అక్షర

మంచి శతకానికి మణిదీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భద్రాద్రి సీతారామ’ భక్తరామదాసు ప్రణీతములోని విశేషాంశములు;
రచయిత: జె.సి.శాస్ర్తీ;
పుటలు: 168; వెల: రూ.50/-;
ప్రతులకు: జె.సి.శాస్ర్తీ,
మునిసిపల్ మేనేజర్ (రిటైర్డ్),
1/17 బ్రాడీపేట, గుంటూరు-2
--

‘‘శ్రీ రఘురామ! చారుతులసీ దళదామ!’’, ‘‘్భండన భీముడార్తజన... ...... భేరికా దాండ దదాండ దాండ నినదంబుల జాండము నిండ... ’’వంటి పలు ప్రఖ్యాత హృద్య పద్యాల దాశరథి శతకంలోని వివిధ భావార్థాలను చాలావాటిని చక్కగా వివరించిన పుస్తకం జె.సి.శాస్ర్తీ రాసిన ‘్భద్రాద్రి సీతారామ’ అనే విశేషాంశాల గ్రంథం.
‘విశేషము’ అంటే ఘనత, ఆధిక్యము, అతిశయము, ప్రత్యేక గుణము, అనన్య సాధారణత, నానావిధములైన వస్తువులు అనే అర్థాలు ఉన్నాయి. దాశరథి శతకానికి తాను రాసిన వ్యాఖ్యానాన్ని ‘విశేషాంశములు’అని పేర్కొన్నారు రచయిత. నిజంగానే ఈ గ్రంథం సార్థకనామ సమన్వితం.
శతకంలోని 102 పద్యాలకూ ఇందులో ప్రతిపదార్థ, తాత్పర్య, విశేషభావ విశదీకరణలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి.
ఇదివరలో ఆచార్య ఎం.కులశేఖరరావుగారు, తదితరులు ‘దాశరథి శతక మానసోల్లాస వ్యాఖ్య’మున్నగు వ్యాఖ్యాన రచనలు చేసి ఉన్నారు. అయినాకూడా ఎవరి వివరణ వారిదే; దీనికదే విశిష్టమైనదీను.
దాశరథి శతకకర్తయొక్క హృదయాన్ని పట్టుకున్నారు జె.సి.శాస్ర్తీగారు. ‘‘దాశరథీ! తావకకీర్తి వధూటికిత్తు ‘బూదండలుగాఁగ నా కవిత (నీ యశోలక్ష్మికి నాకైతలను పూదండలుగా సమర్పిస్తాను) అన్న కంచర్ల గోపన్న వాక్కులలో ప్రతి పద్యమూ ఒక్కో విధమైన విలక్షణ భావసుగంధంతో రసజ్ఞులను ఎలా అలరిస్తుందో తనకున్న బహువిషయ పరిజ్ఞానంతో వెలార్చి చూపారు. దీనికి మొట్టమొదటిదైన ‘శ్రీరఘురామ! చారు తులసీదళదామ’అనే పద్యానికి చేసిన వ్యాఖ్యానం ప్రబల తార్కాణం. ‘చారుతులసీ దళదామ’ అన్న పద బంధానికి చక్కని సమగ్ర విశదీకరణ ఉన్నది.
‘‘విష్ణువునకు దివ్యాలంకారములందు ప్రధానమైనది ‘వనమాల’. ఇది పంచతన్మాత్ర స్వరూపము. ఇందు తులసీ దళము లేనిదే అది ‘వనమాల’ కానేరదు.
‘‘రామతులసి (తెల్లనిది), కృష్ణతులసి (నీలపుది)అని రెండు రకములున్నవి. తులసిని విష్ణుప్రియ, బృంద అని కూడా పిలుస్తారు. ‘‘తులసీ మిశ్రీతోయేన స్నాపయంతి జనార్దనమ్/ పూజయంతిచ భావేన ధన్యాస్తే భువి మానవాః (తులసీదళాలు కలసి ఉన్న నీటితో విష్ణువునకు అభిషేకంచేసి పూజించినవారు ధన్యత పొందుతారు)’’
‘‘తులసీ దళమును తలపైన పెట్టుకొనరాదు. వెంట్రుకలకు తాకగూడదు. అంత పవిత్రమైనది’’ - ఇలా పద్యంలోని ప్రతి పదానికీ ఒక సాంకేతిక, శాస్ర్తియ వ్యాఖ్యానం కనిపిస్తుంది.
