అక్షర

సామాన్యుడికి ఇది ‘వేదం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చతుర్వేద భాష్యము
డా.క్రోవి పార్థసారథి
వెల: రూ.1500/-
ప్రతులకు: రచయత
23-11/1-10/2, ఓగిరాల వారి వీధి
సత్యన్నారాయణపురం
విజయవాడ-11
ఫోన్: 0866 2530672

‘‘అపాణిపాదో జవనోగ్రహీతా’’ అంటూ ఈశ్వరుడనేవాడు ఉన్నాడు అని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటిచెప్పినది వేదమే. ప్రపంచములో అత్యంత ప్రాచీన లిఖిత- వౌఖిక వాఙ్మయము ఋగ్వేదమే. బైబిలు, ఖురాను, ఛందఅవన్తాత్రిపీటకములు అన్ని మత గ్రంథములు ఋగ్వేదము తర్వాతనే అవతరించాయి. వేదోఖిల ధర్మమూలమ్ అన్నారు పెద్దలు. అన్ని ధర్మములకు మూలము వేదమే. వేదము సత్య విద్యల గ్రంథము. భౌతిక-ఆధ్యాత్మికాది సమస్త విద్యలు వేదముద్వారా పొందవచ్చును. వేదములకు లోగడ కొన్ని భాష్యములు వచ్చాయి. వాటిలో భారతీయ రచనలు కొన్ని మాక్సుముల్లరు వంటి పాశ్చాత్యుల వ్యాఖ్యానములు కొన్ని ఉన్నాయి. వేద మంత్రములకు ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక త్రివిధార్థాలున్నాయి. ముఖ్యంగా ఖ.శాస్తమ్రు (ఎస్ట్రానమీ) తెలియకపోతే ఒక్క వేదమంత్రము కూడా అర్థముకాదు. ఈ కారణంచేతనే వేదము అవైదికమైంది. భారతదేశమూ ఇన్ని వేల సంవత్సరాలుగా చ్యుతిని పొందుతూ వస్తున్నది.
క్రోవి పార్థసారథి వృత్తిరీత్యా వాణిజ్య శాఖాధ్యాపకులు. ప్రవృత్తిరీత్యా శ్రీ విద్యోపాసకులు. ఇటీవల హైదరాబాదులో వారు నిరవధికంగా శ్రీ విద్యపై పనె్నండు గంటలు శ్రీవిద్యా ప్రసంగాలు చేసి ప్రపంచరికార్డు సృష్టించారు. ప్రస్తుతము చతుర్వేద భాష్యమును జిజ్ఞాసువులను తెలుగులో అందిస్తున్నారు. వేద విద్యలో శ్రీవిద్యా రహస్యములు చెప్పగలిగిన సమర్థులు వీరు. దయానందుని వంటి కొందరి దృష్టిలో సంహితాభాగము మాత్రమే వేదము. అనగా సూక్తములే వేదము. ఇదే అపేరుషేయము అనగా ఈశ్వర ప్రోక్తము. బ్రాహ్మణములు కర్మకాండా వివరణము. తక్కినవి ఆర్షములు. అనగా ఆయా ఋషులు రచించినవి. పార్థసారథి నాలుగు సంపుటములలో చతుర్వేదులు, బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు సంగ్రహంగా వివరించినారు. ఈ మొత్తమూ అపేరుషేయమే అన్నారు. ప్రామాణికమైన ఉపనిషత్తులు 111 ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథమునకు అనంత వ్యాఖ్యానాలున్నాయి. ఐతే పార్థసారథి ముఖ్యమైన వాటిని సంగ్రహంగా పరిచయం చేశారు. ఐనా గ్రంథ విస్తృతి పెరుగక తప్పలేదు. పార్థసారథిగారు సాధ్యమైనంత సరళంగా ఉండే భాషను వాడారు. వేదాంత పరిభాష తప్పనిసరి. ఐతే ఇది ఒక్కొక్క మంత్రము తీసుకొని దానికి అర్థతాత్పర్యములు రచించిన గ్రంథము కాదు. సమీక్షాత్మక పరిచయము. అంటే చతుర్వేదములు, 111 ఉపనిషత్తులు, బ్రాహ్మణములు చదువుకునే శక్తిలేనివారు పార్థసారథీయమును చదువుకొని మూలగ్రంథములలో ఏమున్నదో తెలుసుకునే అవకాశం ఉంది. అంటే అనంతమైన ఆర్షసాహిత్యానికి ఇదొక మార్గదర్శి (గైడ్) వంటిది.
