ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సాహస దౌత్యం ఫలిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న సాహస దౌత్యం ఆశించిన ఫలితాలు ఇస్తుందా? హిందూత్వవాదిగా ముద్ర పడిన నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు నేల విడిచిసాము చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ పర్యటన నుండి స్వదేశానికి తిరిగి వస్తూ అకస్మాత్తుగా లాహోర్‌లో దిగి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు జన్మదిన శుభా కాంక్షలు తెలియజేయటంతోపాటు ఆయన మనుమరాలి పెళ్లి వేడుకలకు కూడా హాజరయ్యారు. పాకిస్తాన్ సైనిక హెలికాప్టర్‌లో షరీఫ్ స్వగ్రామం రాయ్‌విండ్ వెళ్లి పెళ్లి వేడుకల్లో పాల్గొనటంతోపాటు నవ వధువులకు బహుమతులు కూడా అందజేశారు.
మోదీ ఆకస్మికంగా లాహోర్ వెళ్లి నవాజ్ షరీఫ్‌తో చర్చ లు జరపటాన్ని అమెరికా, ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు సమర్థించాయి. ముందస్తు ప్రచారం వలన చర్చల వాతావరణం చెడిపోతుందునే అనుమానంతో ఇలా ఆకస్మిక పర్యటన జరిపారని కొందరు వాదిస్తుంటే సాహస దౌత్యం ఆశించిన ఫలితాలు ఇవ్వదని మరికొందరు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతికూల విమర్శ చేయటంతోపాటు పాకిస్తాన్‌లో వ్యాపారం చేస్తున్న ఒక బడా వ్యాపారి కోసం నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లారు, మోదీ ఆకస్మిక పర్యటనలో దేశ ప్రయోజనమేదీ లేదని ఆరోపించింది. కాంగ్రెస్ నాయకులు లాహోర్ ఆకస్మిక పర్యటనను చీల్చి చెండాడారు. మోదీ సాహస దౌత్యం ఎంత మాత్రం మంచిది కాదని మనీష్ తివారీ విమర్శిస్తే ఆనంద్ శర్మ మాత్రం లాహోర్ పర్యటన వెనక ప్రైవేట్ వ్యాపారం ఉన్నదని ఆరోపించారు. ఎవరేవిధంగా వ్యాఖ్యానించినా నరేంద్ర మోదీ మాత్రం క్రీస్త్తు పుట్టిన రోజు లాహోర్‌కు సాహస యాత్ర చేసి భారత, పాకిస్తాన్‌ల మధ్య సత్సంబంధాలను పెంచేందుకు కృషి చేశారని చెప్పకతప్పదు. నరేంద్ర మోదీ అనాలోచితంగా లాహోర్ వెళ్లారని ఎంత మాత్రం భావించలేము.
సాహస దౌత్యం లోతుపాతులను విశే్లషించిన తరువాతనే ఆయన లాహోర్ వెళ్లి ఉంటారు. గతంలో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్ యాత్రకు వెళ్లినప్పుడు పాకిస్తాన్ ఎలాంటి దౌష్ట్యానికి పాల్పడిందనేది అందరికి తెలిసిందే. ఆ రోజు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎంతో ధైర్యంతో లాహోర్ వెళ్లారు. పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసమే ఆయన లాహోర్‌కు బస్సులో వెళ్లితే పాకిస్తాన్ సైన్యం కార్గిల్ చొరబాటుకు పాల్పడి వందలాది మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్నది. ఇప్పుడు నరేంద్ర మోదీ లాహోర్ యాత్ర చేసిన అనంతరం పాకిస్తాన్ నుండి ఎలాంటి విపత్తు ముంచుకు వస్తుందోననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. గతంలో వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లినప్పుడు కూడా నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. కార్గిల్ దాడిని అరికట్టలేకపోయినా షరీఫ్ ఇప్పుడు నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లివచ్చిన తరువాత పాకిస్తాన్ సైన్యం మలో దురాగతానికి పాల్పడదనే హామీ ఇవ్వగలరా? శతృత్వ పొరుగుదేశాలతో స్నేహం చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి మోసం చేసే తత్వం ఉన్న పొరుగు దేశాలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఏమవుతుందనేదిందుకు 1962 యుద్ధం, కార్గిల్ సంఘటనలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు మనతో ఎందుకింద స్నేహంగా ఉంటున్నారు. భారత దేశంతో స్నేహం చేసేందుకు, సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఎందుకింత ఉత్సాహం చూపిస్తున్నారనేది ఆలోచించాలి. సిరియలో ఐ.ఎస్.ఐ.ఎస్ తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు సైతం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు ఆర్థిక సహాయం నిలిపివేయటంతోపాటు అవసరమైతే సైనిక చర్యకు పూనుకుంటున్నాయి. ఇస్లామిక్ తీవ్రావాదానికి మారుపేరుగా మారిన పాకిస్తాన్‌పై అమెరికా తదితర దేశాలు తీవ్ర స్థాయిలో వత్తిడి తెస్తున్నాయి. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపు చేయకపోతే ఆర్థిక సహాయం ఉండదని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా సహాయం అందకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక సహాయం నిలిచిపోతే పాకిస్తాన్‌కు పుట్టగతులుండవు. భారత దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నట్లు చూపించటం ద్వారా అమెరికా నుండి ఆర్థిక, సైనిక సహాయం పొందటం పాకిస్తాన్ పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయి. పాకిస్తాన్ పాలకులు తమ అవసరం కోసం ఏమైనా చేస్తారు, అవసరం తీరిన తరువాత ఎంతకైనా తెగిస్తారు.
ముంబాయి వరుస పేలుళ్లకు బాధ్యులైన వారిని, సముద్ర మార్గంలో వచ్చి ముంబాయిపై దాడి చేసిన ముష్కరులను శిక్షించే విషయంలో పాకిస్తాన్ ఎలా వ్యవహరించిందనేది మనం ఎలా మరిచిపోగలము? ముంబాయి వరుస పేలుళ్ల సూత్రధారి, ప్రముఖ స్మగ్లర్ దావుద్ ఇబ్రహీం ఇప్పటికి పాకిస్తాన్‌లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు. దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం ఇవ్వటంతోపాటు అతని కిరాతక మూకల ద్వారా ఇప్పటికీ మన దేశంలో దాడులు చేయిస్తున్న పాకిస్తాన్‌తో ఇలాంటి స్నేహం చేయటం ఎంత వరకు మంచిది? పాకిస్తాన్‌తో చర్చలు జరిపే సమయంలో సీమాంతర ఉగ్రవాదులను మట్టుపెట్టే ప్రక్రియలో మన సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తున్నారనేది ఎప్పటికి మరిచిపోరాదు. సైన్యం చేతిలో కీలుబోమ్మగా వ్యవహరించే నవాజ్ షరీఫ్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపు చేయగలరా?