అమృత వర్షిణి

మార్గశిర సంగీతం.. మదరాసు (అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్గశిర మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ప్రాతఃకాలంలో తిరుప్పావై వినిపించేది అప్పుడే. గుళ్లూ, గోపురాలూ, వినూత్నమైన శోభతో అలరారుతూ, పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి.
తమిళనాడులో మార్గశిర మాస వైభవం ఇంకా విలక్షణంగా ఉంటుంది. సంగీత విద్వాంసులకూ, సంగీత ప్రియులకూ మద్రాసులో జరిగే మార్గశిర మాస సంగీతోత్సవ వైభవం ఒక మరపురాని అనుభూతి నిస్తుందనటంలో సందేహం లేదు. నిజానికి ఒక్క మద్రాసు నగరంలో, ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట సంగీత కచేరీ ఉంటూనే ఉంటుంది. కానీ మార్గశిర మాసమైతే వేరు. సుమారు 50, 60 సంగీత సభలు పోటాపోటీగా ఈ సంగీతోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించటం గత రెండున్నర దశాబ్దాలుగా నాకు అనుభవమే.
సంగీతాభ్యాసం చేసే యువతీ యువకులు, ఉన్నత స్థాయి సంగీతం పాడగలిగే వర్దిష్ణు గాయనీ గాయకులు, సందడి చేసేదీ మాసంలోనే.
కొత్తవారు తమకు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వారి ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించగలిగే అవకాశం ఈ మాసంలోనే వస్తుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి వరకూ సాగే ఈ సంగీతోత్సవాలలో, పరిణతి చెందిన మహావిద్వాంసుల సంగీతం వినేందుకు స్థానికులే కాదు ఇతర దేశాల నుంచి అనేకమంది సంగీత రసికులు కొన్ని లక్షలు ఖర్చు చేసి, వచ్చి వింటారు. విదేశాలలో ఉంటూ సంగీతం అభ్యసించే విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ, ఈ సంగీతోత్సవాల కోసం రావటం గమనార్హం.
ఏటా జరిగే ఈ మార్గశిర సంగీత ఉత్సవాలకు, స్థానిక వ్యాపార సంస్థలూ, బ్యాంకులూ, జ్యూయలరీ షాపులూ, జిఆర్‌టి, ఎల్‌ఐసి వంటి సంస్థలూ, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వంటివి ఆర్థిక సహాయ సహకారాలందించటం ఒక గర్వంగా భావిస్తారంటే ఆశ్చర్యం కాదు.
తమిళనాడులో వుండే పేరున్న సంగీత విద్వాంసులు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుండి మరెందరో విద్వాంసులూ ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
మన ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ సోదరులు, మల్లాది సోదరులు, లలిత హరిప్రియ సోదరీమణులు, పంతుల రమ, మండా సుధారాణి వంటి వారి సంగీత తమిళ రసికులు వినటానికి ఎంతో ఆసక్తిని చూపిస్తారు. ఏది ఏమైనా, తమిళనాట పెరిగే సంగీత విద్వాంసుల సంఖ్యతో పోలిస్తే, మనవైపు నుండి అక్కడకు వెళ్లి పాడేవారి సంఖ్య చాలా తక్కువే.
సుస్వరంతో నిండుగా వాయించే వయొలిన్ విద్వాంసులే అక్కడ పాతిక, నలభై మంది ఉంటారు. మృదంగ విద్వాంసులు కూడా అంతే.
రసికులైన శ్రోతల సంఖ్య పెరిగే కొద్దీ సంగీత ప్రమాణాలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తమిళనాడులో సంప్రదాయ సంగీతం పట్ల అభిరుచి పెరగటానికి కారణం, మూర్తిత్రయం వారి కృతులు. వారి శిష్య ప్రశిష్య పరంపర వల్ల ప్రచారమై అసంకల్పితంగా సంగీతం పట్ల అఖండ గౌరవం ఏర్పడింది, అక్కడి వారికి. ఏదో ఒక కచేరీ వినకుండా అక్కడి వారుండరు. ప్రతి శుభకార్యానికీ, స్థితిపరులైన ఇళ్లల్లో సన్నాయి మేళాలూ, లేదా పాట కచేరీలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ప్రతి పాట కచేరీకి రసిక జనం విపరీతంగా హాజరవుతారు.
