లోకాభిరామం

కొత్తదనం కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచికో, చెడుకో మనిషికి ఒక పేరు వస్తుంది. అది బహుశా సులభంగానే వస్తుంది. అందరికీ అంత సులభంగా రాకపోవచ్చు. కొంతమంది పేరు చెప్పగానే అందరూ మొహం అదోలాగ పెడతారు. అటువంటి పేరు కూడా చాలాకాలం కొనసాగుతుంది. ఆ మనిషి ‘నేను మారానంటే నమ్మరేం’ అంటూ గడ్డం పెంచుకుని పాటలు పాడినా ఎవరూ అతగాడిని నమ్మరు. అది వేరే సంగతి. ఇక కొంత మంచి పేరు వస్తుంది. ఆ వచ్చిన మంచి పేరును నిలబెట్టుకోవడం అసలు సిసలయిన సమస్య. ఉన్న పేరును పోగొట్టుకోవడానికి మార్గాలు చాలానే ఉన్నాయి. అసలేమీ చేయకుండా ఉంటే చాలు, పేరుపోతుంది. కానీ పేరు పోగొట్టుకోవాలని ఎవరికి మాత్రం ఉంటుంది.
సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. కుండలు పగులగొట్టి, గుడ్డలు చించుకుని, కనీసం గాడిదలా అరిచి, ఏదో ఒక మార్గం ద్వారా ప్రసిద్ధులు కావాలి అంటుంది ఆ శ్లోకం. చెప్పవలసినవి మంచి మాటలు కానీ, మంచివి కాకపోనీ, పద్యంలో అందునా సంస్కృతంలో చెప్పాలనే రోజులుండేవి. ఆ పద్ధతి పోయింది. ఇంతకూ పద్యం, అంటే శ్లోకంలో చెప్పిన మూడు పనులు చేస్తే అందరూ మనవైపు చూస్తారేమో కానీ, అది ప్రసిద్ధికి కారణం అవుతుందా? కాదనే అనుమానం. ఎందుకంటే ఆ పనులు ఇంతకు ముందే ఎవరో ఒకరు, రకరకాలుగా చేసేశారు. మనం ఎంత బాగా గాడిదలా అరిచినా, కొత్తదనం లేదు. పైగా ఈ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు ఉంటే చాలదు. అవి రెండూ రూపాయలు, నోట్లు, చీట్లుగా మారితేనే అసలయిన గొప్పదనం. అదీ కొత్త పద్ధతి. మీ విజయం మీ బ్యాంక్ బాలెన్స్, ఇంట్లో ఉండే ధనం ఆధారంగా కొలవబడుతుంది. డబ్బులు రావాలంటే అంతా కొత్తగా ఉండాలి.
వెనుకట పులితో పోరు, మామిడికాయలు, ఉదయ రవికిరణాలు గుర్తులుండే మూడు అగ్గిపెట్టెలుండేవి. ఇక సబ్బులు కూడా అదే పద్ధతిలో మరో మూడో నాలుగో ఉండేవి. ఆ పేరు అందరికీ మెదడులో ఇంకి, మరో పేరు అడగడం వీలయ్యేది కాదు. ఇప్పుడు దుకాణంలో అడుగు పెడితే వంద రకాల స్నానం సబ్బులు, మరో వంద రకాల గుడ్డల సబ్బులు ఉంటాయి. ప్రతి నెలా కొత్త బ్రాండు కొనాలి. ఒక రకమేదో నిజంగా నచ్చి మళ్లీ కొందాము అనిపిస్తే ‘అది రావడం లేదు. ఆ కంపెనీ వాళ్లే మరో కొత్త బ్రాండ్ వదిలారు. అది కొంటే అట్లకాడ ఉచితంగా ఇస్తారు’ అని ఉపన్యాసం వినిపించే వీలు లేకపోలేదు.
