అక్షర

శతాధిక కవుల కవితా కాహళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర (కవితా సంకలనం)
సంకలనకర్త- సుధామ,
వెల: రు.300/-;
ప్రతులకు- శ్రీ వేదగిరి
కమ్యూనికేషన్స్,
హెచ్.ఐ.జి.బ్లాక్-6,
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్-44

2015 గురజాడ శత వర్ధంతి సంవత్సరం. విమర్శకులు అన్నట్టు గురజాడ 1915లో మరణించినా 1915 తర్వాతే జీవించటం మొదలైంది. ‘గురజాడ’ అనగానే పులకరించే, పలవరించే వేదగిరిరాంబాబు సంకల్పంతో ఈ ‘‘అక్షర’’ కవితాసంకలనం వెలువడింది. అత్యంత సమర్ధుడైన సుధామ సంపాదకత్వంలో రావటం హర్షణీయం. నూటయాభై మంది కవుల కవితలు సేకరించటం సాహిత్యంలో ఆషామాషీ వ్యవహారంకాదు. కవులు ఇటువంటి విషయంలో బద్ధకస్తులు. సుధామగారు కాబట్టి ఈ సంకలనం తీసుకువచ్చారు.
తెలుగు సాహిత్యంతో ఎనె్నన్నో కవితా సంకలనాలు వచ్చాయి. కవితా సంపుటి అంటే ఒకేవ్యక్తి కవితలతో ఉన్నవి. కవితా సంకలనం అంటే అనేకమంది కవితలు గలవి. సాహిత్య చరిత్రలో కవితా సంపుటాలకంటే కవితా సంకలనాలకే ప్రాధాన్యం వుంటుంది. ఈ సంకలనంలోని కవితల్ని పేరుప్రతిష్ఠలు, వయస్సుల్నిబట్టి కాకుండా అకారాది క్రమంలో కూర్చడం శాస్ర్తియమైన పద్ధతి. గురజాడ పైనే రాయాలన్న నిబంధనలే కాదు కాబట్టి వివిధ అంశాలపై రాయబడినవి ఉన్నాయి. కానీ గతించినవారి ఎప్పటివో కవితల్ని ఇందులో చేర్చడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిందే!
ఆళ్ళ నాగేశ్వరరావు గురజాడను మళ్ళీ జన్మించమంటూ-
‘‘దేశమంటే మనుష్యులన్నావు నీవు
ఆ మనుష్యులే మానవతా రహితులై
తీవ్రవాదులుగా మారుతున్న వైనం చూడు’’
అనే కవిత రాశారు.
‘‘కవిత్వానికి సలాం-
చిగురించిన జీవితానికి సలాం’’ అంటాడు ఆశారాజు. పాత బట్టలకి కొత్త పాత్రలిస్తూ బతికేవాళ్ళ గురించి బహుశా డా.ఎన్.గోపి మొదటగా కవిత రాశారు. ‘‘సాహిత్యం ప్రజల సొత్తు’’అన్న గురజాడకు ఈ కవిత ఒక మచ్చు తునక! ‘‘నవయుగ వైతాళికుడు- గురజాడ’’వంటి కవితను ఎలా స్వీకరించారో జవాబు చెప్పవలసి వుంది. కొత్తవాళ్ళని ప్రోత్సహించటం స్వాగతించాలి. డా.తెనే్నటి సుధాదేవి కవిత చూస్తాం. ఒకనాటి ప్రసిద్ధ కవి నాగినేని భాస్కరరావు ‘‘గురజాడ తామరకాడ’’ అనటం అసంబద్ధం. ఇక్కడే సంకలనకర్త దృష్టిపెట్టాలి.
‘‘ముగ్ద మనోహరమూర్తి
ముసలి పులి గుహలో భీతావహ హరిణం
వేటగాని వలలో పావురం’’
అంటూ సూరేపల్లి మనోహర్ విశిష్టంగా గురజాడ కథ ‘మెటిల్డా’పై కవిత రాయడం అసామాన్యం. ఈ ప్రయత్నం గొప్పది, ఆహ్వానించదగినది. కాకపోతే కొన్ని నియమాలతో తీసుకువస్తే మరో ‘‘వైతాళికులు’’ అయ్యేది.

-ద్వా.నా.శాస్ర్తీ