డిసెంబర్‌లో జరిగే ఈ సంగీత ఉత్సవాల్లో సాయంత్రం సమయాలలో వుండే కచేరీలకు టిక్కెట్లుంటాయి. ఆలస్యంగా వెళితే టిక్కెట్లు దొరకవు - సంగీత విద్యార్థులకూ, అభిమానులకూ.
నామమాత్రంగా చెల్లిస్తే ‘స్టేజీ’ మీద కూర్చుని వినే అవకాశాన్ని కల్పిస్తారు.
సంప్రదాయ సంగీతం వినటంలో ఇంత విపరీతమైన ఆసక్తి దాక్షిణాత్యులకుండడానికీ, మన తెలుగునాడులో లేకపోవడానికీ కల బలవత్తరమైన కారణాలను విశే్లషించుకోవద్దూ?! తెలుగు దేశంలో రసవంతమైన సంగీతం వినాలనే ఆసక్తి మన వారికి లేకపోలేదు. అయితే ప్రత్యేకంగా ప్రతిభా విశేషాలు లేవీ లేని ‘వాన ముసురు’ లాంటి పాటకచేరీలు వినేటందుకు ఎవ్వరూ రారు.
మన వాళ్లను మనమే కించపరుస్తున్నట్లుగా భావించవద్దు. నాణ్యత, రుచి, కల్పనాచాతుర్యం, నిత్య నూతనత్వం ఉంటే జనాకర్షణ తప్పకుండా ఉంటుందనటానికి నిదర్శనం, తమిళనాడులో జరిగే ఈ మార్గశిర సంగీత ఉత్సవాలే.
ఇక్కడ సంగీతాభ్యాసం చేసే ప్రతి విద్యార్థీ అక్కడ ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాలకు వెళ్లాలి. అక్కడ కచేరీలు, కనీసం నాలుగు రోజుల పాటైనా ఉండి వినాలి. మన ఊళ్లో జరిగే కచేరీలకే వెళ్లని వారికి, ఎక్కడో పొరుగు రాష్ట్రంలో జరిగే కచేరీలకు వెళ్ళే ఆలోచన ఉంటుందా?
వార్తాపత్రికల ప్రచారం
అక్కడ జరిగే ఈ సంగీతోత్సవాలకు పత్రికాముఖంగా జరిగే ప్రచారం అద్వితీయం. ఏ రోజుకారోజు ఎక్కడెక్కడ కచేరీ జరిగిందో, దానికి సంబంధించిన విశే్లషణ ఉంటుంది. ఎవరెవరు బాగా పాడారో, వారివారి మనోధర్మ సంగీత ప్రతిభా విశేషాలేమిటో వ్రాస్తూ, విద్వాంసులను ఎంతో ప్రోత్సహిస్తారు.
సంగీత జ్ఞానం కలిగి, అనేక సంగీత కచేరీలు విన్న అనుభవం వున్న పాత్రికేయులే ఇటువంటి శీర్షికలు నిర్వహించటం గమనార్హం. విదేశాలలో వుండి, ఇక్కడకు రాలేకపోయిన సంగీత రసికులకు ప్రత్యేకంగా ఇంటర్‌నెట్ ద్వారా వెబ్‌కాస్ట్ చేస్తారు. ప్రత్యేక కథనాలతో, విశే్లషణతో, విమర్శనాత్మకంగానే ఉంటాయి అవన్నీ.
వక్తా, శ్రోతా చ దుర్లభా’ అన్నట్లుగా పరిణతి చెందిన సంగీత రసికుల వల్లనే మంచి సంగీతానికి ఉనికి ఏర్పడుతుంది.
అక్కడ సంగీత కచేరీలకు హాజరయ్యే శ్రోతలే వేరు. వారి మధ్య జరిగే సంభాషణలే వారి సంగీత, రసజ్ఞతకు అద్దం పడ్తాయి.