దీనిని అధ్యయనం చేసినవారు మూలముపై ఆసక్తిని పెంచుకొని వాటిని అధ్యయనం చేయాలని అనుకోవటం సహజం. అందుకే పార్థసారథీయము ఆధునిక యుగములో వర్తమాన విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రథమభాగంలో వేదాలు వివిధ విషయాల ఋక్‌యజుస్ సంహితా వ్యాఖ్యానం ఉంది. రెండవ భాగంలో సామ అధర్వణములు బ్రాహ్మణ అరణ్యకముల పరిచయం ఉంది. తృతీయ భాగంలో శాక్తేయ శైవ వైష్ణవ వేదాంతోపనిషత్ పరిచయం ఉంది. చతుర్థబాగంలో యోగ సన్యాస దశోపనిషత్తుల పరిచయం కొండను అద్దంలో చూపినట్లు చూపి పార్థసారథి కృతకృత్యులైనారు.
క్రీస్తుశకం 1380 ప్రాంతంలో మాధవ విద్యారణ్యుడి సోదరుడైన సాణాచార్యుడు ‘‘విద్యారణ్యము’’ అనే పేరుతో నాలుగు వేదాలకు భాష్యం వ్రాశాడు. ఆ తరువాత నాలుగు వేదాలకు కలిపి వ్రాసిన భాష్యం, తెలుగులో మొదటి వేదభాష్యం ఇదే. దీన్ని వ్రాసింది డా.క్రోవి పార్థసారథి. గతంలో శ్రీవిద్య, లలితాసహస్రం వంటి 32 పుస్తకాలు వ్రాసిన డా.పార్థసారథి అవధూత దత్తపీఠానికి, అమెరికాలో ఒక దేవాలయానికి ఆస్థాన విద్వాంసులు. ఇప్పటివరకు ఉపన్యాసాలలో 11 రికార్డులు స్థాపించి, రాష్ట్రప్రభుత్వం నుంచి కూడా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు ‘‘పార్థసారథీయము’’అనే పేరుతో నాలుగు వేదాలకు సామాన్యుడికి అర్థం అయ్యేరీతిలో భాష్యం వ్రాశారు. ఇది మొత్తం నాలుగు భాగాలుగా ఉంది.
మొదటిభాగంలో వేదాలకు సంబంధించిన అనేక విషయాలు, ఋక్, యజుస్సంహితలు చెప్పబడ్డాయి. ముందుగా వేదాలకు సంబంధించిన అనేక విషయాలు 35 అంశాలుగా వివరించబడ్డాయి. 53వ పేజీలో వేద విభజన గురించి చెబుతూ ‘‘వ్యాసమహర్షి ఋషుల ప్రాతిపదికగా వేదాలను విభజించాడు. అలాకాకుండా విషయప్రాతిపదిక లేదా దేవతల ప్రాతిపదికన వేద విభజన చేస్తే చదివే వారికి చాలా సౌకర్యంగా ఉండేది. ఒకవేళ నాకే గనక వ్యాసుడు కనిపించి ఉంటే అలా చెయ్యమని చెప్పేవాణ్ణి’’ అన్నారు.
గ్రంథ ప్రారంభంలో వేదావిర్భావాన్ని వివరిస్తూ చరిత్రకారుల ప్రకారం ఆర్యులు ప్రకృతిని చేసిన స్తుతులే వేదాలు. సంప్రదాయవాదుల ప్రకారం ఆప్తర్షులు వేద మంత్రాలను దర్శించారు అంటూ ఋగ్వేదంలోని మంత్రాలను 403 మంది ఋషులు దర్శించారు అని 97వ పేజీలో కొంతమంది వేదద్రష్టలైన ఋషులను వివరించారు.
వేదం చదివేప్పుడు దాని అర్థం తెలియాలా? అంటే సూక్తానికి పూర్తిగా అర్థం తెలియకపోయినా కనీసం అందులోని విషయమన్నా తెలుసుకోవాలి అని మధ్యేమార్గాన్ని సూచించారు.
వేదంలో అనేక విషయాలు చెప్పారు. వేదం అంతా జాతీయభావన, సమాజశ్రేయస్సే వివరించబడ్డాయి. కాబట్టే వేదాన్ని ఆచరించాలి అన్నారు 109వ పేజీలో.