‘‘రంగ దరాతి భంగ! ఖగరాజ తురంగ...’’అనే పద్యాన్ని విశే్లషిస్తూ పద్యంలో ‘గ’ప్రతి సమాసాంతంగా పదిసార్లు, పద్యం మొత్తంలో గకార ఉచ్చారణ పనె్నండుసార్లు వస్తుంది. ‘గ’అనే అక్షరం సమస్త విఘ్నాలను పోగొట్టే మహత్తర బీజాక్షరం. గ కారంతో కూడినవాడు గణపతి. వైష్ణవభావ సంప్రదాయపరంగా విష్వక్సేనుడికి సంకేతం. అలా శౌరిసేనాపతి, సమస్త విఘ్ననాశకుడు అయిన విష్వక్సేనుని సంభావన చేయటం ఈ గకార పునరావృత్తిలో అంతరార్థం’’అంటారు ఈ వ్యాఖ్యాత. చాలా సమంజసంగాను, గంభీరంగాను ఉంది.
‘‘గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది...’’అనే పద్యంలో ‘గురుతరమైన కవ్యాము’అంటే పరమాత్మపరమైన కావ్యము అని గ్రహించాలి’’అనటం చాలా ఉదాత్తంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ‘గురు’అంటే గొప్ప అనే అర్థంకాదు. ‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’అనే సూక్తిని అన్వయించుకోవాలి.
వాల్మీకం, అధ్యాత్మ రామాయణం, భాస్కర రామాయణం, వివిధ దేవతల సహస్ర నామస్తోత్రాలు, భగవద్గీత, భవభూత్యాదుల రచనలు, శ్రీరామ కర్ణామృతం, ముకుందమాల, ఒంటిమిట్ట రఘువీర శతకం, వేదవాఙ్మయం, అనేక పురాణాలు, భర్తృహరిత్రిశతి, ఆయుర్వేద శాస్త్రం, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, ఎన్నో ప్రబంధాలు- ఒకటేమిటి- లెక్కకుమిక్కిలిగా ప్రాచీన సారస్వతంలోని అనర్ఘ వచనాలు, ప్రవచనాలు, పద్యాలు, శ్లోకాలు అడుగడుక్కీ ఇందులో క్రోడీకరించారు రచయిత. ఆయా సందర్భాలనుబట్టి ఉద్గిష్టాంశ వివరణలకు ఉపపత్తులుగా. ఇది ఒక పరిశోధనా గ్రంథంలాగా విపులంగా ఉంది.
శాస్ర్తీగారు తన రుూ వ్యాఖ్యాన రచనలో వస్త్ధ్వుని, రసధ్వనులకు ఉపహరణీయాలు చాలానే చెప్పారు కానీ ఈ శతకంలో ఎడనెడ మెఱసిన ఉపమ, కావ్యలింగ, దృష్టాంత, అర్ధాంతరన్యాసాది అలంకార ధ్వని ఎత్తిచూపటంలో ఇతోధిక దృష్టిపెట్టలేదేమో అనిస్తోంది. బహుశః గ్రంథ విస్తృతి, ముద్రణా వ్యయభారముల దృష్ట్యా కావచ్చు.
అక్కడక్కడ అచ్చుపొరపాట్లు దొర్లటంవల్ల సగటు పాఠకుడు అర్థసమర్థనకు కొంచెం ఇబ్బందిపడాల్సి వస్తుంది. మచ్చుకు 21వ పుటలో 21వ పంక్తి చివర ‘ఊరు’అని కాదు- ఉరు అని ఉండాలి గొప్పవైన అనే అర్థంలో. మొత్తంమీద ఈ పుస్తకం దాశరథి శతక వైశిష్ట్యానికి పట్టిన నిలువెత్తు నిలువుటద్దం, కమ్రవాసనల కర్పూర దీపం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం