అమృత వర్షిణి

ప్రణవ నాదంతో శాశ్వతానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూనే, గురుస్సాక్షాత్ పరబ్రహ్మా’ అని గురువుకే పరమోన్నత స్థానాన్నిచ్చారు. ఇందులో వుండే అంతరార్థం భాషార్థంతో కాక భావార్థంతోనే గ్రహించాలి.
మనకు జన్మనిచ్చినది తల్లిదండ్రులే అయినా మనిషి జీవితానికి పరమార్థ మార్గాన్ని చూపించేది మాత్రం సద్గురువే. సద్గురువును పురుషోత్తముడుగా భావించి, ‘పురుషాధముడ నేను’ అన్న భావంతో శిష్యుడు సేవిస్తే, అజ్ఞాన తిమిరం తొలగిపోతుంది. అందుకే గురువుని భాస్కరుడితో పోల్చారు.
తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే పెట్టుబడిగా పెట్టి, శిష్యుడితో జ్ఞానజ్యోతిని వెలిగించడంలో సంగీత సద్గురువుదే ప్రముఖమైన పాత్ర. పూర్వం మహారాజులు, చక్రవర్తులూ తమ పిల్లల్ని రాజభోగాల నుంచి దూరం చేసి, గురుకులాలకు పంపేవారు. అలా గురు శుశ్రూష చేసిన పిల్లలు జ్ఞానంతో బుద్ధిగా ఇంటికొచ్చేవారు.
ఒకప్పుడు సంగీత బోధన ఇలాగే ఉండేది. తాళం చెవి లేకుండా తలుపులు తీయడం ఎలా సాధ్యం కాదో గురువు లేకుండా విద్యార్జన చేయడం అంతే. దయ ఆయనది. దీనులం మనం. త్యాగం ఆయనది. ప్రయోజనం మనది. గురువనే జ్ఞాన కల్పతరువు తప్పుకుంటే మనకు జీవితమే లేదు’ అనుకున్నవాడే యోగ్యుడిగా పరిగణింపబడతాడు. తన శిష్యుడు పదిమందిలో పేరు ప్రతిష్టలు సంపాదించి గౌరవించబడితే సంతోషించేది ముందు గురువే కదా!
త్యాగరాజుకు శొంఠి వెంకటరమణయ్య లభించినట్లుగా, అందరికీ సద్గురువులు దొరకరు. ఒక్కోసారి బోధ గురువులే కాదు బాధ గురువులు కూడా ఉంటూ ఉంటారు. పక్కదారులు పట్టించి భ్రష్టు చేసేది వీళ్లే.
మన తెలుగు రాష్ట్రాల్లో లబ్ధప్రతిష్టులైన మహా విద్వాంసులకు లోటు లేదు.
దక్షిణాది వారితో పోలిస్తే తక్కువేగానీ, రాజాదరణ పుష్కలంగా వుండేది కాబట్టి విద్వాంసులు ప్రోత్సహించబడేవారు. గౌరవం లభించేది. ముఖ్యంగా రాగాలాపన, తానం పల్లవి గానంలో వారి ప్రతిభ చూపిస్తూ ఆదరణ గౌరవాలు పొందేవారు. ఆ రోజుల్లో మూర్తిత్రయం వారి రచనలలో నాద సుఖాన్ని అనుభవించే ప్రయత్నం కంటే, చిత్ర విచిత్ర స్వరకల్పన విన్యాసాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రసిద్ధులయ్యారు చాలామంది. విజయనగరం, బొబ్బిలి రాజాలు, జైపూర్, ఒరిస్సా, పిఠాపురం సంస్థానం, చల్లపల్లి జమీందార్లు, గద్వాల్ రాజాస్థానం, టెక్కలి (శ్రీకాకుళం) జమీందారులు, ఆత్మకూరు, వెంకటగిరి సంస్థానాధీశులు సంగీతానికీ, సాహిత్యానికీ ఎనలేని సేవ చేశారు.
మన ఆంధ్రుడైన బొబ్బిలి కేశవయ్య దక్షిణాది వెళ్లి మూర్తిత్రయంలో ఒకడైన శ్యామశాస్ర్తీ చేత ఓడింపబడ్డాడు. కేశవయ్య పల్లవి గానంలో సిద్ధహస్తుడు. తెనాలి వాస్తవ్యుడైన నారుమంచి జానకిరామయ్య (1823-1902) త్యాగరాజు సంగీతం పట్ల మోహితుడై, సంగీతాభ్యాసానికై వెళ్లి త్యాగయ్యను కలుసుకుని సంగీతం నేర్పమన్నాడు. అప్పటికి త్యాగయ్యకు 74 ఏళ్లు. తన శిష్యుడైన వీణకుప్పయ్యర్ దగ్గరకు వెళ్లమని చెప్పడంతో, దీక్షగా 14 ఏళ్లపాటు కుప్పయ్యర్ దగ్గరే ఉండిపోయి, లక్షణ గీతాలు, వర్ణాలు, కృతులు నేర్చుకుని విద్వాంసుడయ్యాడు.