యజ్ఞయాగాలలో పశుబలి నిషేధమా? అన్నప్పుడు సంప్రదాయవాదుల ప్రకారం పశుబలి ఇవ్వాలి అంటూనే బలిసమయంలో ఆ ప్రదేశం ఎలా ఉంటుందో వివరించి, ఈ పరిస్థితులలో పశుబలి నిషేధించి తీరాలి గ్రంథ రచయితగా ఇది నా అభిప్రాయం.
మంత్రానికి శక్తి ఉన్నది అనే మాటను వివరిస్తూ 206వ పేజీలో ఇచ్చిన ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది.
వేదానికి ఆదరణ రావాలి అంటే డిగ్రీ స్థాయిలోను, పి.జి. స్థాయిలోను వేదాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. ఇతర డిగ్రీల లాగానే వీరికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గనక తలచుకుంటే ఈ పని జరుగుతుంది అన్నారు.
సంహిత భాగంలో అనేక సూక్తాలు సందర్భోచిత వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మన వివాహవ్యవస్థ చాలా గొప్పది. బాల్యవివాహాలు వేదంలో చెప్పలేదు. తురుష్కులు పాలించిన కాలంలో, జాతిని రక్షించటానికి బాల్య వివాహాలు చేశారు. కాని ఈ రోజున కూడా బాల్య వివాహాలు చెయ్యటం మూఢాచారము అన్నారు. అలాగే ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు ఉన్నదని, ఏకోదరుల మధ్య సంబంధం కూడదని వేదంలో ఉందన్నారు. శ్రీ సూక్తంలాటి కొన్ని సూక్తాలకు మంత్రశాస్త్రం కూడా కలిపి వివరించారు.
అధర్వణ వేదంలో అనేక సూక్తాలు, వశీకరణ విద్యలు వివరిస్తూ, ‘‘ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడూ చెయ్యవద్దు’’అని సమాజానికి హితవు పలికారు. సమాజంలో స్ర్తిని గౌరవించాలి అని చెబుతూ ప్రతి అత్తా కోడలిని కూతురులా చూసుకోవాలి’ అన్నారు. సతీసహగమనం వేదంలో చెప్పలేదని, అది ఒక దుర్మార్గమైన, నికృష్టమైన దురాచారము. కొందరు స్వార్థపరుల పన్నాగము అన్నారు.
బ్రాహ్మణాలలో అశ్వమేధము, రాజసూయము, వాజపేయము వంటి 48 యాగాలను, అనేక ఉపాఖ్యానాలను వివరించారు.
కోరికలు లేనటువంటి స్థితే మోక్షము. రాగద్వేషాలు, కామక్రోధాలు, అరిషడ్వర్గాలను జయించినవారు ‘జగత్తంతా పరమేశ్వర స్వరూపమే’ అని భావించగలవారు మాత్రమే మోక్షం పొందుతారు. వారికి పునర్జన్మ ఉండదు అన్నారు. చివరిగా జగత్తంతా పరమేశ్వర స్వరూపం. అందులోని 84 లక్షల జీవరాసి పరమేశ్వరుడికి ప్రతి రూపం. వేదంలో కులం లేదు, మతం లేదు, స్వార్థంలేదు, వైష్ణవం లేదు, శైవం లేదు, ద్వైతం లేదు, అద్వైతం లేదు, సాకారం, నిరాకారం అసలే లేవు. ఆస్తికత్వం నాస్తికత్వం కూడా లేవు. జగత్తంతా పరమేశ్వర మయం. ప్రపంచం మొత్తానికి తెలిసింది ప్రేమ. జగత్తులోని అన్ని ప్రాణులు సమానమే అని భావించగలిగినవాడు మోక్షం పొందుతాడు. విశ్వమానవాళి అంతా ఒక్కటే. ఇందులో ఎక్కువ తక్కువలు లేవు, సమసమాజ స్థాపన, సర్వమానవ సమానత్వము, సౌభ్రాత్రుత్వము, విశ్వమానవ కళ్యాణము, విశ్వశాంతి ఇవే వేగంలో చెప్పిన విషయాలు. ‘‘కాబట్టి ప్రాచీన భారతీయ విజ్ఞాన భాండాగారమైన వేదాన్ని ఆదరించండి. సంప్రదాయాన్ని కాపాడండి. మీ గౌరవాన్ని పెంపొందింపచేసుకోండి’’ అంటూ చతుర్వేద భాష్యాన్ని ముగించారు.

-ముదిగొండ శివప్రసాద్