అతడు భగత్ దగ్గరికొచ్చి, ‘మీకేమన్నా చివరి కోరిక ఉంటే సందేహించకుండా చెప్పండి’ అన్నాడు.
‘ఖాన్ సాహిబ్, అమ్మ చేతి వంట తినాలని ఉంది’ అన్నాడు భగత్‌సింగ్.
‘అదెలా కుదురుతుంది? ఎక్కడో ఉన్న మీ అమ్మకు కబురుచేసి ఆహారం తెప్పించేందుకు వ్యవధి లేదు’ అన్నాడు వార్డెను.
భగత్‌సింగ్ పగలబడి నవ్వాడు. ‘్ఫరవాలేదు ఖాన్ సాహిబ్! ఈ జైల్లోనే నాకో అమ్మ ఉంది’
వార్డెనుకు అర్థం కాలేదు. తన మరుగు స్థలాన్ని శుభ్రం చేయడానికి అప్పుడే అక్కడికి వచ్చిన ‘బోఘా’ను భగత్‌సింగ్ కేకేసి -
‘నీ చేతి వంట తినాలని ఉంది. తినిపిస్తావా?’ అన్నాడు.
బోఘా తెల్లబోయాడు. ‘మీరేమిటి? నా చేతి తిండి తినడమేమిటి? అది పాపం - మేము అంటరానివాళ్లము కదా?’
భగత్‌సింగ్ అతడి భుజం తట్టి ‘్ఫరవాలేదు సోదరా! నీ చేతులు చూస్తే మా అమ్మ చేతులు గుర్తొస్తాయి’ అని - వార్డెన్ వైపు తిరిగి ‘నా జీవితంలో

ఇద్దరే వ్యక్తులు నా మలమూత్రాలను శుభ్రం చేశారు. చిన్నతనంలో మా అమ్మ. ఇక్కడ ఇతడు’ అన్నాడు భగత్.
బోఘాకు కళ్లనీళ్లు తిరిగాయి. ‘అలాగేనయ్యా! సాయంత్రం డ్యూటీకి వచ్చేటప్పుడు నీకు భోజనం తెచ్చి పెడతాను’ అన్నాడు.
కాని - మళ్లీ అతడు వచ్చేసరికి భగత్‌సింగ్ లేడు. ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయాడు.
[The Life and Times of Bhagat Singh,
Mahesh Sharma, pp.132-133]
[Bhagat Singh, The Eternal Rebel, Waraich, p.164]

నాటికి మూఢు రోజుల కింథటే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు జైలు సూపర్నెంటు ద్వారా పంజాబ్ గవర్నరుకు పంపిన లేఖలో ఒక సవాలు విసిరారు. ఏమనంటే-
‘మా మీద ప్రధాన అభియోగం ఇంగ్లండు రాజుపై మేము యుద్ధానికి దిగామని. బ్రిటిషు కోర్టు చేసిన ఈ నిర్ధారణ రెండు విషయాలను సూచిస్తుంది. మొదటిది - భారత జాతికి, బ్రిటిషు జాతికి మధ్య యుద్ధ స్థితి నెలకొని ఉన్నదని! రెండవది - మేము ఆ యుద్ధంలో పాల్గొన్నామని! దీని ప్రకారం మేము యుద్ధ ఖైదీలమే అవుతాము.
‘మమ్మల్ని చంపాలని మీరు తలచుకుంటే చంపే తీరుతారు. అధికారం మీ చేతిలో ఉంది కనుక ఏమైనా చేయగలరు. మా మీద జరిగిన విచారణే దీనికి రుజువు. మేము అడిగేదల్లా ఒక్కటే. మేము యుద్ధానికి పాల్పడ్డామని మీ కోర్టు తీర్పే ఒప్పుకుంది కాబట్టి మమ్మల్ని యుద్ధ ఖైదీలలాగే చూడండి. మీ కోర్టు చెప్పింది నిజమని నిరూపించుకోదలిస్తే - ఉరి తీయడం కాదు; యుద్ధ ఖైదీల్లా మమ్మల్ని కాల్చి చంపండి. మాకు విధించిన మరణశిక్షను అమలు జరపడానికి తన దళాన్ని పంపమని మీ మిలిటరీ డిపార్టుమెంటుకు ఆజ్ఞ ఇవ్వండి.’