ఈయన మన ఆంధ్రదేశంలో, దక్షిణాది తంజావూర్ బాణీని ప్రవేశపెట్టిన వారిలో ఆద్యుడు. నారుమంచి సీతారామయ్య, ఉప్పలపాటి శ్రీరాములు ఈయన శిష్యులు.
వీణకుప్పయ్యర్ కొడుకైన ముత్యాలపేట త్యాగయ్య దగ్గర సంగీతం నేర్చుకుని రాగాలాపనలోనూ, పల్లవి గానంలోనూ ప్రసిద్ధుడైన మరో ఆంధ్రుడు నెల్లూరి రాఘవయ్య. వీణ వాద్యం తలుచుకుంటే గుర్తుకు వచ్చే వారిలో పిఠాపురంలోని తుమరాడ సంగమేశ్వర శాస్ర్తీ మహా ప్రసిద్ధుడు. వీణను నిలబెట్టి వాయించటంలో సమర్థత కల్గిన విద్వాంసుడు ఆయన.
ఆంధ్రదేశంలో నందిగామ వెంకన్న (1852-1916) అని ఒక విద్వాంసుడుండేవారు. మంద్ర స్థాయిలో రాగాలాపన ఆయన ప్రత్యేకత. సంగమేశ్వర శాస్ర్తీకి బావగారైన వెంకన్న వీణా వాద్యంలో కూడా ఘటికుడే. ఆ రోజుల్లో దక్షిణాదిలో పేరు సంపాదించిన తెలుగువాడు. ఓసారి పిఠాపురం సంస్థానానికి అతిథిగా వచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవార్థం, ఆస్థాన విద్వాంసుడైన సంగమేశ్వర శాస్ర్తీ కచేరీ ఏర్పాటైంది. ఠాగోర్ అభినందన లందుకోవడమే కాదు ‘మేము కోరినప్పుడెల్లా మీ ఆస్థాన వైణికుని మా శాంతినికేతనానికి పంపమని కోరి, తీసుకుని వెళ్లారు. ఆ ‘వీణ’ శాంతినికేతన్‌లో ఇప్పటికీ ఉంది.
సంగమేశ్వర శాస్ర్తీది శ్రీకాకుళం జిల్లా పాలకొండ దగ్గర బిటివాడ అగ్రహారం. వీణ మెట్టు మీద అన్ని స్వరాలను అలవోకగా వాయించగల సమర్థుడు. అంతేకాదు. ఉత్తరాది సంగీతాన్ని మనోహరంగా, బింకంగా, నాదపూరితంగా వాయించటంలో బరోడా, కాశీ, కలకత్తా ప్రాంతాలలో ఎంతో పేరు తెచ్చుకున్న వైణికుడు.
మైకులు ఏమీ లేని ఆ రోజుల్లో చివరి వరుసలోని శ్రోతలకు సైతం ఆయన వాద్యం వినిపించేదంటే ఊహించండి. సంగమేశ్వర శాస్ర్తీ శాంతినికేతనంలో కొన్ని మాసాలుండి నిత్య సంగీత ప్రదర్శనలలోనూ పాల్గొనేవారు.
సంగమేశ్వర శాస్ర్తీ కుమారుడు సత్యనారాయణ తండ్రి కంటే మేధావి. మద్రాసు రేడియో కేంద్రంలో వీణ వాద్యం వినిపించేవారు.
పంచె అంచు పళ్ల మధ్య బిగించి పట్టుకుని ‘లంబోదర లకుమికర’ వంటి గీతాలను పంచె అంచుపైన పలికించే ప్రజ్ఞాశాలి. ఆయన శిష్యులలో ఆమర్తి వేమన దొరగారి వయొలిన్ వాద్యం, ద్వారం వారి వయొలిన్ వాద్యానికి దీటుగా వుండేదని చెప్పుకునేవారు. ద్రాక్షారం నుంచి పిఠాపురం వస్తూ పోతూ ఉండే ఈమని అచ్యుతరామశాస్ర్తీ గారిపై తుమరాడ వారి ప్రభావం, అలాగే శంకర శాస్ర్తీ, చిట్టిబాబుల వీణా వాద్యంపై ఉందంటారు.