ఒకప్పుడు కొత్తదనాన్ని కనుక్కోవలసి వచ్చేది. ఇప్పుడు కొనుక్కోవలసి ఉంటున్నది. ఈ ప్రపంచంలో తెలియవలసిన విషయాలు అన్నీ ఇంకా తెలియనప్పుడు కొంతమంది గడ్డాలు పెంచుకుని, గుడ్డలు మాపుకుని కొత్త సంగతులను కనుక్కుంటూ ఉండేవాళ్లు. వాళ్లకు పిహెచ్.డి డిగ్రీలు ఇచ్చేవారు. అలా కొత్తదనం తేవడం చేతగాని వాళ్లకు ‘ఎచ్చిడి’ మాత్రమే మిగిలేది. అప్పుడు జరిగినదంతా పరిశోధన. ఇప్పుడు జరిగేది ‘రీసెర్చ్’. ఈ మాటలోనే ఇదివరకే తెలిసిన సంగతులను మరోసారి వెదకడం అనే భావం వినిపిస్తుంది. కనిపిస్తుంది. నాకూ ఒక పిహెచ్.డి ఉంది. ఈ కాలం రీసెర్చ్ సంగతి తెలియని ఒక పెద్దామె నన్ను ‘అయితే నీవేం కనుక్కున్నావూ?’ అని అడిగింది. నేను నిజంగానే ఏదో కనుక్కున్నాను. అది నాకు తప్ప మరెవరికీ పనికిరాని సంగతి. నాకూ పేరుకు ముందు, తర్వాతా కొన్ని పొడి అక్షరాలు చేర్చుకోవడానికి తప్పితే మరోరకంగా ఆ డిగ్రీ పనికి వచ్చినట్లు తోచలేదు. నేను కనుక్కున్న సంగతులేవో ఆయమ్మకు చెప్పడానికి ప్రయత్నించాను. ఆమె సగం విని, ‘నీవేదో యంత్రం, లేదంటే మరో మందూ కనిపెట్టావనుకుంటిని. నీవు చెపుతున్న తీరు చూస్తే అటువంటిదేమీ ఉన్నట్లు తోచడం లేద’ని ఒక కుండ బుద్దలు కొట్టింది. నేనా రోజు నుంచి పేరు ముందు వెనుకల నుండి పొడి అక్షరాలు వదిలేసుకున్నాను. గొప్ప వాడిననిపించుకునేందుకు కొత్తదారి ఏదయినా దొరుకుతుందేమోనని వెదుకుతున్నాను. లేదంటే చేసిన ఆ కొంచెం రీసెర్చ్ గురించి తెలివిగా చెప్పగల కొత్తదారి నేర్చుకోవాలి.
సైన్సులోనే కాదు, చాలా విషయాలలో పరిశోధనలు విచిత్రంగా సాగుతూ ఉంటాయి. చాలాచోట్ల వీటిలో అసలు కొత్తదనమే ఉండదంటారు. ఇక ఆ పేరున గొప్ప పేరు సంపాదించుకోవడం అన్నది అది మరో సమస్య. మన దేశంలో లక్షలు, కోట్ల మంది రకరకాల పనులు చేస్తున్నారు. అందులో ఆటలు ఆడేవారు ఉండవలసినంత మంది ఉన్నట్టు లేరు. ఉన్నవాళ్లకు సరయిన మద్దతు కూడా ఉన్నట్టు లేదు. లేకుంటే ప్రపంచ స్థాయిలో మనకు పతకాలు మరీ అందకుండా ఎందుకు పోతాయి? కొత్తదనం వేరు, కొత్తదారులు వేరు. పాత పని చేయడానికి కూడా కొత్తదారులు ఉంటాయి.
