అక్షర

మారిన జీవితాలపై యక్షగానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యక్షగానం
దేవులపల్లి కృష్ణమూర్తి
పేజీలు: 152,
వెల: రూ.120/-
ప్రతులకు: రచయిత,
హైదరాబాద్ బుక్‌ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీనగర్,
గుడిమల్కాపూర్,
హైదరాబాద్-6.

దశాబ్దాలుగా సాహిత్యంతో మమేకమైన దేవులపల్లి కృష్ణమూర్తిగారు ఏడుపదుల వయసులో రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. ‘‘కథల గూడు’’, ‘‘తారుమారు’’ కథాసంకలనాలతో సాహితీ లోకంలో కథకునిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిల పరుచుకున్న దేవులపల్లిగారు ఇపుడు ‘‘యక్షగానం’’ పేరుతో మరో కథా సంకలనాన్ని వెలువరించి నల్లగొండ జిల్లా ప్రాంత ప్రజల జీవన సరళిని ప్రతిబింబింపజేశారు. ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంత ప్రజల్లో గత ఐదు దశాబ్దాలుగా వస్తున్న మార్పులను తమ కథల్లో నిక్షిప్తం చేశారు. ‘‘యక్షగానం’’ గ్రంథంలోని ఇరవై కథలు దేవులపల్లిగారి పరిశీలనా పటిమకు అద్దంపట్టే విధంగా రూపుదిద్దుకున్నాయి. రచయిత తమ అపార జీవితానుభవాన్ని రంగరించి రాసిన ఈ కథల్లో మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంత ప్రజల దశాబ్దాల చరిత్ర దాగి వుంది. మారుతున్న సమాజంతో.. నల్లగొండ జిల్లా వాసిగా ఆయనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ రాసిన ఈ కథల్లో జీవితం వుంది. జీవం ఉంది. నిన్న, నేడు, రేపుల మధ్య ఉన్న సూత్రాన్ని.. ఒకదానితో మరొకటి ప్రభావితం చేసుకునే తీరుని సమగ్రంగా ఆకళింపు చేసుకున్న దేవులపల్లిగారు తమ ప్రాంత ప్రజల వైరుధ్యాలను, సంక్షోభాలను, జీవితాల్లో వచ్చిన మార్పులను, కథల్లో పొందుపరిచిన తీరు బాగుంది. గత యాభై ఏళ్లలో వచ్చిన మార్పులలోని విభిన్న కోణాలను కథలలో చక్కగా ఆవిష్కరించారు. ఈ కథలు గతంతోపాటు వర్తమానంలోకి లాక్కొని వెళ్ళడమేగాక, భవిష్యత్తుకు బాటను చూపుతాయి.. రచయిత తన చుట్టూ ఆవరించిన అనంతమైన జీవితాన్ని అక్షరాల్లో బంధించి కథల రూపంలో మన ముందుంచారు. కథల్లోని సంఘటనలు మన కళ్లముందు కదలాడే విధంగా దృశ్యమానం చేయడంలో దేవులపల్లిగారు సఫలీకృతులైనారు. ఈ కథలు ఒక ఘటన చుట్టో, ఓ మానసిక స్థితి చుట్టో తిరిగేవి కావు. విభిన్న పార్శ్వాల్లో అనంత జీవన గమనాన్ని ప్రతిఫలింపజేసే కథలివి! అనుభూతి చెంది రాసిన కథలు కనుక... రచయిత సాధికారిత ఇట్టే కానవస్తుంది.
మొదటి కథ ‘మా ఊరు’లో సహజంగా ప్రతి ఊరులో వచ్చే మార్పులనే చూస్తాం.. దశాబ్దాలుగా ఊళ్లో చోటుచేసుకునే మార్పులతోపాటు వ్యక్తుల స్వభావాల్లో వచ్చిన మార్పులను చక్కగా చిత్రించారు. డబ్బుముందు స్నేహితులు, తోడపుట్టినవారు, బంధువులు బలాదూరని తెలియజెప్పారు.. స్వార్థం పడగ నీడలో విలువలకు తిలోదకాలివ్వడాన్ని ఈ కథలో గమనిస్తాం..
‘‘యక్షగానం’’ కథలో ప్రపంచీకరణ పుణ్యమా అని... కళలు ఎలా అంతరించి పోతున్నాయో తెలియజేశారు. పటేండ్లు దయతలచి నాలుగు నాటకాలు ఆడిస్తే.. ఆడేది! లేకుంటే చాపలు అల్లుకుంటూ, అమ్ముకుంటూ, అడుక్కుంటూ జీవన వెళ్ళదీసే దాసరోళ్ల దయనీయ గాథల్ని ఆర్ద్రంగా ఆవిష్కరించారు. ‘‘మనోరమ’’ కథ ద్వారా ఒకనాటి రాజవంశ సంస్థానంలో.. ఆటపాటలకు భోగం స్ర్తిలను ఎలా ఉపయోగించుకునేవారో.. రచయిత విడమరిచి చెప్పారు. అలాగే రజాకార్ల జమానాలో జాగీర్దారులు తమ జల్సాలను ఎలా చేసుకునే వారో ‘‘తూముకుంట బంగ్లా’’ కథలో చూడగలం. ‘‘ఆశ’’ కథలో మట్టారెడ్డి పాత్రను చూస్తే జాలేస్తుంది. డబ్బుమీద ఉన్న ప్రేమ కన్నతల్లిదండ్రుల మీద లేదనీ... కొడుకుల నిరాదరణకు గురవుతున్న వృద్ధుల వ్యధలకు అద్దంపట్టే కథ ఇది! మసకబారుతున్న మానవ సంబంధాలను ఆవిష్కరించిన తీరు అభినందనీయం! ఇదే తరహాలో ‘నన్ను మరిచిపోయిండేమో’’ కథ రూపుదిద్దుకుంది.
ఏది సాధించాలన్నా... సాధన, పట్టుదల ప్రధానమని ‘‘గుర్రం ఎగిరింది’’ కథ ద్వారా తెలుసుకుంటాం. దేనికైనా సమయం రావాలనీ.. అంతవరకు నిరంతర కృషి అవసరమని ‘కళాకారుడి’ పాత్రను సృష్టించిన తీరు బాగుంది. కొడుకుల కంటే... కూతుళ్లకే తండ్రిమీద ప్రేమ ఉండటాన్ని ‘‘బతుకుభారం’’ కథలో గమనిస్తాం. తెలంగాణ సాయుధ పోరాట గాథను.. వర్తమానంతో అనుసంధానించి రాసిన కథ ‘మృత్యుంజయుడు’. యర్రబోతు రాంరెడ్డి జైలులో అనుభవించిన నరకయాతనను, బాధలను, గోసలను రచయిత ఈ కథలో అక్షరబద్ధం చేశారు.
ఇలా ‘యక్షగానం’ గ్రంథంలోని కథలు చాలావరకు వాస్తవికత ఘటనలతో రూపుదిద్దుకున్నాయి. సామాజిక చరిత్రకు... తమ సృజనాత్మకతను అద్ది... రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి వెలువరించిన ఈ కథలు అందరినీ ఆకట్టుకుంటాయి..

-దాస్యం సేనాధిపతి