మోసాలు చేసి, గోతులు తీసి, నమ్మకద్రోహాలతో పాపిష్టి తంత్రాలతో భారతదేశాన్ని దొంగచాటున ఆక్రమించిన తెల్లవాళ్లకు విప్లవవీరులు వీరోచితంగా విసిరిన సవాలును స్వీకరించే ధైర్యమెక్కడిది? సుదీర్ఘ దురాక్రమణ చరిత్రలో భారత జాతి పౌరుషాన్ని చవిచూడాల్సి వచ్చిన ప్రతిసారీ జరిగినట్టే ఈ మారూ బెంబేలెత్తి... నాగరికత, న్యాయబద్ధ పాలన అంటూ తాను తొడుక్కున్న డాబుసరి ముసుగులను అవతల పారేసి, తన వికృత నిజరూపాన్ని చూపించి బ్రిటిషు ప్రభుత్వం రాక్షసంగా చెలరేగింది.
సాధారణంగా - జైలు లోపల ఉండేది సంఘ వ్యతిరేక నేరస్థులు. వారిని న్యాయప్రకారం శిక్షించి, చట్టాన్ని నిలబెట్టి అసాంఘిక శక్తుల నుంచి బయటి ప్రజలకు శాంతి, రక్షణ కలిగించవలసింది గవర్నమెంటు. కాని, ఈ ఘట్టంలో ప్రభుత్వమే పెద్ద నేరమయ అసాంఘిక శక్తి. బూటకపు బ్రిటిష్ న్యాయవ్యవస్థ వేటు వేసిన ముగ్గురు దేశ భక్తులను విదేశీ దొరతనం ఎక్కడ కాటు వేస్తుందోనని తల్లడిల్లుతూ వందలాది ప్రజలు లాహోర్ సెంట్రల్ జైలు వెలుపల గుమికూడి ఉన్నారు. జైలు లోపలి నేరస్థులు, రాజకీయ ఖైదీలు తమను బంధించిన గదుల్లో ఉండే, పిడికిళ్లు బిగించి ఆ దేశభక్తులను శ్లాఘిస్తూ, విదేశీ పీడను గర్హిస్తూ నినాదాలు చేస్తున్నారు. జాతీయ వీరులను ఫలానా రోజు ఫలానా సమయాన ఉరితీస్తున్నట్టు ప్రకటించేందుకు కూడా ధైర్యం లేని దుష్ట ప్రభుత్వం తన నియమాలను తానే ఉల్లంఘించి అసుర సంజవేళ బితుకుబితుకుమంటూ అతి రహస్యంగా ముగ్గురు దేశభక్తులను ఉరి తీయించింది.
ఖైదీలందరినీ కొట్టాల్లో కుక్కి బీగాలు వేశాక, తమకు స్నానాలు చేయించి, నల్లదుస్తులు వేసి, బలిపీఠానికి కొనిపోయేందుకు చేతులు కట్టి వేయబోతూంటే - ‘మా చివరి కోరికయినా తీర్చండి... మా చేతులను గొలుసులతో కట్టివేయవద్దు. ఉరితీసే ముందు మాకు ముసుగులు తొడగవద్దు’ అన్నాడు భగత్‌సింగ్. ఒకరి చేయి ఒకరు పట్టుకుని, ‘కభీ వో దిన్‌భీ ఆయేగీ..’ ‘సర్ఫరోషికీ తమన్నా..’ లాంటి దేశభక్తి గీతాలు గొంతెత్తి పాడుతూ, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ ‘బ్రిటిషు సామ్రాజ్యం నశించాలి’ అని బిగ్గరగా నినదిస్తూ ముగ్గురు వీరులూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, కొదమసింహాల్లా, మండే సూర్యుల్లా నడిచి వెళ్లారు. తమ మెడలకు తాడును తామే తగిలించుకుని ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని అరుస్తూ వారు ధీరోదాత్తంగా ఆత్మార్పణ చేశారు. తల్లికిచ్చిన మాటను భగత్‌సింగ్ నిలబెట్టుకున్నాడు.
అప్పుడు రవి అస్తమించడనబడే బ్రిటిషు మహాసామ్రాజ్య వ్యవస్థ ఏమి చేసింది? ప్రాణాలు పోయాయని వైద్యులు ధ్రువీకరించాక కూడా దేశభక్తుల కళేబరాలను చూసి గజగజ వణికింది. నిబంధనల ప్రకారం మృతదేహాలను బంధువులకు ఒప్పగించడానికి కూడా ధైర్యం లేక, వాటిని ఆనవాలు లేకుండా అప్పటికప్పుడే బూడిద చేస్తేగానీ తన సామ్రాజ్యానికి భద్రత లేదనుకుంది.