ఈ కాలం ప్రపంచంలో తలెత్తి ఎటువైపు చూసినా తలక్రిందకు వాల్చుకుని నేల మీదికే చూసినా ఎల్లెడలా కొత్తదనం గురించిన జాడలు, కనపడుతున్నాయి. వ్యాపారం, ప్రభుత్వం, చదువులు, సినిమా, టీవీ, తిండి ఒకటేమిటి ఎక్కడ చూసినా కొత్తదనం. ఒకప్పుడు అందగాళ్లే నటులయ్యే వాళ్లు. కొత్త పద్ధతిలో వికారులు కూడా ‘ఈరో’లవుతున్నారు. ఆడ గొంతు గల మగవాళ్లు అరిచి పాట వినమంటున్నారు. వీటిని తప్పు పడుతున్నామనే భావం ఎవరికయినా కలిగితే తప్పు నాది కాదు. రాయడంలో కొత్తదనం నాకు చేతగాలేదని ఒప్పుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
భాష కొత్తగా ఉండాలి. భావం కొత్తగా ఉండాలి. ‘కూల్’ అంటే చల్లదనం. అది ఏనాడూ గొప్పదనాన్ని సూచించిన మాట కాదు. ఇప్పుడు ‘కూల్’ అంటే చాలా బాగుందని అర్థమట. ఒక హోటల్‌లో ఇచ్చిన మెనూ కార్డులో వింత వింత పేర్లు కనిపించాయి. అందులో గ్రీన్ పీస్ పిరమిడ్ అని కూడా అర్థం ఉంది. ‘పిరమిడ్ లంటే’ సమాధులు. ఈ పేరేమిటి అనుకుంటూనే అవేమిటని ఆరా తీశాను. అవి ఇంతకు ముందు ‘సమోసా’లని పిలవబడే ఆహార విశేషం. సమోసాలు అంటే పేరులో మాత్రమే మోసం ఉండే తిండి పదార్థాలు. అవి పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. అందుకే కొత్తగా ఉంటుందని లోపలి మసాలాలో వేసిన బఠాణీలు ఎక్కువగా వేసి ఒక ఆహార విశేషం తయారుచేశారు. సమోసాలు చాలా రకాలుగా ఉంటాయని చాలామందికి తెలియకపోవచ్చు. సమోసాలో ఆలూ ఉన్నంతవరకు అధికారంలో లాలూ ఉంటాడు అని ఒకప్పుడు ఒక నినాదం వినిపించింది. కానీ లాలూ పదవిలో లేడు. సమోసాల్లో ఆలూ ఉంటూనే ఉంది. హైదరాబాద్‌లో ఆలూ లేని సమోసాలు అమ్ముతూ ఉంటారు. వాటిలో మరేదో పదార్థం ఉండి ఉంటుంది. ఉత్తర భారతం మిఠాయి దుకాణాలలో ఎంత కాలమయినా నిల్వ ఉండగలిగే ‘పొడి’ సమోసాలు దొరుకుతాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో దిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అదే పద్ధతిలో ఉత్తర భారతపు మిఠాయి అంగళ్లు కూడా దేశమంతటా ఉంటాయి. కనుక పొడి సమోసాలు కూడా అంతటా దొరుకుతాయి.
హాస్టల్లో ఉంటున్నప్పుడు ‘మెస్’లో తయారుచేసే వంటకాల వైనం ముందే నోటీసు బోర్డులో పెట్టాలని నిర్ణయం జరిగింది. మెస్ అంటే అస్తవ్యస్తం అని ఇంకో అర్థం ఉంది. మెస్‌లో పెట్టే తిండి అస్తవ్యస్తంగా ఉండటంలో గొప్పదనం లేదనుకున్నారేమో ‘ఫ్రైడ్ టొమాటో’ అని ఒక శాక విశేషం బుధవారం కేటాయించారు. టమోటాలను వేపుడు ఎలా చేస్తారని అంతా నోరు వెళ్లబెట్టాం. తీరా బుధవారం వచ్చేసరికి ఒక్క ఉస్మానియా హాస్టళ్లలో మాత్రమే దొరికే ‘బీరకాయ బూందీ’ కూర మరోసారి ప్రత్యక్షమయింది. అప్పట్లో కొత్తదనం తేవడం ‘మెస్’లో కూడా సాధ్యం కాలేదు. ఈ కథకు అంటే టోమోటో ఫ్రై కథకు ఫలశ్రుతి ఉంది. అప్పట్లో టోమాటోలను కూడా వేపుడు చేయలేకపోయారు. ఇప్పుడు అయిస్‌క్రీమ్‌ను వేపుడు చేస్తారట. ఫ్రైడ్ అయిస్ క్రీం ఉందట. వెదకాలి. కొత్తదనం వెదకాలి.
కొత్త సీసాలో పాత సారాయం అని ఒక మాట ఉంది. కానీ ఈ మధ్యన సీసా ఉండదు. మరేదో కొత్త పదార్థంతో, సరికొత్త పద్ధతిలో ఒక పాత్ర తయారుచేసి అందులో కొత్తగా కనిపించి కొత్తగా రుచించే ద్రావకాలు కొత్తకొత్తవి కనపడుతున్నాయి. అంతా కొత్త మోజు!
తిక్క తిక్కగా ఉంది. ఎక్కడ మొదలుపెట్టాలో, ఏ పక్కకు వెళ్లానో చివరికి ఎక్కడ తేలానో మీరే చెప్పాలి.

కె.బి. గోపాలం