అక్షర

హద్దులు మీరని వర్ణన.. రసపోషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణయవాహిని
(ముగ్ధ నాయికలు)
- డా.కొండూరు శ్రీదేవి
వెల: రూ.150/-
ప్రతులకు: రచయత,
ఇం.నెం.28/774 ఎ-4,
ఎన్.జి.ఓ.కాలనీ (నూనెపల్లె)
నంద్యాల, కర్నూలు జిల్లా.
**
డా.కొండూరు శ్రీదేవిగారి ప్రణయవాహిని (ముగ్ధ నాయికలు) పుస్తకంలో ముప్ఫైఏడు వ్యాసాలున్నాయి. ఇది నాయికానాయకుల అనురాగానికి అద్దంపట్టిన రచన. పౌరాణిక స్ర్తిలు, ప్రబంధ నాయికలు, దేవతా స్ర్తిలు, మునికాంతలు, రాజకుమార్తెలు-వారి ప్రేమ వృత్తాంతాలు, అవి భగ్నమైన తీరు లేదా ఫలించిన తీరు- వీటిని రచయిత్రి వర్ణించారు. విషయగ్రహణకు కావలసినన్ని విశేషాలను అందించారు. పేరుకు తగినట్లుగానే ప్రణయానికి సంబంధించిన అంశాలనే రసపోషణ, ఔచిత్యం కలగలిపి రచించారు. గంభీరమైన హద్దులుమీరని వర్ణనలతోనే రసపోషణ వుంది. ప్రసిద్ధ కవుల భావాలు, రచనల్లోని సంభాషణలు, వర్ణనలను ఉన్నవిఉన్నట్లుగానే సులభశైలిలో వర్ణించారు. శ్రీనాథుని హర విలాసము, పెద్దన మనుచరిత్రము, తిమ్మన పారిజాతాపహరణము- ఇలా ప్రసిద్ధ రచనల్లోని పాత్ర చిత్రణలు ఇందులో వున్నాయి. దీని ద్వారా ప్రాచీన గ్రంథాలలో అక్కడ కూడా ఉన్న కథలన్నీ ఒకే దగ్గర చదువుకునే అవకాశం పఠితలకు కలుగుతున్నది. ఉలూచి అర్జునులు, రాధాకృష్ణులు, హిడింబ భీములు, ప్రభావతీ ప్రద్యుమ్నలు, ఊర్వశీ పురూరవులు, గిరికావసురాజులు, యామినీ పూర్ణతిలక బిల్హణులు, ప్రణయ వృత్తాంతాలు వివరింపబడినాయి. సత్యభామా శ్రీకృష్ణుల ప్రణయ కలహం, దేవకార్యాన్ని సాధించిన ఉషాపరిణయ ఘట్టం, రుక్మిణి శ్రీకృష్ణునికి సందేశాన్ని పంపించడం, దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహమాడడం వంటి సంఘటనలు ఇందులో వున్నాయి. హిడింబ, చిత్రాంగి, అంబ, దేవయాని, ఉషలు ముగ్ధనాయికలవుతారా అన్నది పరిశీలించాల్సిన విషయం. ఈ పుస్తకంద్వారా వివిధ పాత్రల మనస్తత్వాలు మనకు స్పష్టమవుతాయి. దేవయాని పట్టుదల, గంగ షరతులు విధించడం, అంబ అనుకున్న దానిని సాధించడం, చిత్రాంగి ప్రతీకారంతో రగిలిపోయి సారంగధరుణ్ణి శిక్షించడం ద్వారా పగ సాధించడం, రాముడు వచ్చి తనను తీసుకుని వెళతాడని దృఢ నిశ్చయంతో సీత వుండడం, శకుంతల సహనంతో దుష్యంతునికోసం నిరీక్షించడం, గోదాదేవి రంగనాథుని మెప్పుపొంది ధన్యురాలు కావడం, శ్రమ జీవన సౌందర్యంతో సుగాత్రి భర్తకు చేరువ కావడం, గౌతముని శాపానికి గురిఅయిన అహల్య రాయి కావడం, తనను పెండ్లాడిన స్వరోచి ద్వారా మనోరమ తన స్నేహితులకు మేలుచేయడం, పరమార్థాన్ని దక్కించుకున్న దేవదేవీ విప్రనారాయణుల కథ, ప్రవరునిపై మనసు నిలుపుకున్న వరూధిని మాయ ప్రవరుని చేత వంచించబడడం, ఇందులో వివరంగా వున్నాయి. రుక్మిణి, తపతి, శైలజ, సుభద్ర మొదలైనవారు తాము వరించిన వారినే చేపట్టారు. ఉష, సుభద్ర, ప్రభావతిలు తమ కోరికలను సఫలం చేసుకున్నారు. సావిత్రి, దమయంతి, దేవహూతి, రతీదేవిల పాతివ్రత్యం దీని ద్వారా విశదమవుతున్నది. వైభవాలలో మునిగి తేలే ఆమ్రపాలి బింబిసారుణ్ణి చేరుకున్నది. తపతికోసం సంవరణుడు తపస్సుచేయడం, ధనుర్దాసు హేమాంబను ప్రాణాధికంగా ప్రేమించడం, నందుడు సుందరిని విడిచి వుండలేనని గౌతమునితో చెప్పడం, తారాశశాంకుల విషయంలో బృహస్పతి సహనం, శాపానికి గురిఅయిన యక్షుడు తన భార్యకు మేఘం ద్వారా సందేశాన్ని పంపించడం వంటి సందర్భాలలో నాయకుల పాత్రలే ఔన్నత్యంతో, ఔచిత్యంతో కూడి వున్నాయి.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