ఆయన సాధనా బలం. కోలంక వెంకట్రాజు మృదంగంతో సహకరించేవారు. 1921లో చల్లపల్లిలో (కృష్ణాజిల్లా) చల్లపల్లి సుబ్బయ్య సోదరులు కర్ణాటక సంగీతాన్ని సుసర్ల దక్షిణామూర్తి శాస్ర్తీ వద్ద నేర్చుకుని బాగా పాడేవారు. దక్షిణామూర్తి శాస్ర్తీ వద్ద విద్య నేర్చిన మరో గాయక ద్వయం ద్వివేదుల లక్ష్మణశాస్ర్తీ సోదరులు. వీరు మైసూర్ బరోడా సంస్థానాధీశుల చేత సన్మానించబడిన తెలుగు విద్వాంసులు. సుసర్ల వారి శిష్యుడే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. ఈయన శిష్య ప్రశిష్యులు ఎందరో ఆంధ్రదేశంలో వ్యాపించి కీర్తిని పొందుతున్నారు.
గుంటూరు జిల్లా పెదరావూరులో నారుమంచి జానకిరామయ్య పుత్రుడైన నారుమంచి సీతారామయ్య (1877-1943) గారనే విద్వాంసుడు, వీణ కుప్పయ్యర్, ముత్యాలపేట త్యాగయ్యల దగ్గర సంగీతం నేర్చుకుని ప్రతిభావంతంగా పాడేవారని డా.శ్రీపాద పినాకపాణి చెబ్తూండేవారు. వీరి కుటుంబమంతా త్యాగరాజునకు పరమభక్తులై సంగీతానికి అంకితమై పోయినవారే. వీరి కుమారుడు నారుమంచి సుబ్బారావు తెనాలిలో త్యాగరాజ సభను నిర్వహిస్తూండేవారు.
‘్భరతరత్న’ సుబ్బులక్ష్మి ఈయన భక్తి పారవశ్యతతో నిండిన సంగీత సేవకు ప్రీతిచెంది ‘ఏమీ ఆశించకుండా వచ్చి కచేరీలు చేసేవారు - నారుమంచి సుబ్బారావు లాంటి త్యాగరాజ భక్తులు చాలా అరుదుగా ఉంటారు. వోలేటి గారి వద్ద సేకరించిన ప్రసిద్ధమైన త్యాగరాజ కీర్తనల కీర్తన పాఠాలను గ్రంథంగా అచ్చువేశారు.
కర్ణాటక సంగీతంలో లబ్ధప్రతిష్టులైన పురాణం పురుషోత్తమ శాస్ర్తీ తండ్రి పురాణం కనకయ్య (1879-1954) దక్షిణాదిలో ప్రసిద్ధుడైన తచ్చూరి సింగరాచారి సోదరుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. గంభీరమైన గాత్ర సంపద కలిగిన తెలుగు విద్వాంసుడీయన.
గుంటూరు జిల్లా పొన్నూరులో వారణాసి సుబ్బయ్య (1882-1911) ఆంధ్రదేశంలో ఎంతో పేరున్న కర్ణాటక సంగీత విద్వాంసుడు. దక్షిణాదిలో ఆ రోజుల్లో ప్రసిద్ధుడైన పూచి (రామ్నాడ్) శ్రీనివాసయ్యంగార్ దగ్గర కొంతకాలం, ఎట్టయాపురం సంస్థానంలోని విద్వాంసుల వద్ద ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులు నేర్చుకుని వచ్చి మన తెలుగు వారికి దక్షిణాది సంప్రదాయ సంగీత మాధుర్యాన్ని చూపించిన మేథా సంపన్నుడు.
పొన్నూరు భావన్నారాయణ స్వామిపై ఎన్నో కృతులు, వర్ణాలు రాశారు. క్రోవి సత్యనారాయణ ఈయన శిష్యుడు. ఒంగోలుకు చెందిన తాడిగడప శేషయ్య కూడా ఈయన శిష్యుడే. కోనేరి రాజపురం వైద్యనాథయ్యర్ ఈయనకు మానసిక గురువు.
పిరాట్ల శంకర శాస్ర్తీ (1881-1951), హరినాగభూషణం (1884-1959), ఉప్పలపాటి అంకయ్య మొదలైన తెలుగువారు మహా సంగీత విద్వాంసులై మన ఆంధ్రదేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.
