అక్షర

గాంధీజీ సిద్ధాంతాలు... నంబూద్రి భాష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాత్ముడు-ఆయన సిద్ధాంతాలు
ఆంగ్లమూలం: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
అనువాదం: కంభంపాటి సత్యనారాయణ, మహీధర రామమోహనరావు
వెల:రు.90/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక
విక్రయ కేంద్రాలు
---
కేరళ ముఖ్యమంత్రిగా విశేష సేవలందించిన ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ఆంగ్లంలో రచించిన ‘ది మహాత్మ అండ్ ది ఇజమ్’ గ్రంధానికి ఇది తెలుగు అనువాదం. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుల్లో నంబూద్రిపాద్ అగ్రపంక్తిలో నిలుస్తారు. చైనా యుద్ధానంతరం కమ్యూనిస్టు పార్టీ చీలినపుడు ఆయన మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో గణనీయ పాత్ర వహించారు. వౌలికంగా ఆయన మార్క్సిస్టు మేధావిగా, సిద్ధాంతకర్తగా ఖ్యాతిగాంచారు. రచయితగా కూడా ఆయన ప్రసిద్ధులు.
‘మహాత్ముడు ఆయన సిద్ధాంతాలు’ తెలుగు అనువాదం ప్రధమ ముద్రణ 1958లో వెలువడింది. అప్పటికి ఆయన అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోవున్న మార్క్సిస్టు దృక్పథంతోనే రచన సాగింది. ఎనిమిది సంపుటాలలో డి.జి.టెండూల్కర్ రచించిన ‘ది మహాత్మా’ గ్రంథంనుంచి , గాంధీ రచనలు, ఇతర ప్రముఖుల గ్రంథాలనుంచి, అభిప్రాయాలనుంచి తన వాదనలకు ఆధారంగా విస్తారంగా పంక్తులను నంబూద్రిపాద్ ఉదహరించారు. అందుచేత గ్రంథ ప్రామాణ్యం ఇనుమడించింది. విశేషమేమంటే టెండూల్కర్ రచనను గాంధీ స్వయంగా సరిచూసారు. టెండూల్కర్ మాటల్లో: ‘1948 జనవరి 22న నేను ఆయనను ఆఖరు పర్యాయం కలుసుకున్నాను. అప్పుడు జీవిత చరిత్ర ఆకారం గురించి టైపును గురించి బొమ్మల్ని గురించి ఎన్నో చర్చించుకున్నాం’ (పుట 3)
గాంధీజీ సిద్ధాంతాలు, ఆలోచనలు, భావాలు, ఆచరణలను నంబూద్రిపాద్ లోతుగా దాపరికం లేకుండా విశే్లషించారు. ఇందులో 14 అధ్యాయాలున్నాయి. ఇంగ్లండులో బారెట్లా చదువు పిమ్మట దక్షిణాఫ్రికా ఉద్యమంతో మొదలై గాంధీ తర్వాత గాంధీవాదం స్వరూప స్వభావాల వరకు వివిధాంశాలను సప్రమాణంగా చర్చించారు. ‘లండన్ రేవు పనివారి సమ్మెలో ఆసక్తి, శాకాహారోద్యమంలో మమేకం కావడం ఇవన్నీ గాంధీజీ కార్యాచరణ, తత్త్వ విధానంలో దేశచరిత్రను తీర్చిదిద్దింది’(పుట 8) అంటారు. దక్షిణాఫ్రికాలో వలస కార్మికుల శ్రేయస్సుకోసం గాంధీ కృషిని ప్రశంసిస్తూ రచయిత ‘గాంధీ సామ్రాజ్యవాద యుద్ధాలలో ఫిరంగులకు బలి కావడానికై యువకుల్ని రిక్రూట్ చేసి సామ్రాజ్యవాద సేవకు పూనుకున్నాడు’ (పుట 14) అని విమర్శించారు. చంపారన్ నీలిమందు తోటల యజమానులపై జరిపిన ఉద్యమాన్ని ‘గాంధీజీ భారతదేశంలో జరిపిన మొదటి పోరాటం అదే’ (పుట 21) అని అభివర్ణించారు. గాంధీజీ సారధ్యం వహించిన ఖిలాఫత్ ఉద్యమంపై రచయిత అభిప్రాయం ఇలా ఉంది. ‘ఖిలాఫత్ ఆందోళన గాంధీజీకీ, ఆయన సహాయ నిరాకరణ ఉద్యమానికీ ఎంతో పుష్టినిచ్చింది. ఏమంటే ఖిలాఫత్ సమస్యను మత సమస్యగాను,రాజకీయ సమస్యగను భావించే ముస్లిం మతస్తులంతా దానితో సత్యాగ్రహలుగా తయారయ్యారు.గాంధీజీ బహు తెలివిగా బ్రిటిష్ వాళ్లవలన జరిగిన అపరాధాలలో దానిని చేర్చాడు’ (పుట 25) గాంధీజీ శ్రామిక, కార్మిక, కర్షక వర్గాల పక్షాన సాగించిన పోరాటాన్ని నంబూద్రిపాద్ సమర్ధించారు. కానీ సామ్రాజ్యవాదులకు ఎలాంటి తోడ్పాటును సమ్మతించలేదు. స్వరాజ్య పార్టీని ప్రస్తావించి రచయిత ‘ఒకవైపు తాను నిర్మాణ కార్యకర్తనే తప్ప స్వరాజ్యపార్టీ వాడిని కానంటూ వారి కార్యక్రమాలన్నింటా ఆయన విశేష శ్రద్ధ వహించారు’ (పుట 39) అని వ్యాఖ్యానించారు. నంబూద్రిపాద్ దృష్టిలో దేశస్వాతంత్య్రం జాతిపిత ఆశించిన తీరులో రాలేదని వ్యాఖ్యానిస్తూ ‘గాంధీజీ నాయకత్వం కింద స్వాతంత్య్రం పొందామని కోట్లాదిమంది ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో తన జీవితాదర్శం (మనుష్య స్వభావాన్ని పునరుజ్జీవింప చేయడం) విఫలమైందని ఆయన అనుకున్నారు’ (పుట 115) అని అన్నారు.
మార్క్సిజంపై పూర్తి అవగాహన, ఆ పరిభాషపైమంచి పట్టు వున్న అనువాదకులు మూల గ్రంథానికి పూర్తి న్యాయం చేసారు. మార్క్సిస్టు నేపథ్యంలో గాంధీ వాదం, ఆచరణ గురించి తెలసుకునేందుకు ఈ గ్రంథం ఎంతో ఉపకరిస్తుంది.

-జిఆర్కే