ఎలా? జైలు ఆవరణ లోపల తగులబెట్టించవచ్చు. కాని - మంటలు, పొగలు లేస్తాయి. వాటిని చూస్తే బయట కాచుకుకూచున్న జనం ఊరుకుంటారా? రెచ్చిపోయి లోనికి చొచ్చుకువచ్చి హంతకుల భరతం పట్టక మానరు. కాబట్టి జైలులో కుదరదు. బయటకు తీసుకువెళ్లి శరీరాలను కాల్చెయ్యాలి. శవాలను పట్టుకుపోతున్నట్టు జనానికి అనుమానం వస్తే ప్రమాదం. జైలుకు ఉన్నది ఒకటే గేటు. దాని బయట వందల జనం పోగయ్యారు.
మరి తెల్ల రాక్షసులు ఏమి చేశారు? ముగ్గురు జాతీయ వీరుల శరీరాలను ముక్కలు చేసి, గోనెసంచుల్లో మూటలు కట్టించారు! రాత్రి సద్దుమణిగాక తమ జైలు వెనక గోడలో కొంత భాగాన్ని తామే దొంగల్లా బద్దలు కొట్టించారు. ఆ సందులో నుంచి ఒక ట్రక్కును లోపలికి తెప్పించారు. గోనెసంచులను అందులో వేసుకుని దొంగల్లా పారిపోయి, 70 మైళ్ల దూరంలో ఫిరోజ్‌పూర్ సమీపాన సట్లెజ్ నది ఒడ్డున ఒకచోట శరీర భాగాలను కుప్పపోసి, కిరోసిన్ కుమ్మరించి తగులబెట్టారు. గుర్తు పట్టలేకుండా మొత్తం కాలిపోయాక అవశేషాలను సట్లెజ్ నదిలోకి తోసెయ్యాలని దొర పిశాచాల ఆలోచన!
వాళ్ల కర్మకాలి, దూరాన లేచిన మంటలు గంధాసింగ్‌వాలా గ్రామస్థుల కంటపడ్డాయి. వాళ్లు కట్టగట్టుకుని కర్రలు, బరిసెలు తీసుకుని పరిగెత్తుకు వచ్చారు. చేతిలో తుపాకులు ఉన్నా, చేసేది దొంగపని కాబట్టి బ్రిటిష్ ఆఫీసర్లకు కాళ్లు వణికాయి. ఎక్కడిదక్కడ వదిలేసి, జనం వచ్చి పడక ముందే వారు సోల్జర్లతో సహా పారిపోయారు. పరిస్థితి చూడగానే జనానికి విషయం అర్థమైంది. చప్పున మంటలు ఆర్పి, లాహోర్‌కి కబురు పంపి, తెల్లవార్లూ అక్కడే కాపలా కాశారు.
భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను నిన్న సాయంత్రం 7 గంటలకు ఉరితీసి, వారి మృతదేహాలను హిందూ, సిక్కు మతాచారాల ప్రకారం యథావిధిగా గత రాత్రి సట్లెజ్ నదీ తీరాన దహనం చేయడమైనది అని అధికారులు మరునాడు (24) ఉదయం లాహోర్ నగరంలో ప్రకటించారు. వారి ‘యథావిధి’ బండారం అప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. తెల్ల రాకాసులు చేసిన ఘాతుకానికి ప్రతి ఒక్కరూ భగభగలాడుతున్నారు.
కబురు అందగానే ఫిరోజ్‌పూర్ బయలుదేరి వెళ్లిన వాళ్లు ఉదయం 11 గంటలకు పార్ధివకాయాల అవశేషాలతో లాహోర్ చేరుకున్నారు. అప్పటికే నగరంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ ముప్పైవేల మందితో ఊరేగింపు బయలుదేరింది. కాలిన ఏ కాలు ఎవరిదో, ఏ ఎముక ఎవరిదో తెలియని దురదృష్టకర స్థితిలో అవశేషాలను మూడు శవపేటికలలో పెట్టి పూలదండలతో అలంకరించిన వాహనంలో అమర్చి, 3 మైళ్ల పొడవున సాగిన జనవాహినితో రావీనదీ తీరానికి తీసుకువెళ్లారు. లక్షల జనం ఆగని కన్నీళ్లతో వందనాలర్పిస్తూండగా, సంప్రదాయబద్ధంగా ముగ్గురు మహావీరులకూ అంత్యక్రియలు జరిగాయి.

(ముగింపు వచ్చేవారం)
*

ఎం.వి.ఆర్.శాస్ర్తీ