బలిజేపల్లి సీతారామయ్య (1885-1947) అనే అత్యుత్తమ సంగీత విద్వాంసుడొకాయన గుంటూరులో ఉండేవారు. దక్షిణాదిలో ప్రసిద్ధుడైన కోనేరి రాజపురం వైద్యనాథ భాగవతార్, గుంటూరులో కొన్ని రోజులుండటం తటస్థించింది. ప్రతిరోజు సాయంత్రం సంగీతాభిమానుల సమావేశంలో పాడుతూండేవారు.
కోనేరి రాజపురం పాట అద్వితీయమై, అప్పట్లో సంగీత రసికులకు ప్రాణంగా ఉండేది. అటువంటి మనోహరమైన గానానికి పరవశులై ఆ బాణీ సంపాదించాలని, తాడిగడప శేషయ్యతో కలిసి కొన్నాళ్లు మద్రాసు వెళ్లిపోయి వైద్యనాథయ్యర్ కచేరీలు బాగా వినీవినీ ఆ బాణీని వొంటబట్టించుకుని మన ఆంధ్రదేశంలో ఎన్నోచోట్ల కచేరీలు చేసి పేరు సంపాదించారు కానీ, శిష్యులంటూ ఎవరినీ తయారుచెయ్యలేక పోయారు - అర్హులు లేరేమో!
ఎవరి గానమైనా శాశ్వతంగా పదిలమై, పది కాలాలుండాలంటే శిష్య సంతతి ఉండాలి. అలా లేని పక్షంలో ఆ దివ్యమైన గానం వారితోనే అంతరించిపోతుంది.
సంప్రదాయ సంగీతంలోని విలువలు తెలిసిన వారు కష్టమైనా ఇష్టపడి గురువుల్ని ఆశ్రయిస్తారు. లేనివారు తేలిక మార్గాలను వెదుకుతూంటారు - అటువంటి వారికి జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ వుండదు. లక్ష్యం ఉండదు. అందువల్ల వాళ్లు దేన్నైతే పొందారో, పొందిన దానే్న వాగ్గేయ రూపంలో చెప్పగలిగారన్నారు భగవాన్ రమణ మహర్షి. ఓసారి తిరువణ్ణామలైలో సంగీతోత్సవం జరిగింది. ఆ సంగీతోత్సవంలో అరియక్కుడి, బూదలూరు కృష్ణమూర్తి శాస్ర్తీ గోటువాద్యం, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గానంతో కచేరీ ఏర్పాటైంది. ఆ కచేరీలో భగవాన్ రమణ మహర్షి కూర్చుని వింటున్నారు. అందరిలా ఆయన తలలూపడం, ఓహో ఓహో లాంటివి ఏమీ చేయకుండా నిశ్చలంగా వింటూంటే, ఎవరో ఒకాయన ‘్భగవాన్! ఏమిటి? అలా ఏమీ స్పందన లేకుండా వింటున్నారు?’ అనడిగారు.
‘మీరంతా ప్రకృతి స్వరానికి (శ్రుతికి) వికృతులైన సప్తస్వరాల సంగీతం వింటూంటే నేనేమో ఆధార శ్రుతిలో లీనమై ఆత్మలోనే ఉండిపోతున్నాన’న్నారు.
96 కోట్ల రామనామ జపం చేసిన వాడు త్యాగబ్రహ్మ. ఆయన వాగ్గేయకారుడుగా అందరికీ కనిపించినా జపతపాలు నిష్టగా చేయడంలో అంతకంటే మించిపోయాడు. దీక్షితుల వారు, బంగారు కామాక్షిని సేవించిన శ్యామశాస్ర్తీ కూడా అంతే.
ఆత్మనిష్టకు పనికివస్తేనే ఆదరణ. లేకపోతే నిరాదరణే అని చెప్పి ముగించారు. అదీ... ఒక యోగి అనుభవం. కర్ణాటక సంగీత బాణీలో రెండు రకాలు లేవు. ఒకటే బాణీ. మనోధర్మాన్ని బట్టి, కల్పనా చాతుర్యాన్నిబట్టి మారుతూంటుంది. స్వయంగా సంగీతానుభవం ఉండాలి. మనస్సే లేకపోతే మనిషి ఎలా ఉండడో మనోధర్మమంటూ లేకపోతే, పాట కూడా అంతే. ఈవేళ సంప్రదాయ సంగీతం మీద శ్రద్ధ తగ్గింది. ఎవరికి, ఏ పద్ధతి వేడుకగా వుండీ, లాభకారిగా ఉంటుందనిపిస్తే ఆ బాణీలో పాడుతున్నారు. అలాగే పాడాలంటున్నారు. సంప్రదాయబద్ధంగా పాడటం ఒక పద్ధతి. పాడిందే సంప్రదాయమని వాదించడం అవివేకం. వింటే ఆశ్చర్యపోతారు. తోడి, శంకరాభరణం, నారాయణగౌళ రాగాలను కుదువపెట్టి అప్పు తెచ్చుకున్న విద్వాంసులుండేవారంటే ప్రాచీన సంప్రదాయపు బాణీలో ఎంత రుచి ఉందో, ఎందరు ప్రతిభావంతులుండేవారో ఊహించవచ్చు. గతాన్ని మరచిపోతే భవిష్యత్తే లేదు.
