అక్షర

మానవ సంబంధాలే ఇతివృత్తాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన కథలు
-డా.డి.ఆర్.ఎల్.రాజేశ్వరీ
చంద్రజ-
వెల: రు.151
పుటలు: 212,
ప్రతులకు:
రచయిత్రి 85002 70484
నవచేతన బుక్‌హౌస్

సంగీతం, సాహిత్యం, నాట్యం, చైనా వైద్యం తదితర రంగాలలో కృషిచేసిన శ్రీమతి డి.ఆర్.ఎల్.రాజేశ్వరీ చంద్రజ తెలుగు పాఠక లోకానికి పరిచితులే. ఆవిడ రాసిన రెండవ కథాసంకలనం మన(సు)కథలు చదువరుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో పనె్నండు కథలు పొందుపరచబడ్డాయి. అన్నిటికి స్ఫూర్తి సామాజిక సమస్యలు. కేవలం సమస్యలు ప్రస్తావించడం కాకుండా, కథలలోని పాత్రల ద్వారా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో సూచించడం జరిగింది.
ఆడదంటే అలుసు అన్న నానుడి ఈనాటిది కాదు. కన్నవారే కొడుకుని ఒకలా, కూతురుని మరొకలా పెంచడం సమాజంలో జరుగుతున్నదే! తన సంపాదన మీద ఇల్లునడుస్తున్నా, తల్లిదండ్రులు కాని తోడబుట్టిన వాడు కాని ఆప్యాయంగా పలకరించరు. వీరి ప్రవర్తనలో అనూహ్యమయిన మార్పు రావడానికి దారితీసిన పరిస్థితులు తెలుసుకోడానికి ‘నల్ల సీతాలు’ కథ చదవాలి.
చాలీచాలని సంపాదనలో ముగ్గురు పెద్దవాళ్లు, ఒక పాప బతకాలి. పాపకి అద్దాల పరికిణీ తీసుకోవాలన్న కోరిక. కాళ్లకి చెప్పులేనా కొనలేకపోయానన్నది తండ్రి ఆవేదన. అయినా అద్దాల పరికిణీ కొని కూతురుతో ఆనందాన్ని పంచుకోగలుగుతాడు. ఇది ఎలాసాధ్యం అన్న ప్రశ్నకు సమాధానం కథ చివరలో లభిస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులని కూతురికి వివరించి చెప్పవలసిన తండ్రి, రక్తం ధారపోసైనా కొనడం విజ్ఞతగల పాఠకుల ఆమోదం పొందదు.
‘చుట్టూ ఉన్న చీకటిని నిందించడంకన్నా చిరుదీపం వెలిగించడం మిన్న’ అన్న వాక్యం సంఘం ఆమోదిస్తే ప్రజలంతా కష్టాల బారినించి తప్పించుకోగలరు. మధ్యతరగతి గృహిణి, దారిలో బిచ్చమెత్తుకుంటున్న పిల్లని ఇంటికి తీసుకురావడం ఆశ్చర్యం కల్గిస్తుంది. ఆదర్శాలు వల్లించడంకన్నా సొంత లాభం కొంత మానుగు పొరుగువారికి తోడు పడడంలో ఉన్న ఆనందాన్ని గృహిణి ఇతర సభ్యులు పొందడాన్ని ‘మొదటి అడుగు’ కథలో చూడవచ్చు.
సమర్థమయిన నాయకత్వం ఉంటే ఎలాంటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చు. రాత్రిపూట బస్సుప్రయాణం. అందరూ ప్రయాణీకులు మంచి నిద్రలో ఉండగా బస్సులోనే సహ ప్రయాణీకులలా వచ్చిన దుండగులు ఇతర ప్రయాణీకుల నగలు/నగదు దోచుకోడం మొదలుపెడతారు. దుండగులు అయిదుగురే ఉన్నారనీ, బస్సులో యాభైయి మంది మగాళ్లున్నారన్న సంగతి వృద్ధురాలైన రమణమ్మ గమనిస్తుంది. ఎవరికివారే భయపడి దుండగులకి సొమ్ములందిస్తూ ఉంటే రమణమ్మ సమయస్ఫూర్తితో వ్యవహరించి దుండగులను పోలీసులకప్పగించిన అంశం చుట్టూ అల్లబడిన కథ ‘లూటీ’.
సంతానం లేనివారు పిల్లలని దత్తత తీసుకోడం లోక సామాన్యం కానీ తలిదండ్రులే తమని ఎవరైనా దత్తత తీసుకోమని కోరుకునే ఇతివృత్తంతో రాయబడిన కథ ‘నన్ను దత్తత తీసుకోరూ?’ లెక్కల మాష్టారు పరంజ్యోతి, ఇద్దరు కొడుకులు యు.కె.లోను, కూతుళ్లు మద్రాసు, అండమాన్‌లో ఉంటారు. తల్లి పోయినపుడు తండ్రి బాధ్యత తీసుకోడానికి సంతానంలో ఎవరూ ముందుకురాక, వృద్ధాశ్రమంలో చేర్పించాలన్న నిర్ణయం తీసుకుంటారు. కథలో కొసమెరుపు నూతనంగా ఉంది.
తల్లీ, తండ్రీ ఉద్యోగస్తులయి తమ కెరీర్‌ల మీద పెట్టిన ధ్యాస పిల్లల మీద పెట్టకపోతే జరిగే అనర్థాలను ఎత్తిచూపే కథ ‘అద్దాల మేడలు’ ముద్దుగా పెంచుకున్న కూతురు తల్లిని కొట్టే స్థాయికి ఎదుగుతుంది. సినిమాలో విలన్ శుభంకార్డు పడడానికి మారిపోయినట్టుగా, కూతురు కూడా మారిపోవడం కొంత నాటకీయంగా అనిపిస్తుంది.
ప్రయాణాలలో దిక్కులు తెలుసుకోడానికి ‘దిక్సూచి’ని వాడవచ్చు. జీవనయానంలో దిక్కుతోచనిస్థితి వచ్చినపుడు ఏ దిక్సూచి దారిచూపిస్తుంది? సంసారంలో భర్తపెట్టే నరకయాతన భరిస్తూ ఉండడంకన్నా, సొంతంగా కొత్త జీవితం మొదలుపెట్టవచ్చునన్న సూచన ఉన్న కథ ‘దిక్సూచి’.
మిగతా కథలు కూడా మానవ సంబంధాల చుట్టూ అల్లబడినవే. సమస్య ప్రస్తావనతోబాటు పరిష్కారం కూడా చూపించడం జరిగింది. ఆరు/ఏడు పేజీల కథల నిడివికి అలవాటుపడ్డ చదువరులు, ఇరవయి పేజీలు కథలు చదవడానికి కొంత ఇబ్బందిపడవచ్చు.

-పాలంకి సత్యనారాయణ