ఫలానా గాయకుడు లేదా గాయని ఫలానా రాగం ఎంతో విస్తరించి పాడిందనీ, నెఱవు బాగుందనీ, అపారమైన మనోధర్మం వుందనీ విశే్లషించుకుంటారు.
సంగీత కచేరీ అవ్వగానే వౌనంగా దాటిపోరు. ప్రత్యేకంగా ఆగి, ఆ విద్వాంసుణ్ణి మెచ్చుకుంటూ, తెలియని విషయాలను, అడిగి తెలుసుకుని మరీ వెళాతరు.
సోదాహరణ ప్రసంగాలు
ఈ సంగీతోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ, ప్రతిభావంతంగా ఉండే అక్కడే జరిగే సోదాహరణ ప్రసంగాలు -ఉదయం 8 గంటల నుండి సాగే ఈ ప్రసంగాలు వినటానికి కూడా సంగీత రసికులు ఎంతో ఉత్సాహంగా హాజరవుతారు. సంగీత విద్యార్థులు సరేసరి. వారు ముందు వరుసలోనే ఉంటారు. ఒక వాగ్గేయకారుడి ప్రతిభా విశేషం, మూర్తిత్రయం కంటే ముందున్న ఇతర వాగ్గేయకారుల చరిత్ర, ఒక్కొక్క రాగం యొక్క విశేషం, మనోధర్మ సంగీత విషయాలు, వివిధ విద్వాంసుల చరిత్ర, ఒకటేమిటి? సంగీత విషయాలపై అనేక కోణాలలో, తులనాత్మక, విమర్శనాత్మక ధోరణిలో, విశే్లషణతో కూడిన సోదాహరణ ప్రసంగాలకు శ్రోతలూ, రసికులూ ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. సంగీత గోష్టులుంటాయి. అభిప్రాయ వేదికలుంటాయి. శ్రోతలతో ముఖాముఖీ కార్యక్రమాలుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సంగీత విద్యార్థి కానీ, విద్వాంసుడు కానీ, సర్వతోముఖమైన అభివృద్ధిని సాధించేందుకు ఉపయోగపడే వేదికలే ఈ మార్గశిర మాసంలో జరిగే సంగీత కచేరీలూ, నృత్య ప్రదర్శనలూను.
గుంటూరులో గోంగూర బాగా పండుతుంది. కోనసీమలో కొబ్బరికి మంచి గిరాకీ. బళ్లారిలో మిర్చి బాగా పండుతుంది. చెన్నైలో సంగీతం బాగా పండుతుంది. శ్రోతల వీనుల విందు చేస్తుంది.
సకల జనరంజకంగా సాగే సంగీత కచేరీలకూ, నృత్య ప్రదర్శనలకూ విశేషంగా వచ్చే అసంఖ్యాక శ్రోతలకు ఈ మాసం ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుందంటే ఆశ్చర్యం కాదు.
ఇంచుమించు ప్రతీ సభకూ, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆర్థిక సహకారం ఉండటం, పారితోషికాలతో నిమిత్తం లేకుండా, ప్రతిభకే పట్టం కట్టే సభలెన్నో ఉన్నాయి.
విశేషమైన ప్రతిభా పాటవాలు కలిగిన కళాకారులకు మ్యూజిక్ అకాడెమీ వంటి సంస్థలు, నగదు పారితోషికాలతోపాటు అవార్డులు కూడా ప్రకటించి గౌరవిస్తూంటారు. వ్యక్తుల పేరిట నెలకొల్పిన అవార్డులు అనేకం.
ఇటువంటి చక్కని సంగీత వాతావరణం ఉంటే సంగీతం పెరగటంలో ఆశ్చర్యం ఏముంటుంది?
అటువంటి సంగీత వాతావరణం మన తెలుగునాట ఎప్పుడు ఏర్పడుతుందో? వేచి చూద్దాం.

chitram...

పంతుల రమ

-మల్లాది సూరిబాబు 9052765490