లౌకికమైన అవసరాలు తీర్చుకోవడం కోసం సంగీత మార్గంలో వెళ్లే వారికి నాదానందం ఎలా తెలుస్తుంది? సంస్కారం ఉండాలి.

ఉత్తమ సంస్కారం వున్నవారికే ఆ అనురక్తి ఉంటుంది. మిగతా వారంతా కేవలం శ్రోతలుగానే ఉండిపోతారు. సంప్రదాయాన్ని పోషించే గమకాలన్నీ పలకగలిగిన శరీర సౌష్టవం, లేదా గాత్రధర్మం లేని వారికి శుద్ధమైన కర్ణాటక సంగీత బాణీ వశం కాదు. పాడగలిగిన వారిని మనస్ఫూర్తిగా మెచ్చుకోలేరు. పుష్కలంగా గుప్తంగా దాచుకున్న సొమ్ము పదిలంగా వుంటే మరొకరికి పంచే సామర్థ్యం, ఖర్చు చేయగల ధైర్యం ఉంటుంది. అదే లేకపోతే ఉన్నదానితోనే తృప్తి పడాలి. ఆశ లేని చోట ప్రయత్నం ఉండదు. సంగీత జ్ఞానం కూడా అంతే.
ఆదిభట్ల నారాయణ దాసుగారు విజయరామ గాన పాఠశాల అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక అందులో గాత్రాధ్యాపకుల కోసం దరఖాస్తులు పెట్టిన వారిలో పట్రాయిని సీతారామశాస్ర్తీ ఒకరు. ఆ ప్రాంతంలో ఆయన్ను సాలూరు చిన గురువు గారని పిలిచేవారు (ఘంటసాలను తీర్చిదిద్దిన గురువు) శాస్ర్తీ పాట విని ‘గానానికి శాస్త్రం ప్రధానమే, కానీ భావం ప్రధానం. అదే ప్రాణం. సాహిత్య భావ ప్రకటన వల్ల మాత్రం ఆ గానం రంజకమవుతుంది. పాటలో రాగానికి ఉండవలసిన లక్షణాలన్నీ వున్న పట్రాయిని పాటకే నా ఓటు. కాదంటే నిరూపిస్తా! అన్నారు. వెంటనే ఎస్టేట్ కలెక్టర్ సత్యనాథన్ సీతారామశాస్ర్తీని నియమిస్తున్నట్లుగా ప్రకటించారు.
నాభి నుంచి వచ్చే సప్త స్వర సుందరులను ప్రసన్నం చేసుకోవాలంటే సాధన తప్పదు. దానికి ఉపాసనా మార్గం ఒక్కటే దిక్కు. మధురమైన ఫలాల్లో తీయదనపు రుచి ఎలాగో పాటలో మాధుర్యం కూడా అంతే.
బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు గురువు చుట్టూ తిరిగి, ఇష్టం కాబట్టి కష్టాల్ని లెఖ్ఖ చేయకుండా నేర్చుకున్న మన విద్వాంసుల్ని మరచిపోగలమా? బారులు బారులుగా కొంగలు కనిపించినంత తేలికగా హంసలు కనపడవు. పరమహంసలైన సద్గురువులు కూడా అంతే. హంసలకున్న ఠీవి, దర్జా, కొంగల కెందుకుంటుంది? ప్రణవాకార నాదంలోని రుచి మరిగితే కనిపించేది శాశ్వతానందమే.
ఎంతో విలువైన సమయాన్ని లెక్కచేయకుండా ధన సంపాదనే ధ్యేయంగా కాకుండా, శిష్యుణ్ణి ఉద్ధరించే కోరిక కల్గిన గురువే అసలైన గురువు. ఆ గురువునే ఈ లోకం గుర్తు పెట్టుకుంటుంది. గంగాస్రవంతి వంటి సంగీతం ఎవర్ని పునీతుల్ని చేస్తుందో ఎవరికెరుక?
*

- మల్లాది సూరిబాబు 9052765490